పెదఖండేపల్లి (శృంగవరపుకోట రూరల్) : హుదూద్ తుపాను వల్ల జిల్లాలో 30,697 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ ప్రమీల తెలిపారు. పెదఖండేపల్లి గ్రామంలో జేడీ ప్రమీల, రైతు శిక్షణా కేంద్రం డిప్యూటీ డెరైక్టర్ ఆశాదేవి, కొత్తవలస సబ్‌డివిజన్ ఏడీఏ కె.మహారాజన్ తదితరులు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా తుపాను తాకిడికి దెబ్బతిన్న చెరుకు, ఇతర పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. హుదూద్ కారణంగా వీచిన గాలులకు ఇప్పటివరకు జిల్లాలో 513 గ్రామాల్లో 632 హెక్టార్లలో వరి, 436 హెక్టార్లలో మొక్కజొన్న, 444 హెక్టార్లలో పత్తి, 153 హెక్టార్లలో చెరుకు పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించామన్నారు. మరో 14,483 హెక్టార్లలో పంట నష్టాలను పరిశీలించాల్సి ఉందన్నారు.
అలాగే 5,404 మంది రైతులకు 50శాతం పైబడి పంట నష్టం జరిగిందన్నారు. 6698 హెక్టార్లలో వరి, 4091 హెక్టార్లలో పత్తి, 5064 హెక్టార్లలో చెరుకు తదితర పంట నష్టాలను సర్వే చేయాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తంగా 66వేలమంది రైతులకు పంట నష్టం వాటిల్లగా ఇప్పటివరకు 30వేల మంది రైతులను గుర్తించామన్నారు. వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శెనగ తదితర విత్తనాలను రాయితీపై అందజేస్తామని ఆమె ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలను కలిగి ఉండాలని సూచించారు. మండలంలోని పెదఖండేపల్లి గ్రామంలో 236 హెక్టార్లలో చెరుకు పంటకు నష్టం వాటిల్లిందని సర్పంచ్ యాళ్ల రమణ, ఎంపీటీసీ తదితరులు జేడీ ప్రమీల దృష్టికి తీసుకొచ్చారు. కానీ సర్వే అధికారులు ఈ నష్టాన్ని గుర్తించడం లేదని వారు ఆరోపించారు. జేడీ వెంట ఏడీఏ కె.మహరాజన్, మండల వ్యవసాయాధికారిణి ఎం.స్వాతికుమారి, ఏఈఓ పి.హైమావతి తదితరులు ఉన్నారు.
30,697 హెక్టార్లలో పంట నష్టం
Published Mon, Oct 27 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM
Advertisement
Advertisement