కిడ్నాప్ గురయి గాయాలతో బయటపడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తెర్లి ఈశ్వరరావు, స్థానికులకు పట్టుబడిన కిడ్నాపర్లు
సాక్షి, శృంగవరపుకోట రూరల్(శ్రీకాకుళం): ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన యువకుడిని కిడ్నాప్‌చేశారన్న వార్త ఎస్.కోట, తెర్లాం మండలాల్లో కలకలం రేపింది. ఉదయం మార్నింగ్‌వాక్‌కు వెళ్లిన యువకుడిని నలుగురు వ్యక్తులు సినీఫక్కీలో కిడ్నాప్ చేసేందుకు కారులో ఎక్కించారు. తలపై దాడి చేశారు. రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. ఓ రహస్య ప్రదేశంలో బంధించే ప్రయత్నంలో యువకుడు కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. కిడ్నాపర్లను వెంబడించడంతో ఇద్దరు పరార్‌కాగా, మరో ఇద్దరు పట్టుబడ్డారు. స్థానికులు, ఎస్.కోట పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన తెర్లి అప్పలనాయుడు కుమారుడు ఈశ్వరరావు హైదరాబాద్‌లో వీఎల్‌ఎస్‌ఐ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు.
కోవిడ్‌తో రెండేళ్లుగా ఇంటివద్ద ఉంటూనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటిలాగే మార్నింగ్ వాకింగ్‌కు రాజాం–రామభద్రపురం ప్రధానరోడ్డుకు శుక్రవారం తెల్లవారుజామున వెళ్లారు. కూనాయవలస పెట్రోల్ బంక్ దాటిన తరువాత రోడ్డుపక్కన ఆగి ఉన్న కారు నుంచి ఓ వ్యక్తి దిగాడు. కారు ఆగిపోయింది.. కొంచెం తోయాలని ఈశ్వరరావు సాయం కోరాడు. కారు నెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కారులో నుంచి మరోవ్యక్తి దిగి ఈశ్వరరావు తలపై బలంగా కొట్టాడు. మరో ఇద్దరు కలిసి కాళ్లుచేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి కారులో ఎక్కించి తీసుకెళ్లిపోయారు. కారులో చిత్రహింసలు పెట్టారు. ఇంటికి ఫోన్ చేసి రూ.50 లక్షలు తెమ్మని బెదిరించారు. లేదంటే పెద్దసార్‌కి అప్పగిస్తామని, ఆయన నీ కళ్లు, కిడ్నీలు, ఇతర శరీర అవయవాలు అమ్మేస్తాడని భయపెట్టారు.
ఎస్.కోట సీహెచ్‌సీలో కిడ్నాప్‌నకు గురయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తెర్లి ఈశ్వరరావుని విచారిస్తున్న పోలీసులు
డబ్బులు ఇవ్వకపోతే మీ నాన్నను చంపేస్తామంటూ కారు ఎక్కించిన ప్రాంతం నుంచి దించిన ధర్మవరం గ్రామం వరకు భయపెడుతూనే ఉన్నారు. ధర్మవరం వద్ద ఉన్న ఓ రహస్య ప్రదేశంలో బంధించేందుకు కారు నుంచి కిందకు దించారు. ఆ సమయంలో ఈశ్వరరావు గట్టిగా కేకలు వేశారు. అటువైపుగా వెళ్లే ధర్మవరం గ్రామస్తులు కొందరు స్పందించారు. వెంటనే దుండగులను పట్టుకునేందుకు వెంటపడ్డారు. ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. ఎస్.కోట పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరు కిడ్నాపర్లను అప్పగించారు. కిడ్నాపర్ల చేతిలో తీవ్రంగా గాయపడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఎస్.కోట సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. ఆయన తలకు తొమ్మిది కుట్లు పడినట్టు వైద్యులు తెలిపారు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తారకేశ్వరరావు కేసు నమోదు చేశారు. కిడ్నాప్ చేసిన ప్రాంతం తెర్లాం మండల పరిధిలోదని, ఉన్నతాధికారుల సూచన మేరకు కేసును అక్కడకు బదిలీ చేస్తామని చెప్పారు. విచారణలో ఉన్నందున కిడ్నాపర్ల పేర్లు చెప్పలేమన్నారు. కిడ్నాపర్లను బంధించి పోలీసులకు సమాచారమిచ్చిన ధర్మవరం గ్రామస్తులను ఎస్‌ఐ అభినందించారు. కిడ్నాప్ ఎందుకు చేశారు.. ఎవరు చేయించారన్న వివరాలు తెలియాల్సి ఉంది.
కిడ్నాపర్లలో ముగ్గురు ఎస్.కోట మండలం వారే..
కిడ్నాపర్లు నలుగురిలో ముగ్గురు ఎస్.కోట మండలంవారే. రేవళ్లపాలెం గ్రామానికి చెందిన యువకులు ఇద్దరు కాగా, మరొకరు ఎస్.కోట పట్టణానికి చెందిన వ్యక్తి. ఈ ముగ్గురు యువకులూ రేవళ్లపాలెం గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ధర్మవరం గ్రామంలో నడుపుతున్న వాటర్‌ప్లాంట్‌లో పని చేస్తున్నారు. వీరందరూ ప్రతిరోజు మద్యం సేవించి ప్లాంట్‌లోనే రాత్రుళ్లు ఉంటారని ధర్మవరం గ్రామస్తులు చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసిన కారు నంబర్ కూడా నకిలీదై ఉంటుందని, కారులో నాలుగైదు నంబర్ ప్లేట్లు, ఇనుప రాడ్లు ఉన్నాయని ఎస్‌ఐ తెలిపారు. సుఫారీ దందాలో భాగంగానే ఈ కిడ్నాప్ తతంగం జరిగిందని, కూనాయవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రోద్బలంతో జరిగినట్టు సమాచారం. కారు డ్రైవర్, కిడ్నాప్‌నకు పూనుకున్న వ్యక్తి ఇద్దరూ పరారీలో ఉన్నారు.
బాధితుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
తెర్లాం మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తెర్లి ఈశ్వరరావు కిడ్నాప్‌కు గురైనట్టు తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈశ్వరరావును కిడ్నాప్ చేయడానికి కారణాలు ఏమై ఉంటాయని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడని, కిడ్నాప్‌కు పాల్పడిన కొందరిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూనాయవలస ఎంపీటీసీ బొమ్మి శ్రీనివాసరావు ఎమ్మెల్యేకు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment