శిక్షా... కక్షా... | Hudood Storm help goods Distribution Corruption in Vizianagaram | Sakshi
Sakshi News home page

శిక్షా... కక్షా...

Published Wed, Oct 29 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

శిక్షా... కక్షా...

శిక్షా... కక్షా...

డీలర్లపై నాయకులు కన్నెర్ర చేస్తున్నారు. పాత కక్షలను మదిలో ఉంచుకుని తాజాగా జరిగిన చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ శిక్ష విధిస్తున్నారు. హుదూద్ సాయం సరుకుల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న ఆరోపణలను ఆయుధాలుగా చేసుకుని తమకు వ్యతిరేకులైన రేషన్ డీలర్లపై దండెత్తుతున్నారు. దీనికోసం అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు అనూహ్యంగా డీలర్లు కూడా గొంతు పెంచారు. ఢీ అంటే ఢీ అంటూ నాయకులకే సవాల్ విసురుతున్నారు. తమను మానసిక క్షోభకు గురి చేస్తే సరుకులు పంపిణీ చేయలేమని, నవంబర్ ఒకటి నుంచి సమ్మె చేస్తామ ని అల్టిమేటం జారీ చేశారు. డీలర్లు, నాయకుల మధ్య గొడవ ఇప్పుడు ప్రజల పీకల మీదకు వచ్చింది.
 
 విజయనగరం కంటోన్మెంట్  : జిల్లాలో డీలర్లు రాజకీయంగా బలవుతున్నారా అంటే అవుననే సమాధానమే విని పిస్తోంది. చాలా చోట్ల డీలర్లను తొలగిద్దామనే ఆలోచన ఉన్నప్పటికీ సంఘటితంగా ఉన్న వారిని ఏం చేయలేని కొందరు రాజకీ య నాయకులు ఆయా డీలర్లపై ‘హుదూద్’ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారని తెలిసింది. పరిహారం అందించడంలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, లబ్ధిదారులకివ్వాల్సిన బియ్యంలో కోత విధిస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ  వారిని అధికారులతో సస్పెండ్ చేయిస్తున్నారు. దీంతో డీలర్లు కూడా తిరగబడుతున్నారు. అక్రమంగా విధిస్తున్న సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు..
 
 నవంబర్ ఒకటి నుంచి రేషన్ సరుకుల సరఫరాను బంద్ చేస్తామని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు.   తమ పార్టీ, వర్గం కాని డీలర్లను తప్పించేందుకు పలువురు నాయకులు ఎప్పటి నుంచో కాచుకుని కూర్చున్నారు. హుదూద్ రూపంలో ఇప్పటికి వారికి అవకాశం వచ్చింది. పరిహారం పంపిణీలో డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ...తమకు నచ్చని డీర్లపై కూడా పనిలోపనిగా ఫిర్యాదు చేయిస్తున్నారని సమాచారం. రాజకీయ నాయకులు ఆరోపణలు చేయడంతో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. మరో వైపు రెవెన్యూ సిబ్బంది దాడులు చేస్తూ సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఆగ్ర హించిన  రేషన్ డీలర్లు సమ్మె చేస్తామని ప్రకటించడంతో కథ కొత్త మలుపు తిరిగింది.
 
 ఇటీవల జిల్లాలోని బీభత్సం సృష్టించిన తుపాను తాకిడికి నష్టపోయిన బాధితులకు బియ్యం తదితర నిత్యావసరాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సరకుల్లో ముఖ్యంగా బియ్యం పంపిణీలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. కార్డుదారులకు ఇచ్చే 25 కిలోల బియ్యంలో మూడు నుంచి 5 కిలోల బియ్యం తక్కువగా ఉంటున్నాయనీ, పది కిలోలు ఇచ్చిన చోట  2కిలోలు తక్కువ ఉంటున్నాయనీ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన డీలర్లను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్, జాయింట్ కలెక్టర్‌కు, ఆర్డీఓకూ ఆదేశించారు. మరోపక్క పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత కూడా డీలర్లపై గుర్రుగా ఉన్నారు. పలు చోట్ల ఈ ఆరోపణలు రావడంతో ఎనిమిది మంది డీలర్లను ఒకేసారి సస్పెండ్ చేశారు. మరో పక్క దాడులు కొనసాగుతున్నాయి. తుపాను బాధితులకు పంపిణీ చేస్తున్న నిత్యావసరాల్లో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరికలు కూడా పంపిస్తుండటంతో డీలర్లు మండిపడుతున్నారు.
 
 కమీషన్ లేకుండా పంపిణీ చేస్తే బహుమతి ఇదా...?
 డీలర్ల ఆవేదన మరోలా ఉంది. జిల్లాలో తాము ఎక్కడా బియ్యం తరలించి అమ్ముకోలేదనీ, బియ్యం తరుగుతో వస్తున్నాయనీ, తరుగుకు గురవుతున్న గోడౌన్లలో దాడులు నిర్వహించకుండా కొద్దిపాటి తేడా వచ్చినా తమను జైలుకు పంపిస్తామనీ, కేసులు బనాయిస్తామని బెదిరిస్తూ  తమను మానసికంగా హింసిస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో ఆరు లక్షల మందికి సరుకులను ఎటువంటి కమీషన్ లేకుండా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందుకు మాకు సస్పెన్షన్లు బహుమతా అని ప్రశ్నిస్తున్నారు. పోనీ ఎవరికైనా బియ్యం ఇవ్వకుండా పంపించేశామా చెప్పండని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో 1362 రేషన్ షాపుల్లో 6,61,296 రేషన్ కార్డులుండగా ప్రతి నెలా రేషన్ సరుకులు ఇస్తున్నారు. ఇప్పుడు డీలర్లు సరుకులు పంపిణీ చేయకుండా సమ్మె చేస్తామనడంతో వారికి సరుకుల సరఫరా ప్రశ్నార్ధకమయింది. డీలర్ల అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలనీ లేకుంటే నిరవధికంగా సరుకులను పంపిణీ చేయబోమని చెబుతున్నారు. అయితే దీనికి అధికారులు కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా డీలర్లు పనిచేయడంతో సస్పెండ్ చేయక తప్పదని చెబుతున్నారు.
 
 మరో ముగ్గురు డీలర్ల సస్పెన్షన్
 జిల్లాలో అక్రమాలకు  పాల్పడుతున్న మరో ముగ్గురు డీలర్లను సస్పెండ్ చేస్తున్నట్టు విజయనగరం ఆర్డీఓ జే వెంకటరావు తెలిపారు. నెల్లిమర్ల మం డలం సారిపల్లి, టెక్కలితో పాటు మరో గ్రామానికి చెందిన డీలర్‌ను సస్పెం డ్ చేసినట్టు ఆయన చెప్పారు. డీలర్లు తుపాను బాధిత కుటుంబాలకు సరఫరా చేస్తున్న రేషన్ సరకులకు పక్కదారి పట్టించడం, అవకతవకలకు పాల్పడటం వంటి కారణాలతో సస్పెండ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు.  
 
 పార్టీలకతీతంగా సస్పెండ్లు చేస్తున్నాం.
 సస్పెన్షన్లు ఊరికే చేయలేదు. రాజకీయంగానూ చేయలేదు. బాధితులకు ఇవ్వాల్సిన బియ్యం సక్రమంగా అందించకపోవడం, ఒక్కరికే పలు కార్డులకు సంబంధించిన బియ్యం అందివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం సరుకులు సరఫరా చేయాలి. అలా చేయడం లేదు. అందుకనే కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఆ ప్రకారమే చేస్తున్నాం. కమిటీ సమక్షంలో సరుకులు సరఫరా చేస్తే అక్రమాలుండవని అలా చెప్పాం కానీ, అదేదో ప్రొటోకాల్ అనుకుంటే ఎలా?  సమ్మె చేస్తామంటే ఎలా? ఆదేశాలిచ్చిన కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చుకోవాలి గానీ ఇలా ప్రకటిస్తారా?
 - జే వెంకటరావు, ఆర్డీఓ, విజయనగరం.
 
 ప్రొటోకాల్ పాటించకుంటే సస్పెండ్ చేస్తారా?
 బియ్యం పంపిణీకి ప్రొటోకాల్ పాటించలేదని మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. వేరే ఎవరో వచ్చి ఫొటోలు తీసుకున్నా, అరకేజీ బియ్యం తక్కువ వచ్చినా సస్పెండ్ చేస్తున్నారు. ఇది అన్యాయం. జిల్లాలో తుపాను బాధితులకు ప్రభుత్వమే సహాయం చేస్తుండటంతో తాము కూడా ముందుకు వచ్చి కమీషన్ లేకుండా సరుకులు పంపిణీ చేస్తున్నాము. ఇదే మా నేరమా? ఇందుకు సస్పెన్షన్లు బహుమతా?? మంచినూనె, పంచదార విషయంలో ఎందుకీ అనుమానం రాలేదు. బియ్యం గోడౌన్లలో తరుగు వస్తోంది. వారిపై చర్యలు తీసుకోకుండా మాపై చర్యలా? బియ్యం కూడా ప్యాకెట్లుగా ఇవ్వమనండి అందరికీ పంచేస్తాం. 50 కిలోల బస్తాలో 650 గ్రాములు ఎక్కువగా ఇవ్వాల్సిందిపోయి తిరిగి రెండు కేజీలు తగ్గిస్తున్నారు. ఆ లోటు భర్తీ చేసుకుంటున్నాం. దీనికే క్రిమినల్ కేసులు పెడతారా?  అందరి సస్పెన్షన్లు బేషరతుగా ఎత్తేయాలి. లేకుంటే నవంబర్ ఒకటి నుంచి సరుకులు సరఫరా బంద్ చేస్తాం.
 - బుగత వెంకటేశ్వర రావు రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం
 అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement