8 ఇసుక లారీల సీజ్
బొబ్బిలి రూరల్:మండలంలోని కారాడ గ్రామంలో వేగావతి నదినుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8లారీలను ఆర్‌ఐ, వీఆర్వోలు మంగళవారం సీజ్ చేశారు. ముందస్తు సమాచారం మేరకు రెవెన్యూ సిబ్బంది గ్రామానికి చేరుకోగానే ఇసుక అక్రమరవాణాదారులు కొందరు పారిపోగా మరికొందరు లారీలలో ఇసుకను తిరిగి వేగావతి నదిలో పోసి పారిపోయారు. కొంతమంది పారిపోగా మిగిలిన 8లారీలను సిబ్బంది పట్టుకున్నారు. ఈ లారీలతో ఇసుకను చీపురుపల్లి, విజయనగరం నుంచి విశాఖవైపు తరలిస్తున్నట్లు రెవెన్యూసిబ్బంది గుర్తించారు.
పట్టుకున్న లారీలను తహశీల్దార్‌కార్యాలయానికి తరలించి సీజ్‌చేశారు. ఇసుక తరలిస్తున్న లారీలను, నదిలో తిరిగి ఇసుక పారబోస్తున్న లారీలను సిబ్బంది వీడియో తీశారు. కాగా ఇసుకలోడుతోపట్టుబడిన లారీలకు ఒక్కోదానికి రూ.10వేల జరిమానా విధిస్తున్నట్లు తహశీల్దార్ బి.మసీలామణి తెలిపారు. కాగా ఈ ప్రాంతంలో పట్టపగలే ఇలా 8ఇసుక లారీలు పట్టుబడడం ఇదే తొలిసారి. గత ఏడాది ఓసారి పలు ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకోవడంతో అప్పట్లో పెద్ద వివాదం అయింది. పలువురు రాజకీయనాయకుల జోక్యంతో సమస్య అప్పట్లో మరింత ముదిరింది. మళ్లీ ఇన్నాళ్లకు 8లారీలను పట్టుకోవడంతో సంచలనం రేగుతోంది.
నాయకుల జోక్యం...?
ఇసుకాసురులను రెవెన్యూ సిబ్బంది పట్టుకోవడంతో చీపురుపల్లి ప్రాంతానికి చెందిన టీడీపీ ప్రముఖ నాయకుడు, అధికారులు, ఇక్కడి రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. సీజ్ చేసిన లారీల్లో టీడీపీ నాయకుడికి చెందినవే 5వరకు ఉన్నట్లు సమాచారం. దీంతో కేసును తారుమారుచేయడానికి గాని సీజ్ చేసిన లారీలను ఖాళీ వాహనాలుగా చూపేందుకు గానీ యత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
చంపావతి ఇసుకతో లారీ పట్టివేత
గుర్ల: ప్రభుత్వ అనుమతులు లేకుండా స్థానిక చంపావతి నది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ లారీని అదుపులోకి తీసుకుని పది వేల రూపాయలు అపరాధ రుసుము వసూలు చేశామని తహశీల్దారు ఉమాకాంత్ ఫాడి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలాగే మూడు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న తరువాత పరారయ్యారన్నారు. వాటికి సంబంధించిన వివరాలు స్థానిక పోలీసు స్టేషను, ఆర్టీఓకు తెలియజేశామని చెప్పారు. మరోసారి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తూ వాహనాలు పట్టుబడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. చంపావతినది, కెల్లగెడ్డ, గడిగెడ్డ ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను తక్షణమే నిలిపివేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దారు మహేష్, సీనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి, ఆర్‌ఐ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.