సహాయంలో రాజకీయమా? | Rahul Gandhi visits cyclone-hit Visakhapatnam | Sakshi
Sakshi News home page

సహాయంలో రాజకీయమా?

Published Mon, Oct 20 2014 1:15 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

సహాయంలో రాజకీయమా? - Sakshi

సహాయంలో రాజకీయమా?

సాక్షి ప్రతినిధి, విజయనగరం/భోగాపురం: హుదూద్ తుపాను వల్ల నష్టపోయిన బాధితులకు సహాయం చేసే విషయంలో రాజకీయాలు చేయరాదని, నష్టపోయిన రైతులందరికీ సహాయం చేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హితవు పలికారు. తుపాను నష్టాన్ని చూసిన రాహుల్ గాంధీ చలించిపోయారు. తుపాను ధాటికి మృతి చెందిన వారి కుటుంబీకుల బాధలు విని జాలి పడ్డారు. వారు పడుతున్న అవస్థల్ని విని, అండగా నిలుస్తామని, కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసి పూర్తిస్థాయి సాయం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.   
 
 హుదూద్ తుపాను బీభత్సానికి కకావికలమైన భోగాపురం మండలం తూడెం, కవులవాడ గ్రామాల్లో రాహుల్‌గాంధీ సోమవారం పర్యటించారు. తొలుత తూడెంలో నేలపాలైన కొబ్బరి చెట్లను పరిశీలించారు. అనంతరం బాధిత రైతులతో మాట్లాడారు. ఒక్కొక్క చెట్టు ఇచ్చే ఫలసాయమెంత, చేతికొచ్చే ఆదాయమెంత తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ప్రభుత్వ వివక్షను వివరించారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయలేదని పంట నష్టం జాబితాలో తమ పేర్లు చేర్చడం లేదని, వివక్ష చూపిస్తున్నారని మొర పెట్టుకున్నారు. రైతుల నష్టాన్ని నయా పైసా సైతం ప్రభుత్వం చెల్లించేలా పోరాడతామని భరోసా ఇచ్చారు.  గ్రామంలోని  రాజమ్మ అనే మహిళ మాట్లాడూతూ నిన్ను చూస్తే మీ నాన్న రాజీవ్ గాంధీని చూసినట్టు ఉంది.
 
 మా కష్ట, నష్టాలను చూసేందుకొచ్చావు. ఇలాగైనా చూడగలిగామంటూ బాధలోనే సంతోషాన్ని వ్యక్తం చేసింది.   అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రాహుల్ గాంధీ మట్లాడారు. అక్కడి నుంచి కవులవాడ గ్రామానికి చేరుకున్నారు. నష్టపోయిన కొబ్బరి రైతులతో ముందు మాట్లాడారు. లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ తన ఎకరా భూమిలో 80చెట్లు పడిపోయాయని, ఇల్లు కూడా పోయిందని మొర పెట్టుకుంది. మరో వృద్ధ మహిళ మాట్లాడుతూ కూలీ చేసుకునే వాళ్లం,కొబ్బరి, జీడి తోటలు పోనాయి. ఎకరాభూమిలో 60చెట్లు పడిపోయాయని చెప్పుకుంది. పంట నష్టపోయిన మహిళల గోడు విన్నాక  తుఫాన్ ధాటికి మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించారు. వారిని ఓదార్చి, ఎనిమిది కుటుంబాలకు  ఏఐసీసీ తరఫున  ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున  సాయం చేశారు.
 
 అనంతరం బాధితుల నుద్దేశించి మాట్లాడారు. భరోసా ఇచ్చే చెట్లు నాశనమైతే మా భవిష్యత్ ఏమని బాధితులంతా ప్రశ్నించుకుంటున్నారు. అంతకంటే సంపాదించే వ్యక్తులు,ధైర్యాన్ని ఇచ్చే యజమానులు చనిపోతే ఆ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరమన్నారు.తుపానుకు  బీద, మధ్య తరగతి వారే నష్టపోయారు. ఇళ్లు పోయి, పశువులు చనిపోయి, పంటలు పోయి నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి సహాయం అందించడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని తెలిపారు. బాధితులంతా గుండె నిబ్బరం చేసుకుని సమష్టిగా పోరాడి, పూర్వస్థితికి రావాలని ఆకాంక్షించారు. తుపాను నష్టం గురించి తెలిసి కళ్లారా చూడాలని, బాధలు తెలుసుకోవాలని  తానిక్కడికి వచ్చానని చెప్పారు.  అంతకుముందు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడారు.
 
 మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మండలంలో, గ్రామంలో జరిగిన నష్టాలను వివరించారు. రాహుల్ గాంధీ పర్యటనలో ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్,  పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తమిళనాడు కాంగ్రెస్ నేత తిరువక్కరసు,  పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి, వి.హనుమంతరావు,  కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పల్లంరాజు, కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, మాజీ మంత్రులు బాలరాజు, కోండ్రు మురళీమోహన్, శాసన మండలి సభ్యుడు రామచంద్రయ్య, డీసీసీబీ చైర్మన్ మరిచర్ల తులసి,మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య,  కాంగ్రెస్ నాయకులు మజ్జి శ్రీను,  యడ్ల రమణమూర్తి, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ,  యడ్ల ఆదిరాజు, పిళ్లా విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.  రాహుల్ గాంధీ స్థాయికి తగ్గ జనాలు రాకపోవడం నిర్వాహకులను అసంతృప్తికి గురిచేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement