ఎన్నికల ముందు పరస్పరం సహకరించుకుంటూ గూడుపుఠాణీ చేసిన టీడీపీ,కాంగ్రెస్ నాయకులు, ఎన్నిక తరువాత కలిహించుకుంటూ ఒకరి అవినీతి చిట్టాలు మరొకరు విప్పుతున్నారు. దీంతో వారి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడతున్నాయి. దీంతో రెండు పార్టీలు దొందూదొందేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు వాఖ్యానిస్తున్నారు. అయితే ఆరోపణలకే పరిమితం కాకుండా ఆధారాలు కూడా బయటపెడితే పార్టీలకు, నేతలకు విశ్వసనీయత పెరుగుతుందని, అందువల్ల అవినీతి నేతల బండారాన్ని బయటపెట్టాలని అవినీతి రహిత రాజకీయాలను ఆశిస్తున్న జిల్లా వాసులు కోరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికలకు నెల రోజుల ముందు టీడీపీలో చేరిన మీసాల గీతకు సీనియర్లను కాదని టిక్కెట్ ఇవ్వడం వెనుక ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీరాజుల బ్రోకరిజం ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఆమె వద్ద నుంచి ఎన్ని రూ.లక్షలు తీసుకున్నారో తమ వద్ద లెక్కలున్నాయి. పురపాలక, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ద్వారపురెడ్డి బి-ఫారాలు అమ్ముకున్నారు. చెరువులు కబ్జా చేసిన మున్సిపల్ ప్రసాదుల రామకృష్ణ, ఏ ఇసుకతో సింగపూర్ సిటీ, భగవాన్ నగర్‌లోని గ్రూపు హౌస్‌లు నిర్మించారో చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు సంధించారు. ముషిడిపల్లి పథకం ఎవరి హయాంలో ప్రారంభమైందో...ఎవరికి కాంట్రాక్ట్‌లు,సబ్ కాంట్రాక్ట్‌లు ఇచ్చారో ...ఇప్పటి పరిస్థితికి ఎవరు కారుకులో తేల్చేందుకు ఎటువంటి విచారణకైనా సిద్ధమని.... అశోక్ వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు.
తాడ్డి వెంకటరావుకు వచ్చిన బి- ఫారాన్ని ... వంగపండు నారాయణ అప్పలనాయుడికి ఇచ్చిందెవరు? దాని కోసం ముడుపులు తీసుకున్న దెవరో తెలియదా? బొత్స దోపిడీ ఏంటో అందరికీ తెలిసిందే. కర్ఫ్యూ కారకులైన వ్యక్తే ఈ కేసులు ఎత్తివేయాలంటూ మాట్లాటడం ఆశ్చర్యంగా ఉంది. పిళ్లా విజయకుమార్ పదేళ్లలో భూ దందాలు చేశారు. యడ్ల రమణమూర్తి కూడా రైతుల నుంచి అన్యాయంగా భూములు రాయించేసుకున్నారంటూ టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగారు. పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. తుపాను సహాయ చర్యల్లో రాజకీయం, ముషిడిపల్లి మంచినీటి పథకం నుంచి వస్తున్న బురద నీరుపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేసుకుంటున్న పరస్పర ఆరోపణలతో వారి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. బస్తీ మే సవాల్ అంటూ ఒకరిపై ఒకరు ధ్వజమెత్తుతున్నారు. అవినీతి అక్రమాల డొంకలను లాగుతున్నారు. అయితే భవిష్యత్‌లో మీ బండారం బయటపెడతామంటూ ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నారు తప్పా...అసలు విషయాలు బయటపెట్టడం లేదు.
ఇలా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు చూస్తే దొందూ దొందే అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టిక్కెట్ల కోసం తీసుకున్న డబ్బు, నాయకులు చేసిన భూఆక్రమణలు, పెద్దోళ్ల దోపిడీ నిర్వాకం బయటపెడితే విచారణ ఏజెన్సీలకు పనిసులువు అవుతుందని, ద్వారపురెడ్డి జగదీష్‌పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. పక్కా ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఆ ఆధారాలేంటో చూపిస్తే వారు చేసిన ఆరోపణలకు విశ్వసనీయత కల్గుతుందని వీరి రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్న వారు కోరుతున్నారు. అదే తరహాలో ముషిడిపల్లి మంచినీటి పథకం కాంట్రాక్ట్ లోగుట్టు విప్పితే ఆ కోటరీ వ్యవహారం బయటకు వస్తుంది. కాంగ్రెస్ నాయకుల నోరు విప్పితే టీడీపీ అసలు స్వరూపం బట్టబయలవుతుంది. అలాగే, కాంగ్రెస్ నేతల భూఆక్రమణల్ని బయటపెట్టి, విచారణకు ఆధారాలు చూపిస్తే టీడీపీ నాయకుల దయవల్ల విచారణాధికారులకు త్వరగా పని పూర్తికానుంది. ఆ నాయకుల అసలు రంగు భయటపడుతుంది. ఇదే మంచి తరుణం...గుట్టు విప్పండి గురూ అంటూ జిల్లా వాసులుకోరుతున్నారు.
గుట్టు విప్పండి గురూ...!
Published Sun, Nov 9 2014 1:30 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement