Corruption-free politics
-
అవినీతి కేసులో తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలు
చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడిని మద్రాసు హైకోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలుశిక్షను విధించింది. రూ.50 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పొన్ముడి ఆయన భార్యపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ 2002లో కేసు నమోదు చేసింది. ఏఐఏడీఎంకే ప్రభుత్వం 1996-2001 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేసు నమోదైంది. అప్పట్లోనే పొన్ముడి ఆయన భార్య ఆదాయం రూ. 1.4 కోట్లుగా ఉంది. ఆర్థిక వనరులకు మించి వారి వద్ద డబ్బు ఉందని తెలింది. 1996-2001 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో పొన్ముడి అక్రమ సంపదను కూడబెట్టారని అధికారులు ఆరోపించారు. తగిన సాక్ష్యాధారాలను సమర్పించడంలో విఫలమైందని పేర్కొంటూ జూన్ 28న వెల్లూరులోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు పొన్ముడి ఆయన భార్యను నిర్దోషులుగా ప్రకటించింది. పొన్ముడి ఆయన భార్యను నిర్దోషులుగా విడుదల చేసిన తీర్పును ఆగస్టులో మద్రాస్ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అయితే.. కేసు చాలా పాతదని, ప్రస్తుతం పొన్ముడికి 73 ఏళ్లు కాగా, ఆయన భార్యకు 60 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా కనీస శిక్ష తగ్గించాలని దంపతులు కోరారు. ఇదీ చదవండి: లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు -
అవినీతిపరులంతా బీజేపీలోకే: కేజ్రివాల్
చండీగఢ్: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతిపై పోరాటం పేరిట డ్రామాలు ఆడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. అవినీతిపరులుగా ముద్ర పడిన వారిని బీజేపీలో చేర్చుకొని, మంత్రి పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఆదివారం హరియాణాలోని రోహ్తక్లో పార్టీ కార్యక్రమంలో కేజ్రివాల్ మాట్లాడారు. అవినీతిపై మోదీ సర్కారు సాగిస్తున్న పోరాటమంతా నాటకమేనని ధ్వజమెత్తారు. నేరాలు, అవినీతికి పాల్పడిన వారు బీజేపీలో చేరుతున్నారని, దాంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు వారిని ఏమీ చేయలేకపోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీలో చేరి రక్షణ పొందుతున్న అక్రమార్కుల జోలికెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుల్లో చిక్కుకొని జైలుకెళ్లిన వారంతా అవినీతిపరులు కాదని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఈడీ కేసుల భయంతో బీజేపీలో చేరినవారే అసలైన అవినీతిపరులని తేలి్చచెప్పారు. -
అవినీతిపరులను కాపాడేందుకే... విపక్షాల ఉద్యమం
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల వల్లే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలు అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరును ఆపలేవని స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ఖ్యాతి అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఈ సమయంలో, భారత వ్యతిరేక శక్తులు అంతర్గతంగా, వెలుపలా చేతులు కలపడం సహజమేనని ప్రధాని పేర్కొన్నారు. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఆయన.. కొన్ని ‘అవినీతి రక్షణ ఉద్యమం’ ప్రారంభించాయంటూ పరోక్షంగా దుయ్యబట్టారు. కొందరికి కోపం కూడా వస్తోందంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే గతంలో ఇంతగా అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. ‘తప్పుడు ఆరోపణలతో దేశం తలవంచదు. అవినీతిపై చర్యలు ఆగవు. భారత వ్యతిరేక శక్తులు బలమైన పునాది వంటి రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తున్నాయి. దేశాభివృద్ధిని ఆపేందుకు దాడికి దిగుతున్నాయి. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు, వాటి విశ్వసనీయతను నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి’అని ఆరోపించారు. 2004–14 సంవత్సరాల మధ్య యూపీఏ ప్రభుత్వం మనీలాండరింగ్ ఆరోపణలపై రూ.5 వేల కోట్ల సొత్తును స్వాధీనం చేసుకోగా 9 ఏళ్లలో తమ ప్రభుత్వం రూ.1.10లక్షల కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుందన్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయాలకు, తమ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలకు సంబంధముందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంతగా విజయాలు సాధిస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అంతగా లక్ష్యంగా చేసుకుంటాయన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై పలు అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. బీజేపీ వరుస విజయాలు నమోదు చేసుకుంటున్న నేపథ్యంలోనే గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల విమర్శల దాడులు ఎక్కువైనట్లు చెప్పారు. మున్ముందు ఈ విమర్శలు అన్ని స్థాయిల్లోనూ తీవ్రతరమవుతాయని హెచ్చరించారు. ఏప్రిల్ 6–14 మధ్య సేవా కార్యక్రమాలు బీజేపీ వ్యవస్థాపక దినం ఏప్రిల్ 6 నుంచి మొదలుకొని ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ జయంతి రోజు వరకు సొంత నియోజకవర్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని మోదీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. సమాజంపై ఎంతో ప్రభావం చూపే రాజకీయ నేతలు రాజకీయేతర అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. ‘‘విష రసాయనాల నుంచి నేలకు విముక్తి కల్పించాలి. ఎంపీలు కొత్త సాంకేతికతను అలవర్చుకునేందుకు నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలకు మోదీని పార్టీ ప్రశంసించింది. బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘దొంగలందరి ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఆందోళనలకు బీజేపీ ఓబీసీ మోర్చా నిర్ణయించింది. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 14 దాకా రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టనున్నట్టు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు. రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఓబీసీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో ర్యాలీ చేశారు. ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
రైతు రథం.. టీడీపీ నాయకుల అవినీతి పథం
పేరుకేమో సంక్షేమ పథకం. తీరుకు మాత్రం దోపిడీకి వేసిన పథకం. టీడీపీ పాలనలో పాటించిన సూత్రమిది. నీరు–చెట్టు నుంచి మొదలుపెడితే రైతు రథం వరకు అన్ని పథకాలు ఈ సూత్రం ప్రకారం పనిచేసినవే. ఆ అవినీతి ఆనవాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి. టీడీపీ నేతలు తమ బినామీలను లబి్ధదారులుగా చేర్చి ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టారో బయటపడుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రైతు రథాలను టీడీపీ నాయకులు అవినీతి పథాల్లో నడిపిన తీరు విస్మయపరుస్తోంది. తమ బినామీలను లబ్ధిదారులగా చేర్చి ఏకంగా రూ.33 లక్షల సబ్సిడీ మొత్తాన్ని కొట్టేసిన బాగోతం వెలుగు చూసింది. రైతు రథం కింద నాడు మంజూరు చేసిన ట్రాక్టర్లు ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద లేవంటే అతిశయోక్తి కాదు. అవెప్పుడో అక్రమార్కుల ఇళ్ల వద్దకు చేరిపోయాయి. జిల్లాకు 24 యూనిట్లు మంజూరైతే ఇప్పుడు లబి్ధదారుల వద్ద ఉన్న ట్రాక్టర్లు రెండే రెండు. మిగతావన్నీ హాంఫట్ అయ్యాయి. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ స్కామ్ టీడీపీ నాయకుల అసలు స్వరూపాన్ని వివరిస్తుంది. ‘పథకం’ ప్రకారమే... 2018 డిసెంబర్, 2019 ఫిబ్రవరి, మార్చి నెలలో రై తు రథం పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఒక్కో యూనిట్ ఖరీదు ఒక్కో రకంగా ని ర్ణయించి, యూనిట్‌కు రూ.లక్షా 50వేల సబ్సిడీని ప్ర కటించింది. అప్పట్లో రైతు రథం పథకంపై పెద్ద ఎ త్తున ప్రచారం చేసింది. అంతా చేసి ఆ ట్రాక్టర్లు ఇ చ్చింది మాత్రం వారి బినామీలకే. దీనిపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అవి నిజమేనని నేడు తేలు తోంది. ట్రాక్టర్లు మంజూరయ్యాక వాటిని నాటి పా లకుల అనుచరులు లాగేసుకున్నారు. ఇందులో ఎంత మొత్తంలో చేతులు మారాయో తెలీదు గానీ రైతు రథం పథకం ఆశయం మరుగున పడిపోయి అనర్హుల చేతికి ట్రాక్టర్లన్నీ వెళ్లిపోయాయి. అక్రమాలు ఇలా.. ►జిల్లాలో రైతు రథం పథకం కింద 24 యూని ట్లు(ట్రాక్టర్లు) మంజూరు చేశారు. ►అత్యధికంగా రూ. 6,28,021 నుంచి అత్యల్పంగా రూ.5,64,720 ధర నిర్ణయించారు. ►ఇందులో ప్రతి దానికి లక్షా 50వేల రూపాయలు చొప్పున సబ్సిడీని అందజేశారు. అయితే మంజూరులో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రస్తుత వ్యవసాయ అధికారులు రైతు రథం కింద మంజూరు చేసిన ట్రాక్టర్లపై విచారణ చేశారు. ఈ విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగు చూశాయి. ►మంజూరైన 24 ట్రాక్టర్లలో ప్రస్తుతం రెండు మాత్రమే అసలైన లబ్దిదారుల వద్ద ఉన్నాయి. ►ఓ రెండు యూనిట్లు ఏకంగా గ్రౌండ్ కాలేదు. మ రో రెండు ట్రాక్టర్లకు సంబంధించి మంజూరైన చాసిస్ నంబర్లు ఒకటుంటే, ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద ఉన్న ట్రాక్టర్ల చాసిస్ నంబర్ మరోలా ఉంది. ►అంటే అప్పట్లో పాత ట్రాక్టర్లను చూపించి సబ్సిడీ మొత్తాన్ని కొట్టేశారన్న అనుమానాలు ఉన్నాయి. ►ఇక 18 ట్రాక్టర్లు లబి్ధదారుల వద్ద ప్రస్తుతం లేవు. అవన్నీ చేతులు మారిపోయాయి. ►అవన్నీ అప్పట్లో వెనకుండి కథ నడిపించిన పెద్దల చేతిలోకి వెళ్లిపోయాయని తేలింది. ►అధికారులైతే ప్రస్తుతానికి వాటిని లబ్దిదారులు అమ్మేశారని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక కూడా వ్యవసాయ అధికారులు పంపించారు. ►మొత్తానికి అక్షరాలా రూ. 33లక్షల సబ్సిడీ మొత్తాన్ని గత ప్రభుత్వంలో కొట్టేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే ఆ ట్రాక్టర్లు ఎవరి చేతికి వెళ్లా యి? అప్పట్లో నడిచిన బినామీ బాగోతం తదితర అవినీతి గుట్టు అంతా బయటపడనుంది. -
తమిళనాడు ఎన్నికల్లో ‘రంగం’ సినిమా రిపీట్
‘రంగం’ సినిమాలో మాదిరి కొందరు యువకులు కలిసి ఏర్పాటుచేసిన పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందో అదే విధంగా తమిళనాడులో ప్రస్తుతం అదే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు ఎన్నికల్లో 36 మంది యువకులు తలపండిన రాజకీయ నాయకులను ఢీకొననున్నారు. ఆ యువశక్తి వెంట ఓ శక్తి ఉంది. ఆయనే యు.సగాయం. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లను ఎన్నికల రాజకీయాల్లోకి దింపనున్నారు. అవినీతికి వ్యతిరేకంగా సగాయం పోరాటం చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన తమిళనాడు ఇలయంగ్ కట్చీ (టీఎన్‌ఐకే) అనే ఒక పార్టీ స్థాపించాడు. అందులో అంతా యువకులే పని చేస్తున్నారు. దశాబ్ద కాలం పాటు అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ ఎన్నికలను వాడుకోనున్నారు. ఈ క్రమంలోనే మొత్తం 20 స్థానాల్లో తమ పార్టీ తరఫున యువకులు పోటీ చేస్తున్నట్లు ఆ మాజీ ఐఏఎస్ అధికారి సగాయం ప్రకటించారు. ఈ మేరకు వారిలో కొంత మంది సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. 15 మంది అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. కొలాత్‌పూర్, రోయాపూర్, అన్నానగర్, అవడీ, అలాందుర్, మధురవోయల్, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో ఆయన శిష్యులు పోటీ చేస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే శక్తి తమకు లేదని.. అందుకే విద్యావంతులు అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నట్లు సగాయం మీడియాకు చెప్పారు. ఇది మొదటి అడుగు.. అని ప్రజల్లోకి ఉద్యమం తీసుకెళ్లేందుకు ఎన్నికలు దోహదం చేస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో మొత్తం రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తాము పోటీ చేసేందుకు సిద్ధమని సగాయం ప్రకటించారు. అయితే ముఖ్యమంతత్రి పళనిస్వామి నియోజకవర్గం ఎడప్పాడిలో పోటీ చేయడం లేదని చెప్పడం గమనార్హం. సగాయం గతంలో మధురైలో అక్రమ గనుల తవ్వకాలను అడ్డుకున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఐఏఎస్‌గా ఉన్న సమయంలో తన పనితీరుతో అందరికీ కంట్లో నలుసుగా ఉన్నారు. అందుకే ఆ బాధ్యతల్లో ఉన్న 27 ఏళ్లల్లో అనేకసార్లు బదిలీలు జరిగాయి. అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ఎన్నికలు ఒక భాగం మాత్రమే అని సగాయం ప్రకటిస్తున్నారు. -
అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, వరంగల్ రూరల్ : అక్రమార్కులకు ఎటువంటి కష్టం లేకుండానే లక్షల విలువ చేసే రేషన్ కిరోసిన్ పక్కదారి పట్టేది. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. రేషన్ సరఫరాలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు తీసుకవచ్చిన ఈ పాస్ సత్ఫలితాలు ఇస్తోంది. ఈ పాస్ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ గతంలో ప్రారంభం కాగా ఫిబ్రవరి నుంచి కిరోసిన్ పంపిణీ సైతం ఈ పాస్ ద్వారా ప్రారంభమైంది. ఈ పాస్ ద్వారా రేషన్ డీలర్ల అక్రమాలకు కళ్లెం పడింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న ఆక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ–పాస్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. తొలుత బియ్యానికి ఈ పాస్ పెట్టగా తద్వారా అక్రమాలను నిరోధించి సరుకులు సక్రమంగా పంపిణీ అయ్యాయని అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కిరోసిన్‌కు అమలు చేస్తుంది. ఇప్పటికే కార్డుదారుల వివరాలను ఆధార్‌కు, మొబైల్ నంబర్‌కు అనుసంధానం చేశారు. రేషన్ కార్డుల జారీ సైతం ఆధార్‌కార్డుల ద్వారానే జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా 464 రేషన్ షాపులుండగా 2,18,269 మొత్తం రేషన్ కార్డులున్నాయి. ఈ–పాస్ పనిచేసిది ఇలా... ఈ–పాస్ పరికరంలో మొదట రేషన్‌కార్డు నంబర్‌తో లాగిన్ అయిన తర్వాత లావాదేవీల ఆప్షన్ వస్తుంది. దీంతో రేషన్ సరుకులు ఎంచుకున్న తరువాత రేషన్ కార్డు నంబర్ నమోదు చేయాలని సూచిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చారో అందులో ఎంచుకోవాలి. అప్పుడు ఆ కార్డుదారుడి వేలి ముద్ర తీసుకుంటే ఆ కుటుంబానికి లీటర్ కిరోసిన్ వస్తుంది. ఈ పాస్‌తో మిగిలిన కిరోసిన్ ఈ పాస్ ద్వారా 16 మండలాల్లో మండలాల్లో బియ్యాన్ని పంపిణీ చేశారు. జిల్లాలో 464 రేషన్‌షాప్‌ల ద్వారా 2,18,269 కార్డుదారులకు సరుకుల పంపిణీ జరుగుతుంది. జిల్లాకు 21,6098 లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు. ఫిబ్రవరి నెల నుంచి ఈ పాస్ ద్వారా కిరోసిన్ పంపిణీ చేయగా 1,98,226 లీటర్ల కిరోసిన్ మిగిలింది. దీంతో ఈ మూడు నెలల్లో 1.98 లక్షల లీటర్ల కిరోసిన్ అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వానికి మిగిలింది. అక్రమాలను పూర్తిగా అరికట్టాం.. రేషన్ పంపిణీలో అక్రమాలను పూర్తిగా అరికట్టకలిగాం. తొలుత బియ్యం.. ఇప్పుడు కిరోసిన్‌కు ఈ పాస్ అమలు చేయడం జరుగుతుంది. దీంతో అక్రమాలకు చెక్ పెట్టాం. కార్డుదారులు ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటును కల్పించాం. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, కిరోసిన్ అందరికి, అంత్యోదయ కార్డు దారులకు చక్కెరను అందిస్తున్నాం. ఎలాంటి అవకతవకలు జరగడం లేదు. –వనజాత, డీఎస్ఓ -
చిన్నిరాజు గారి కోటలో సామంతుల వేట
ఆయన హోం శాఖా మంత్రి ... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సింది పోయి తన ఇంటినే చక్కబెట్టే పనిని విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశ పెట్టినా ఆ పథకం తన నియోజవర్గానికి అన్వయించేస్తూ పర్సంటేజీల వాటాలతో అక్రమాల విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. మంత్రి పదవిని ఆసరా చేసుకొని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లుగా కోట్ల రూపాయలను కొల్లగొట్టారనే వాదనలు గుప్పుమంటున్నాయి. పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టను గుల్ల చేసి అధికార పార్టీ నేతలు రూ.100 కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తు ఉండే కొండలు నేడు కనిపించని విధంగా 200 ఎకరాల వరకు చదును చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. సాక్షి టాస్క్‌ఫోర్స్: మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని ఆయన పేరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా కోట్లు కొల్లగొట్టారనే వాదనలు గుప్పుమంటున్నాయి. ఈ విషయాలు ‘సాక్షి టాస్క్‌ఫోర్స్’ ద్వారా వెల్లడయ్యాయి. ఎన్నికల్లో ఉపయోగపడేలా నియోజకవర్గంలో కార్యకర్తలకు మంత్రి అండగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనే పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టను గుల్ల చేసి అధికార పార్టీ నేతలు రూ.100 కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తు ఉండే కొండలు నేడు కనిపించని విధంగా 200 ఎకరాల వరకు చదును చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. కొండల తవ్వకాలను నిలిపివేయాలని వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన చేసినా టీడీపీ నేతలు మంత్రి సిఫార్సులతో అధికారుల సమక్షంలో కొండలను గుల్ల చేసి రూ.కోట్లు ఆర్జించారు. నాలుగేళ్లుగా కొండలను తవ్వడం ప్రారంభించి నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ కొండపై ఆధారపడి ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం, వాలుతిమ్మాపురం గ్రామాలకు చెందిన సుమారు 800 మంది దళితులు జీవించే వారు. అయితే అధికార పార్టీ పెద్దల అండతో మైనింగ్ మాఫియా ఆ భూముల్లోకి ప్రవేశించి దళితుల బతుకులతో ఆటలాడుకుంటోంది. దళితులతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని దళితుల అనుమతులు ఉన్నాయంటూ తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొండల మీదుగా 33 కేవీ విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయగా వాటి చుట్టు కూడా గ్రావెల్ తవ్వకాలు చేశారు. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో రామేశ్వరం మెట్టపై ఉన్న భూములను 800 ఎకరాల వరకు పేద దళితులకు పంపిణీ చేశారు. తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మరో 530 ఎకరాల భూమిని ఒక్కొక్క కుటుంబానికి ఎకరం 35 సెంట్లు చోప్పున పంపిణీ చేశారు. రాజశేఖరరెడ్డి హయాంలో బోర్లు ఏర్పాటు.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005–06లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇందిరా క్రాంతి, ఇందిరా జల ప్రభ ద్వారా 72 బోర్లు వేయించి డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా పంట పొలాలకు పైపులైన్లు ఏర్పాటు చేయించారు. దాంతో మెట్టపై జీడి మామిడి, దుంప, అపరాల పంటలు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. దాంతో ఎకరానికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు ఆదాయం వచ్చే దని రైతులు తెలియజేశారు. విద్యుత్ సదుపాయంతో బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న మెట్టను ఏ విధంగా తవ్వకాలకు అధికారులు అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండ దండలతో తప్పుడు రికార్డులతో మాఫియా రంగంలోకి దిగి క్వారీ తవ్వకాలు చేస్తోంది. మెట్టపై భూములు ఉన్న వారిని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని మైనింగ్ తవ్వకాలు ప్రారంభించారనే ఆరోపణలూ జోరుగానే ఉన్నాయి. మెట్టపైన తవ్వకాల ద్వారా వందల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సొంత భూమిలో గ్రావెల్ తవ్వకానికి అనేక మంది అధికారుల అనుమతి ఉండాలి. ఎటువంటి అనుమతి లేకుండా ఏడీబీ రోడ్డును చేర్చిన ఉన్న ప్రభుత్వ కొండను తవ్వకాలు చేస్తూ ఉన్నా అధికారులు మౌనం వహించడంపై అధికార పార్టీ అండ ఉన్నదనే వాదనలకు బలం చేకూరుతుంది. దాదాపు 10 ప్రొక్లెయిన్లతో 24 గంటల పాటు నిరంతరాయంగా తవ్వకాలు జరుగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎకరం భూమిలో సుమారు 10 వేల లారీల వరకు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసింది. లారీ మట్టి ఖరీదు రూ. వెయ్యి చోప్పున చూసినా ఎంత వస్తుందో అర్థమవుతుంది. అభివృద్ధి పేరుతో అవినీతి మయం.. పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ది చేశామనే ప్రకటనలో అవినీతి భాగం ఎక్కువగా ఉన్నదనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో రూ.1200 కోట్ల వరకు అభివృద్ధి జరిగినట్టు ఉప ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారని, దానిలో 50 శాతం వరకు అవినీతి చోటు చేసుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం సమయంలోనే గోతులతో నిండిపోయింది. దానిలో 50 శాతం వరకు అవినీతి ఉన్నదనే గతంలోనే తోట సుబ్బారావు నాయుడు ఆరోపించారు. ఈ అవినీతిపై అన్ని పార్టీల నాయకులు ప్రశ్నల వర్షం కురిపించినా మౌనం వహించడం విశేషం. ఇక రూ. కోటితో పెద్దాపురం బస్సు కాంప్లెక్స్ నిర్మాణంలోను భారీ అవినీతి ఉన్నదనే వాదనలు ఉన్నాయి. రేకులతో నిర్మాణం చేసి రూ.50 లక్షల వరకు నిధులు స్వాహా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. సంత మార్కెట్‌ను మార్పు చేసి ప్రారంభంలో మూడు వారాల పాటు టెంట్లు ఏర్పాటు చేసి రూ.లక్షల బిల్లు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పాండవుల మెట్టపై శతాబ్ది పార్కు నిర్మాణంలో మున్సిపాలిటీ జనరల్ నిధులు రూ.రెండు కోట్ల వరకు కేటాయించడం ఎంత వరకు సమంజసమనే వాదనలు ఉన్నాయి. పార్కు పనుల్లో రూ.కోటి వరకు అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. కార్యకర్తలకు ఒక వరం నీరు–చెట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తల కోసం నీరుచెట్టు పథకం ప్రవేశ పెట్టినట్టు ఉంది. ఈ పథకం ప్రకారం చెరువులో మట్టి తీసిన సమయంలో ఆ మట్టిని గట్లు పటిష్టం చేయడానికి, రివిట్ మెంటుకు ఉపయోగించాలి. ఆయా గ్రామాల్లో ఇళ్ల స్థలాలు, శ్మశాన వాటికలు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాలు పల్లంగా ఉంటే వాటిని ఎత్తు చేయడానికి ఉపయోగించాలి. అయితే చెరువుల్లో మట్టిని బయట విక్రయించి కార్యకర్తలు రూ.లక్షలు సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి మంత్రి అండ ఉన్నదనే వాదనలు ఉన్నాయి. దీని కారణంగానే అధికారులు గమనించి కూడా మౌనం వహించారనే విమర్శలు ఉన్నాయి. వేట్లపాలెం వెంకటపతిరాజు చెరువు, నీరు చెట్లు పనుల పేరుతో రూ.10 కోట్ల వరకు సంపాదించారనే వాదనలు ఉన్నాయి. ఆస్పత్రి అభివృద్ధిలోనూ అవినీతే.. సామర్లకోట సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రహారీతో పాటు 10 పడకలు రూ.60 లక్షలతో నిర్మించగా (ప్రహరీకి రూ.50 లక్షలు ఖర్చుగా అంచనా వేశారు) మరో 30 పడకలకు రూ.2.86 కోట్లు కేటాయించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనులకు సంబంధించి అంచనాలు ఎక్కువగా తయారు చేయించి దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందరికీ ఇళ్ల పథకంలో జి ప్లస్ 3 పేరుతో ప్రతి ఫ్లాటుకు రూ. 6.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు కేటాయించి కాంట్రాక్టరుకు లబ్ధిగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి లబ్ధిదారునిపై రూ.మూడు లక్షలు అప్పు చెల్లించాల్సి ఉంది. గతంలో రాజశేఖరరెడ్డి కాలంలో నిర్మించిన ఫ్లాట్లు కేవలం రూ.1.95 లక్షలతో జీ ప్లస్ 2లో అందజేయడం జరిగిందనే వాదనలు ఉన్నాయి. దీనిలో లబ్ధిదారుడు బ్యాంకు వాటా రూ.20 వేలుగానే ఉండటం గమన్హారం. హౌసింగ్ రుణాల మంజూరుకు పార్టీ నేతలకు చేతులు తడపాల్సి వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రూ.1.5 లక్షలకు గ్రామాల్లో రూ.రెండు వేల నుంచి రూ.ఐదు వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డు వెంబడి ఉన్న చెట్లను తెలుగుదేశం నాయకులు మాయం చేస్తున్నారు. రోడ్డు వెడల్పు పేరుతో ఆర్అండ్బీ అధికారులు చెట్లు తొలగించాల్సి ఉంది. అటువంటి సమయంలో చెట్లకు బహిరంగ వేలం నిర్వహించవలసి ఉంది. అయితే అటు వంటి ప్రక్రియ లేకుండానే చెట్లను పార్టీ నేతలు మాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డు వెంబడి ఉన్న చెట్లను తెలుగు తమ్ముళ్లు మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పెద్దాపురం ఇరిగేషన్ కార్యాలయాన్ని విడిచి పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. కార్యాలయాలకు చెందిన కలప మాయం వేలం నిర్వహించకుండానే మాయం చేశారనే విమర్శలు ఉన్నాయి. కోట్లమ్మ.. నీలమ్మ చెరువు అభివృద్ధి పనులు ఎక్కడ? నాలుగేళ్లుగా కోట్లమ్మ, నీలమ్మ చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటనలు తప్ప ఆచరణ జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నీలమ్మ చెరువు అభివృద్ధికి రూ.కోటి కేటాయిస్తున్నట్లు ప్రకటనలు చేశారు. అయితే నిధులు విడుదల కాక పోవడంతో పనులు ప్రారంభించలేదని అధికారులు తప్పించుకొంటున్నారు. నీరు చెట్టు పనుల పేరుతో చెరువులో పూడిక తీసి గట్లును పటిష్టం చేశారు. అయితే రివిట్మెంట్, పార్కు, వాకింగ్ ట్రాక్ పనులు చేయవలసి ఉంది. పార్కులు, రివిటింగ్ పనులకు సాధారణ నిధులు కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. ఇక కోట్లమ్మ చెరువు అభివృద్ధి పనులు శిలాఫలకానికే పరిమితం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేకుల షెల్టర్లకు రూ.ఐదు లక్షలా! ఐదు నుంచి 10 మంది ప్రయాణికులు వేచి ఉండడానికి రేకులతో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక్కొక్క షేల్టర్కు రూ.ఐదు లక్షలు ఖర్చు చేసిన్నట్టు ప్రకటించడంపై ప్రజలు ముక్కున వేలువేసు కొంటున్నారు. రూ.లక్ష కూడా ఖర్చు కాని ఈ షెల్టర్‌కు రూ. ఐదు లక్షలా అనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి షెల్టర్లు పెద్దాపురంలో మూడు నిర్మించి భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతీ అభివృద్ధి పనిలోను అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అనధికార లే అవుట్ల జోరు.. నియోజకవర్గ పరిధిలో ప్రతీ గ్రామంలోను అనధికార లే అవుట్లు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గమనించి ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. లే అవుట్ల సమయంలో సమీపంలో ఉన్న భూములు స్వాహా చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. అనధికార లే అవుట్ల విక్రయాలు చేసిన సమయంలో కొనుగోలు దారులు నష్టపోతున్నారు. వారికి ఇళ్ల నిర్మాణానికి ప్లాన్లు మంజూరు కావడం లేదు. దాంతో అపరాధ రుసం చెల్లించాల్సిన పరిస్థితి కొనుగోలుదారులపై భారంగా ఉంటుంది. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు అభివృద్ధిలో పార్టీ పక్షపాత వైఖరి ఎక్కువగా ఉన్నదనే విమర్శలు ఉన్నాయి. సామర్లకోట మఠంసెంటర్లోను, పెద్దాపురం దర్గా సెంటర్లోను అధికార పార్టీ నేతలకు చెందిన షాపులు ఉండడం వల్ల వాటికి చెందిన రోడ్డుపై ఉన్న మెట్లు కూడా ముటుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికార పార్టీ అండతో వాట్స్ఆప్, ఫేస్బుక్లలోను హల్చల్ చేశాయి. అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి.. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు గాలి వదలి వేశారు. కలుషితం అవుతున్న గోదావరి జలాలే ప్రజలకు తాగునీరుగా ఉంది. నియోజకవర్గ పరిధిలో కొండలను పిండి చేసి కోట్లు సంపాదించుకొన్నారు. నియోజకవర్గంలో మొక్కల పేరుతో నిధులు స్వాహా చేశారు. ఎక్కడా మొక్కలు వేయలేదు. నీరు–చెట్టు పేరుతో అధికారుల అండతో అవినీతి జరిగింది. మంత్రి అండతో కార్యకర్తల దోపిడీ పెరిగిపోయింది. ప్రతీ అభివృద్ధి పనిలోను అవినీతి చోటు చేసుకుంది. పనులు నాసి రకంగా జరుగుతున్నాయి. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు వెడల్పు పనులను ప్రజలు గమనిస్తున్నారు. పిఠాపురం రోడ్డులో ఇరుకు వంతెన మంత్రి గారికి కనిపించడం లేదా? గోదావరి కాలువలో కాలుష్య జలాలు కలుస్తున్నా చర్యలు తీసుకొవడం లేదు. రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలి.– దవులూరి దొరబాబు, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పెద్దాపురం నియోజకవర్గం అవినీతిలో నిండిపోయింది.. నియోజకవర్గ పరిధిలో మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని బారీ ఎత్తున అవినీతి మయంగా మారి పోయింది. కొండలను తవ్వి చేసి రూ.కోట్లు స్వాహా చేశారు. కొండలను బంధువులకు అప్ప గించారు. ఏడీబీ రోడ్డు మిగులు భూములు కార్యకర్తలు స్వాహా చేస్తున్నారు. దానికి మంత్రి అండ ఉంది. టీడీపీ నాయకులు బినామీ కాంట్రాక్టర్ల పేరుతో సింగిల్ టెండర్లతో పనులు చేస్తున్నారు. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు విస్తరణలో పక్షపాత వైఖరి అవలంబించారు. పేదలకు అన్యాయం చేశారు. రోడ్డు పనుల్లో నాణ్యత లోపం ఉంది. జన్మభూమి కమిటీలు కార్పొరేషన్ రుణాల్లో అవకతవకలు జరిగాయి. సామర్లకోట టౌన్ ప్లానింగ్ పూర్తిగా విఫలమైంది. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. రూ.60వేలతో నిర్మించే బస్ షెల్టర్‌కు రూ.ఐదు లక్షల ఖర్చు చూపడం అవినీతి కాదా. – నేతల హరిబాబు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, సామర్లకోట -
ఆ అవినీతి మంత్రి .. మాకొద్దు
సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీ అధికార టీడీపీలో టిక్కెట్ల రగడ రోజు రోజుకు ముదురుతోంది. పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో శుక్రవారం టీడీపీ సమీక్షా సమావేశం నిర్వహించింది. సభలో మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. జవహర్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంత్రి జవహర్‌కు టిక్కెట్ ఇస్తే కేటాయిస్తే అతడిని ఖచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. జిల్లాలోమంత్రి జవహర్ భారీగా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఇసుక, మద్యం కుంభకోణల్లో కోట్ల రూపాయలు సంపాదించారు. దీంతో సమావేశంలో అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. -
కార్పొరేషన్లో అవినీతి కంపు
కర్నూలు (టౌన్): నగర పాలక సంస్థ అధికారులు అవినీతిలో కూరుకుపోయారు. పైసలివ్వందే పనులు చేయడం లేదు. దీంతో ఒక్కొక్కరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడుతున్నారు. ఏడాది వ్యవధిలోనే నలుగురు అధికారులు జైలు పాలయ్యారు. తాజాగా బుధవారం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. మూడునెలల క్రితం నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి ప్రశాంతి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అన్ని విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పాలనను గాడిలో పెడుతున్న సమయంలోనే పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం ఏసీబీకి చిక్కడంతో కార్పొరేషన్ పరువు కాస్తా గంగలో కలిసినట్లయ్యింది. ఏడాది వ్యవధిలో నలుగురు నగర పాలక సంస్థలో వివిధ విభాగాలకు చెందిన నలుగురు ఉద్యోగులు లంచం తీసుకుంటూ జైలుపాలయ్యారు. 2018 జనవరి 27న ఇంజినీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాలసుబ్రమణ్యం కంట్రాక్టర్‌కు బిల్లు చేసేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అలాగే ఏప్రిల్ 14న ఇంటికి కుళాయి కనెక్షన్‌కు సంబంధించి రూ.5 వేలు లంచం తీసుకుంటూ రెవెన్యూ విభాగానికి చెందిన బిల్‌కలెక్టర్ సుధాకర్ పట్టుబడ్డారు. ఆ తరువాత ఇదే విభాగంలో మరొక బిల్ కలెక్టర్ షరీఫ్ డిసెంబర్ 13న పన్నులో పేరు మార్పిడికి సంబంధించి రూ.5 వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. తాజాగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నం రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఐఏఎస్ పాలనలోనూ అదే దందా! నగర పాలక సంస్థ కమిషనర్‌గా పి.ప్రశాంతి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరంతర తనిఖీలు, సమీక్షలు చేయడంతో పాలనలో కొంత మార్పు కనిపించింది. చెత్త సేకరణలోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయి. కార్పొరేషన్ బాగుపడుతోందని అనుకుంటున్న తరుణంలో మరో అధికారి పట్టుబడటం గమనార్హం. దీన్నిబట్టి ఐఏఎస్ అధికారి పాలనలోనూ అదే దందా కొనసాగుతోందన్న విమర్శలకు తావిచ్చినట్లు అయ్యింది. నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగం అన్ని విభాగాల్లో కీలకమైనది. ఇళ్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య భవనాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు..వీటన్నింటి అనుమతి వ్యవహారాలు ఈ విభాగంలో చూస్తుంటారు. దీంతో ఇక్కడ అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది. బిల్డింగ్లు ప్లానింగ్‌కు విరుద్ధంగా నిర్మించినా, అనుమతి లేకుండా కట్టినా, నాన్లేఔట్లలో నిర్మాణాలు చేపట్టినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏసీబీకి చిక్కిన ఏసీపీ – శాస్త్రి షభ్నం తీరే సప‘రేటు’ కర్నూలు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ)గా పనిచేస్తున్న శాస్త్రి షభ్నం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు బుధవారం పట్టుబడ్డారు. నగరంలోని బళ్లారి చౌరస్తాకు చెందిన పవన్‌కుమార్ మోదీ 2015, 2017 సంవత్సరాల్లో రెండు స్థలాలు కోనుగోలు చేశాడు. ఈ స్థలాల్లో నిర్మాణాల కోసం పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శాస్త్రి షభ్నంను కలిశారు. రెండు మూడు సార్లు కలిసినా పని కాలేదు. ప్లాన్ అప్రూవల్ కావాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విసుగు చెందిన బాధితుడు ఈ నెల 19న అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిసి... లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం నగర పాలక పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీపీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో సోదా చేయగా.. రూ.8.20 లక్షల నగదు, 200 గ్రాముల బంగారు నగలు, బ్యాంకు పాస్‌బుక్కులు, విలువైన డాక్యుమెంట్లు లభించాయి. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉందని ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. పట్టుబడిన ఏసీపీని గురువారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. కాగా.. శాస్త్రి షభ్నం 1999 నుంచి 2001 వరకు పట్టణ ప్రణాళిక విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆ తరువాత టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ (కర్నూలు నగరపాలక సంస్థ)గా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా (గుంతకల్లు, నందికొట్కూరు) పనిచేశారు. ఆ తరువాత పదోన్నతిపై అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా కర్నూలు నగరపాలక సంస్థలో 2014 నుంచి పనిచేస్తున్నారు. -
ఆర్టీఓ కార్యాలయలంలో అవినీతి దందా
మన ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారులకు, సిబ్బందికి బొత్తిగా ‘బుర్ర’ లేదేమోనని... ఒక్కోసారి అనిపిస్తుంటుంది. వారు చాలా తేలిగ్గా ఏసీబీ అధికారులకు దొరికిపోతుంటారు. ఇలాంటోళ్లు.. తమను చూసి ‘పాఠాలు’ నేర్చుకోవాలంటున్నారు.. ఓ ప్రభుత్వ శాఖ ‘వారు’. యథేచ్ఛగా, నిర్భీతిగా, బహిరంగంగా అవినీతి దందా సాగిస్తూ... ఏసీబీని కూడా బురిడీ కొట్టిస్తున్న (దొరక్కుండా తప్పించుకుంటున్న) ఆ అపర అవినీతి ‘చక్రవర్తుల’ను, వారి ‘సామ్రాజ్యాన్ని’ చూసొద్దాం రండి...!!! ఖమ్మంక్రైం: ఆ ‘సామ్రాజ్యం’ పేరే... ఖమ్మంలోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయం(ఆర్టీఓ)...! అ క్కడి సిబ్బందే ‘చక్రవర్తులు’...!! అక్కడ అవినీతి దందా ఎలా సాగుతోందో ప్రత్యక్షంగా చూద్దాం. అతడి పేరు పవన్. ప్రభుత్వ ఉద్యోగి. ఇటీవల, ఓ ద్విచక్ర వాహనం కొన్నాడు. అప్పటివరకూ అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. లైసెన్స్ కోసం ఖమ్మంలోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయానికి ఉదయమే వెళ్లాడు. క్యూలో గంటలతరబడి నిల్చున్నాడు. తన ఫైల్‌ను కౌంటర్ చేయించుకున్నాడు. లైసెన్స్ పరీక్ష రాశాడు... ‘ఫెయిలయ్యాడు’..! తనదే పొరపాటు జరిగిందేమోనని అనుకున్నాడు. ఉసూరుమంటూ బయటికొచ్చాడు. అప్పటికి సమయం.. మధ్యాహ్నం మూడు గంటలు. మరొక రోజున, ఆఫీస్‌కు సెలవు పెట్టి ఉదయమే వెళ్లాడు. మొదటిసారి వెళ్లినప్పుడు మాదిరిగానే, గంటలతరబడి క్యూలో నిలుచున్నాడు. కౌంటర్ వేయించుకున్నాడు. పరీక్ష రాశాడు. మళ్లీ ‘ఫెయిలయ్యాడు’..!! బయటికొచ్చేసరికి సాయంత్రమైంది. తనకేమీ అర్థమవలేదు. తన తరువాత ముగ్గురు స్నేహితులు దరఖాస్తు చేసిన విషయం గుర్తుకొచ్చింది. వాళ్లను కలుసుకున్నాడు. ఆశ్చర్యం...! వాళ్ల ముగ్గురికీ దరఖాస్తు చేసిన రోజునే (లెర్నింగ్) లైసెన్స్ వచ్చిందట...!! తనకు రెండుసార్లు ఎదురైన అనుభవాలను, పడిన అవస్థలను వివరించాడు. ఇదంతా విన్న ఆ స్నేహితులు, పవన్ వైపు చూస్తూ పగలబడి నవ్వుతున్నారు. ఇతడికి ఏమీ అర్థమవడం లేదు. వారి వైపు పిచ్చి చూపులు చూస్తున్నాడు. ‘‘కొన్నిచోట్ల, మరీ ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీసులో పనులు కావాలంటే.. దక్షిణ సమర్పించుకోక తప్పదన్న విషయం కూడా తెలియని అజ్ఞానిలాగా ఉన్నావ్. నీ దారిలో నువ్వు వెళితే.. ఈ జన్మలో కూడా లైసెన్స్ సాధించలేవు. మా దారిలో వెళ్లు. వెంటనే రాకపోతే అడుగు’’ అని, సలహా ఇచ్చారు. ‘ఎవరి’ని కలవాలో చెప్పారు. ఆ ముగ్గురు మిత్రుల్లో ఒకరితో కలిసి రవాణా శాఖ కార్యాలయం వద్దనున్న ఓ దళారి వద్దకు పవన్ వెళ్లాడు. ‘‘రవాణా శాఖకు చెల్లించాల్సిన ఫీజు ఇంత, కార్యాలయంలోని సిబ్బందికి.. నాకు కలిపి ఇవ్వాల్సింది ఇంత’’ అని, లెక్క చెప్పాడు. ఆ దళారి అడిగినంత ఇచ్చుకున్నాడు పవన్. ‘‘రేపు వచ్చి లైసెన్స్ తీసుకెళ్లండి’’ అన్నాడు దళారి. ఏదో ఆలోచిస్తున్న పవన్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ‘‘సెలవు పెట్టడం కుదరదేమోనని...’’ పవన్ వాక్యం పూర్తికాలేదు. ఆ దళారి, పగలబడి నవ్వాడు. ‘‘మీ అంతట మీరు వెళితే.. పూట పట్టొచ్చు, రోజు పట్టొచ్చు. అసలు పనే జరగకపోవచ్చు. మా ద్వారా వస్తే... జస్ట్, ఒక్క గంటలోనే పని పూర్తిచేసి పంపిస్తాం’’ అన్నాడు. అతడు చెప్పినట్టుగానే, మరుసటి రోజున ఆ దళారి వద్దకు పవన్ వెళ్లాడు. అతడి దరఖాస్తుపై ఒక ‘కోడ్’ వేసి, చేతికిచ్చి కార్యాలయంలోకి వెళ్లాలని చెప్పాడు. అంతకు ముందు నేరుగా వెళ్లిన తనను చూసి చిరాగ్గా మొహం పెట్టిన అక్కడి ఉద్యోగి... ఇప్పుడు ఆ దరఖాస్తుపై ‘కోడ్’ చూడగానే చిత్రంగా చిరునవ్వు నవ్వాడు. ఆ వెన్వెంటనే పరీక్ష రాయడం... ఉత్తీర్ణుడవడం... లైసెన్స్ చేతికి అందడం... అంతా కేవలం గంటలోపే పూర్తయింది. ‘ఇక్కడ దళారులదే దందా. వారిని ఆశ్రయించకపోతే, దరఖాస్తు ఫైల్.. అంగుళం కూడా ముందుకు కదలదన్నమాట..!’ అనుకుంటూ, తన మిత్రుడికి ఫోన్ చేశాడు. ‘‘ఆర్టీఓ కార్యాలయం వంటిచోట్ల పనులు కావాలంటే.. ‘ఆమ్యామ్యా’ సమర్పించుకోవాలని తెలి సింది. ఇక్కడికొచ్చిన తరువాత... నా ‘అజ్ఞానం’ వీడింది, ‘జ్ఞానోదయం’ అయింది...’’ అని చెప్పాడు. ఇక్కడే, చిన్న సవరణ ఉంది. ఇక్కడ జరుగుతున్న పనుల్లో వందలో దళారులవి 90 ఉంటే, మి గతా పది మాత్రమే ఇతరులవి. కనీసంగా, ఈ ప ది పనులైనా దళారులతో సంబంధం లేకుండా చేయకపోతే... ‘బాగుండదేమో’నని చేస్తున్నారు. డ్రామా...! ఔను..! జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో తరచుగా ‘డ్రామా’లు జరుగుతుంటాయి. అది కూడా చూద్దాం. ఈ కార్యాలయంలో దళారుల దందా సాగుతోందని, వారి కనుసన్నల్లోనే సిబ్బంది మెలుగుతున్నారని మీడియాలో వార్త వచ్చినప్పటి నుంచి అక్కడ హడావుడి మొదలవుతుంది. దళారులను లోపలికి రానివ్వకుండా అక్కడున్న హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులు తెగ హడావుడి చేస్తుంటారు. చూసేవాళ్లకు... ఇదంతా ఓ ‘డ్రామా’ అనే విషయం తెలియదు. జస్ట్... వారం పది రోజుల్లో ఈ ‘డ్రామా’కు తెర పడుతుంది. మళ్లీ ‘మామూలే’...!!! పార్కింగ్‌లోనూ దందానే...! ఈ కార్యాలయానికి వచ్చే వాహనదారులు తమ వాహనాలను కార్యాలయం గేట్ వద్దే పార్కింగ్ చేయాలి. అదే, ఏజెంట్ల వాహనాలైతే మాత్రం.. నేరుగా కార్యాలయం ముందు వరకు కూడా వెళ్లవచ్చు. ఓ దళారి (ఏజెంట్), గత కొన్ని నెలలుగా తన కారును ఈ కార్యాలయ ఆవరణలోగల చెట్టు కిందనే పార్కింగ్ చేస్తున్నాడు(ట). ఏసీబీ... ఏమిటిది..?! ఈ కార్యాలయంపై గతంలో ఏసీబీ దాడులు జరిగాయి. అయినప్పటికీ, పరిస్థితిలో మార్పు లేదు. ఈ కార్యాలయ సిబ్బంది, దళారుల ‘బాధితులు’ (పవన్ లాంటివాళ్లు)... ‘ఏసీబీ.. ఏమిటిది..? ఇక్కడ ఇంత పబ్లిగ్గా అవినీతి దందా సాగుతుంటే.. ఫిర్యాదులు రావడం లేదా..? వచ్చినా పట్టించుకోవడం లేదా..? తన కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంటే... అక్కడి అధికారి(ఆర్టీఓ) ఏం చేస్తున్నట్టు..?’ అంటూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లకు పడగెత్తారట...! ఖమ్మం రవాణాశాఖ కార్యాలయం చుట్టూ సుమారు 200 మంది వరకు ఏజెంట్లు (దళారులు) ఉన్నారు. వీరిలో కొందరైతే... కేవలం ఈ ‘పనుల’ ద్వారానే కోట్లకు పడగలెత్తారట...! ఇక్కడ ‘సంపాదన’తో వేర్వేరు వ్యాపారులు సాగిస్తున్నారట. వీళ్లే ఇంత సంపాదించారంటే... వీళ్లతో కుమ్ముక్కైన ఆ కార్యాలయ అవినీతి సిబ్బంది కూడా ఇంతే స్థాయిలో కోట్లకు పడగలెత్తి ఉండొచ్చేమోనన్నది కొందరు ‘బాధితుల’ అభిప్రాయం–అంచనా. ఈ దళారీ దందా ఎప్పుడు అంతమవుతుందో...? ఈ అవినీతి సామ్రాజ్యం ఎన్నడు కూలుతుందో...? ఈ ‘ఆమ్యామ్యా చక్రవర్తు’లకు చెక్ పెట్టేదెవరో...? -
అవినీతిలో ప్రథమ పౌరులు
ప్రజాప్రతినిధులంటే.. పదిమందికీ ఆదర్శంగా నిలవాలి. ప్రజలు.. ప్రభుత్వానికి వారధిగా నిలవాలి. ప్రజా సంక్షేమానికి అహరహం శ్రమించాలి.. ఆ ముగ్గురు ప్రజా ప్రతినిధులు కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తుంటారు.. కమీషన్లు దండుకోవడం.. పోస్టుల్ని అమ్మేసుకోవడం.. గెడ్డల్ని కబ్జా చేయడం.. కాంట్రాక్టులు దక్కించుకోవడం.. ఇనాం భూముల్ని కారు చవగ్గా కొట్టేయడంలో వీరు నిత్యం తలమునకలై ఉంటారు. వారే పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు.. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. ఆయన సతీమణి, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపుడ్డి శ్రీదేవి. దండుకోవడంలో ఈ త్రయానికున్న పేరు పార్వతీపురంలో మారు మోగిపోతోంది. పనికి ఇంత ధర నిర్ణయించేశారు. పైసలిస్తే తప్ప ఏ పనీ చేయరు. పార్వతీపురాన్ని దోచుకు తింటున్నారు. పట్టం గట్టిన ప్రజల్ని ఉసూరుమనిపిస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ.. ఇంకొకరు పట్టణ ప్రథమ పౌరురాలు. కమీషన్లు దండుకోవడం.. ఉద్యోగాలు అమ్ముకోవడం.. కాంట్రాక్టులు ఇప్పించడంలో ఈ ముగ్గురూ ఘనాపాటీలు. వాళ్లే పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు..ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి. ఏ పని కావాలన్నా గ్రామీణ ప్రాంతంలో అయితే ఎమ్మెల్యే.. పట్టణ ప్రాంతంలో అయితే ఎమ్మెల్సీకి అడిగినంత చదివించుకోవలసిందే. ఇక ఎమ్మెల్సీ సతీమణి, పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి భర్త స్ఫూర్తితో అయినకాడికి దోచుకోవడంలో పోటీ పడుతున్నారు. అడ్డూ అదుపూ లేని ఈ ముగ్గురి అక్రమార్జనపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మున్సిపల్ చైర్పర్సన్ రేట్లివి పార్వతీపురం పురపాలక సంఘం చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి భర్త ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ కావడం ఆమెకు ఎదురు లేకపోయింది. భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని పురపాలక సంఘంలో చక్రం తిప్పుతున్నారు. ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సిందే. ఇళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, లే ఔట్ల రెగ్యులరైజేషన్, కొత్త లే అవుట్లకు అనుమతులు ఇచ్చేందుకు రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. పురపాలక సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్లు, మెప్మా కార్యాలయంలో ఆర్పీలు, పారిశుద్ధ్య కార్మికుల నియామకంలో దండిగా డబ్బులు వసూలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులను కొత్తగా 36 మందిని నియమించాలని పాలకవర్గం తీర్మానిస్తే.. చైర్పర్సన్ ఏకంగా 42 మందిని నియమించి ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారనేది బహిరంగ రహస్యం. కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్సీ తమ్ముడికే.. పార్వతీపురం పురపాలక సంఘంలో ప్రతి సివిల్ కాంట్రాక్టును ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తన సోదరుడు ద్వారపురెడ్డి వెంకట తిరుపతిరావుకు అప్పగిస్తున్నారు. భార్య ద్వారపురెడ్డి శ్రీదేవి మున్సిపల్ చైర్పర్సన్ కావడంతో ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని పురపాలక సంఘంలో రూ.కోట్ల విలువైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ నిర్మాణాలను తిరుపతిరావుకు కట్టబెడుతున్నారు. సింగిల్ టెండర్లు వస్తే వాటిని తిరస్కరించి మళ్లీ టెండర్లు పిలవాలన్న నిబంధనలున్నాయి. కానీ చైర్పర్సన్ అధికారాన్ని ఉపయోగించుకొని తమ్ముడికి సింగిల్ టెండర్లను కూడా ఆమోదింపజేసి కాంట్రాక్టులు కట్టబెట్టి కమీషన్లు దండుకుంటున్నారు. డివైడర్ పనుల పేరిట దోపిడీ పార్వతీపురం పట్టణ ప్రధాన రహదారిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డివైడర్ నిర్మాణ పనులు చేపట్టారు. అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై పనులు చేపట్టాలంటే ఆర్అండ్బి శాఖ చేపట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తమ్ముడు కాంట్రాక్టర్ ద్వారపురెడ్డి తిరుపతిరావుకు ఆ నిర్మాణ పనులను అప్పగించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందనుకుంటే పర్వాలేదు.. కానీ అవసరం లేని చోట పార్వతీపురం పురపాలక సంఘం రూ.1.39 కోట్ల ప్రజాధనం వెచ్చించి డివైడర్లు నిర్మించింది.. అన్ని పనులకు కలిపి ఒకేసారి టెండర్లు పిలిచినçప్పటికీ, డివైడర్లకు సున్నాలు, రంగులు వేయడానికి రూ.22 లక్షలు అదనంగా నిధులు మంజూరు చేసి పాలకవర్గంతో ఆమోదించారు. కొన్ని చోట్ల పాత డివైడర్లపై రంధ్రాలు వేసి ఇనుప కంచెతో గోడ నిర్మించినందుకు అదనంగా నిధులు మంజూరు చేసి తినేశారు. కమీషన్ల కోసం సుందరీకరణ పనులు పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని బైపాస్ రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణ పేరుతో రూ.16 లక్షలు వెచ్చించి మొక్కలు నాటారు. వాస్తవానికి దీనివల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రైవేటు వ్యక్తుల స్థలాల ముందు అడ్డంగా కంచెను నిర్మించి అందులో పేపర్ గులాబీ మొక్కలను వేశారు. ఎమ్మెల్సీ తమ్ముడు కాంట్రాక్టర్ ద్వారపురెడ్డి వెంకట తిరుపతిరావుకు లబ్ధి చేకూర్చేందుకే అవసరం లేకపోయినా సుందరీకరణ పేరుతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో వీటిని నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేశారు. మరమ్మతుల పేరిట మేత పార్వతీపురం 14వ వార్డులోని షటిల్ బ్యాడ్మింటన్ స్టేడియం ఇదివరకు ఐటీడీఏ పీఓ చైర్మన్‌గా ఆఫీసర్స్ స్టేడియంగా ఉండేది. అందులో ప్రభుత్వోద్యోగులు, క్ల»బ్ సభ్యులుగా ఉన్నవారు మాత్రమే ఆటలు ఆడేవారు. కానీ సొంత ప్రయోజనాల కోసం మున్సిపాల్టీతో దత్తత తీసుకొని మరమ్మతుల పేరుతో రూ.30 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి దాని నిర్మాణ బాధ్యతలను కూడా ఎమ్మెల్సీ సోదరుడు కాంట్రాక్టర్ ద్వారపురెడ్డి తిరుపతిరావుకు అప్పగించారు. అక్కడితో ఆగకుండా మరమ్మతుల పేరుతో రూ.5 లక్షలు మంజూరు చేసేందుకు పాలకవర్గ సమావేశంలో అజెండాలో పొందుపరిచారు. దీనిని అధికార, విపక్ష కౌన్సిల్ సభ్యులతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్‌నారాయణ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మున్సిపాలిటీకి ఆదాయం రాని స్టేడియంకు ఎందుకు ప్రజాధనాన్ని ఖర్చు చేయాలని నిలదీశారు. అయినా తమ్ముడికి భారీగా కమీషన్లు రావడం కోసం పాలకవర్గంతో ఒప్పించి తీర్మానం చేయించిన ఘనత ఎమ్మెల్సీదే. కారు చవగ్గా ఇనాం భూములు గరుగుబిల్లి మండలం పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని 56.34 ఎకరాల ఇనాం భూములను ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికవక ముందు వరకు ఆయన పేరుమీద ఈ భూముల్లేవు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టాక మాత్రమే ఈ భూములు ఆయన కొనుగోలు చేసినట్టు ఆధారాలు ధ్రువీకరిస్తున్నాయి. పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 178లో 56.34 ఎకరాలను వల్లభ జోష్యుల సూర్యనారాయణ నుంచి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఆయన సోదరుడు ద్వారపురెడ్డి ధనుంజయనాయుడు పేరుమీద కొనుగోలు చేసినట్టు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదై ఉంది. విశేషమేమిటంటే ద్వారపురెడ్డి జగదీష్ రూ.2,02,83,000కు ఈ భూములను కొనుగోలు చేసినట్టు దస్తావేజుల్లో చూపిస్తోంది. ఈ ఖర్చును ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్లో చూపించకపోవడం గమనార్హం. భూ క్రయ విక్రయాలు జరిగే సమయంలో ఒక వ్యక్తి భూమి అమ్మితే మరో వ్యక్తి ఆ భూమిని కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ ఖర్చులను కొనుగోలుదారు భరించాలి. కానీ భూ విక్రయదారే రిజిస్టేషన్ ఖర్చులను భరించుకున్నట్టు దస్తావేజు స్పష్టం చేస్తోంది. పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలో పల్లపు భూమి ఎకరా రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర పలుకుతుండగా.. ఎమ్మెల్సీ కేవలం రూ.3 లక్షల చొప్పున 56.34 ఎకరాలను కారు చౌకగా దక్కించుకున్నారు. బినామీకి 40 ఎకరాల డీ పట్టా భూములు పార్వతీపురం మండలం వెంకంపేట పంచాయతీ పరిధిలోని వెంకంపేట చెరువు దిగువ భాగంలో డీ పట్టా భూములను కూడా తన బినామీ పేరుమీద సుమారు 40 ఎకరాల వరకు కొనుగోలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ కొనుగోలు చేసిన భూములు నేటికి అనేక మంది రైతుల ఆధీనంలో సాగులో ఉన్నాయి. ద్వారపురెడ్డి జగదీష్ కొనుగోలు చేసిన విషయం నేటికి సాగు చేస్తున్న రైతులకు తెలియక పోవడం గమనార్హం. ఈ విషయం తెలిసిన రైతులు ఇటీవల కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. వరహాల గెడ్డ కబ్జా పార్వతీపురం పట్టణ నడిబొడ్డుగుండా ప్రవహిస్తున్న వరహాలగెడ్డను ఆక్రమించి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఇల్లు నిర్మించుకుంటున్నారు. సహజంగా వరహాలగెడ్డ వెడల్పు 12 మీటర్లు ఉండాలి. కానీ ఎమ్మెల్సీ ఇంటి వద్దకు వచ్చేసరికి గెడ్డను కుదించి ప్రహరీ నిర్మించి లోపలి భాగంలో ఇల్లు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్సీ సోదరుడు డాక్టర్ రామ్మోహనరావు ఆస్పత్రి వెనుకభాగంలో వరహాలగెడ్డను కప్పి అందులో అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు వేసి పెంచుతున్నారు. దీనిపై గతంలో పత్రికల్లో కథనం రాగా పరిశీలనకు వెళ్లాలని కలెక్టర్ స్థానిక ఆర్డీఓను ఆదేశించారు. వివరణ కోరేందుకు వెళ్లిన అధికారులకు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారు వెనుదిరిగారు. మా పొట్ట కొడుతున్నారు ఎన్నో దశాబ్ధాలుగా సాగు చేస్తున్న మా భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. మా సాగులో ఉన్న ఇనాం భూమిని సరిచేసి హక్కు కల్పించాలని నా లాంటి ఎంతో మంది రైతులం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా స్పందించలేదు. మాకు తెలియకుండానే మా సాగులో ఉన్న భూములు వేరొకరు రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేశారు. ఈ విషయం కొద్ది రోజుల ముందే ఆనోటా, ఈనోటా తెలిసింది. దీంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – బడే శంకరరావు, రైతు, పెద్దూరు. -
మంత్రి అచ్చెన్నాయుడు అండతో అవినీతి దోపిడి
ఆదర్శాలు, విలువలు ఇలాంటి మాటలు ఆ ఇలాకాలో వాడకూడదు. నీతి, నిజాయితీ ఈ పదాలను కూడా పెదాలపైకి తీసుకురాకూడదు. ఉన్నదల్లా ఒక్కటే అవినీతి. చేసేదంతా ఒక్కటే అక్రమం. ప్రసంగాల్లో బుద్ధిమంతుడి మాటలు చెప్పే మంత్రి అచ్చెన్న చేసే తెరచాటు యవ్వారాలు వివరించడానికి రోజులు సరిపోవనేది స్థానికుల మాట. పదేళ్ల తర్వాత చేతికి అందిన అధికారాన్ని జనం కోసం కాకుండా ధనం కోసం మాత్రమే అచ్చెన్న వాడుతున్న తీరు ప్రజాస్వామ్యవాదులను విస్తుగొలుపుతోంది. జిల్లాలో ఏ రంగాన్నీ వదలకుండా చేస్తున్న దోపిడీ చూస్తున్న వారి మతులు పోగోడుతోంది. మి(ని)స్టర్ అవినీతి గురించి లోతుల్లోకి వెళ్తే.. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం రాక రాక పదేళ్ల తర్వాత అధికారం చేతికొచ్చింది! వచ్చిందే మొదలు కాసులు కురిపించే ఏ రంగాన్నీ టీడీపీ నాయకులు వదిలిపెట్టలేదు! ఇది రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో అవినీతి మరింత పెచ్చుమీరింది. ఆయన అండదండలే ఆసరాగా సోదరుడు సహా టీడీపీ తమ్ముళ్ల కుమ్ముడుకు అడ్డే లేకుండా పోయింది. కనిపించిన ఏ ప్రభుత్వ స్థలాన్నీ వదిలిపెట్టలేదు. చివరకు చెరువులను సైతం కబ్జా చేస్తున్నా మంత్రి ఏ మాత్రం వారించలేదు. లిక్కరు మాఫియా, ఇసుక మాఫియాకు సైతం టెక్కలి నుంచే అండదండలు అందుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేకపోయారంటే పరిస్థితి ఊహించవచ్చు. అనుచరులు తోడుగా.. అచ్చెన్న అనుచరులైన టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములు కనబడితే చాలు కబ్జా చేస్తూ వచ్చారు. గత నాలుగున్నరేళ్లలో పలు చోట్ల ప్రభుత్వ భూములనే కాదు చెరువులు, మెట్టలు, కొండలు వారి వశమయ్యాయి. అధికారులకు ఈ విషయం తెలిసినప్పటికీ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లతో తలొగ్గుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కోటబొమ్మాళి మండల కేంద్రం పరిధిలోగల పెద్దచెరువును అభివృద్ధి పేరుతో చిన్నచెరువుగా మార్చేసిన ఘనత టీడీపీ నాయకులకే చెందుతుంది. ఈ చెరువు గర్భం నుంచి జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 16) వరకూ మంచాలపేట మీదుగా సుమారు రెండు కిలోమీటర్లు పొడవున రహదారి నిర్మాణం పేరుతో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో చెరువు గర్భాన్ని బోయిన రమేష్‌తో పాటు మరికొంతమంది ఆక్రమించుకున్నారు. ఈ భూమిలో రైస్‌మిల్లులు కూడా నిర్మించేశారు. గరీబుల గెడ్డ పరివాహక భాగంలో నీలంపేట– కిష్టుపురం మధ్య సుమారు ఏడు ఎకరాల భూమిని టీడీపీ నాయకుడు ఒకరు కబ్జాచేసి సాగులోకి తెచ్చుకున్నారు. దంత – సరియాపల్లి గ్రామాల మధ్య గరీబులు గెడ్డ ఎగువభాగాన్ని, మాసాహెబ్‌పేట ఉప్పర చెరువును జేసీబీలతో చదును చేసి కబ్జా చేశారు. అలాగే తిలారు, కోటబొమ్మాళి, శ్రీజగన్నాధపురం, లఖందిడ్డి, గంగరాం, మాసాహెబ్‌పేట చెరువులు ఆక్రమణలకు గురైనప్పటికీ అధికారులు తొలగించలేకపోయారు. చీపుర్లపాడు పంచాయతీ ఊ డికలపాడు గ్రామ పరిధిలో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలోనున్న చిన్న ఎర్రబంద ఆక్రమణలకు గురవుతోంది. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ గున్న పావని భర్త రమణ లచ్చన్నపేట సమీపంలో సర్వే నంబరు 135లోని మెట్టను ఆక్రమించుకుని ఏకంగా క్రషర్ నిర్వహిస్తున్నారు. సుమారు 2 ఎకరాల్లో తన సోదరుడు అడివిరాజు పేరుతో డీ çసృష్టించుకున్నారు. ఈ క్రషర్ వద్ద రాత్రి సమయాల్లో భారీ పేలుళ్లపై గతంలో ఇదే పంచాయతీ పరిధిలోని కంట్రగడ గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. బలరాంపురం గ్రామంలో సంపతిరావు పాపారావు, సంపతిరావు సూర్యనారాయణ అనే టీడీపీ నాయకులు సర్వే నంబరు 495లో టెక్కలి–తెంబూరు రోడ్డుకు ఆనుకుని ఉన్న మెట్టను ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారు. వీటికి ఎన్టీఆర్ గృహæ నిర్మాణ పథకం కూడా వర్తింపజేయడం గమనార్హం. నందిగాం మండలం శివరాంపురం పంచాయతీ బడబంద రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 149లోని కొండపై పలువురు టీడీపీ నాయకులు అడ్డగోలుగా డీ పట్టాలు సృష్టించుకున్నారు. నందిగాం నీటిసంఘం అ«ధ్యక్షుడు ప్రసాదరావు, అతని సోదరి బొడ్డ శోభారాణి, ప్రగడ బాలకృష్ణ, గొట్టిపల్లి మోహనరావు, ప్రగడ వైకుంఠరావు పేర్లతో అవి వెలిశాయి. గొల్లూరు పంచాయతీ సొంఠినూరు కొండపై కూడా టీడీపీ తమ్ముళ్లే బినామీల పేర్లతో డీ పట్టాలు ఏర్పాటు చేసుకొన్నారు. సంతబొమ్మాళి మండలంలో జగన్నాథపురం గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పుక్కళ్ల శ్రీనివాసరావు సర్వే నంబరు 315లో సుమారు ఏడెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకున్నాడు. రొయ్యల చెరువులకు లీజుకిచ్చి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రభుత్వ పథకాల్లోనూ.. టసంతబొమ్మాళి ఎంపీపీ కర్రి కృష్ణవేణి భర్త విష్ణుమూర్తి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తప్పుడు బిల్లులతో లక్షల రూపాయలను జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. టఅధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించి ఆ సొమ్ము మింగేశాడు. నందిగాం మండలంలోని దిమిలాడ సొసైటీలో టీడీపీ మండల అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్ పలువురు గిరిజనులు, చిన్నకారు రైతుల పేర్లతో దీర్ఘకాలిక రుణాలు (లాంగ్‌టర్మ్ లోనులు) తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టఅలాగే పింఛన్ల మంజూరులోనే గాకుండా ఇంటింటా ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పథకాల్లోనూ ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యులు కాంట్రాక్టర్ల అవతారమెత్తి నిధులు స్వాహా చేశారు. అలాగే నీరు–చెట్టు పథకం కింద దక్కిన పనులను ఒకటీ రెండు రోజుల పాటు జేసీబీలతో తూతూమంత్రంగా కానిచ్చేసి లక్షలాది రూపాయలు వెనుకేసుకున్నారు తప్ప చెరువుల అభివృద్ధిపై దృష్టి సారించలేదు. తిత్లీ తుఫానులో దోపిడీ బీభత్సం గత ఏడాది అక్టోబరు 10వ తేదీన సంభవించిన తిత్లీ తుఫానుతో ప్రజలు నష్టపోయినా టీడీపీ నాయకుల జేబులు మాత్రం నిండాయి. పరిహారం కోసం పంటలు లేకపోయినా ఉన్నట్లు రాయించడం, కొంత నష్టమే జరిగితే అధికంగా నమోదు చేయించడం వంటి అక్రమాలకు తెగించారు. చివరకు మంత్రి అచ్చెన్న కుటుంబసభ్యుల పేర్లుతో కూడా ఇలాంటి గిమ్మిక్కులు చేసి రూ.కోటి వరకూ దుర్వినియోగం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అదనుగా మిగతా టీడీపీ నాయకులు కూడా ఎక్కడికక్కడ అక్రమాలకు పాల్పడ్డారు. చివరకు తుఫానుతో గూడు కోల్పోయిన నిరాశ్రయులకు పంపిణీ చేయాల్సిన పరదాలు, సోలార్ లాంతర్లను పక్కదారి పట్టించిన దాఖలాలు కోకొల్లలు. కొంతమంది నాయకులు పరదాలను ప్రైవేటు దుఖాణాలకు అమ్ముకున్నారంటే వారి కక్కుర్తి ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. పింఛన్లనూ వదలని తమ్ముళ్లు.. మంత్రి అచ్చెన్నాయుడు అండతో వివిధ రకాల సంక్షేమ పథకాల్లోనూ టీడీపీ నాయకులు దోపిడీ పర్వం కొనసాగించారు. ఒక్కో రకం పింఛనుకు ఒక్కో మాదిరిగా అక్రమ వసూళ్లకు పా ల్పడుతున్నారు. ముఖ్యంగా కొత్త పింఛన్ల మంజూరులో మూడు నెలల పాటు లబ్ధిదారునికి పింఛన్ ఇవ్వకుండా చివరి నెలలో ఒక నెల డబ్బును కొట్టేస్తున్నారు. నీరు–చెట్టులోనూ అచ్చెన్న సోదరుడికే పెద్దపీట గత ఏడాది ‘నీరు–చెట్టు’ పథకం కింద వంశధార ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు ఆహ్వానించిన పనుల్లో రూ.4.04 కోట్లు విలువలైన 12 పనులు సురేష్ కన్స్ట్రక్షన్స్ సంస్థకే దక్కాయి. వేరేవ్వరికైనా ఒకటీ రెండు పనులు దక్కితే నానాయాగీ చేసే టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరెందుకు మిన్నకుండిపోయారంటే... ఆ సంస్థ సాక్షాత్తూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి సోదరుడైన కింజరాపు హరివరప్రసాద్‌కు చెందినది కావడమే. జిల్లాలో నీరు–చెట్టు పథకం 2015 జూన్‌లో ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కాసుల వర్షం కురిపిస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టింది. టెక్కలి నియోజకవర్గానికే 2016–17లో జిల్లాలోనే అత్యధికంగా రూ.117.13 కోట్ల విలువైన 1,319 పనులు కేటాయించగా, వాటిలోనూ కోటబొమ్మాళి మండలానికే రూ.60 కోట్ల విలువైన 474 పనులిచ్చారు. వాటిలో ఎక్కువ పనులు తూతూమంత్రంగా చేసి బిల్లులు జేబులో వేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఏడాది టెండర్లలోనూ అత్యధిక పనులు కింజరాపు కుటుంబసభ్యులు, ఆయన అనుయాయులకే దక్కడం గమనార్హం. మంత్రి సోదరుడి నేతృత్వంలోనే.. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ నేతృత్వంలోనే టెక్కలి నియోజకవర్గంలో కొన్ని రకాల అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వీటిలో నిమ్మాడ ఎఫ్‌సీఐ గొడౌన్ వద్ద అక్రమాలు, కల్తీ మద్యం మాఫియా, మైన్స్ మాఫియాతో సంబంధాలే కాకుండా ఏ శాఖలోనైనా తన సొంత కాంట్రాక్ట్ సంస్థకు టెండర్లు దక్కించుకోవడానికి బరి తెగిస్తున్నారు. నిమ్మాడ ఎఫ్‌సీఐ గొడౌన్ వద్ద మంత్రి సోదరుడు కింజరాపు హరిప్రసాద్ కనుసన్నల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నిమ్మాడ, కొత్తపల్లి, అక్కయ్యవలస, కోటబొమ్మాళి ప్రాంతాల్లో హరిప్రసాద్ కనుసన్నల్లో లిక్కర్ మాఫియా కార్యకలాపాలు సాగిస్తోంది. చీఫ్ లిక్కర్‌ను ఖరీదైన మద్యంలో కల్తీ చేయడం, నకిలీ మూతలతో బ్రాండ్లు సృష్టించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నవారికి మంత్రి సోదరుడే ప్రధాన అండ అనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు టెక్కలి పరిసర ప్రాంతాల్లో ఖరీదైన గ్రానైట్ బ్లాకులు మంత్రి సోదరునికి చెందిన పాలిషింగ్ యూనిట్లకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి మైన్స్ అధికారులు సైతం అండగా ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ రుణాల మంజూరులో చిలక్కొట్టుడు అర్హులకు అందాల్సిన వివిధ రకాల కార్పొరేషన్ రుణాలకు సంబంధించి టీడీపీ నాయకులు చిలక్కొట్టుడు వ్యవహారానికి పాల్పడుతున్నారు. మండల స్థాయి నాయకులు, టీడీపీ ద్వితీయ శ్రేణి కార్యకర్తలదే కీలక పాత్ర. ఇటీవల టెక్కలి చిన్నబజారులో కొత్తగా నిర్మించిన పంచాయతీ దుకాణాల కేటాయింపు దీనికి ఉదాహరణ. నందిగాంలో కొత్తగా వెలసిన కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాల మంజూరులోనూ ఒక్కొక్కరి నుంచి 20 వేల రూపాయల వరకూ వసూళ్లకు పాల్పడ్డారు. సంతబొమ్మాళి మండలంలో వివిధ రకాల కార్పోరేషన్ రుణాల మంజూరులో అధికంగా వసూలు చేశారు. రైతురథాల పేరుతో అర్హులైన రైతులకు అందాల్సిన సబ్సిడీ ట్రాక్టర్లను అత్యధికంగా టీడీపీ నాయకులకే అడ్డగోలుగా కట్టబెట్టారు. వారిలో సంతబొమ్మాళి ఎంపీపీ కర్రి కృష్ణవేణి భర్త కర్రి విష్ణుమూర్తి, వైస్ ఎంపీపీ సూరాడ భీమారావు కూడా ఉన్నారు. కోటబొమ్మాళి మండలంలో కార్పొరేషన్, సొసైటీ రుణాల మంజూరు మంత్రి అచ్చెన్న కనుసన్నల్లో జరిగింది. -
కానోడు... కావాలనుకుని.. కట్టుకున్నోడిని చంపేసింది..
బంధం... బంధించిందని.. అనురాగం... అపహాస్యమైందని.. ఆత్మీయత... ఆవిరైందని.. అయినోడు... అదృశ్యమవాలని.. కానోడు... కావాలనుకుని.. కాళరాత్రి... కాటేసింది.. కట్టుకున్నోడు... కన్నుమూశాడు.. వైరా: ఆమెకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కారణాలు ఏమైతేనేమి, వివాహ బంధం.. తనకొక ‘బంధనం’గా మారిందని, తాను ‘బందీ’నయ్యానని ఆమె భ్రమించింది. వారి మధ్యన ఒకప్పటి అనురాగం.. ఇప్పుడు అపహాస్యమైంది. ఆత్మీయత ఆవిరైంది. అయినోడిని (భర్తను) కాటికి పంపాలనుకుంది. కానోడిని (ప్రియుడిని) కావాలనుకుంది. ఇద్దరూ కలిసి పథకం వేశారు. (కాళ)రాత్రి వేళ... ఆ ఇద్దరూ కలిసి అతడిని చంపేశారు. ఇది, గురువారం రాత్రి ఖమ్మం జిల్లా వైరాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... వైరాలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ షేక్ అబ్దుల్లా(30)కు, జూలూరుపాడుకు చెందిన అమీదాతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొన్నాళ్లపాటు సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు సమ్రీన్(6), సమీరా(4) ఉన్నారు. వీరు నివసిస్తున్న ప్రాంతంలోనే షేక్ అక్బర్ ఉంటున్నాడు. ఇతడొక మెకానిక్. ఈ అక్బర్‌తో అమీదాకు కొన్నేళ్ల క్రితం పరిచయమేర్పడింది. క్రమేణా ఇద్దరూ దగ్గరయ్యారు. రెండేళ్ల నుంచి వీరి మధ్య వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయం, ఆమె భర్త అబ్దుల్లాకు తెలిసింది. అభ్యంతరం చెప్పాడు. దీనిని ఆమె తట్టుకోలేకపోయింది. తమ మధ్య సంబంధం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆమె ఈ విషయాన్ని తన ప్రియుడు అక్బర్‌తో చెప్పింది. ఈ నెల 10వ తేదీన, ఆమె భర్త అబ్దుల్లాపై ప్రియుడు అక్బర్.. అకారణంగా దాడి చేశాడు. దీనిపై, పోలీస్ స్టేషన్లో అబ్దుల్లా ఫిర్యాదు చేశాడు. తమ సంబంధానికి అబ్దుల్లా అడ్డుగా ఉన్నాడని అమీదా – అక్బర్ భావించారు, సహించలేకపోయారు. అడ్డను తొలగించాలనుకున్నారు. అబ్దుల్లాను చంపేయాలనుకున్నారు. ఇద్దరూ కలిసి పథకం పన్నారు. గురువారం రాత్రి... అబ్దుల్లా, గాఢ నిద్రలో ఉన్నాడు. అక్బర్ మద్యం మత్తులో అబ్దుల్లా ఇంటికి వచ్చాడు. అతడిని లోపలికి తీసుకెళ్లింది. ఆమె తన భర్త కాళ్లను గట్టిగా పట్టుకుంది. దిండుతో అబ్దుల్లా మొహంపై అక్బర్ గట్టిగా అదిమి పట్టుకున్నాడు. అబ్దుల్లా మేల్కొన్నాడు. పైకి లేచేందుకు ప్రయత్నించాడు. అతడి మెడను అక్బర్ గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. కొద్దిసేపటికే, ఊపిరాడక అబ్దుల్లా ప్రాణాలొదిలాడు. అక్బర్ బయటకు వెళ్లిపోయాడు. ఆ తరువాత, ‘‘నా భర్తకు ఏదో అయింది. కదలడం లేదు.. మెదలడం లేదు...’’, అని ఏడుస్తూ, చుట్టుపక్కల వాళ్లను అమీదా పిలిపిచింది. చంపినట్టుగా ఒప్పుకున్నారు... పోలీసులకు సమచారం వెళ్లింది. ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ ఎ.రమాకాంత్, ఎస్సై టి.నరేష్ వచ్చారు. అబ్దుల్లా గొంతుపై, శరీరంపై కమిలిన గుర్తులు కనిపించాయి. అమీదాను, స్థానికుల ను విచారించారు. అక్బర్–అమీదా మధ్య సంబం ధం బయటపడింది. అక్బర్‌ను పిలిపించారు. ఇద్దరినీ విచారించారు. ‘‘ఔను.. మేమే చంపాం’’ అని వారిద్దరూ ఒప్పుకున్నారు(ట). అబ్దులా సోదరుడు ఫరీద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు పెడితే... బతికేవాడేమో...! ‘‘తనపై అక్బర్ అకారణంగా దాడి చేశాడంటూ ఈ నెల 10న పోలీస్ స్టేషన్లో షేక్ అబ్దుల్లా ఫిర్యాదు చేశాడు. తన భార్య అమీదాకు, అక్బర్‌కు వివాహేతర సంబంధం ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయినప్పటికీ, పోలీసులు పట్టించుకోలేదు. అబ్దుల్లాకు, అక్బర్‌కు సర్దిచెప్పారు. దాడిలో అబ్దుల్లాకు గాయాలవడంతో, అక్బర్ నుంచి వెయ్యి రూపాయలను పరిహారంగా ఇప్పించి పంపించేశారు. ఆ రోజున, ఫిర్యాదు స్వీకరించి, అక్బర్‌పై చర్యలు తీసుకున్నట్టయితే... అబ్దుల్లా బతికేవాడు’’ అని, అతడి సోదరుడు, కుటుంబీకులు అంటున్నారు. ఫిర్యాదును పట్టించుకోని పోలీసుల తీరుపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదమ్ములు.. అవినీతి అనకొండలు..
గ్రామానికి ఎక్కువ...మండలానికి తక్కువ స్థాయి కలిగిన రమేష్‌కు సీఎం చంద్రబాబు రాజ్యసభ సభ్యుడి పదవి కట్టబెడితే అడ్డంగా దోపిడీ చేస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడించారు. పోట్లదుర్తి బ్రదర్స్ అక్రమాలకు అంతే లేకుండా పోయిందని ఆరోపించారు. అందుకు నిదర్శనంగా జలయజ్ఞం పెండింగ్ పనులు నిలుస్తున్నాయి.వందల కోట్లల్లోనిలిచిపోయిన పనులు వేలకోట్లకు దక్కించుకున్నారు. నీరు– చెట్టు పథకంతో నిధులు కొల్లగొట్టారు. ఆర్టీపీపీలో ఉద్యోగాలు, కాంట్రాక్టు పనులు అడ్డంగా దోచేశారు. తుదకు ఐరన్ స్క్రాప్‌ను కూడా వదల్లేదు. పెన్నానది కేంద్రంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి కోట్లు ఆర్జించారు. అధికారం అండతో ఏటిపో రంబోకు భూమిని ఆక్రమించి సాగుచేస్తు న్నారు. రాజ్యసభ సభ్యుడు రమేష్ అవినీతి జిల్లా దాటి రాష్ట్రవ్యాప్తంగా విస్త రించిన నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. ‘గ్రామానికి ఎక్కువ.. మండలానికి తక్కువ’ స్థాయి కల్గిన వారే అయినప్పటికీ ప్రభుత్వ అధినేత వద్ద పరపతి మెండుగాఉంది... ఆపై నడుచుకుంటూ వచ్చి హోదా వరించింది... అధికారం గుప్పిట్లో ఉండటంతో ప్రభుత్వ పథకాలతో కోట్లాది రూపాయాలు అప్పనంగా దండుకున్నారు... మరోవైపు పెన్నానదికి గర్భశోకం కల్గించి అక్రమార్జనకు తెరలేపారు... ఇంకోవైపు స్వగ్రామం చెంతనే ఆర్టీపీపీ ఉండటం అందివచ్చిన వరంగా మారింది... నిధుల దోపిడీకి పాల్పడుతూనాసిరకం పనులకుశ్రీకారం చుట్టారు...పెండింగ్‌లో ఉన్న జలయజ్ఞం పనుల అంచనాలను ఉన్నత స్థాయి పరపతితో అమాంతం పెంచుకొని వేలాది కోట్లు స్వాహా చేశారు... వెరసి వారు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా మారింది. వారు ఎవరో కాదు ‘పోట్లదుర్తి బ్రదర్స్’. సీఎం రమేష్, సీఎం సురేష్‌గా పిలువబడే వారి అవినీతి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. సాక్షి టాస్క్‌ఫోర్స్ : ప్రభుత్వ అండదండలతో పోట్లదుర్తి సోదరులు సీఎం రమేష్ నాయుడు, సీఎం సురేష్ నాయుడు అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోత్సాహంతో వీరు అంచెలంచెలుగా ఎదిగారు. జలయజ్ఞం పెండింగ్ పనులకు అమాంతంగా రేట్లు పెంచేసి, నామినేషన్‌పైన అప్పగించడం వరంగా మారింది. మునుపు పనులు చేసిన కాంట్రాక్టర్‌తో నిమిత్తం లేకుండా.. పెండింగ్‌లో ఉన్న పనులకు 200 శాతం అధికంగా రేట్లు పెంచి అప్పనంగా అప్పగించారు. జిల్లాలోని జీఎన్ఎస్ఎస్ పథకంలో భాగంగా ఫ్లడ్‌ఫ్లో కెనాల్ నుంచి ఇలాంటి తంతు ఆరంభమైంది. ఈ కెనాల్లో 29వ ప్యాకేజీలో రూ.52 కోట్ల పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్‌లో పడ్డాయి. నిలిచిపోయిన ఆ పనులకు టీడీపీ సర్కారు అంచనాలు పెంచి రూ.175.63 కోట్లకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కాంట్రాక్టు సంస్థ అయిన రిత్విక్‌కు అప్పగించింది. ఇలా జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ తదితర పథకాలల్లో నిలిచిపోయిన రూ.800 కోట్ల పెండింగ్ పనుల అంచనాలు దాదాపు రూ.3 వేల కోట్లకు పెంచి రమేష్‌నాయుడు సంస్థకు అప్పగించారు. ‘సీఎం’తో చొరవ.. హోదా కారణంగా.. ముఖ్యమంత్రి అంతరంగికులుగా గుర్తింపు పడ్డ రమేష్‌నాయుడు సోదరులు జిల్లాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఏ స్థాయి అధికారి అయినా వీరి ఎదుట చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఎక్కువ, తక్కువ మాట్లాడితే దాడి చేయడానికి కూడా వెనకాడని స్థితికి చేరారు. ఈ కారణంగా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో పెన్నానది ఏటి పొరంబోకు భూములను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఆక్రమించి స్మృతి వనాలు నిర్మించారు. సర్వే నంబర్ 906లో 736 ఎకరాల ఏటి పొరంబోకు భూమి ఉంది. ఇందులో 470 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ప్రత్యేకించి వీరి కుటుంబ సభ్యుల నేతృత్వంలో 20 ఎకరాలు ఆక్రమించారని.. రెవెన్యూ అధికారులు స్మృతి వనానికి, ఏటి పోరంబోకు భూమికి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ స్థలాల్లో ఏకంగా గదులు నిర్మించి, ఇటుకల తయారీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే హనుమనగుత్తి వద్ద వంక, ఏటి పొరంబోకు భూమినంతా ఆక్రమించడంతో వంక పూడిపోయింది. క్యూకట్టిన జలయజ్ఞం పెండింగ్ పనులు జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ జలయజ్ఞం పనులు కొన్ని పెండింగ్‌లో పడ్డాయి. ఈ పనులన్నీ తాజా అంచనాలంటూ అమాంతం పెంచి ఎంపీ రమేష్‌నాయుడు కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. అలా అప్పగించిన వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. కుందూ– పెన్నా వరద కాలువ పనుల్లో 29వ ప్యాకేజీలో రూ.52 కోట్ల పనులు నిలిచిపోయాయి. అవే పనులను 240 శాతం అధికంగా రేట్లు పెంచి రూ.175.63 కోట్లకు అప్పగించారు. అలాగే 27వ ప్యాకేజీలో నిలిచిపోయిన పనులు రూ.126 కోట్లకు అప్పగించారు. సీబీఆర్ కుడి కాలువ పనులు రూ.27.15 కోట్లు, ముచ్చుమర్రి కెనాల్ విస్తరణ పనులు రూ.29 కోట్లు, గొడ్డుమర్రి ఆనకట్ట పనులు రూ.24.5 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–2లో 2, 3 ప్యాకేజీలు రూ.192 కోట్లు, 6, 10 ప్యాకేజీలు రూ.71 కోట్లు, 9, 13, 17 ప్యాకేజీలు రూ.124.6 కోట్లకు అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు రూ.29 కోట్ల విలువైనవి మిగిలిపోగా.. వాటిని రూ.151 కోట్లకు సీఎం రమేష్ కంపెనీకి అప్పగించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.432 కోట్లు కాగా.. అదనంగా రూ.143 కోట్ల అంచనాలు పెంచి అప్పగించారు. ఇలా రాయలసీమ వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వందలాది కోట్ల పనులు వేల కోట్లుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సోదరుని పరపతి.. జిల్లాలో సాగిలపడే యంత్రాంగం.. వెరసి పెన్నానది ఆధారంగా సురేష్‌నాయుడు ఇసుక వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రూ.కోట్లు కొల్లగొట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామ సమీపాన పెన్నానదిలో క్వారీ పేరుతో దోపిడీ చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇసుక క్వారీ మంజూరు చేయకపోవడం, ఆర్టీపీపీలో వేలాది కోట్ల నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ఇసుక ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారు. హనుమనగుత్తి క్వారీలోకి సురేష్‌నాయుడు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు కాకుండా మరే ట్రాక్టర్లకు అనుమతులు ఉండేవి కావు. అటు ప్రొద్దుటూరు, ఇటు ఎర్రగుంట్ల, ఆర్టీపీపీ పరిసర ప్రాంతాల్లో ఇసుక కావాలంటే ట్రాక్టర్‌కు రూ.2,500 చెల్లించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అనధికారికంగా రుసుం వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దాని కంటే ఎక్కువగా వంద రెట్లు అధికంగా ఇసుక తోడేసినా అడిగే అధికారే లేకపోయారు. ఇక్కడి ఇసుకను ఆర్టీపీపీలో డంప్ చేసి, అక్కడి నిర్మాణ పనులకు విక్రయించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో ఆర్టీపీపీలో పెద్ద దుమారమే రేగింది. దౌర్జన్యాలు పోట్లదుర్తి గ్రామంలో సీఎం రమేష్ కుటుంబ సభ్యుల దౌర్జన్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గట్టిగా ఎవరైనా ప్రతిఘటిస్తే అధికారుల ద్వారా అలాంటి వారి మెడలు వంచుతున్నారు. శివాలయం నడిగడ్డ వద్ద 100 ఎకరాలకు పైగా భూమలు ఉన్నాయి. వాటిపై సురేష్‌నాయుడు కన్ను పడింది. ఆ భూములు తమకే ఇచ్చేయాలంటూ ఒత్తిడి పెంచారు. ఇష్టమున్న లేకున్నా అప్పగించాలని బలవంతం చేశారు. పట్టా హక్కుదారుకు ఎకరాకు రూ.7 లక్షలు చెల్లించి స్వాధీనం చేసుకున్నారు. డీకేటీ పట్టాలున్న రైతులకు శఠగోపం పెట్టారు. భూములు నమ్ముకొని జీవించే వారిని జీవనోపాధి కోల్పోయేలా చేశారు. తమ వైరిపక్ష సామాజిక వర్గంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అలాంటి వారిపై మైనింగ్ అధికారులను ప్రయోగించి గనులు మూయించేశారు. అలాగే గనుల యజమానులు ఎవ్వరైనా సరే.. ఇతర పార్టీల వారితో వెళ్లకూడదంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికీ చోటు చేసుకుంటుండటం గమనార్హం. కల్లు వ్యాపారం నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. చింతకుంట సుబ్బనాయుడుది జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మండలంలో పోట్లదుర్తి గ్రామం. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఆయన తన కుమారులు చిన్న, చిన్న వ్యాపారాల వైపు వెళ్లేలా ప్రోత్సహించారు. ఈ క్రమంలో కమలాపురం, ప్రొద్దుటూరు ప్రాంతంలో కల్లు వ్యాపారం ఆరంభించారు. తదుపరి తన పెద్ద కుమారుడు మునిస్వామినాయుడు తన వ్యాపార వారసత్వంగా సారాయి అంగళ్ల వేలం పాటలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సారాయి వ్యాపారం క్రమక్రమంగా విస్తరించింది. జిల్లాలో పలు ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాల్లో సారాయి వ్యాపార భాగస్వామిగా మునిస్వామినాయుడు వ్యాపారాన్ని విస్తరించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో మద్యం వ్యాపారుల సిండికేట్ నిర్వాహకుల చెంతకు మునిస్వామినాయుడు తన తనయుడు చింతకుంట మునెయ్యగారి రమేష్‌నాయుడు (సీఎం రమేష్ నాయుడు)ను చేర్చారు. అక్కడ మద్యం వ్యాపారంలో దూసుకుపోయిన సీఎం రమేష్‌కు చంద్రగిరి ఎమ్మెల్యే రామ్మూర్తినాయుడితో సాన్నిహిత్యం ఏర్పడింది. 1995లో అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబునాయుడు వరించడం సీఎం రమేష్‌కు లాభించింది. చిత్తూరు జిల్లాలో ఉన్న సంబంధాల రీత్యా రమేష్‌నాయుడు తక్కువ కాలంలోనే చంద్రబాబు అనుచరుడిగా చేరిపోయారు. ఆ తర్వాత 1999లో కాంట్రాక్టు సంస్థ ఏర్పాటు చేసి అనతి కాలంలోనే భారీ టర్నోవర్ దిశగా చేరింది. కాంట్రాక్టర్‌గా, వ్యాపారవేత్తగా సీఎం రమేష్ నిలదొక్కుకున్న తర్వాత తన సోదరుడు సురేష్‌నాయుడు పోట్లదుర్తి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే మునిస్వామి నాయుడు కుటుంబంలో మొదటి రాజకీయ పదవి. అంతకు మునుపు మునిస్వామి తమ్ముడు గోవర్ధన్‌నాయుడు సతీమణి భాగ్యమ్మ ఎర్రగుంట్ల మండలాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో సీఎం రమేష్ తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. తర్వాత 2018 ఏప్రెల్ 3న రెండో పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా మరోమారు ఎంపికయ్యారు. పోట్లదుర్తి మినహా ఎర్రగుంట్ల మండల వ్యాప్తంగా కూడా ప్రజాబలం లేని రమేష్‌నాయుడికి రాజ్యసభ సీటు రెండుసార్లు వరించడం గమనార్హం. అన్న ప్రాబల్యంతో సురేష్‌నాయుడు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. బెల్టు చోరీలో ప్రధాన పాత్ర ఆర్టీపీపీలోని కోల్ ప్లాంట్ బెల్టు చోరీలో సురేష్‌నాయుడు అనుచరుల పాత్ర ప్రధానంగా ఉంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. జెన్కో ఎండీ స్థాయిలో పరిచయాలు ఉండటంతో సీఈ స్థాయి అధికారి నోరుమెదపలేని పరిస్థితి. ఎట్టకేలకు కల్లమల్ల పోలీసుస్టేషన్లో ఎస్పీఎఫ్, కోల్‌ప్లాంట్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని అధికారులను బతిమలాడి సగం బెల్టును ఆర్పీపీపీకి తీసుకు వచ్చారు. దీనిపై ఏపీ జెన్కో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి, చోరీ వాస్తవమేనని ఏపీ జెన్కో ఉన్నతాధికారులకు నివేదికలు కూడా ఇచ్చారు. లక్షలు విలువ చేసే బెల్ట్ అర్ధాంతరంగా కనుమరుగు కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి నిగ్గు తేల్చారు. ఆర్టీపీపీలోని కోల్ ప్లాంట్ బెల్టు చోరీలో సురేష్‌నాయుడు అనుచరుల పాత్ర ప్రధానంగా ఉంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. జెన్కో ఎండీ స్థాయిలో పరిచయాలు ఉండటంతో సీఈ స్థాయి అధికారి నోరుమెదపలేని పరిస్థితి. ఎట్టకేలకు కల్లమల్ల పోలీసుస్టేషన్లో ఎస్పీఎఫ్, కోల్‌ప్లాంట్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని అధికారులను బతిమలాడి సగం బెల్టును ఆర్పీపీపీకి తీసుకు వచ్చారు. దీనిపై ఏపీ జెన్కో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి, చోరీ వాస్తవమేనని ఏపీ జెన్కో ఉన్నతాధికారులకు నివేదికలు కూడా ఇచ్చారు. లక్షలు విలువ చేసే బెల్ట్ అర్ధాంతరంగా కనుమరుగు కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి నిగ్గు తేల్చారు. ఆర్టీపీపీ.. అక్షయపాత్ర పోట్లదుర్తి బ్రదర్స్ బినామీ కాంట్రాక్టర్ సంస్థలైన శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, ద్వారకా కన్స్ట్రక్షన్స్ పనులు దక్కించుకోగా.. సురేష్‌నాయుడు కనుసన్నల్లో సాగాయి. ఆర్టీపీపీ సీఎస్ఆర్ ఫండ్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్షబులిటీ) పనుల్లో దోపిడీ చేశారు. ఎర్రగుంట్ల మండలంలో రూ.41 కోట్లతో వివిధ రోడ్ల పనులు చేశారు. చిలంకూరు నుంచి పోట్లదుర్తి వరకు రూ.16 కోట్లు, పి.గోపులాపురం నుంచి సిరిగేపల్లె వరకు రూ.1.20 కోట్లు, పోట్లదుర్తి గనుల రక్షణ గోడ పేరుతో రూ.1.30 కోట్లు, మాలపాడు నుంచి నిడిజువ్వి వరకు పొలాల మీదుగా రూ.4 కోట్లతో పనులు, ఎర్రగుంట్ల నుంచి వీ.ఎన్ పల్లె వరకు రూ.15 కోట్లు, పోట్లదుర్తి నుంచి ఎర్రగుంట్ల వరకు ప్యాచ్ వర్కులకు రూ.4 కోట్లు.. ఈ పనులన్నీ సురేష్‌నాయుడు నేతృత్వంలో సాగాయి. సీఎస్ఆర్ ఫండ్ కింద మంజూరైన పనులన్నీ నాసిరకంగా చేపట్టారు. ఎక్కడికక్కడ సీసీ రోడ్లు బీటలు వారాయి. తక్కువ సమయంలోనే సిమెంటు రోడ్లు నెర్రెలు బారి దర్శనమిస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తుండిపోయారు. మితిమీరిన దోపిడీ పోట్లదుర్తి బ్రదర్స్ దోపిడీ మితి మీరింది. అధికారం అండతో హనుమనగుత్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఇసుకను కొల్లగొట్టి రూ.కోట్లు ఆర్జించారు. ఇదే గ్రామ సమీపంలో పునరావాస కేంద్రం ఏర్పాటుకు నిధుల అంచనాలు పెంచి దోచుకున్నారు. వీరు ఏమి చేసినా ప్రశ్నించే అధికారులు లేరు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పునరావాస కేంద్రంలో నివాసాలు లేకపోయినా వందలాది దొంగ (నకిలీ) ఓట్లు ఎక్కించారు. – సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ, హనుమనగుత్తి నీరు– చెట్టు పేరుతో దోచేశారు నీరు– చెట్టు పథకం పేరుతో పోట్లదుర్తి బ్రదర్స్ దోచేశారు. తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు కావడంతో అడిగేవారే లేరు. పోట్లదుర్తి నుంచి చిలంకూరు వరకు నీరు–చెట్టు పనుల్లో భాగంగా వేల మొక్కలు నాటినట్లు రికార్డుల్లో ఉన్నా.. ఒక్క మొక్క కూడా పెరగలేదు. రోడ్డుకు ఇళ్లు పోగోట్టుకున్న వారికి నష్ట పరిహారం చెల్లించకుండా ..నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరాల్సిందిగా బలవంతంగా తరలించారు. తక్కువ డబ్బు ఇచ్చి, రైతులను బెదిరించి, మభ్యపెట్టి వందల ఎకరాలు కొనుగోలు చేశారు. – సుధాకర్‌రెడ్డి, పోట్లదుర్తి అవినీతిలో ఆరితేరారు రాష్ట్రంలో అతిపెద్ద అవినీతి తిమింగళం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు. ప్రజల్లో పట్టు లేకపోయినా ప్రభుత్వ అధినేత వద్ద పరపతి ఉండటంతో ఇష్టారాజ్యంగా దోపిడీ పర్వం కొనసాగింది. ఆయన కుటుంబం నియంతృత్వం కారణంగా భూములు వదిలి వెళ్లాల్సిన దుస్థితి పోట్లదుర్తిలో ఉంది. వీరి కుటుంబం ప్రొద్దుటూరు కేంద్రంగా దందాలు చేస్తోంది. – హనుమంతరెడ్డి, జమ్మలమడుగు -
‘అవినీతి చక్రవర్తి’పై అడ్డగోలు వాదనలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో నాలుగన్నరేళ్లలో అవినీతి పాలనతో రూ.లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన సీఎం చంద్రబాబు తీరుకు అక్షర రూపమిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకంలోని అంశాలు అధికార టీడీపీ నేతల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాతోపాటు విభిన్న మాధ్యమాలలో, రాజకీయ వర్గాల్లో చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో టీడీపీ అడ్డగోలు వాదనకు తెరతీసింది. పుస్తకంలో ప్రచురించిన వాస్తవాలకు సమాధానం చెప్పలేక తిరకాసు మాటలతో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పేరిట గురువారం రాత్రి బహిరంగలేఖ విడుదల చేసింది. వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వారి లో సంతలో పశువు ల్లా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల పేరుతో ఈ లేఖ వెలు వడింది. అమ్ముడుపోవడమేగాక మంత్రులుగా వ్యవహ రిస్తున్న ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, అమరనాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియతోపాటు 17 మంది ఎమ్మెల్యేల పేరుతో టీడీపీ లెటర్‌హెడ్‌పై 4 పేజీల ప్రకటన విడుదల చేసినప్పటికీ... ఏ ఒక్కరి సంతకం, కనీసం పార్టీకి చెందిన ఏ ప్రతినిధి పేరు కూడా లేకపోవడం గమనార్హం. ఎప్పటిలాగే ఊకదంపుడు ఉపన్యాసాలలో చెప్పినట్లే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా, తనకున్న అనుభవం, ప్రతిష్టతో కష్టపడి సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతిని అదుపు చేయడానికి కొత్త విధానాలను అనుసరిస్తున్నారని చెప్పడం తప్ప చంద్ర బాబు గురించి ‘అవినీతి చక్రవర్తి’లో ప్రస్తావించిన ఏ అంశా నికీ కనీసం సమాధానం లేదు. వైఎస్సార్సీపీ, సాక్షి పత్రిక, ఛానల్‌పై అక్కసు వెళ్లగక్కడంతోపాటు 23 ప్రశ్నలు వేశారు. బాబు అవినీతి ప్రజల్లోకి చేరడంతో... ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించాక వేల సంఖ్యలో ఆ పుస్తకాలు ప్రజలకందాయి. అందులోని అంశాలు సోషల్ మీడియాలో ఊహకు అందని స్థాయిలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు దోపిడీ, అవినీతి పాలనకు ఆ పుస్తకం కళ్లకు కట్టిందని, అన్ని ఆధారాలతో వివరించిన తీరు అద్భుతంగా ఉందని, తవ్వేకొద్దీ చంద్రబాబు అవినీతి కుప్పలుతెప్పలుగా బయటకొస్తోందనే నెటిజన్ల వ్యాఖ్యలు, పరిశీలకుల విశ్లేషణలు చంద్రబాబు, ఆయన కోటరీకి గంగవెర్రులెత్తిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా అన్నింటా అవి నీతి పెచ్చరిల్లిందని, రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో రూ. 6,17,585.19 కోట్లు అవినీతి జరిగిందని ఆధారాలతో సహా వివరించడంతో పాలకపక్షం వెన్నులో చలి మొదలైంది. నోరు మెదపని టీడీపీ నేతలు రాజధానిపై లీకులు కొందరి లబ్ధి కోసమేనని మాజీ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించడం, ఏపీలో చెత్త పాలన సాగుతోందని ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థలు అభిప్రాయపడటాన్ని పుస్తకంలో ఉటంకించడాన్ని చూసి తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతోంది. రాష్ట్ర ప్రజలకు జీవనాడి అయిన జాతీయ ప్రాజెక్టు పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలతోపాటు జలవనరుల శాఖలో చేపట్టిన అన్ని పనుల్లోనూ జరిగిన అంతులేని దోపిడీపై ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. కోటరీ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తున్న వైనం, ఇసుక, మట్టి, నీరు–చెట్టు పేరిట దోచుకుంటున్న తీరు, విశాఖ భూ కుంభకోణం, ప్రభుత్వ స్థలాల ఆరగింత, అసైన్డ్ భూముల్ని కొల్లగొట్టడం, అగ్రిగోల్డ్ ఆస్తులపై చినబాబు కన్ను పడటం వంటి అంశాలపై టీడీపీ నేతలు నోరు మెదపలేకపోతు న్నారు. అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల ముసుగులో దోచుకుంటున్న తీరును ‘అవినీతి చక్రవర్తి’లో ఆవిష్కరించి నప్పటికీ తెలుగుదేశం నేతలు జవాబు చెప్పలేదు. చంద్రబాబు కోటరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తల పేరిట ప్రచురించిన అవినీతి ఆరోపణలపై మాట పెగలడం లేదు. ఎదురుదాడి ద్వారా తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుండటాన్ని బట్టి టీడీపీ బేలతనం, డొల్లతనం బట్టబయలవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అవినీతి టీడీపీ పాలనకు చరమగీతం పాడాలి
రావులపాలెం (కొత్తపేట): అడుగడుగునా అవినీతికి పాల్పడుతున్న టీడీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్ తన జన్మదినం సందర్భంగా రావులపాలెం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నానికి శనివారం పాదయాత్ర ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని, కొత్తపేటలో ఎమ్మెల్యేగా తిరిగి చిర్ల జగ్గిరెడ్డి గెలుపొందాలని ఆకాంక్షిస్తూ, హత్యాయత్నం నుంచి జగన్ క్షేమంగా బయటపడి తిరిగి ప్రజల మధ్యకు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ చేపట్టిన ఈ పాదయాత్రను.. రావులపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద బోస్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ప్రసన్నకుమార్‌తో జన్మదిన కేకు కట్ చేయించారు. స్థానిక సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బోస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వ నిధులతో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి తాండవిస్తోందన్నారు. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధారాలు వెల్లడించారన్నారు. ఈ అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవచ్చని, కేంద్రమే సుప్రీం అని, అవినీతిని నిరోధించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని కూడా రాజకీయం చేయడం చూసి ప్రజలు చంద్రబాబును అసహ్యించుకుంటున్నారన్నారు. శత్రువైనా కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించడం తెలుగు సంప్రదాయమన్నారు. హత్యాయత్నం ఘటనను ఖండించి దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పి ఉంటే చంద్రబాబు గౌరవం పెరిగేదని బోస్ అన్నారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన చంద్రబాబు పాలన త్వరలోనే అంతమవుతుందన్నారు. ప్రసన్నకుమార్ పాదయాత్ర విజ యవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఊబలంక మీదుగా ప్రసన్నకుమార్ పాదయాత్ర ఆత్రేయపురం మండలం వైపు సాగింది. మార్గం మధ్యలో పలుచోట్ల అభిమానులు పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికి, జన్మదిన కేకులు కట్ చేయించారు. తీన్మార్ డప్పులు, బాణసంచా కాల్పులతో పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ప్రసన్నకుమార్‌తోపాటు బోస్, జగ్గిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు, మాజీ కార్యదర్శి కర్రి పాపారాయుడు, అమలాపురం పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మునికుమారి ఊబలంక వరకూ పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీ కోట చెల్లయ్య, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మార్గన గంగాధరరావు, అడ్లగళ్ళ సాయిరామ్, జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా ప్రభాకరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బొక్కా వెంకటలక్ష్మి, అప్పారి విజయ్‌కుమార్, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను, కనుమూరి శ్రీనివాసరాజు, ముత్యాల వీరభద్రరావు, ఎంపీటీసీ సభ్యులు కొండేపూడి రామకృష్ణ, బొక్కా ప్రసాద్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మల్లిడి రామిరెడ్డి, కోనాల రాజు, చంటి కోపెల్లమిల్లి, ద్వారంపూడి సుధాకరరెడ్డి పాల్గొన్నారు. -
అందరికీ ఇళ్లు.. అవినీతికి ఆనవాళ్లు
ఒంగోలు: అందరికీ ఇళ్లు పేరుతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒంగోలులో నిర్మిస్తున్న మొదటి, మూడో విడత గృహ నిర్మాణాలకు సంబంధించి రూ.600కోట్ల అవినీతి చోటు చేసుకుందంటూ సామాజిక కార్యకర్త మలిశెట్టి శ్రీనివాసరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని తీర్మానిస్తూ హైకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో చదరపు అడుగు వ్యయం రూ.896.97గా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.1900గా నిర్ణయించడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఫిర్యాది పేర్కొన్నారు. మొత్తం 53,51,170 చదరపు అడుగుల నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ సంస్థ అయిన టిడ్కోకు అదనంగా రూ.535కోట్లు చెల్లింపులు జరుగుతాయని, అదే «విధంగా కొప్పోలు వద్ద మూడో విడతకు సేకరించిన భూమి ధర చెల్లింపులోను పెద్ద ఎత్తున అవినీతి వ్యవహారం నడిచిందని పేర్కొన్నారు. ఇందులో 50.50 ఎకరాలకుగాను రూ.35కోట్లు అదనంగా చెల్లిస్తున్నారని, తద్వారా రెండు దశలలో కలిపి రూ.600 కోట్ల అవినీతి ఉందన్నారు. నిబంధనల ప్రకారం సొంతిల్లు లేనివారికి, రూ.3లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు అర్హులుకాగా తమ పరిశీలనలో మొదటి విడతలోని 1488 మందిలో 134 మందికి సొంతి ళ్లు ఉన్నాయని తేలిందన్నారు. మరికొందరికి కుటుంబసభ్యుల పేర్లతో ఇళ్లు ఉన్నాయని, అసలు ఒంగోలులో రేషన్ కార్డులు లేనివారికి కూడా పథకంలో చోటు కల్పించినట్లు మలిశెట్టి శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పది మంది ప్రతివాదులు.. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు సిఫార్సుల మేరకు అధికారులు లబ్ధిదారులను గుర్తిస్తున్నారని మలిశెట్టి శ్రీనివాసరావు తన పిటిషన్లో పేర్కొన్నారు. నగరపాలక సంస్థ మొత్తం 14656 మందిని లబ్ధిదారులుగా పేర్కొంటే అందులో 1051 మంది అనర్హులుగా తమ ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందంటూ సంబంధిత పత్రాలను ధర్మాసనానికి సమర్పించారు. దీనిపై గురువారం హైకోర్టు ధర్మాసనం న్యాయమూర్తులు పి.రాధాకృష్ణ, వి.రామసుబ్రహ్మణ్యన్లు విచారణ జరిపారు. గతంలో గృహ నిర్మాణాలకు సంబంధించిన పర్యవేక్షణాధికారిని ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించడంతో అందుకు సమ్మతించి అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో గురువారం అందరికీ ఇళ్లు అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు దృష్టి సారించి మొత్తం 10 మందిని ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ప్రతివాదులుగా పేర్కొన్న వారిలో కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులు, ఏపీ టిడ్కో ఎండీ, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఒంగోలు ఆర్డీవో, తహసీల్దారు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన మిషన్ సంయుక్త కార్యదర్శి, మిషన్ డైరెక్టర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌కు సంబంధించిన తదుపరి విచారణను మూడు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది. -
టీడీపీ పాలనలో అడుగడుగునా అవినీతి
తడ(సూళ్లూరుపేట): ‘నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో అడుగడుగునా అవినీతి తాండవిస్తోంది. సంక్షేమ పథకాలను వదిలేశారు. చంద్రబాబు పాలనలో తెలుగు తమ్ముళ్లు రూ.3 లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారు’ అని వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. తడ మండలంలోని వాటంబేడులో బుధవారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాలను అందజేసి వాటి గురించి వివరించారు. పార్టీ మండల అధ్యక్షడు కొళివి రఘు ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో సంజీవయ్య మాట్లాడుతూ చెరువులు, కాలువలు, గుంతలను బాగు చేస్తున్నామని చెప్పి రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు. నెర్రికాలువ మరమ్మతులు చేయడం పూర్తిగా విస్మరించారన్నారు. చెంతనే తెలుగుగంగ ప్రధాన కాలువనుంచి తమిళనాడుకు నీరు వెళుతుండగా నార్లు పోసుకోవడానికి చుక్కనీరు లేకుండా రైతులు ఇబ్బందులు పడుతుంటే గంగనీరు తీసుకురాలేని అసమర్ధులుగా టీడీపీ నేతలు మిగిలిపోయారని విమర్శించారు. ఒకవైపు లోటు బడ్జెట్ అంటూనే రూ.కోట్లు అనవరంగా ఖర్చు చేస్తున్నారన్నారు. చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లి గెలిచేందుకు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. నీరు – చెట్టు పథకంలో రూ.కోట్లు అవినీతి పాల్పడుత్నుట్లు చెప్పారు. సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ కావాలంటే జగనన్నను సీఎం చేయాలన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడికి రూ.50 వేలు ఇస్తారన్నారు. బడికెళ్లే ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ.20 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. నవరత్నాల పథకాలు ప్రతి పేద ఇంటిని తాకుతాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి గండవరం సురేష్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు కళత్తూరు శేఖర్‌రెడ్డి, పట్టణ ప్రచార విభాగం కార్యదర్శి తుపాకుల ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి కొమ్మల శేఖర్‌బాబు, మండల రైతుల విభాగం అధ్యక్షులు చిల్లకూరు మునిరత్నం రెడ్డి, ఎంపీటీసీ హరినాథరెడ్డి, నరేష్‌రెడ్డి, అట్రంబాక రాజేష్, కారికాటి సురేష్‌రెడ్డి, చంద్రారెడ్డి, పాల మహేశ్వర్, తడకుప్పం రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గుట్టు విప్పండి గురూ...!
ఎన్నికల ముందు పరస్పరం సహకరించుకుంటూ గూడుపుఠాణీ చేసిన టీడీపీ,కాంగ్రెస్ నాయకులు, ఎన్నిక తరువాత కలిహించుకుంటూ ఒకరి అవినీతి చిట్టాలు మరొకరు విప్పుతున్నారు. దీంతో వారి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడతున్నాయి. దీంతో రెండు పార్టీలు దొందూదొందేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు వాఖ్యానిస్తున్నారు. అయితే ఆరోపణలకే పరిమితం కాకుండా ఆధారాలు కూడా బయటపెడితే పార్టీలకు, నేతలకు విశ్వసనీయత పెరుగుతుందని, అందువల్ల అవినీతి నేతల బండారాన్ని బయటపెట్టాలని అవినీతి రహిత రాజకీయాలను ఆశిస్తున్న జిల్లా వాసులు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికలకు నెల రోజుల ముందు టీడీపీలో చేరిన మీసాల గీతకు సీనియర్లను కాదని టిక్కెట్ ఇవ్వడం వెనుక ద్వారపురెడ్డి జగదీష్, ఐవీపీరాజుల బ్రోకరిజం ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఆమె వద్ద నుంచి ఎన్ని రూ.లక్షలు తీసుకున్నారో తమ వద్ద లెక్కలున్నాయి. పురపాలక, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ద్వారపురెడ్డి బి-ఫారాలు అమ్ముకున్నారు. చెరువులు కబ్జా చేసిన మున్సిపల్ ప్రసాదుల రామకృష్ణ, ఏ ఇసుకతో సింగపూర్ సిటీ, భగవాన్ నగర్‌లోని గ్రూపు హౌస్‌లు నిర్మించారో చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు సంధించారు. ముషిడిపల్లి పథకం ఎవరి హయాంలో ప్రారంభమైందో...ఎవరికి కాంట్రాక్ట్‌లు,సబ్ కాంట్రాక్ట్‌లు ఇచ్చారో ...ఇప్పటి పరిస్థితికి ఎవరు కారుకులో తేల్చేందుకు ఎటువంటి విచారణకైనా సిద్ధమని.... అశోక్ వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. తాడ్డి వెంకటరావుకు వచ్చిన బి- ఫారాన్ని ... వంగపండు నారాయణ అప్పలనాయుడికి ఇచ్చిందెవరు? దాని కోసం ముడుపులు తీసుకున్న దెవరో తెలియదా? బొత్స దోపిడీ ఏంటో అందరికీ తెలిసిందే. కర్ఫ్యూ కారకులైన వ్యక్తే ఈ కేసులు ఎత్తివేయాలంటూ మాట్లాటడం ఆశ్చర్యంగా ఉంది. పిళ్లా విజయకుమార్ పదేళ్లలో భూ దందాలు చేశారు. యడ్ల రమణమూర్తి కూడా రైతుల నుంచి అన్యాయంగా భూములు రాయించేసుకున్నారంటూ టీడీపీ నేతలు ఎదురు దాడికి దిగారు. పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. తుపాను సహాయ చర్యల్లో రాజకీయం, ముషిడిపల్లి మంచినీటి పథకం నుంచి వస్తున్న బురద నీరుపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేసుకుంటున్న పరస్పర ఆరోపణలతో వారి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. బస్తీ మే సవాల్ అంటూ ఒకరిపై ఒకరు ధ్వజమెత్తుతున్నారు. అవినీతి అక్రమాల డొంకలను లాగుతున్నారు. అయితే భవిష్యత్‌లో మీ బండారం బయటపెడతామంటూ ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నారు తప్పా...అసలు విషయాలు బయటపెట్టడం లేదు. ఇలా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు చూస్తే దొందూ దొందే అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టిక్కెట్ల కోసం తీసుకున్న డబ్బు, నాయకులు చేసిన భూఆక్రమణలు, పెద్దోళ్ల దోపిడీ నిర్వాకం బయటపెడితే విచారణ ఏజెన్సీలకు పనిసులువు అవుతుందని, ద్వారపురెడ్డి జగదీష్‌పై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. పక్కా ఆధారాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఆ ఆధారాలేంటో చూపిస్తే వారు చేసిన ఆరోపణలకు విశ్వసనీయత కల్గుతుందని వీరి రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్న వారు కోరుతున్నారు. అదే తరహాలో ముషిడిపల్లి మంచినీటి పథకం కాంట్రాక్ట్ లోగుట్టు విప్పితే ఆ కోటరీ వ్యవహారం బయటకు వస్తుంది. కాంగ్రెస్ నాయకుల నోరు విప్పితే టీడీపీ అసలు స్వరూపం బట్టబయలవుతుంది. అలాగే, కాంగ్రెస్ నేతల భూఆక్రమణల్ని బయటపెట్టి, విచారణకు ఆధారాలు చూపిస్తే టీడీపీ నాయకుల దయవల్ల విచారణాధికారులకు త్వరగా పని పూర్తికానుంది. ఆ నాయకుల అసలు రంగు భయటపడుతుంది. ఇదే మంచి తరుణం...గుట్టు విప్పండి గురూ అంటూ జిల్లా వాసులుకోరుతున్నారు.