
చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడిని మద్రాసు హైకోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలుశిక్షను విధించింది. రూ.50 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
పొన్ముడి ఆయన భార్యపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ 2002లో కేసు నమోదు చేసింది. ఏఐఏడీఎంకే ప్రభుత్వం 1996-2001 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేసు నమోదైంది. అప్పట్లోనే పొన్ముడి ఆయన భార్య ఆదాయం రూ. 1.4 కోట్లుగా ఉంది. ఆర్థిక వనరులకు మించి వారి వద్ద డబ్బు ఉందని తెలింది. 1996-2001 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో పొన్ముడి అక్రమ సంపదను కూడబెట్టారని అధికారులు ఆరోపించారు.
తగిన సాక్ష్యాధారాలను సమర్పించడంలో విఫలమైందని పేర్కొంటూ జూన్ 28న వెల్లూరులోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు పొన్ముడి ఆయన భార్యను నిర్దోషులుగా ప్రకటించింది. పొన్ముడి ఆయన భార్యను నిర్దోషులుగా విడుదల చేసిన తీర్పును ఆగస్టులో మద్రాస్ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. అయితే.. కేసు చాలా పాతదని, ప్రస్తుతం పొన్ముడికి 73 ఏళ్లు కాగా, ఆయన భార్యకు 60 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా కనీస శిక్ష తగ్గించాలని దంపతులు కోరారు.
ఇదీ చదవండి: లాలూ, తేజస్వీలకు ఈడీ సమన్లు