సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో నాలుగన్నరేళ్లలో అవినీతి పాలనతో రూ.లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన సీఎం చంద్రబాబు తీరుకు అక్షర రూపమిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకంలోని అంశాలు అధికార టీడీపీ నేతల్లో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాతోపాటు విభిన్న మాధ్యమాలలో, రాజకీయ వర్గాల్లో చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో టీడీపీ అడ్డగోలు వాదనకు తెరతీసింది. పుస్తకంలో ప్రచురించిన వాస్తవాలకు సమాధానం చెప్పలేక తిరకాసు మాటలతో టీడీపీ రాష్ట్ర కార్యాలయం పేరిట గురువారం రాత్రి బహిరంగలేఖ విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన వారి లో సంతలో పశువు ల్లా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల పేరుతో ఈ లేఖ వెలు వడింది.
అమ్ముడుపోవడమేగాక మంత్రులుగా వ్యవహ రిస్తున్న ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, అమరనాథ్‌రెడ్డి, భూమా అఖిలప్రియతోపాటు 17 మంది ఎమ్మెల్యేల పేరుతో టీడీపీ లెటర్‌హెడ్‌పై 4 పేజీల ప్రకటన విడుదల చేసినప్పటికీ... ఏ ఒక్కరి సంతకం, కనీసం పార్టీకి చెందిన ఏ ప్రతినిధి పేరు కూడా లేకపోవడం గమనార్హం. ఎప్పటిలాగే ఊకదంపుడు ఉపన్యాసాలలో చెప్పినట్లే లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా, తనకున్న అనుభవం, ప్రతిష్టతో కష్టపడి సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతిని అదుపు చేయడానికి కొత్త విధానాలను అనుసరిస్తున్నారని చెప్పడం తప్ప చంద్ర బాబు గురించి ‘అవినీతి చక్రవర్తి’లో ప్రస్తావించిన ఏ అంశా నికీ కనీసం సమాధానం లేదు. వైఎస్సార్‌సీపీ, సాక్షి పత్రిక, ఛానల్‌పై అక్కసు వెళ్లగక్కడంతోపాటు 23 ప్రశ్నలు వేశారు.
బాబు అవినీతి ప్రజల్లోకి చేరడంతో...
‘అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించాక వేల సంఖ్యలో ఆ పుస్తకాలు ప్రజలకందాయి. అందులోని అంశాలు సోషల్ మీడియాలో ఊహకు అందని స్థాయిలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు దోపిడీ, అవినీతి పాలనకు ఆ పుస్తకం కళ్లకు కట్టిందని, అన్ని ఆధారాలతో వివరించిన తీరు అద్భుతంగా ఉందని, తవ్వేకొద్దీ చంద్రబాబు అవినీతి కుప్పలుతెప్పలుగా బయటకొస్తోందనే నెటిజన్ల వ్యాఖ్యలు, పరిశీలకుల విశ్లేషణలు చంద్రబాబు, ఆయన కోటరీకి గంగవెర్రులెత్తిస్తున్నాయి. ఆకాశమే హద్దుగా అన్నింటా అవి నీతి పెచ్చరిల్లిందని, రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో రూ. 6,17,585.19 కోట్లు అవినీతి జరిగిందని ఆధారాలతో సహా వివరించడంతో పాలకపక్షం వెన్నులో చలి మొదలైంది.
నోరు మెదపని టీడీపీ నేతలు
రాజధానిపై లీకులు కొందరి లబ్ధి కోసమేనని మాజీ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించడం, ఏపీలో చెత్త పాలన సాగుతోందని ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థలు అభిప్రాయపడటాన్ని పుస్తకంలో ఉటంకించడాన్ని చూసి తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతోంది. రాష్ట్ర ప్రజలకు జీవనాడి అయిన జాతీయ ప్రాజెక్టు పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలతోపాటు జలవనరుల శాఖలో చేపట్టిన అన్ని పనుల్లోనూ జరిగిన అంతులేని దోపిడీపై ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. కోటరీ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుస్తున్న వైనం, ఇసుక, మట్టి, నీరు–చెట్టు పేరిట దోచుకుంటున్న తీరు, విశాఖ భూ కుంభకోణం, ప్రభుత్వ స్థలాల ఆరగింత, అసైన్డ్ భూముల్ని కొల్లగొట్టడం, అగ్రిగోల్డ్ ఆస్తులపై చినబాబు కన్ను పడటం వంటి అంశాలపై టీడీపీ నేతలు నోరు మెదపలేకపోతు న్నారు.
అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల ముసుగులో దోచుకుంటున్న తీరును ‘అవినీతి చక్రవర్తి’లో ఆవిష్కరించి నప్పటికీ తెలుగుదేశం నేతలు జవాబు చెప్పలేదు. చంద్రబాబు కోటరీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తల పేరిట ప్రచురించిన అవినీతి ఆరోపణలపై మాట పెగలడం లేదు. ఎదురుదాడి ద్వారా తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుండటాన్ని బట్టి టీడీపీ బేలతనం, డొల్లతనం బట్టబయలవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment