తడ(సూళ్లూరుపేట): ‘నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో అడుగడుగునా అవినీతి తాండవిస్తోంది. సంక్షేమ పథకాలను వదిలేశారు. చంద్రబాబు పాలనలో తెలుగు తమ్ముళ్లు రూ.3 లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారు’ అని వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. తడ మండలంలోని వాటంబేడులో బుధవారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాల కరపత్రాలను అందజేసి వాటి గురించి వివరించారు. పార్టీ మండల అధ్యక్షడు కొళివి రఘు ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో సంజీవయ్య మాట్లాడుతూ చెరువులు, కాలువలు, గుంతలను బాగు చేస్తున్నామని చెప్పి రూ.కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారు.
నెర్రికాలువ మరమ్మతులు చేయడం పూర్తిగా విస్మరించారన్నారు. చెంతనే తెలుగుగంగ ప్రధాన కాలువనుంచి తమిళనాడుకు నీరు వెళుతుండగా నార్లు పోసుకోవడానికి చుక్కనీరు లేకుండా రైతులు ఇబ్బందులు పడుతుంటే గంగనీరు తీసుకురాలేని అసమర్ధులుగా టీడీపీ నేతలు మిగిలిపోయారని విమర్శించారు. ఒకవైపు లోటు బడ్జెట్ అంటూనే రూ.కోట్లు అనవరంగా ఖర్చు చేస్తున్నారన్నారు. చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లి గెలిచేందుకు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారన్నారు. నీరు – చెట్టు పథకంలో రూ.కోట్లు అవినీతి పాల్పడుత్నుట్లు చెప్పారు. సంక్షేమ పథకాల సృష్టికర్త వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ కావాలంటే జగనన్నను సీఎం చేయాలన్నారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే రైతుభరోసా కింద రైతులకు పెట్టుబడికి రూ.50 వేలు ఇస్తారన్నారు. బడికెళ్లే ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ.20 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. నవరత్నాల పథకాలు ప్రతి పేద ఇంటిని తాకుతాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి గండవరం సురేష్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు కళత్తూరు శేఖర్‌రెడ్డి, పట్టణ ప్రచార విభాగం కార్యదర్శి తుపాకుల ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి కొమ్మల శేఖర్‌బాబు, మండల రైతుల విభాగం అధ్యక్షులు చిల్లకూరు మునిరత్నం రెడ్డి, ఎంపీటీసీ హరినాథరెడ్డి, నరేష్‌రెడ్డి, అట్రంబాక రాజేష్, కారికాటి సురేష్‌రెడ్డి, చంద్రారెడ్డి, పాల మహేశ్వర్, తడకుప్పం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment