మన ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారులకు, సిబ్బందికి బొత్తిగా ‘బుర్ర’ లేదేమోనని... ఒక్కోసారి అనిపిస్తుంటుంది. వారు చాలా తేలిగ్గా ఏసీబీ అధికారులకు దొరికిపోతుంటారు. ఇలాంటోళ్లు.. తమను చూసి ‘పాఠాలు’ నేర్చుకోవాలంటున్నారు.. ఓ ప్రభుత్వ శాఖ ‘వారు’. యథేచ్ఛగా, నిర్భీతిగా, బహిరంగంగా అవినీతి దందా సాగిస్తూ... ఏసీబీని కూడా బురిడీ కొట్టిస్తున్న (దొరక్కుండా తప్పించుకుంటున్న) ఆ అపర అవినీతి ‘చక్రవర్తుల’ను,
వారి ‘సామ్రాజ్యాన్ని’ చూసొద్దాం రండి...!!!
ఖమ్మంక్రైం: ఆ ‘సామ్రాజ్యం’ పేరే... ఖమ్మంలోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయం(ఆర్‌టీఓ)...! అ క్కడి సిబ్బందే ‘చక్రవర్తులు’...!! అక్కడ అవినీతి దందా ఎలా సాగుతోందో ప్రత్యక్షంగా చూద్దాం.
అతడి పేరు పవన్. ప్రభుత్వ ఉద్యోగి. ఇటీవల, ఓ ద్విచక్ర వాహనం కొన్నాడు. అప్పటివరకూ అతడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు. లైసెన్స్ కోసం ఖమ్మంలోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయానికి ఉదయమే వెళ్లాడు. క్యూలో గంటలతరబడి నిల్చున్నాడు. తన ఫైల్‌ను కౌంటర్ చేయించుకున్నాడు. లైసెన్స్ పరీక్ష రాశాడు... ‘ఫెయిలయ్యాడు’..! తనదే పొరపాటు జరిగిందేమోనని అనుకున్నాడు. ఉసూరుమంటూ బయటికొచ్చాడు. అప్పటికి సమయం.. మధ్యాహ్నం మూడు గంటలు.
మరొక రోజున, ఆఫీస్‌కు సెలవు పెట్టి ఉదయమే వెళ్లాడు. మొదటిసారి వెళ్లినప్పుడు మాదిరిగానే, గంటలతరబడి క్యూలో నిలుచున్నాడు. కౌంటర్ వేయించుకున్నాడు. పరీక్ష రాశాడు. మళ్లీ ‘ఫెయిలయ్యాడు’..!! బయటికొచ్చేసరికి సాయంత్రమైంది.
తనకేమీ అర్థమవలేదు. తన తరువాత ముగ్గురు స్నేహితులు దరఖాస్తు చేసిన విషయం గుర్తుకొచ్చింది. వాళ్లను కలుసుకున్నాడు. ఆశ్చర్యం...! వాళ్ల ముగ్గురికీ దరఖాస్తు చేసిన రోజునే (లెర్నింగ్) లైసెన్స్ వచ్చిందట...!! తనకు రెండుసార్లు ఎదురైన అనుభవాలను, పడిన అవస్థలను వివరించాడు. ఇదంతా విన్న ఆ స్నేహితులు, పవన్ వైపు చూస్తూ పగలబడి నవ్వుతున్నారు. ఇతడికి ఏమీ అర్థమవడం లేదు. వారి వైపు పిచ్చి చూపులు చూస్తున్నాడు. ‘‘కొన్నిచోట్ల, మరీ ముఖ్యంగా ఆర్‌టీఓ ఆఫీసులో పనులు కావాలంటే.. దక్షిణ సమర్పించుకోక తప్పదన్న విషయం కూడా తెలియని అజ్ఞానిలాగా ఉన్నావ్. నీ దారిలో నువ్వు వెళితే.. ఈ జన్మలో కూడా లైసెన్స్ సాధించలేవు. మా దారిలో వెళ్లు. వెంటనే రాకపోతే అడుగు’’ అని, సలహా ఇచ్చారు. ‘ఎవరి’ని కలవాలో చెప్పారు.
ఆ ముగ్గురు మిత్రుల్లో ఒకరితో కలిసి రవాణా శాఖ కార్యాలయం వద్దనున్న ఓ దళారి వద్దకు పవన్ వెళ్లాడు. ‘‘రవాణా శాఖకు చెల్లించాల్సిన ఫీజు ఇంత, కార్యాలయంలోని సిబ్బందికి.. నాకు కలిపి ఇవ్వాల్సింది ఇంత’’ అని, లెక్క చెప్పాడు. ఆ దళారి అడిగినంత ఇచ్చుకున్నాడు పవన్. ‘‘రేపు వచ్చి లైసెన్స్ తీసుకెళ్లండి’’ అన్నాడు దళారి. ఏదో ఆలోచిస్తున్న పవన్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ‘‘సెలవు పెట్టడం కుదరదేమోనని...’’ పవన్ వాక్యం పూర్తికాలేదు. ఆ దళారి, పగలబడి నవ్వాడు. ‘‘మీ అంతట మీరు వెళితే.. పూట పట్టొచ్చు, రోజు పట్టొచ్చు. అసలు పనే జరగకపోవచ్చు. మా ద్వారా వస్తే... జస్ట్, ఒక్క గంటలోనే పని పూర్తిచేసి పంపిస్తాం’’ అన్నాడు.
అతడు చెప్పినట్టుగానే, మరుసటి రోజున ఆ దళారి వద్దకు పవన్ వెళ్లాడు. అతడి దరఖాస్తుపై ఒక ‘కోడ్’ వేసి, చేతికిచ్చి కార్యాలయంలోకి వెళ్లాలని చెప్పాడు. అంతకు ముందు నేరుగా వెళ్లిన తనను చూసి చిరాగ్గా మొహం పెట్టిన అక్కడి ఉద్యోగి... ఇప్పుడు ఆ దరఖాస్తుపై ‘కోడ్’ చూడగానే చిత్రంగా చిరునవ్వు నవ్వాడు. ఆ వెన్వెంటనే పరీక్ష రాయడం... ఉత్తీర్ణుడవడం... లైసెన్స్ చేతికి అందడం... అంతా కేవలం గంటలోపే పూర్తయింది. ‘ఇక్కడ దళారులదే దందా. వారిని ఆశ్రయించకపోతే, దరఖాస్తు ఫైల్.. అంగుళం కూడా ముందుకు కదలదన్నమాట..!’ అనుకుంటూ, తన మిత్రుడికి ఫోన్ చేశాడు. ‘‘ఆర్టీఓ కార్యాలయం వంటిచోట్ల పనులు కావాలంటే.. ‘ఆమ్యామ్యా’ సమర్పించుకోవాలని తెలి సింది. ఇక్కడికొచ్చిన తరువాత... నా ‘అజ్ఞానం’ వీడింది, ‘జ్ఞానోదయం’ అయింది...’’ అని చెప్పాడు.
ఇక్కడే, చిన్న సవరణ ఉంది. ఇక్కడ జరుగుతున్న పనుల్లో వందలో దళారులవి 90 ఉంటే, మి గతా పది మాత్రమే ఇతరులవి. కనీసంగా, ఈ ప ది పనులైనా దళారులతో సంబంధం లేకుండా చేయకపోతే... ‘బాగుండదేమో’నని చేస్తున్నారు.
డ్రామా...!
ఔను..! జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో తరచుగా ‘డ్రామా’లు జరుగుతుంటాయి. అది కూడా చూద్దాం. ఈ కార్యాలయంలో దళారుల దందా సాగుతోందని, వారి కనుసన్నల్లోనే సిబ్బంది మెలుగుతున్నారని మీడియాలో వార్త వచ్చినప్పటి నుంచి అక్కడ హడావుడి మొదలవుతుంది. దళారులను లోపలికి రానివ్వకుండా అక్కడున్న హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులు తెగ హడావుడి చేస్తుంటారు. చూసేవాళ్లకు... ఇదంతా ఓ ‘డ్రామా’ అనే విషయం తెలియదు. జస్ట్... వారం పది రోజుల్లో ఈ ‘డ్రామా’కు తెర పడుతుంది. మళ్లీ ‘మామూలే’...!!!
పార్కింగ్‌లోనూ దందానే...!
ఈ కార్యాలయానికి వచ్చే వాహనదారులు తమ వాహనాలను కార్యాలయం గేట్ వద్దే పార్కింగ్ చేయాలి. అదే, ఏజెంట్ల వాహనాలైతే మాత్రం.. నేరుగా కార్యాలయం ముందు వరకు కూడా వెళ్లవచ్చు. ఓ దళారి (ఏజెంట్), గత కొన్ని నెలలుగా తన కారును ఈ కార్యాలయ ఆవరణలోగల చెట్టు కిందనే పార్కింగ్ చేస్తున్నాడు(ట).
ఏసీబీ... ఏమిటిది..?!
ఈ కార్యాలయంపై గతంలో ఏసీబీ దాడులు జరిగాయి. అయినప్పటికీ, పరిస్థితిలో మార్పు లేదు. ఈ కార్యాలయ సిబ్బంది, దళారుల ‘బాధితులు’ (పవన్ లాంటివాళ్లు)... ‘ఏసీబీ.. ఏమిటిది..? ఇక్కడ ఇంత పబ్లిగ్గా అవినీతి దందా సాగుతుంటే.. ఫిర్యాదులు రావడం లేదా..? వచ్చినా పట్టించుకోవడం లేదా..? తన కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంటే... అక్కడి అధికారి(ఆర్‌టీఓ) ఏం చేస్తున్నట్టు..?’ అంటూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోట్లకు పడగెత్తారట...!
ఖమ్మం రవాణాశాఖ కార్యాలయం చుట్టూ సుమారు 200 మంది వరకు ఏజెంట్లు (దళారులు) ఉన్నారు. వీరిలో కొందరైతే... కేవలం ఈ ‘పనుల’ ద్వారానే కోట్లకు పడగలెత్తారట...! ఇక్కడ ‘సంపాదన’తో వేర్వేరు వ్యాపారులు సాగిస్తున్నారట. వీళ్లే ఇంత సంపాదించారంటే... వీళ్లతో కుమ్ముక్కైన ఆ కార్యాలయ అవినీతి సిబ్బంది కూడా ఇంతే స్థాయిలో కోట్లకు పడగలెత్తి ఉండొచ్చేమోనన్నది కొందరు ‘బాధితుల’ అభిప్రాయం–అంచనా.
ఈ దళారీ దందా ఎప్పుడు అంతమవుతుందో...? ఈ అవినీతి సామ్రాజ్యం ఎన్నడు కూలుతుందో...? ఈ ‘ఆమ్యామ్యా చక్రవర్తు’లకు చెక్ పెట్టేదెవరో...?
Comments
Please login to add a commentAdd a comment