బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో నేతలతో మోదీ
న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల వల్లే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలు అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరును ఆపలేవని స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ఖ్యాతి అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఈ సమయంలో, భారత వ్యతిరేక శక్తులు అంతర్గతంగా, వెలుపలా చేతులు కలపడం సహజమేనని ప్రధాని పేర్కొన్నారు.
కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఆయన.. కొన్ని ‘అవినీతి రక్షణ ఉద్యమం’ ప్రారంభించాయంటూ పరోక్షంగా దుయ్యబట్టారు. కొందరికి కోపం కూడా వస్తోందంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే గతంలో ఇంతగా అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. ‘తప్పుడు ఆరోపణలతో దేశం తలవంచదు. అవినీతిపై చర్యలు ఆగవు.
భారత వ్యతిరేక శక్తులు బలమైన పునాది వంటి రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తున్నాయి. దేశాభివృద్ధిని ఆపేందుకు దాడికి దిగుతున్నాయి. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు, వాటి విశ్వసనీయతను నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి’అని ఆరోపించారు. 2004–14 సంవత్సరాల మధ్య యూపీఏ ప్రభుత్వం మనీలాండరింగ్ ఆరోపణలపై రూ.5 వేల కోట్ల సొత్తును స్వాధీనం చేసుకోగా 9 ఏళ్లలో తమ ప్రభుత్వం రూ.1.10లక్షల కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుందన్నారు.
ఎన్నికల్లో బీజేపీ విజయాలకు, తమ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలకు సంబంధముందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంతగా విజయాలు సాధిస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అంతగా లక్ష్యంగా చేసుకుంటాయన్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై పలు అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. బీజేపీ వరుస విజయాలు నమోదు చేసుకుంటున్న నేపథ్యంలోనే గుజరాత్ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల విమర్శల దాడులు ఎక్కువైనట్లు చెప్పారు. మున్ముందు ఈ విమర్శలు అన్ని స్థాయిల్లోనూ తీవ్రతరమవుతాయని హెచ్చరించారు.
ఏప్రిల్ 6–14 మధ్య సేవా కార్యక్రమాలు
బీజేపీ వ్యవస్థాపక దినం ఏప్రిల్ 6 నుంచి మొదలుకొని ఏప్రిల్ 14వ తేదీ అంబేడ్కర్ జయంతి రోజు వరకు సొంత నియోజకవర్గాల్లో సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని మోదీ ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. సమాజంపై ఎంతో ప్రభావం చూపే రాజకీయ నేతలు రాజకీయేతర అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. ‘‘విష రసాయనాల నుంచి నేలకు విముక్తి కల్పించాలి. ఎంపీలు కొత్త సాంకేతికతను అలవర్చుకునేందుకు నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలకు మోదీని పార్టీ ప్రశంసించింది.
బీజేపీ దేశవ్యాప్త ఆందోళనలు
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘దొంగలందరి ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఆందోళనలకు బీజేపీ ఓబీసీ మోర్చా నిర్ణయించింది. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 14 దాకా రాహుల్‌కు వ్యతిరేకంగా ప్రచారోద్యమం చేపట్టనున్నట్టు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రకటించారు. రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ ఓబీసీ ఎంపీలు మంగళవారం ఢిల్లీలో ర్యాలీ చేశారు. ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment