బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పు తప్పదంటూ విపక్షాల ప్రచారం
రాజస్తాన్, యూపీలో బీజేపీపై రాజ్‌పుత్‌ల తీవ్ర అసంతృప్తి
కర్ణాటకలో మిత్రపక్షమైన జేడీ(ఎస్) నేత ప్రజ్వల్‌పై లైంగిక వేధింపుల కేసు
విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలో విఫలమవుతున్న బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్న కమల దళానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్ తదితర కీలక నేతలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు విపక్షం నుంచి ఎదురుదాడి, మిత్రపక్షాల కారణంగా తలెత్తుతున్న చిక్కులు, కొన్ని వర్గాల్లో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తి వంటివి బీజేపీలో అలజడి సృష్టిస్తున్నాయి.
రిజర్వేషన్ల రద్దు అంశంపై రగడ
ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఇప్పటిదాకా సొంతంగా 432 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో పది నుంచి పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మొత్తం 445 మంది అభ్యర్థులను బరిలో నిలిపినా, 370 సీట్ల లక్ష్యం సాధించాలంటే 80 శాతానికి పైగా స్థానాల్లో కచి్చతంగా నెగ్గాల్సి ఉంటుంది. కానీ, అందుకు ప్రతిబంధకాలు లేకపోలేదు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. రిజర్వేషన్లు, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకమని పదేపదే ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక, ఆప్ నేత సంజయ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రిజర్వేషన్లు, రాజ్యాంగంపై బీజేపీని ఇరుకున పెడుతున్నారు.
దీనికి తోడు కాంగ్రెస్ ఇటీవల వైరల్ చేసిన అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో తర్వాత రిజర్వేషన్ల రద్దు అంశంపై జనంలో చర్చ మొదలైంది. రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని, అలాంటి ఆలోచనే లేదని నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నప్పటికీ, దేశంలో 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల్లో అనుమానాలు పూర్తిగా తొలగిపోవడం లేదు. మరో ఐదు విడతల్లో 350కి పైగా స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం ఓటర్లపై తప్పనిసరిగా ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
అందుకేనా 400 సీట్లు?
మళ్లీ బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని మార్చేయడం ఖాయం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాజ్యాంగంతోపాటు కీలకమైన చట్టాలను మార్చడానికే ‘అబ్‌కీ బార్ చార్ సౌ పార్’ నినాదాన్ని బీజేపీ తెరపైకి తెచి్చందని కాంగెరస్ అధ్యక్షుడు ఖర్గే సహా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయం, సమానత్వం, పౌర హక్కులు, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ద్వేషిస్తోందని, నియంతృత్వ పాలన తీసుకురావడమే ఆ పార్టీ లక్ష్యమని విపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపైనా ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాల్సి వచి్చంది.
సాక్షాత్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ దిగివచి్చనా రాజ్యాంగాన్ని మార్చలేరని ఆయన పలు సభల్లో చెప్పారు. అయినప్పటికీ రాజ్యాంగ మార్పుపై బీజేపీ నేతలు అనంతకుమార్ హెగ్డే, అరుణ్ గోవిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సంకటంగా మారాయి. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం తమకు లేదని మోదీ పదేపదే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా విపక్షాల దాడిని సమర్థంగా తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమవుతోంది. రాజ్యాంగం మార్పుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొన్ని వర్గాల ప్రజలు నమ్ముతున్నట్లే కనిపిస్తోంది. ఇంకోవైపు రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తమ జనాభా ఉన్న స్థానాల్లోనూ తమ వర్గం వారికి టిక్కెట్లు ఇవ్వలేదని రాజ్‌పుత్‌లు బీజేపీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. మహాపంచాయతీలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలతో వివాదం
కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కర్ణాటకలో రెండో విడత పోలింగ్‌కు రెండు రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. ప్రజ్వల్ రేవణ్ణను జేడీ(ఎస్) నుంచి బహిష్కరించినప్పటికీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు.
Comments
Please login to add a commentAdd a comment