రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్‌ను నియంత్రించే యత్నం
ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ విమర్శల దాడి
ఇటీవలి ఎన్నికల ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఇలా వేర్వేరు ఎన్నికల్లో వేర్వేరు సంవత్సరాల్లో ఇప్పటిదాకా దాదాపు 80–90 సార్లు ఓటమిని చవిచూసినా విపక్షాలు తమ తీరును మార్చకోలేదని ప్రధాని మోదీ అసహనం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రక్రియలో పదేపదే ప్రజల చేతిలో తిరస్కరణకు గురైనాసరే కొన్ని పార్టీలు పార్లమెంట్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్నాయని ప్రతిపక్షాలనుద్దేశించి మోదీ ఘాటు విమర్శలు చేశారు. ఈ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంట్ సభాకార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు. సోమవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు నూతన పార్లమెంట్ భవనం ఎదుట మీడియాతో మోదీ మాట్లాడారు.
పార్లమెంట్‌పై పట్టుకు యత్నం
‘పార్లమెంట్‌లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. అయితే, దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. అంతరాయాలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. 80–90 సార్లు ఎన్నికల్లో ఓడినా విపక్షాల తీరు మారలేదు. విపక్ష పార్టీలు, ఆ పార్టీల నేతలు పార్లమెంట్‌లో చర్చలు జరగ నివ్వట్లేదు. ప్రజాస్వామ్య సూత్రా లను, ప్రజల ఆకాంక్షలను గౌరవించరు. ప్రజల పట్ల తమకున్న బాధ్యతను గుర్తించడం లేదు’’ అని మోదీ విమర్శల దాడి చేశారు.
కొన్ని ప్రతిపక్షపార్టీలు సహకరిస్తున్నా
‘‘కొందరు విపక్ష నేతలు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. వీళ్ల వైఖరిని ప్రజలు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు తగిన శిక్ష విధిస్తున్నారు. ప్రతిపక్షాల ప్రవర్తన కొత్త ఎంపీల హక్కులను అణచివేస్తుంది. వారి కొత్త ఆలోచనలను పంచుకునే అవకాశాన్ని దెబ్బతీస్తోంది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని ముందుకొచ్చాయి. అయితే ఈ పార్టీల మనసుల్ని వాటి మిత్రపక్షాలు మార్చేస్తు న్నాయి.
సభలో ఆందోళనలు, నిరసనలకే మొగ్గుచూపుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తున్నాయి. సభా సజావుగా సాగేందుకు సిద్ధపడ్డ కొన్ని విపక్షపార్టీల గొంతును వాటి భాగస్వామ్య పార్టీలే నొక్కేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తు న్నాయి. వీళ్ల గొడవ వల్ల తొలిసారిగా సభకు ఎన్నికైనవారు కనీసం ప్రసంగించే అవకాశాన్ని కూడా పొందలేకపోతున్నారు’’ అని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారత్‌లో వచ్చిన అవకాశం అరుదైంది
‘‘ప్రపంచదేశాల పార్లమెంట్‌లతో పోలిస్తే భారత పార్లమెంట్‌లో సభ్యత్వం పొంది అభిప్రాయాలు వెల్లడించే అవకా శం రావడం నిజంగా అరుదు. పార్లమెంట్ వేదికగా ఇచ్చే సందేశం ప్రజా స్వామ్యంపై ప్రజలకున్న అంకితభావా నికి అద్దంపట్టాలి. నేడు ప్రపంచమంతా భారత్ వైపు ఆశగా ఎదురుచూస్తోంది. అందుకు అనుగుణంగా దేశ గౌరవాన్ని, ఖ్యాతిని ఇనుమడింపజేసేలా సభ్యులు సభా సమయాన్ని వినియోగించుకో వాలి. ప్రస్తుత సమావే శాలు అత్యంత ఫలవంతమవ్వాలి. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తిచేసు కుంటున్న ఈ తరుణంలో రాజ్యాంగ ప్రతిష్టను మనందరం పెంచుదాం. కొత్త ఆలోచనలతో సరికొత్త స్ఫూర్తిని నింపుదాం’ అని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment