ఆయన హోం శాఖా మంత్రి ... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సింది పోయి తన ఇంటినే చక్కబెట్టే పనిని విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశ పెట్టినా ఆ పథకం తన నియోజవర్గానికి అన్వయించేస్తూ పర్సంటేజీల వాటాలతో అక్రమాల విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. మంత్రి పదవిని ఆసరా చేసుకొని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లుగా కోట్ల రూపాయలను కొల్లగొట్టారనే వాదనలు గుప్పుమంటున్నాయి. పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టను గుల్ల చేసి అధికార పార్టీ నేతలు రూ.100 కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తు ఉండే కొండలు నేడు కనిపించని విధంగా 200 ఎకరాల వరకు చదును చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్: మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని ఆయన పేరుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా కోట్లు కొల్లగొట్టారనే వాదనలు గుప్పుమంటున్నాయి. ఈ విషయాలు ‘సాక్షి టాస్క్‌ఫోర్స్’ ద్వారా వెల్లడయ్యాయి. ఎన్నికల్లో ఉపయోగపడేలా నియోజకవర్గంలో కార్యకర్తలకు మంత్రి అండగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనే పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప.
పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టను గుల్ల చేసి అధికార పార్టీ నేతలు రూ.100 కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 30 నుంచి 50 అడుగుల ఎత్తు ఉండే కొండలు నేడు కనిపించని విధంగా 200 ఎకరాల వరకు చదును చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది. కొండల తవ్వకాలను నిలిపివేయాలని వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు ఆందోళన చేసినా టీడీపీ నేతలు మంత్రి సిఫార్సులతో అధికారుల సమక్షంలో కొండలను గుల్ల చేసి రూ.కోట్లు ఆర్జించారు. నాలుగేళ్లుగా కొండలను తవ్వడం ప్రారంభించి నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ కొండపై ఆధారపడి ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం, వాలుతిమ్మాపురం గ్రామాలకు చెందిన సుమారు 800 మంది దళితులు జీవించే వారు.
అయితే అధికార పార్టీ పెద్దల అండతో మైనింగ్ మాఫియా ఆ భూముల్లోకి ప్రవేశించి దళితుల బతుకులతో ఆటలాడుకుంటోంది. దళితులతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుని దళితుల అనుమతులు ఉన్నాయంటూ తవ్వకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొండల మీదుగా 33 కేవీ విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయగా వాటి చుట్టు కూడా గ్రావెల్ తవ్వకాలు చేశారు. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో రామేశ్వరం మెట్టపై ఉన్న భూములను 800 ఎకరాల వరకు పేద దళితులకు పంపిణీ చేశారు. తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మరో 530 ఎకరాల భూమిని ఒక్కొక్క కుటుంబానికి ఎకరం 35 సెంట్లు చోప్పున పంపిణీ చేశారు.
రాజశేఖరరెడ్డి హయాంలో బోర్లు ఏర్పాటు..
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005–06లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇందిరా క్రాంతి, ఇందిరా జల ప్రభ ద్వారా 72 బోర్లు వేయించి డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా పంట పొలాలకు పైపులైన్లు ఏర్పాటు చేయించారు. దాంతో మెట్టపై జీడి మామిడి, దుంప, అపరాల పంటలు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. దాంతో ఎకరానికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు ఆదాయం వచ్చే దని రైతులు తెలియజేశారు. విద్యుత్ సదుపాయంతో బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న మెట్టను ఏ విధంగా తవ్వకాలకు అధికారులు అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ అండ దండలతో తప్పుడు రికార్డులతో మాఫియా రంగంలోకి దిగి క్వారీ తవ్వకాలు చేస్తోంది. మెట్టపై భూములు ఉన్న వారిని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని మైనింగ్ తవ్వకాలు ప్రారంభించారనే ఆరోపణలూ జోరుగానే ఉన్నాయి. మెట్టపైన తవ్వకాల ద్వారా వందల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సొంత భూమిలో గ్రావెల్ తవ్వకానికి అనేక మంది అధికారుల అనుమతి ఉండాలి. ఎటువంటి అనుమతి లేకుండా ఏడీబీ రోడ్డును చేర్చిన ఉన్న ప్రభుత్వ కొండను తవ్వకాలు చేస్తూ ఉన్నా అధికారులు మౌనం వహించడంపై అధికార పార్టీ అండ ఉన్నదనే వాదనలకు బలం చేకూరుతుంది. దాదాపు 10 ప్రొక్లెయిన్లతో 24 గంటల పాటు నిరంతరాయంగా తవ్వకాలు జరుగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎకరం భూమిలో సుమారు 10 వేల లారీల వరకు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసింది. లారీ మట్టి ఖరీదు రూ. వెయ్యి చోప్పున చూసినా ఎంత వస్తుందో అర్థమవుతుంది.
అభివృద్ధి పేరుతో అవినీతి మయం..
పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ది చేశామనే ప్రకటనలో అవినీతి భాగం ఎక్కువగా ఉన్నదనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో రూ.1200 కోట్ల వరకు అభివృద్ధి జరిగినట్టు ఉప ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారని, దానిలో 50 శాతం వరకు అవినీతి చోటు చేసుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం సమయంలోనే గోతులతో నిండిపోయింది.
దానిలో 50 శాతం వరకు అవినీతి ఉన్నదనే గతంలోనే తోట సుబ్బారావు నాయుడు ఆరోపించారు. ఈ అవినీతిపై అన్ని పార్టీల నాయకులు ప్రశ్నల వర్షం కురిపించినా మౌనం వహించడం విశేషం. ఇక రూ. కోటితో పెద్దాపురం బస్సు కాంప్లెక్స్ నిర్మాణంలోను భారీ అవినీతి ఉన్నదనే వాదనలు ఉన్నాయి. రేకులతో నిర్మాణం చేసి రూ.50 లక్షల వరకు నిధులు స్వాహా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. సంత మార్కెట్‌ను మార్పు చేసి ప్రారంభంలో మూడు వారాల పాటు టెంట్లు ఏర్పాటు చేసి రూ.లక్షల బిల్లు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పాండవుల మెట్టపై శతాబ్ది పార్కు నిర్మాణంలో మున్సిపాలిటీ జనరల్ నిధులు రూ.రెండు కోట్ల వరకు కేటాయించడం ఎంత వరకు సమంజసమనే వాదనలు ఉన్నాయి. పార్కు పనుల్లో రూ.కోటి వరకు అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.
కార్యకర్తలకు ఒక వరం నీరు–చెట్టు
రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తల కోసం నీరుచెట్టు పథకం ప్రవేశ పెట్టినట్టు ఉంది. ఈ పథకం ప్రకారం చెరువులో మట్టి తీసిన సమయంలో ఆ మట్టిని గట్లు పటిష్టం చేయడానికి, రివిట్ మెంటుకు ఉపయోగించాలి. ఆయా గ్రామాల్లో ఇళ్ల స్థలాలు, శ్మశాన వాటికలు, పాఠశాలలు, ప్రభుత్వ స్థలాలు పల్లంగా ఉంటే వాటిని ఎత్తు చేయడానికి ఉపయోగించాలి. అయితే చెరువుల్లో మట్టిని బయట విక్రయించి కార్యకర్తలు రూ.లక్షలు సంపాదించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి మంత్రి అండ ఉన్నదనే వాదనలు ఉన్నాయి. దీని కారణంగానే అధికారులు గమనించి కూడా మౌనం వహించారనే విమర్శలు ఉన్నాయి. వేట్లపాలెం వెంకటపతిరాజు చెరువు, నీరు చెట్లు పనుల పేరుతో రూ.10 కోట్ల వరకు సంపాదించారనే వాదనలు ఉన్నాయి.
ఆస్పత్రి అభివృద్ధిలోనూ అవినీతే..
సామర్లకోట సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రహారీతో పాటు 10 పడకలు రూ.60 లక్షలతో నిర్మించగా (ప్రహరీకి రూ.50 లక్షలు ఖర్చుగా అంచనా వేశారు) మరో 30 పడకలకు రూ.2.86 కోట్లు కేటాయించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనులకు సంబంధించి అంచనాలు ఎక్కువగా తయారు చేయించి దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందరికీ ఇళ్ల పథకంలో జి ప్లస్ 3 పేరుతో ప్రతి ఫ్లాటుకు రూ. 6.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు కేటాయించి కాంట్రాక్టరుకు లబ్ధిగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి లబ్ధిదారునిపై రూ.మూడు లక్షలు అప్పు చెల్లించాల్సి ఉంది. గతంలో రాజశేఖరరెడ్డి కాలంలో నిర్మించిన ఫ్లాట్లు కేవలం రూ.1.95 లక్షలతో జీ ప్లస్ 2లో అందజేయడం జరిగిందనే వాదనలు ఉన్నాయి.
దీనిలో లబ్ధిదారుడు బ్యాంకు వాటా రూ.20 వేలుగానే ఉండటం గమన్హారం. హౌసింగ్ రుణాల మంజూరుకు పార్టీ నేతలకు చేతులు తడపాల్సి వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. రూ.1.5 లక్షలకు గ్రామాల్లో రూ.రెండు వేల నుంచి రూ.ఐదు వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డు వెంబడి ఉన్న చెట్లను తెలుగుదేశం నాయకులు మాయం చేస్తున్నారు. రోడ్డు వెడల్పు పేరుతో ఆర్‌అండ్‌బీ అధికారులు చెట్లు తొలగించాల్సి ఉంది. అటువంటి సమయంలో చెట్లకు బహిరంగ వేలం నిర్వహించవలసి ఉంది. అయితే అటు వంటి ప్రక్రియ లేకుండానే చెట్లను పార్టీ నేతలు మాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సామర్లకోట–పెద్దాపురం ఏడీబీ రోడ్డు వెంబడి ఉన్న చెట్లను తెలుగు తమ్ముళ్లు మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పెద్దాపురం ఇరిగేషన్ కార్యాలయాన్ని విడిచి పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి. కార్యాలయాలకు చెందిన కలప మాయం వేలం నిర్వహించకుండానే మాయం చేశారనే విమర్శలు ఉన్నాయి.
కోట్లమ్మ.. నీలమ్మ చెరువు అభివృద్ధి పనులు ఎక్కడ?
నాలుగేళ్లుగా కోట్లమ్మ, నీలమ్మ చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటనలు తప్ప ఆచరణ జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నీలమ్మ చెరువు అభివృద్ధికి రూ.కోటి కేటాయిస్తున్నట్లు ప్రకటనలు చేశారు. అయితే నిధులు విడుదల కాక పోవడంతో పనులు ప్రారంభించలేదని అధికారులు తప్పించుకొంటున్నారు. నీరు చెట్టు పనుల పేరుతో చెరువులో పూడిక తీసి గట్లును పటిష్టం చేశారు. అయితే రివిట్‌మెంట్, పార్కు, వాకింగ్ ట్రాక్ పనులు చేయవలసి ఉంది. పార్కులు, రివిటింగ్ పనులకు సాధారణ నిధులు కేటాయించారనే విమర్శలు ఉన్నాయి. ఇక కోట్లమ్మ చెరువు అభివృద్ధి పనులు శిలాఫలకానికే పరిమితం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రేకుల షెల్టర్లకు రూ.ఐదు లక్షలా!
ఐదు నుంచి 10 మంది ప్రయాణికులు వేచి ఉండడానికి రేకులతో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక్కొక్క షేల్టర్‌కు రూ.ఐదు లక్షలు ఖర్చు చేసిన్నట్టు ప్రకటించడంపై ప్రజలు ముక్కున వేలువేసు కొంటున్నారు. రూ.లక్ష కూడా ఖర్చు కాని ఈ షెల్టర్‌కు రూ. ఐదు లక్షలా అనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి షెల్టర్లు పెద్దాపురంలో మూడు నిర్మించి భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ప్రతీ అభివృద్ధి పనిలోను అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.
అనధికార లే అవుట్ల జోరు..
నియోజకవర్గ పరిధిలో ప్రతీ గ్రామంలోను అనధికార లే అవుట్లు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గమనించి ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. లే అవుట్ల సమయంలో సమీపంలో ఉన్న భూములు స్వాహా చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. అనధికార లే అవుట్ల విక్రయాలు చేసిన సమయంలో కొనుగోలు దారులు నష్టపోతున్నారు. వారికి ఇళ్ల నిర్మాణానికి ప్లాన్లు మంజూరు కావడం లేదు. దాంతో అపరాధ రుసం చెల్లించాల్సిన పరిస్థితి కొనుగోలుదారులపై భారంగా ఉంటుంది. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు అభివృద్ధిలో పార్టీ పక్షపాత వైఖరి ఎక్కువగా ఉన్నదనే విమర్శలు ఉన్నాయి. సామర్లకోట మఠంసెంటర్‌లోను, పెద్దాపురం దర్గా సెంటర్‌లోను అధికార పార్టీ నేతలకు చెందిన షాపులు ఉండడం వల్ల వాటికి చెందిన రోడ్డుపై ఉన్న మెట్లు కూడా ముటుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికార పార్టీ అండతో వాట్స్‌ఆప్, ఫేస్‌బుక్‌లలోను హల్‌చల్ చేశాయి.
అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి..
నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు గాలి వదలి వేశారు. కలుషితం అవుతున్న గోదావరి జలాలే ప్రజలకు తాగునీరుగా ఉంది. నియోజకవర్గ పరిధిలో కొండలను పిండి చేసి కోట్లు సంపాదించుకొన్నారు. నియోజకవర్గంలో మొక్కల పేరుతో నిధులు స్వాహా చేశారు. ఎక్కడా మొక్కలు వేయలేదు. నీరు–చెట్టు పేరుతో అధికారుల అండతో అవినీతి జరిగింది. మంత్రి అండతో కార్యకర్తల దోపిడీ పెరిగిపోయింది. ప్రతీ అభివృద్ధి పనిలోను అవినీతి చోటు చేసుకుంది. పనులు నాసి రకంగా జరుగుతున్నాయి. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు వెడల్పు పనులను ప్రజలు గమనిస్తున్నారు. పిఠాపురం రోడ్డులో ఇరుకు వంతెన మంత్రి గారికి కనిపించడం లేదా? గోదావరి కాలువలో కాలుష్య జలాలు కలుస్తున్నా చర్యలు తీసుకొవడం లేదు. రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధికి సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలి.– దవులూరి దొరబాబు, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పెద్దాపురం
నియోజకవర్గం అవినీతిలో నిండిపోయింది..
నియోజకవర్గ పరిధిలో మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని బారీ ఎత్తున అవినీతి మయంగా మారి పోయింది. కొండలను తవ్వి చేసి రూ.కోట్లు స్వాహా చేశారు. కొండలను బంధువులకు అప్ప గించారు. ఏడీబీ రోడ్డు మిగులు భూములు కార్యకర్తలు స్వాహా చేస్తున్నారు. దానికి మంత్రి అండ ఉంది. టీడీపీ నాయకులు బినామీ కాంట్రాక్టర్ల పేరుతో సింగిల్ టెండర్లతో పనులు చేస్తున్నారు. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు విస్తరణలో పక్షపాత వైఖరి అవలంబించారు. పేదలకు అన్యాయం చేశారు. రోడ్డు పనుల్లో నాణ్యత లోపం ఉంది. జన్మభూమి కమిటీలు కార్పొరేషన్ రుణాల్లో అవకతవకలు జరిగాయి. సామర్లకోట టౌన్ ప్లానింగ్ పూర్తిగా విఫలమైంది. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. రూ.60వేలతో నిర్మించే బస్ షెల్టర్‌కు రూ.ఐదు లక్షల ఖర్చు చూపడం అవినీతి కాదా. – నేతల హరిబాబు, వైఎస్సార్ సీపీ సీనియర్
నాయకుడు, సామర్లకోట
Comments
Please login to add a commentAdd a comment