సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం..’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఈ పంక్తుల్ని కొంచెం సవరించి..‘తెలుగుదేశం ఏలుబడిలో ఏమున్నది పురోగమనం.. ఏ రంగం చూసినా ప్రజలపై భారాల వడ్డనం..’ అంటే చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వ పాలనకు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. ‘అర చేతిలో వైకుంఠం’ మాదిరిగా ఆరువందలకు పైగా హామీలతో ఊరించి, అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఎప్పటిలాగే జనకంటక స్వభావాన్ని బయట పెట్టుకున్నారు. ప్రజలపై నిర్దాక్షిణ్యంగా భారాలు మోపారు. ఆయన గద్దెనెక్కాక నిత్యావసర వస్తువుల ధరల నుంచి ఇంటి పన్నుల వరకూ రెట్లురెట్లుగా పెరిగిపోయాయి. జనజీవితాన్ని భారంగా మార్చాయి.
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా 2013 ఏప్రిల్ 2న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు టీడీపీ నేతలతో కలసి కాకినాడ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఒక్క రోజు నిరాహారదీక్ష చేశారు. ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో భాగంగా కరెంటు ఛార్జీలు, కోతలకు నిరసనగా కాకినాడలో లాంతరు పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేటు కంపెనీల నుంచి ఎంత ముడుపులు తీసుకుని చార్జీలు పెంచారని ఆరోపించారు.
ముఖ్యమంత్రయ్యాక మూడుసార్లు పెంపు
విద్యుత్ చార్జీలపై ప్రతిపక్ష నేతగా నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. 2015, 2017, 2018 సంవత్సరాల్లో పెంచిన చార్జీలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలపై భారం పడింది. ఏరుదాటాక తెప్ప తగలేసినట్టు అధికారంలోకి వచ్చాక గతాన్ని మరిచిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లింది. అధికారం కోసం ఏ గడ్డైనా తింటారు, ప్రజలను ఎంతకైనా మోసగిస్తారు. పదవి చేపట్టాక గత ఉద్యమాలను, హామీలను మరిచిపోయి గజినీలా వ్యవహరిస్తారు.
ప్రతి ఏడాదీ బాదుడే...
2014కి ముందు 500 వందల యూనిట్ల వరకు ఒకే శ్లాబు ఉండేది. ప్రతి 50 యూనిట్లకు ఒక్కో రేటుతో చార్జీలు వేసేవారు. 50 యూనిట్ల లోపు వినియోగించుకుంటే యూనిట్‌కు రూ.1.45 చొప్పున చెల్లించేవారు. కానీ, 2015లో 200 యూనిట్లు, 500 యూనిట్ల వద్ద రెండు శ్లాబులు పెట్టారు. 50 యూనిట్లు వాడినా యూనిట్ ధర రూ.2.60 పడేలా ఏడాది మొత్తంలో ఉపయోగించిన సరాసరి విద్యుత్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. 2014కు ముందు 200 నుంచి 250 మధ్య యూనిట్‌కు రూ.6.38 లెక్కన చార్జీలు విధించేవారు.
తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన శ్లాబు విధానంతో 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ విద్యుత్ వినియోగించినా యూనిట్ ధర రూ.6.90కి పెంచారు. 500 యూనిట్ల వినియోగం దాటిన వారి నుంచి 2014కు ముందు యూనిట్ రూ. 8.38 లెక్కన చార్జీలు వేశారు. 2015లో యూనిట్ ధర రూ. 8.80కు, 2017లో యూనిట్ ధర రూ.9.06కు పెంచారు. శ్లాబులు, ఏడాది మొత్తంలో వినియోగించిన సరాసరి యూనిట్లను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ చార్జీలు విధిస్తుండడంతో జిల్లాలోని 14,63,205 మంది గృహ వినియోగదారులపై ప్రభావం పడింది.
జిల్లాలో కేటగిరీల వారీ విద్యుత్ కనెక్షన్లు గృహ వినియోగం - 14,63,205
వాణిజ్య వినియోగం - 1,55,658
పారిశ్రామిక రంగం - 12,638
వ్యవసాయరంగం - 47,504
చార్జీలు పెంచడం చంద్రబాబుకు అలవాటే..
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 9 ఏళ్లు పాలించిన సమయంలోనూ విద్యుత్ చార్జీల పెంపుతో సామాన్యులు, రైతుల నడ్డివిరిచారు. 2014కు ముందు వ్యాపార వినియోగానికి(దుకాణాలు) వాడిన విద్యుత్‌పై 50 యూనిట్లలోపు యూనిట్ ధర రూ.6.63, 500 యూనిట్లు దాటితే యూనిట్ రూ. 9.13 చొప్పున చార్జీలు విధించేవారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక 2015లో 50 యూనిట్లలోపు యూనిట్ ధర రూ.6.63, 500 యూనిట్లు దాటితే యూనిట్ ధర రూ.9.59కు పెంచారు. 2016లో యూనిట్ ధరను రూ.9.78కి, 2017లో ఏకంగా రూ.10.19కు పెంచేసింది. జిల్లాలోని 1,55,658 లక్షల మంది వ్యాపారులపై పెంపుప్రభావం పడింది.
మూలిగే నక్కపై తాటిపండులా..
చాలీచాలని ఆదాయ వనరులతో నెట్టుకొచ్చే స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీలను వడ్డించింది. 2014కు ముందు పంచాయతీలకు యూనిట్ ధర రూ.4.37 ఉండగా 2017 నాటికి మూడు సార్లు పెరిగి రూ.5.98, మున్సిపాలిటీలకు 2014కు ముందు యూనిట్ రూ. 5.37 ఉండగా 2017 నాటికి రూ.6.53 అయ్యాయి. నగరపాలక సంస్థల కు విద్యుత్ ధర రూ.5.87 నుంచి రూ.7.09కు పెంచారు. పెరిగిన చార్జీ లతో జిల్లాలోని 1,069 పంచాయతీలు, 3 నగరపంచాయతీలు, 7 ము న్సిపాలిటీలు, 2 నగరపాలక సంస్థలపై భారం పడింది.
గృహ వినియోగం కేటగిరీలో యూనిట్ చార్జీల వివరాలు
2013 - 14 సంవత్సరంలో 50 యూనిట్ల లోపు వినియోగించే వారికి యూనిట్ ఒక్కింటికి రూ. 1.45 వసూలు చేసేవారు.
చంద్రబాబు వచ్చాక 2015 - 16లో అమలు చేసిన యూనిట్ ధర వివరాలు
యూనిట్ | ధర |
0–50 | రూ. 1.45 |
50 –100 | రూ. 2.60 |
100– 200 | రూ. 3.60 |
200–500 | రూ. 8.80 |
2016 - 17 సంవత్సరంలో ఏడాదికి 900 లోపు వినియోగించే వారికి..
యూనిట్ | ధర |
0–50 | రూ.1.45 |
51–100 | రూ. 2.60 |
101–200 | రూ. 3.60 |
200 యూనిట్లపైబడి | రూ. 6.90 |
ఏడాదికి 900 నుంచి 2700 యూనిట్లు పైబడి వినియోగించే వారికి..
యూనిట్ | ధర |
0–50 | రూ. 2.60 |
51–100 | రూ.2.60 |
101–200 | రూ. 3.60 |
200–300 | రూ. 6.90 |
300 యూనిట్లకు పైబడి | రూ. 7.75 |
ఏడాదికి 2700 యూనిట్లు పైబడి వినియోగించే వారికి..
యూనిట్ | ధర |
0–50 | రూ. 2.68 |
51–100 | రూ. 3.35 |
101–200 | రూ. 5.42 |
200–300 | రూ. 7.11 |
300– 400 | రూ. 7.75 |
400–500 | రూ. 7.98 |
500 యూనిట్లు పైబడి | రూ. 9.06 |
విద్యుత్ చార్జీల పెంపు హెచ్‌టీ జనరల్ కేటగిరీ (పరిశ్రమలు) (యూనిట్ల వారీగా) వీటికి ఫిక్స్‌డ్ చార్జీలు అదనం
కేటగిరీ | 2014–15 | 2015–16 | 2016–17 | 2017–18 |
11కేవీ | రూ. 5.73 | రూ. 6.02 | రూ. 6.14 | రూ. 6.33 |
33కేవీ | రూ. 5.33 | రూ.5.57 | రూ. 5.68 | రూ. 5.87 |
132కేవీ | రూ. 4.90 | రూ. 5.15 | రూ. 5.20 | రూ. 5.44 |
హెచ్‌టీ కమర్షియల్ కేటగిరీ యూనిట్ల వారీగా చార్జీల పెంపు వివరాలు ఇలా..
కేటగిరీ | 2014–15 | 2015–16 | 2016–17 | 2017–18 |
11కేవీ | రూ.6.90 | రూ.7.25 | రూ.7.40 | రూ7.66 |
33కేవీ | రూ.6.28 | రూ.6.59 | రూ.6.72 | రూ.6.98 |
132కేవీ | రూ.6.03 | రూ.6.33 | రూ.6.46 | రూ.6.72 |
పెనాల్టీ భారీగా పెంచేశారు
విద్యుత్ బిల్లుల్ని సకాలంలో చెల్లించకపోతే గతంలో రూ.25 పెనాల్టీ విధించేవారు. ఇప్పుడు ఏకంగా రూ.75 నుంచి రూ.100 వరకు పెంచేశారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది భారం. గతంతో పోలిస్తే ఏటా విద్యుత్ బిల్లులు క్రమంగా పెరుగుతున్నాయి.
– ఎం.దుర్గారావు, రాజమహేంద్రవరం
ఏటా పెరుగుతున్న భారం
కేటగిరీ–2 లోని కమర్షియల్ (షాపుల) విద్యుత్ చార్జీల పెంపు గత నాలుగేళ్లుగా క్రమక్రమంగా పెంచుకుంటూ పోవడంతో విద్యుత్ బిల్లుల భారం అధికమవుతోంది. ఏటా యూజర్ చార్జీలు, సర్ చార్జీల పేరుతో విద్యుత్ బిల్లులు పెంచేస్తున్నారు.
– పి.దుర్గాప్రసాద్, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment