అప్పుడు అన్నపై.. ఇప్పుడు తమ్ముడిపై | Highly Betting In Bhimavaram On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

అప్పుడు అన్నపై.. ఇప్పుడు తమ్ముడిపై

Published Sun, May 26 2019 9:50 AM | Last Updated on Sun, May 26 2019 9:50 AM

Highly Betting In Bhimavaram On Pawan Kalyan - Sakshi

భీమవరం(ప్రకాశం చౌక్‌): 2009లో మెగాస్టార్‌ చిరంజీవిపై, ఇప్పుడు పవన్‌కల్యాణ్‌పై పందేలు కాసి జిల్లాలోని యువత రూ.కోట్లలో నష్టపోయారు. అప్పట్లో చిరంజీవి పాలకొల్లు నుంచి గెలుస్తారని, రాష్ట్ర సీఎం అవుతారంటూ అభిమానులు.. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన యువత భారీగా పందేలు కాశారు. అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవి పాలకొల్లు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బంగారు ఉషారాణి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అలాగే ఆ పార్టీ కేవలం 18 సీట్లను మాత్రమే గెలుచుకుంది. దీంతో పందేలు కాసినవారంతా పెద్ద ఎత్తున నష్టపోయారు. చిరంజీవి సభలకు లక్షల్లో జనం రావడం చూసి ఆయన ముఖ్యమంత్రి అవుతాడని అభిమానులు, ఓ సామాజిక వర్గం చాలా ఆశలు పెట్టుకుంది. దీంతో చాలామంది వ్యాపారులు, సంపన్నులే కాకుండా మధ్యతరగతికి చెందిన అనేకమంది అప్పులు చేసి మరీ పందేలు కాశారు. కొంతమంది ఆస్తులు తాకట్టుపెట్టి చిరంజీవిపై లక్షల్లో పందేలు కట్టారు. ఆ అప్పులు తీర్చడానికి వారికి సంవత్సరాలు పట్టింది. అనంతరం ఆ పందేల్లో డబ్బులు పోగొట్టుకున్నామనే బాధ కంటే.. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. 

పదేళ్ల అనంతరం తమ్ముడు
మళ్లీ పదేళ్ల అనంతరం చిరంజీవి తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ భీమవరం నుంచి గెలుస్తారని పెద్ద ఎత్తున పందేలు కాశారు. పవన్‌ కల్యాణ్‌ సభలకు జనం భారీగా రావడంతో భీమవరంలో ఆయన ఎలాగైనా గెలుస్తారని అభిమానులు, ఆయన సామాజికవర్గానికి చెందిన యువ ఓటర్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. పవన్‌ ముఖ్యమంత్రి అవుతారన్న ఆశ లేకపోయినా.. కనీసం భీమవరంలో కొద్ది తేడాతో గెలుస్తారని చివరివరకూ ధీమాగా ఉన్నారు. పవన్‌ పోటీ చేసిన భీమవరం, గాజువాకలో విజయం సాధిస్తారని, పార్టీకి 30 సీట్లు వస్తాయని జనసైనికులు లెక్కలేసుకుని లక్షల రూపాయలు పందేలు కట్టారు. ఈసారి ఆ సామాజివర్గంలోని పెద్దలు పందేల జోలికి వెళ్లలేదు. కానీ యువత మాత్రం పెద్ద ఎత్తున బరిలోకి దిగింది. భీమవరం, గాజువాకలో గెలుస్తారంటూ సీట్లు, ఓట్ల శాతంపై గుడ్డిగా డబ్బులు పెట్టేశారు. నర్సాపురం ఎంపీగా నాగబాబు గెలుస్తాడని కూడా పలువురు పందేలు కట్టారు. పవన్‌ కల్యాణ్‌ రెండు చోట్ల ఓడిపోవడం, ఆ పార్టీ ఒకే ఒక్క సీటు గెలుచుకోవడంతో మొత్తంగా రూ. కోట్లలో పందేలు ఓడిపోయారు. 

భీమవరంలో రూ.కోటికిపైగా పందేలు
భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ గెలుస్తాడని ఆ ప్రాంతంలో సుమారు రూ.కోటికిపైగానే పందేలు జరిగాయి. ఎన్నికల అనంతరం వారం రోజుల పాటు పవన్‌కల్యాణ్‌ గెలుస్తాడని జోరుగా ప్రచారం జరగడంతో ఇతర పార్టీలకు చెందిన వారు తమ పార్టీ అభ్యర్థులపై పందేలు కట్టేందుకు భయపడ్డారు. లక్షకు లక్షన్నర ఇస్తామని జనసేన పార్టీకి చెందిన కొందరు హషారుపడ్డారు. ఆ తర్వాత సర్వే సంస్థలు, పలువురు నేతల చేసిన సర్వేల్లో భీమవరం గ్రంధి కచ్చితంగా గెలుస్తారని తెలియడంతో మిగిలిన రెండు పార్టీలకు చెందిన వారు పవన్‌ అభిమానులతో పందేలు వేశారు. ఇప్పుడు గ్రంధి గెలుపుతో ఆయన గెలుస్తారని పందేలు వేసిన వారు సంబరాల్లో ఉంటే.. పవన్‌పై వేసిన వారు మాత్రం పూర్తి నిరాశలో మునిగిపోయారు. అప్పుడు అన్నపై.. ఇప్పుడు తమ్ముడిపై పందేలు కట్టి పలువురు అభిమానులు పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement