జనానికి దూరంగా... జనసేన | Janasena Only One Assembly Seat Win In AP | Sakshi
Sakshi News home page

జనానికి దూరంగా... జనసేన

Published Tue, May 28 2019 8:00 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

Janasena Only One Assembly Seat Win In AP - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోగా, 2019 ఎన్నికల్లో ఆ రాజన్న కొడుకు జగన్‌మోహన్‌ రెడ్డి ఫ్యాన్‌ గాలికి పవన్‌ కల్యాణ్‌ కొట్టుకుపోయారు. ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్‌ నాయకులను పంచెలు ఊడదీసి కొడతామని యువరాజ్యం అధ్యక్షుడి హోదాలో పవన్‌ కల్యాణ్‌ తనదైన శైలిలో రెచ్చిపోయారు. తాజా ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడి హోదాలో ‘తాట తీస్తాను. తోలు తీస్తాను. తరిమికొడతాను. బట్టలూడదీసి కొడతా’నంటూ పిచ్చి ప్రేలాపనలకు దిగారు. అయితే నోటికొచ్చినట్టు మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌కు జనం మామూలు షాకివ్వలేదు. 2009లో ఎలాగైతే బుద్ధి చెప్పారో 2019లో అంతకుమించి ఎదురుతిరిగారు. నాడు ఓట్లు, సీట్లు గౌరవ ప్రదంగానైనా వచ్చాయి. కానీ ఈసారి చాలాచోట్ల డిపాజిట్లు దక్కక, మరికొన్నిచోట్ల నామమాత్రపు పోటీతో సరిపుచ్చుకున్నారు.

జిల్లాలో దుస్థితి
రాజకీయాలను సమూలం గా మార్చివేస్తానని, అన్న చిరంజీవి తరహా రాజకీయాలు చేయనని, జనసేన పార్టీతో ప్రభంజనమే సృష్టిస్తానని ఎన్నికల్లో తెరమీదకు వచ్చారు. పవన్‌ కల్యాన్‌ కానీ ఓట్ల విషయంలో బొక్కబోర్లా పడ్డారు. ప్రజారాజ్యం పార్టీ గెలిచిన స్థానాల్లో కూడా జనసేన పట్టు సాధించలేకపోయింది. నాడు చిరంజీవి నేతృత్వంలోని పీఆర్‌పీ జిల్లాలో నాలుగు సీట్లు కైవసం చేసుకోగా నేడు పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన కేవలం ఒక స్థానంతో సరిపెట్టుకుంది. అది కూడా పవన్‌ కల్యాణ్‌ గొప్పతనమేమీ లేదు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ వ్యక్తిగత పలుకుబడే ఆయన్ని గెలిపించినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ జిల్లాలో గట్టి పోటీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పోలైన 26,60,568 ఓట్లలో 8,05,836 ఓట్లు  సాధించింది. దాదాపు 30.4 శాతం ఓటు షేర్‌ పొందడమే కాకుండా పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కొత్తపేట నియోజకవర్గాల్లో గెలుపొందింది. అదే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ 8,97,019 ఓట్లు సాధించి  33.8 శాతం ఓటు షేర్‌తో 11 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. ఇక, టీడీపీ 7,29,610 ఓట్లు సాధించి 27.5 శాతం ఓటు షేర్‌తో 4 స్థానాలను దక్కించుకుని మూడోస్థానంలో నిలిచింది. అంటే 2009 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా జిల్లాలో మాత్రం ఓట్ల షేర్‌లో రెండో స్థానంలో నిలిచింది. దీనిప్రకారం ప్రజారాజ్యం పార్టీ జిల్లాలో ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

అసభ్య పదజాలంతో తిడితే ఓట్లు పడతాయే...
నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు సహించరని ఈ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌కు చేతల్లో జిల్లా ఓటర్లు చూపించారు. ఈ ఎన్నికల్లో కేవలం 5,19,264 ఓట్లు సాధించి, 15.37 శాతం ఓటు షేర్‌తో ఒక స్థానంతో సరిపెట్టుకుని మూడో స్థానంలో నిలిచారు. టీడీపీతో కుమ్మక్కు రాజకీయాలు నడిపి, ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీల్చి తన పార్టనర్‌ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చుదామని పవన్‌ చేసిన యత్నాలన్నీ బెడిసికొట్టేశాయి. బలహీనమైన అభ్యర్థులను పెట్టి పరోక్షంగా టీడీపీకి మేలు చేద్దామని భావించినా ప్రజలు తిప్పికొట్టారు. కుమ్మక్కు రాజకీయాలు చేసిన నేతలను ప్రోత్సహించకూడదని గంపగుత్తగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారు. పోలైన 33,76,670 ఓట్లలో వైఎస్సార్‌సీపీకి 14,68,056 ఓట్లు వచ్చాయి. 43.47 శాతం ఓటు షేర్‌తో అగ్రస్థానంలో నిలిచి 14 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక జనసేన కుమ్మక్కుతో నడిచిన ఎన్నికల్లో టీడీపీ 12,40,867 ఓట్లు సాధించి 36.74 శాతం ఓటు షేర్‌తో కేవలం నాలుగు స్థానాలతో సరిపుచ్చుకుంది. విశేషమేమిటంటే నాడు ప్రజారాజ్యం గెలిచిన అసెంబ్లీ స్థానాల్లో జనసేన కనీస పట్టు నిలుపుకోలేకపోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement