
సాక్షి, నంద్యాల : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే సభా ప్రాంగణం వద్ద మైక్ సౌండ్ సెట్ తల మీద పడటంతో సిరాజ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే సిరాజ్ ప్రాణాలు వదిలాడు. దీంతో సభా ప్రాంగణం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. సభను కొనసాగించేందుకు జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా మృతి చెందిన సిరాజ్ నడిగడ్డ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌గా తెలిసింది. అతడికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే కుమార్తె అంగవైకల్యంతో బాధపడుతోంది. సిరాజ్ మరణ వార్త తెలిసి కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.