అవినీతిలో ప్రథమ పౌరులు | TDP MLA And Leaders Corruption In Vizianagaram | Sakshi
Sakshi News home page

అవినీతిలో ప్రథమ పౌరులు

Published Sat, Feb 16 2019 12:51 PM | Last Updated on Sat, Feb 16 2019 12:51 PM

TDP MLA And Leaders Corruption In Vizianagaram - Sakshi

ప్రజాప్రతినిధులంటే.. పదిమందికీ ఆదర్శంగా నిలవాలి. ప్రజలు.. ప్రభుత్వానికి వారధిగా నిలవాలి. ప్రజా సంక్షేమానికి అహరహం శ్రమించాలి.. ఆ ముగ్గురు ప్రజా ప్రతినిధులు కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తుంటారు.. కమీషన్లు దండుకోవడం.. పోస్టుల్ని అమ్మేసుకోవడం.. గెడ్డల్ని కబ్జా చేయడం.. కాంట్రాక్టులు దక్కించుకోవడం.. ఇనాం భూముల్ని కారు చవగ్గా కొట్టేయడంలో వీరు నిత్యం తలమునకలై ఉంటారు. వారే పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు.. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌.. ఆయన సతీమణి, పార్వతీపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ద్వారపుడ్డి శ్రీదేవి. దండుకోవడంలో ఈ త్రయానికున్న పేరు పార్వతీపురంలో మారు మోగిపోతోంది. పనికి ఇంత ధర నిర్ణయించేశారు. పైసలిస్తే తప్ప ఏ పనీ చేయరు.

పార్వతీపురాన్ని దోచుకు తింటున్నారు. పట్టం గట్టిన ప్రజల్ని ఉసూరుమనిపిస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ.. ఇంకొకరు పట్టణ ప్రథమ పౌరురాలు. కమీషన్లు దండుకోవడం.. ఉద్యోగాలు అమ్ముకోవడం.. కాంట్రాక్టులు ఇప్పించడంలో ఈ ముగ్గురూ ఘనాపాటీలు. వాళ్లే పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు..ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌.. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీదేవి. ఏ పని కావాలన్నా గ్రామీణ ప్రాంతంలో అయితే ఎమ్మెల్యే.. పట్టణ ప్రాంతంలో అయితే ఎమ్మెల్సీకి అడిగినంత చదివించుకోవలసిందే. ఇక ఎమ్మెల్సీ సతీమణి, పార్వతీపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీదేవి భర్త స్ఫూర్తితో అయినకాడికి దోచుకోవడంలో పోటీ పడుతున్నారు. అడ్డూ అదుపూ లేని ఈ ముగ్గురి అక్రమార్జనపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌.      

సాక్షి ప్రతినిధి, విజయనగరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రేట్లివి పార్వతీపురం పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ ద్వారపురెడ్డి శ్రీదేవి భర్త ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ కావడం ఆమెకు ఎదురు లేకపోయింది. భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని పురపాలక సంఘంలో చక్రం తిప్పుతున్నారు. ఏ పని చేయాలన్నా చేయి తడపాల్సిందే. ఇళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, లే ఔట్ల రెగ్యులరైజేషన్, కొత్త లే అవుట్లకు అనుమతులు ఇచ్చేందుకు రూ.లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నారు. పురపాలక సంఘంలో కంప్యూటర్‌ ఆపరేటర్లు, మెప్మా కార్యాలయంలో ఆర్‌పీలు, పారిశుద్ధ్య కార్మికుల నియామకంలో దండిగా డబ్బులు వసూలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులను కొత్తగా 36 మందిని నియమించాలని పాలకవర్గం తీర్మానిస్తే.. చైర్‌పర్సన్‌ ఏకంగా 42 మందిని నియమించి ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల చొప్పున వసూలు చేశారనేది బహిరంగ రహస్యం.

కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్సీ తమ్ముడికే..
పార్వతీపురం పురపాలక సంఘంలో ప్రతి సివిల్‌ కాంట్రాక్టును ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ తన సోదరుడు ద్వారపురెడ్డి వెంకట తిరుపతిరావుకు అప్పగిస్తున్నారు. భార్య ద్వారపురెడ్డి శ్రీదేవి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కావడంతో ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకొని పురపాలక సంఘంలో రూ.కోట్ల విలువైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్‌ నిర్మాణాలను తిరుపతిరావుకు కట్టబెడుతున్నారు. సింగిల్‌ టెండర్లు వస్తే వాటిని తిరస్కరించి మళ్లీ టెండర్లు పిలవాలన్న నిబంధనలున్నాయి. కానీ చైర్‌పర్సన్‌ అధికారాన్ని ఉపయోగించుకొని తమ్ముడికి సింగిల్‌ టెండర్లను కూడా ఆమోదింపజేసి కాంట్రాక్టులు కట్టబెట్టి కమీషన్లు దండుకుంటున్నారు.

డివైడర్‌ పనుల పేరిట దోపిడీ
పార్వతీపురం పట్టణ ప్రధాన రహదారిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్‌ డివైడర్‌ నిర్మాణ పనులు చేపట్టారు. అంతర్‌రాష్ట్ర ప్రధాన రహదారిపై పనులు చేపట్టాలంటే ఆర్‌అండ్‌బి శాఖ చేపట్టాలి. కానీ అందుకు విరుద్ధంగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ తమ్ముడు కాంట్రాక్టర్‌ ద్వారపురెడ్డి తిరుపతిరావుకు ఆ నిర్మాణ పనులను అప్పగించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందనుకుంటే పర్వాలేదు.. కానీ అవసరం లేని చోట పార్వతీపురం పురపాలక సంఘం రూ.1.39 కోట్ల ప్రజాధనం వెచ్చించి డివైడర్లు నిర్మించింది.. అన్ని పనులకు కలిపి ఒకేసారి టెండర్లు పిలిచినçప్పటికీ, డివైడర్లకు సున్నాలు, రంగులు వేయడానికి రూ.22 లక్షలు అదనంగా నిధులు మంజూరు చేసి పాలకవర్గంతో ఆమోదించారు. కొన్ని చోట్ల పాత డివైడర్లపై రంధ్రాలు వేసి ఇనుప కంచెతో గోడ నిర్మించినందుకు అదనంగా నిధులు మంజూరు చేసి తినేశారు.

కమీషన్ల కోసం సుందరీకరణ పనులు

పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని బైపాస్‌ రోడ్డుకు ఇరువైపులా సుందరీకరణ పేరుతో రూ.16 లక్షలు వెచ్చించి మొక్కలు నాటారు. వాస్తవానికి దీనివల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ప్రైవేటు వ్యక్తుల స్థలాల ముందు అడ్డంగా కంచెను నిర్మించి అందులో పేపర్‌ గులాబీ మొక్కలను వేశారు. ఎమ్మెల్సీ తమ్ముడు కాంట్రాక్టర్‌ ద్వారపురెడ్డి వెంకట తిరుపతిరావుకు లబ్ధి చేకూర్చేందుకే అవసరం లేకపోయినా సుందరీకరణ పేరుతో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో వీటిని నిర్మించి ప్రజాధనాన్ని వృథా చేశారు. 

మరమ్మతుల పేరిట మేత

పార్వతీపురం 14వ వార్డులోని షటిల్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియం ఇదివరకు ఐటీడీఏ పీఓ చైర్మన్‌గా  ఆఫీసర్స్‌ స్టేడియంగా ఉండేది. అందులో ప్రభుత్వోద్యోగులు, క్ల»బ్‌ సభ్యులుగా ఉన్నవారు మాత్రమే ఆటలు  ఆడేవారు. కానీ సొంత ప్రయోజనాల కోసం మున్సిపాల్టీతో దత్తత తీసుకొని మరమ్మతుల పేరుతో రూ.30 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి దాని నిర్మాణ బాధ్యతలను కూడా ఎమ్మెల్సీ సోదరుడు కాంట్రాక్టర్‌ ద్వారపురెడ్డి తిరుపతిరావుకు అప్పగించారు. అక్కడితో ఆగకుండా మరమ్మతుల పేరుతో రూ.5 లక్షలు మంజూరు చేసేందుకు పాలకవర్గ సమావేశంలో అజెండాలో పొందుపరిచారు. దీనిని అధికార, విపక్ష కౌన్సిల్‌ సభ్యులతోపాటు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బెలగాం జయప్రకాష్‌నారాయణ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మున్సిపాలిటీకి ఆదాయం రాని స్టేడియంకు ఎందుకు ప్రజాధనాన్ని ఖర్చు చేయాలని నిలదీశారు. అయినా తమ్ముడికి భారీగా కమీషన్లు రావడం కోసం పాలకవర్గంతో ఒప్పించి తీర్మానం చేయించిన ఘనత ఎమ్మెల్సీదే. 

కారు చవగ్గా ఇనాం భూములు

గరుగుబిల్లి మండలం పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని 56.34 ఎకరాల ఇనాం భూములను ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికవక ముందు వరకు ఆయన పేరుమీద ఈ భూముల్లేవు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టాక మాత్రమే ఈ భూములు ఆయన కొనుగోలు చేసినట్టు ఆధారాలు ధ్రువీకరిస్తున్నాయి. పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్‌ 178లో 56.34 ఎకరాలను వల్లభ జోష్యుల సూర్యనారాయణ నుంచి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఆయన సోదరుడు ద్వారపురెడ్డి ధనుంజయనాయుడు పేరుమీద కొనుగోలు చేసినట్టు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదై ఉంది.

విశేషమేమిటంటే ద్వారపురెడ్డి జగదీష్‌ రూ.2,02,83,000కు ఈ భూములను కొనుగోలు చేసినట్టు దస్తావేజుల్లో చూపిస్తోంది. ఈ ఖర్చును ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్‌లో చూపించకపోవడం గమనార్హం. భూ క్రయ విక్రయాలు జరిగే సమయంలో ఒక వ్యక్తి భూమి అమ్మితే మరో వ్యక్తి ఆ భూమిని కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో రిజిస్ట్రేషన్‌ ఖర్చులను కొనుగోలుదారు భరించాలి. కానీ భూ విక్రయదారే రిజిస్టేషన్‌ ఖర్చులను భరించుకున్నట్టు దస్తావేజు స్పష్టం చేస్తోంది. పోలినాయుడు వలస గ్రామ రెవెన్యూ పరిధిలో పల్లపు భూమి ఎకరా రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర పలుకుతుండగా.. ఎమ్మెల్సీ కేవలం రూ.3 లక్షల చొప్పున 56.34 ఎకరాలను కారు చౌకగా దక్కించుకున్నారు. 

బినామీకి 40 ఎకరాల డీ పట్టా భూములు 

పార్వతీపురం మండలం వెంకంపేట పంచాయతీ పరిధిలోని వెంకంపేట చెరువు దిగువ భాగంలో డీ పట్టా భూములను కూడా తన బినామీ పేరుమీద సుమారు 40 ఎకరాల వరకు కొనుగోలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ కొనుగోలు చేసిన భూములు నేటికి అనేక మంది రైతుల ఆధీనంలో సాగులో ఉన్నాయి. ద్వారపురెడ్డి జగదీష్‌ కొనుగోలు చేసిన విషయం నేటికి సాగు చేస్తున్న రైతులకు తెలియక పోవడం గమనార్హం. ఈ విషయం తెలిసిన రైతులు ఇటీవల కలెక్టర్‌ వద్దకు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు.

వరహాల గెడ్డ కబ్జా
పార్వతీపురం పట్టణ నడిబొడ్డుగుండా ప్రవహిస్తున్న వరహాలగెడ్డను ఆక్రమించి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ ఇల్లు నిర్మించుకుంటున్నారు. సహజంగా వరహాలగెడ్డ వెడల్పు 12 మీటర్లు ఉండాలి. కానీ ఎమ్మెల్సీ ఇంటి వద్దకు వచ్చేసరికి గెడ్డను కుదించి ప్రహరీ నిర్మించి లోపలి భాగంలో ఇల్లు నిర్మిస్తున్నారు. ఎమ్మెల్సీ సోదరుడు డాక్టర్‌ రామ్మోహనరావు ఆస్పత్రి వెనుకభాగంలో వరహాలగెడ్డను కప్పి అందులో అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు వేసి పెంచుతున్నారు. దీనిపై గతంలో పత్రికల్లో కథనం రాగా పరిశీలనకు వెళ్లాలని కలెక్టర్‌ స్థానిక ఆర్డీఓను ఆదేశించారు. వివరణ కోరేందుకు వెళ్లిన అధికారులకు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారు వెనుదిరిగారు. 

మా పొట్ట కొడుతున్నారు
ఎన్నో దశాబ్ధాలుగా సాగు చేస్తున్న మా భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయి. మా సాగులో ఉన్న ఇనాం భూమిని సరిచేసి హక్కు కల్పించాలని నా లాంటి ఎంతో మంది రైతులం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా స్పందించలేదు. మాకు తెలియకుండానే మా సాగులో ఉన్న భూములు వేరొకరు రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేశారు. ఈ విషయం కొద్ది రోజుల ముందే ఆనోటా, ఈనోటా తెలిసింది. దీంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. – బడే శంకరరావు, రైతు, పెద్దూరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement