తమిళనాడు ఎన్నికల్లో ‘రంగం’ సినిమా రిపీట్‌ | Former IAS Officer Sagayam Supporters Contesting In Tamil Nadu Elections | Sakshi
Sakshi News home page

తమిళనాడు ఎన్నికల్లో ‘రంగం’ సినిమా రిపీట్‌

Published Mon, Mar 15 2021 3:25 PM | Last Updated on Mon, Mar 15 2021 6:55 PM

Former IAS Officer Sagayam Supporters Contesting In Tamil Nadu Elections - Sakshi

‘రంగం’ సినిమాలో మాదిరి కొందరు యువకులు కలిసి ఏర్పాటుచేసిన పార్టీ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందో అదే విధంగా తమిళనాడులో ప్రస్తుతం అదే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు ఎన్నికల్లో 36 మంది యువకులు తలపండిన రాజకీయ నాయకులను ఢీకొననున్నారు. ఆ యువశక్తి వెంట ఓ శక్తి ఉంది. ఆయనే యు.సగాయం. ఆయన మాజీ ఐఏఎస్‌ అధికారి. ఆయన ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులు, ఎంబీఏ గ్రాడ్యుయేట్లను ఎన్నికల రాజకీయాల్లోకి దింపనున్నారు. 

అవినీతికి వ్యతిరేకంగా సగాయం పోరాటం చేస్తున్నాడు. అందులో భాగంగా ఆయన తమిళనాడు ఇలయంగ్‌ కట్చీ (టీఎన్‌ఐకే) అనే ఒక పార్టీ స్థాపించాడు. అందులో అంతా యువకులే పని చేస్తున్నారు. దశాబ్ద కాలం పాటు అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ ఎన్నికలను వాడుకోనున్నారు. ఈ క్రమంలోనే మొత్తం 20 స్థానాల్లో తమ పార్టీ తరఫున యువకులు పోటీ చేస్తున్నట్లు ఆ మాజీ ఐఏఎస్‌ అధికారి సగాయం ప్రకటించారు. ఈ మేరకు వారిలో కొంత మంది సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. 15 మంది అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.

కొలాత్‌పూర్‌, రోయాపూర్‌, అన్నానగర్‌, అవడీ, అలాందుర్‌, మధురవోయల్‌, చెంగల్‌పట్టు తదితర ప్రాంతాల్లో ఆయన శిష్యులు పోటీ చేస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే శక్తి తమకు లేదని.. అందుకే విద్యావంతులు అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నట్లు సగాయం మీడియాకు చెప్పారు. ఇది మొదటి అడుగు.. అని ప్రజల్లోకి ఉద్యమం తీసుకెళ్లేందుకు ఎన్నికలు దోహదం చేస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో మొత్తం రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో తాము పోటీ చేసేందుకు సిద్ధమని సగాయం ప్రకటించారు. అయితే ముఖ్యమంతత్రి పళనిస్వామి నియోజకవర్గం ఎడప్పాడిలో పోటీ చేయడం లేదని చెప్పడం గమనార్హం.

సగాయం గతంలో మధురైలో అక్రమ గనుల తవ్వకాలను అడ్డుకున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న వ్యక్తి. ఐఏఎస్‌గా ఉన్న సమయంలో తన పనితీరుతో అందరికీ కంట్లో నలుసుగా ఉన్నారు. అందుకే ఆ బాధ్యతల్లో ఉన్న 27 ఏళ్లల్లో అనేకసార్లు బదిలీలు జరిగాయి. అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటంలో ఎన్నికలు ఒక భాగం మాత్రమే అని సగాయం ప్రకటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement