బొత్స సత్యనారాయణ బీజేపీలోకి వెళ్తున్నారా?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలోకి వెళ్తున్నారా? ఫ్యామిలీ ప్యాకేజీకి బీజేపీ ఆఫర్ ఇచ్చిందా? దాని కోసం రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారా? అందుకే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారా? నెల గంటు పెట్టేలోగానే నిర్ణయం తీసుకుంటారా? ఫిబ్రవరిలో ముహూర్తం పెడతారా? ఇవే ఇప్పుడు బొత్సపై షికారు చేసేస్తున్నాయి పుకార్లు. ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. బొత్స సత్యనారాయణకు అనుచరుడైన ఇందుకూరి రఘురాజు ఇప్పటికే బీజేపీలో చేరారు. ఒకప్పుడు టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక అనుచరుడిగా ఎదిగిన ముద్దాడ మధు కూడా ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్దరూ చేరాక బొత్స సత్యనారాయణ కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్‌లో ఉన్న ఆయన అనుచరులంతా ఇకపై క్యూ కడతారనే వాదన తెరపైకొచ్చింది.
అయితే, రెండు రోజులుగా ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను ఇటీవల బొత్స కలిశారని, పార్టీలో చేరేందుకు బొత్స, చేర్చుకునేందుకు అమిత్ షా ఆసక్తి చూపారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలతో బొత్స అంతరంగికంగా చర్చించినట్టు ఊహాగానాలొస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఏదైనా ఈనెల 13వ తేదీలోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, ఫిబ్రవరిలో ముహూర్తం పెడతారని అంటున్నారు. అందరూ వెళ్తారా ? తానొక్కడే వెళ్తారా? అనేదానిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. నెల గంట పెట్టిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని, పార్టీలో చేరడం అంతకన్న మంచిది కాదన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదే విషయమై బొత్స సత్యనారాయణ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. ఎవరన్నారో తీసుకురండి అని అన్నారు.