రైతుల జీవితాలతో చెలగాటం
ఏపీ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్‌మోహన్‌రెడ్డి
► రాష్ట్రంలో రైతు రుణాలు, రూ.87 వేల కోట్లు, డ్వాక్రా రుణాలు రూ.14 వేల కోట్లు
► వీటికి ఏడాది వడ్డీ రూ.14 వేల కోట్లు, రెండేళ్లకు కలిపి వడ్డీ రూ.28 వేల కోట్లు
► ఈ లెక్కన రూ.1లక్ష 29 వేల కోట్ల రుణాలుండగా రూ.5వేల కోట్లు ఇచ్చారు
► పింఛన్లకు ఏడాదికి రూ.3,700 కోట్లు అవసరమైతే.. రూ.1,300 కోట్లు కేటాయించారు
► మిగిలిన రూ. 2,400 కోట్లు విడుదల చేయకుండా ఆ మేరకు పింఛన్లు కోసేస్తున్నారు
► రుణమాఫీ, రీ షెడ్యూల్ లేకపోవడంతో పంటబీమా కోల్పోయిన రైతన్నలు
► చంద్రబాబు మోసాలపై నవంబర్ 5న అన్నదాతలు, అక్కచెల్లెళ్ల చేత అడిగిస్తాం
► శ్రీకాకుళం జిల్లాలో హుదూద్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
► బాణసంచా పేలుడు మృతుల కుటుంబాలను ఓదార్చేందుకు హుటాహుటిన వెళ్లిన జగన్, రెండో రోజు పర్యటన రద్దు
శ్రీకాకుళం: ‘‘అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీపై తొలిసంతకం చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు రుణమాఫీ కోసం ఇచ్చింది కేవలం రూ.5 వేల కోట్లు. ఆ మాత్రం ఇచ్చి మొత్తం రైతు రుణాలలో 20 శాతం ఇచ్చానని చెపుతున్నారు. మొత్తం రైతు రుణాలు రూ.87 వేల కోట్లు, డ్వాక్రా అక్కచెల్లెళ్ల రుణాలు రూ.14 వేల కోట్లు. మొత్తం దాదాపు రూ.లక్ష కోట్లు. వీటికి ఏడాది వడ్డీ రూ.14 వేల కోట్లు. అప్పుడే రెండో ఏడాది కూడా వస్తుంది, అంటే మరో రూ.14 వేల కోట్లు. రెండేళ్ల వడ్డీకలిపితే రూ.28 వేల కోట్లు అవుతుంది. ఈ లెక్కన మొత్తం రూ.1.29 లక్షల కోట్లు రుణ మాఫీ చేయాలి. కానీ ఆయనేమో రూ.5వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇది సమంజమేనా? రుణమాఫీ అంటే ఇదేనా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు. ఆయన మంగళవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శిం చుకున్నారు. తుపానుకు సర్వస్వం కోల్పోయిన ప్రజలు ఆ కష్టం నుంచి తేరుకోవాలని ఆల యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలోని హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. జీలుగుపాలెం, కోటపాలెం, పాతర్లపల్లి, కోస్టా జంక్షన్‌లలో బాధితులను పరామర్శించారు. కిల్లిపాలెం, కళ్లేపల్లి, పెదగనగళ్లపేట, మురపాక, తదితర ప్రాంతాల్లో ప్రసంగించారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు...
రాష్ట్రంలో 43,11,636 పింఛన్లు వున్నాయి. ఇప్పుడు రూ.1,000 పింఛన్ ఇస్తామంటున్నారు. అంటే వాటికి రూ.3,700 కోట్లు అవుతుంది. కానీ మొన్న బడ్జెట్‌లో వీటికి రూ.1,300 కోట్లు కేటాయించారు.మిగిలిన రూ.2,400 కోట్లు ఇవ్వకుండా ఆ మేరకు పింఛన్లు కత్తిరించే కార్యక్రమం చేస్తున్నారు. ‘‘మొన్నటివరకు ఐసీఐసీఐ బ్యాంకు అనే సంస్థ వాళ్ళు నెలనెలా ఊళ్ళకు వచ్చి మేము బతికున్నామో లేదోచూసి వేలి ముద్ర వేయించుకుని రూ.200 పింఛన్ ఇచ్చి వెళ్లేవారు. మరి అప్పుడు బోగస్ కానివి ఇప్పుడెలా బోగస్ అయ్యాయి?’’ అని చంద్రబాబుని నిలదీయండి.
ప్రతిరోజూ నేను చూస్తున్నా రోడ్డుకు అటుప్రక్క, ఇటుప్రక్క ఒరిగిన చెట్లు, నష్టపోయిన పంటలు, కూలిన ఇళ్లు కనపడ్డాయి. చెరకు, వరి, అరటి, కొబ్బరి, మామిడి, జీడిమామిడి ఇలా అన్ని పంటలు, తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిని చూసి నేను రైతులను అడిగా.. పంటలు ఇంత తీవ్రంగా నష్టపోయాయి కదా! మరి ఇన్సూరెన్స్ ఏమైనా వస్తుందా అని. దానికి రైతులు ఏమన్నారంటే, అయ్యా...‘‘చంద్రబాబుగారు మీరెవరూ రుణాలు కట్టొద్దు, నేను అధికారంలోకి రాగానే మీ రుణాలన్నీ మాఫీ చేస్తాం’ అన్నారు. అందుకే మేము లోన్లు కట్టలేదు, ఇప్పుడేమో రీ షెడ్యూల్ కూడా చేయలేదు, అందువల్ల ఇన్సూరెన్స్‌లేదు, ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పారు. గ్రామాల్లో తాగటానికి మంచినీళ్లు లేవు, బోర్లకు కరెంట్ లేదు, జనరేటర్‌తో బోర్లు నడిపించి ప్రజలకు కనీసం మంచినీళ్లయినా ఇద్దామనే మనసులేని దారుణమైన ప్రభుత్వమిది. తాగునీటికోసం జనరేటర్ డీజిల్‌కు డబ్బులిస్తామని కూడా చెప్పని దారుణమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వుంది.
మనం చంద్రబాబును, ఈ ప్రభుత్వాన్ని నిల దీయకపోతే, మరో పది రోజులుపోతే.. బియ్యం కార్డులు, పింఛన్లు తగ్గిపోతాయి. రుణమాఫీ ఎగిరిపోతుంది. కేవలం రూపాయి కిలో బియ్యం 25 కేజీలు కొన్ని గ్రామాలకు ఇచ్చి, కొందరికి ఇవ్వకుండా అంతా చేసేశామంటూ ఏమీ చెయ్యకుండానే ఈనాడు పత్రికలోనో, మరో చానల్‌లోనో అంతా బాగుంది, బ్రహ్మాండంగా వుంది, బిల్ క్లింటన్ కన్నా, నవీన్ పట్నాయక్ కన్నాబాబు బాగా చేశాడు అని అద్భుతంగా ప్రచారం చేసుకుంటారు. అందుకే ఈ ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తీసుకు రావాలి, లేకపోతే మంచి జరగ దు. అందుకే డ్వాక్రా, రైతు రుణమాఫీ కోసం, మన అవ్వ, తాతలు, వికలాంగ, వితంతు పింఛన్లు కోసం, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను బాధితుల సహా య పునరావాసం కోసం నవంబర్ 5న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహిద్దాం.
రెండోరోజు పర్యటన రద్దు
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పేలుడు ఘట నలో మృతిచెందినవారి కుటుంబాల్ని పరామర్శించేందుకు జగన్ హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో మంగళవారం జరగాల్సిన పర్యటన రద్దయింది. బుధవారం జరగాల్సిన రెండోరోజు పర్యటనను కూడా రద్దు చేశారు.
తమకు ఏ సాయమూ అందలేదంటున్న బాధితులు
జగన్ తాను పర్యటించిన ప్రతి ఊరిలో తుఫాను బాధిత ప్రజలను పరామర్శిస్తూ... మీకు ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం అందిందా? పంట, ఆస్తినష్టం వివరాల నమోదుకు ఎవరైనా అధికారులు మీ గ్రామాలకు వచ్చారా? అని ప్రశ్నిస్తూ వాటికి సమాధానం బాధితులంతా చేతులెత్తి, పెద్దగా వినపడేలా చెప్పాలని కోరారు. తమకు ఏవీ అందలేదని, తమ వద్దకు ఏ అధికారులు రాలేదని ప్రతీచోటా బాధితులు ముక్త కంఠంతో చెప్పారు. కొల్లిపాలెంలో రైతు డి.రామారావు తుపానుకు నష్టపోయిన చెరుకు పంటను, పలువురు రైతులు వరి, అరటి పంటలను తీసుకువచ్చి జగన్‌కు చూపించారు. తమను ఎవరూ పట్టించుకోవటం లేదని సర్వం నష్టపోయి పుట్టెడు దుఃఖంలో వుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని ఆవేదనను వెళ్లబోసుకున్నారు.