నష్టం రూ.1500 కోట్ల పైనే!
శ్రీకాకుళం పాతబస్టాండ్: హుదూద్ తుపాను, అనంతరం సంభవించిన వరదల వల్ల జిల్లాకు వాటిల్లిన నష్టం రోజులు గడుస్తున్నకొద్దీ పెరుగుతోంది. సర్వేల్లో నష్టం అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు జరిపిన సర్వేల ప్రకారం చూస్తే రూ.1500 కోట్లకుపైగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 12 రోజలు గడిచినా తుపాన్ దెబ్బ నుంచి ప్రజలు, రైతులు ఇంకా తేరుకోలేదు. సర్వేలకు వచ్చిన అధికారులకు నష్టాలను వివరించలేని దీనస్థితిలో రైతులు ఉన్నారు. మరికొందరు నిబంధనల కారణంగా జరిగిన నష్టానికి పరిహారం పొందే పరిస్థితి లేదు.
పల్లం 5 ఎకరాలు, మెట్టు 10 ఎకరాల్లోపు ఉన్న రైతులనే పరిహారానికి అర్హులుగా పరిగణించడం, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు నష్ట పరిహారాన్ని దానికే పరిమితం చేయడంతో మధ్య, పెద్ద రైతులు మరింతగా కుంగిపోతున్నారు. పరిహారం పెంచినా నిబంధనలు ప్రతిబంధకంగా మారాయని ఆధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టాన్ని 60 శాతం వరకే రాయాలన్న నిబంధన కూడా ఉండటంతో పూర్తి స్థాయిలో పరిహారం అందదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా నష్టం అంచనాలు ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖల సర్వేలు పూర్తి కావడానికి కనీసం మరో వారం పడుతుంది. వీటిని మినహాయిస్తే, మిగిలిన రంగాల నష్టం సుమారు రూ.850 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా వేశారు.
వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు ఇన్‌పుట్ రాయితీ సుమారు రూ.180 కోట్లు ఉంటుందని లెక్కలు వేశారు. హెక్టారుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల పరిహారం ఆధారంగా ఈ లెక్కలు వేశారు. అంటే ఎకరాకు రూ.6 వేలే వస్తుంది. వాస్తానికి ఎకరా వరి సాగుకు సుమారు రూ.25 వేలు ఖర్చవుతుంది. ఆధికారులు మాత్రం ఇన్‌పుట్ రాయితీ రేటునే నష్టంగా తీసుకుంటున్నారు. తుపాను, వరదల వల్ల 1.54 లక్షల హెక్టర్లలో పంట నష్టం వాటిల్లినట్లు.. ఆ మేరకు ఒక్క వ్యవసాయ రంగానికే రూ.720 కోట్ల మేరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సర్వేలు పూర్తి అయ్యేసరికి ఇది మరింత పెరుగుతుంది.
ఇవీ నష్టం అంచనాలు
తుపాను, అనంతరం నాగావళి, వంశధార వరదలకు జిల్లాలోని 38 మండలాల్లో 1863 గ్రామాలు ప్రభావితమయ్యాయి. వీటిలో 196 గ్రామాలు తీవ్రంగా, 1667 గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇద్దరు చనిపోగా, ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరికి రూ.10.45 లక్షల పరిహారం చెల్లించాలి. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖలకు సంబంధించి తాత్కాలిక మరమ్మతులకు రూ. 10 కోట్లు, శాశ్వత పనులకు రూ.153 కోట్లు అవసరమని లెక్కలు వేశారు. పురపాలక సంఘాల పరిధిలో రోడ్లు, భవనాలు, ఇతర ఆస్తుల నష్టం సుమారు రూ.4 కోట్లుగా అంచనా వేశారు. విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ స్ట్రక్చర్లు, స్తంభాలు చాలావరకు దెబ్బ తినడం వల్ల సుమారు రూ.16 కోట్ల నష్టం వాటిల్లింది.
గృహనిర్మాణ శాఖ పరిధిలో పక్కా, పూరిళ్లు కలిపి 6877 దెబ్బతిన్నాయి. వీటి నష్టం సుమారు రూ.4 కోట్లు ఉంటుంది. పశుసంవర్థక శాఖ పరిధిలో పెద్ద పశువులు 27, చిన్న జీవాలు 211, పౌల్ట్రీ సంబంధిత జీవాలు 17,500 మృతి చెందాయి. ఎనిమిది పాడి యూనిట్లు దెబ్బతినడంతో సుమారు రూ.4.70 కోట్ల నష్టం జరిగింది. మత్స్యశాఖకు సంబంధించి వెయ్యి బోట్లు, 300 వలలను మత్స్యకారులు నష్టపోయారు. నష్టం సుమారు రూ.13.85 కోట్లు ఉంటుందని అంచనా. వంశధార కాలువలతోపాటు నీటిపారుదల శాఖకు చెందిన పలు 173 నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.108 కోట్లు అవసరమని అంచనా. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చెందిన పలు నీటి పథకాలు దెబ్బతినగా రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లింది.
విద్యాశాఖ పరిధిలో 12 మండలాల్లో 24 పాఠశాలల ప్రహరీ గోడలు, తరగతి గదులపై చెట్లు పడిపోవడం వల్ల సుమారు రూ.3,28 కోట్ల నష్టం వాటిల్లింది. సామాజిక అటవీ విభాగం పరిధిలో కూడా ప్లాంటేషన్లు దెబ్బతినడం, మొక్కలు నాశనం కావడంతో నష్టం సుమారు రూ.1.70 కోట్ల వరకు ఉంటుంది. పరిశ్రమల శాఖకు రూ.85 కోట్ల వరకు నష్టం అంచనా వేశారు. పలు రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలు కూలడం, చెట్లు పడటంతో రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లింది, ఎనిమిది మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రహరీ గోడలు, అదనపు గదులు, మరుగుదొడ్లు నాశనమయ్యాయి. రూ.కోటి ఉంటుందని అంచనా. దేవాదాయ శాఖకు కూడా రూ.20 లక్షల నష్టం వాటిల్లింది.