చేదెక్కుతున్న సాగు
ప్రభుత్వ పోకడలు రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. ప్రతికూల వాతావరణ ం,మద్దతు ధర లేకపోవడం, చక్కెరమిల్లుల దయనీయ పరిస్థితుల ప్రభావం చెరకు సాగుకు అన్నదాతను దూరం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కాడిమేడి వదిలేస్తున్న వైనం దీనికి అద్దం పడుతోంది. ఇప్పటికే రైతులు నాట్లు వేయడం మానేశారు. వేసిన పంటకే ఎరువులు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ ఏడాది నాలుగు చక్కెర కర్మాగారాల్లో లక్ష్యం మేరకు క్రషింగ్ అనుమానమే. మరో పక్క బెల్లం తయారీ కూడా నామమాత్రంగా ఉండేలా ఉంది.
- తగ్గిన చెరకు పంట విస్తీర్ణం
- రుణాలివ్వని బ్యాంకర్లు
- పెట్టుబడులు లేక ఆసక్తి చూపని రైతులు
- ఆందోళన కలిగిస్తున సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితులు
చోడవరం: అంతర్జాతీయ బెల్లం మార్కెట్, నాలుగు సహకార చక్కెర కర్మాగారాలు ఉండటంతో జిల్లాలో ఏటా 2లక్షల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. ఈ ఏడాది బెల్లం ధరలు తగ్గడం, చెరకు సరఫరా చేసిన రైతులకు మిల్లు యాజమాన్యాలు సకాలంలో చెల్లిం పులు చేపట్టకపోవడంతో ఈ పంటపై రైతుల్లో ఆసక్తి తగ్గింది. ఇప్పటి వరకు 70శాతమే నాట్లు పడ్డాయి. మిగతా 30శాతం నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది చెరకు రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. పంట పక్వానికి వచ్చే సమయంలో హుద్‌హుద్ ధాటికి 40శాతం పంటను కోల్పోయారు. ఉన్నదానిని దక్కించుకుని బెల్లం తయారీకి, ఫ్యాక్టరీలకు తరలించినా పెట్టుబడులు కూడా దక్కలేదు.
బెల్లం ధరలు తగ్గిపోవడం, పంచదారకు ధరలేకపోవడం, రాష్ట్రం ప్రభుత్వం ఆదుకోని విధానంతో సుగర్ ఫ్యాక్టరీలు చతికిలపడ్డాయి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేపట్టలేకపోయాయి. కేంద్రం ప్రకటించిన రూ.2265 మద్దతు ధరనే గోవాడ లాంటి ఫ్యాక్టరీ సైతం ఇవ్వలేదు. దీనికి తోడు ఫ్యాక్టరీల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక, ఒక వేళ అప్పులు చేసినా గిట్టుబాటు ధర లభిస్తుందన్న నమ్మకం లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంట వేస్తే అప్పులేనంటూ సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. ఈ ఏడాది చెరకు నాట్లు సమయంలో వర్షాలు అనుకూలించలేదు. మోటార్ల సాయంతోనైనా నాట్లు వేద్దామంటే జలాశయాలు, నదులు, చెరువులు, కొండగెడ్డలు అడుగంటడంతో అన్నదాతలు నిరాశకు గురయ్యారు.
వీటికి తోడు కూలీ ధరలు, ఎరువులు, విత్తనం ధరలు భారీగా పెరగడంతో గతంలో ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెడితే ఈ ఏడాది రూ.45వేలకు పైబడే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం పుణ్యమా అని రుణమాఫీ అమలుకాకపోవడంతో బ్యాంకులు సైతం అప్పులివ్వలేదు. రైతులు పూర్తిగా ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇన్ని సమస్యలు చుట్టుముట్టడంతో చెరకు సాగుకు దూరమవుతున్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 30వేల ఎకరాల్లో చెరకు సాగు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 22వేల ఎకరాల్లో మాత్రమే చేపట్టారు.
జిల్లాలో అత్యధికంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోనే సుమారు 80వే ఎకరాలకు పైబడి చెరకు పండిస్తారు. అలాంటిది ఈ ఏడాది 65వేలకు మించలేదు. నెలాఖరుతో నాట్లుకు సీజన్ ముగుస్తోంది.చోడవరం, చీడికాడ, బుచ్చెయ్యపేట, సబ్బవరం,అనకాపల్లి, కశింకోటతో పాటు చెరకు పండించే అనేక ప్రాంతాల్లో భూములను రైతులు రీఎలర్టర్లకు అమ్మేస్తున్నారు. అప్పులు చేసి సాగుచేయలేమని వాపోతున్నారు.