Jaggery market
-
అనకాపల్లి బెల్లానికి అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అనకాపల్లి: సేంద్రియ పద్ధతుల్లో తయారుచేసే రుచికరమైన అనకాపల్లి ఆర్గానిక్ బెల్లానికి, దానితో తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గిరాకీ పెరిగింది. తయారీదారులకు విదేశాల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. నాణ్యమైన పద్ధతుల్లో తయారుచేసే ఈ బెల్లం దేశ విదేశాల్లో వినియోగదారుల ఆదరణ చూరగొంటోంది. రాజస్థాన్, ఒడిశా, పశి్చమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు అమెరికా, మారిషస్, అ్రస్టేలియా, యూరప్ దేశాలకు ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బెల్లం సీజన్ ప్రారంభం కావడంతో ఆయా దేశాలనుంచి ఇక్కడి వ్యాపారులుకు ఆర్డర్లు ఊపందుకున్నాయి. అనకాపల్లి జిల్లా నుంచి ‘ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా’’మార్క్‌తో సేంద్రియ బెల్లం, దానితో తయారయ్యే ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంటారు. ఏటా అనకాపల్లి జిల్లా నుంచి సుమారు 25 వేల టన్నుల సేంద్రియ బెల్లం ఎగుమతి అవుతోంది. అదేవిధంగా 30కి పైగా సేంద్రియ బెల్లం ఉత్పత్తులు కూడా ఎగుమతవుతున్నాయి. అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం, బెల్లం ఉత్పతులపై ఆధారపడి జీవించే కుటుంబాలు 100కి పైగా ఉన్నాయి. హైడ్రోస్ కలపకుండా మంచి ఫ్లేవర్స్ వచ్చేలా వినూత్న రీతిలో తయారుచేయడం, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో అనకాపల్లి ఆర్గానిక్ బెల్లానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అనకాపల్లి, మునగపాక, మాడుగుల, కోటవురట్ల మండలాల్లో ఆర్గానిక్ బెల్లం తయారుచేస్తున్నారు. చక్కెర కర్మాగారాలు గిట్టుబాటు ధర కలి్పంచలేని పరిస్థితుల్లో చెరకు రైతులకు ఆర్గానిక్ బెల్లం తయారీ సంస్థలు అండగా నిలుస్తున్నాయి. హైడ్రోస్ కలపకుండా.. బెల్లం తయారీలో సహజంగా సల్ఫర్, పంచదార వినియోగిస్తుంటారు. కానీ సేంద్రియ బెల్లం తయారీలో అవి కలపకుండా వాటి స్థానంలో సుక్రోజ్, విటమిన్–ఎ, విటమిన్–సి లను తగు మోతాదులో కలిపి అత్యున్నత ప్రమాణాలతో తయారుచేయడం ప్రారంభించారు. పంచదారతో సంబంధంలేకుండా, రంగుకు ప్రాధాన్యమివ్వకుండా, హైడ్రోస్ కలపకుండా బెల్లం అందిస్తారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆధునిక పద్ధతుల్లో బెల్లం తయారు చేసే యూనిట్లను ఇక్కడ కూడా ఏర్పాటుచేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పోటీ పడుతూ.. అనకాపల్లి పరిశోధన కేంద్రాల్లో విలువ ఆధారిత బెల్లం తయారు చేస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో తయారీ అనకాపల్లి జిల్లాలో పలువురు సంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారీ యూనిట్లు ఏర్పాటుచేశారు. 5 గ్రాముల నుంచి 850 గ్రాముల బరువు బెల్లం దిమ్మలు, కుందులు, పౌడర్, బెల్లం ద్రావణాన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం భారత దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఆరు మిలియన్ టన్నుల బెల్లం ఎగుమతిచేస్తున్నారు. ఇంకా డిమాండ్ భారీ స్థాయిలో ఉంది. దీంతో సేంద్రియ బెల్లం తయారీదారులు ఎగుమతులపై దృష్టి పెట్టారు. విదేశీయులు ఇష్టపడే ఫ్లేవర్లలో బెల్లం తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు.ఆర్‌ఏఆర్‌ఎస్ నుంచి ఎగుమతి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు దీటుగా అనకాపల్లి బెల్లం ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఆర్‌ఏఆర్‌ఎస్ (రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్)లో శాస్త్రవేత్తల సహకారంతో సేంద్రియ పద్ధతిలో బెల్లం ఉత్త్పత్తులను తయారు చేస్తున్నారు. అత్యుత్తమ నాణ్యత కారణంగా ఈ ఉత్పత్తులకు దేశ విదేశాల నుంచి ఆన్లైన్లో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పీఎంఎఫ్ఎంఈ(ప్రైమ్‌మినిస్టర్స్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్) పథకంలో భాగంగా అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రూ.3.5 కోట్లతో చెరకు, పనస, చిరుధాన్యాలకు సంబంధించి ఇంక్కుబేషన్ సెంటర్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో చెరకు ఇంక్యుబేషన్ సెంటర్లో ఉత్పత్తి ప్రారంభమై గణనీయమైన ఆదరణ కనిపిస్తోంది. పనస, చిరుధాన్యాల ఉత్పత్తులకు సంబంధించిన ఇంక్యుబేషన్ సెంటర్ల నిర్మాణంకూడా దాదాపు పూర్తయింది. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు మంచి డిమాండ్ వచ్చి రైతులకు మేలు జరగనుంది. రైతుకు అండగా.. ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటుతో చెరకు, చిరుధాన్యాలు, పనస రైతులకు అండగా నిలవడంతో పాటు వారి ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని చెరకు రైతులకు ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు. దీంతో పాటు పనస, మిల్లెట్స్ పండించే గిరిజన రైతులకు కూడా మంచి లాభాలు వస్తాయి. ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం కూడా పూర్తయింది. – పి.వి.కె జగన్నాథరావు, ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీ -
అనకాపల్లి బెల్లం మార్కెట్ డీలా
అనకాపల్లి : అనకాపల్లి మార్కెట్‌కు ముసురు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే అన్‌సీజన్‌లో తీవ్రంగా నష్టపోయిన మార్కెట్ వర్గాలు తాజాగా ముసురు కారణంగా లావాదేవీల్లేక మార్కెట్ డీలా పడింది. ఈ వారం మూడురోజులుగా ఒక్క బెల్లందిమ్మకూ వ్యాపారం జరగలేదు. మిగిలిన మూడు రోజులు లెక్కిస్తే కేవలం 107 బెల్లం దిమ్మలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శనివారం మార్కెట్‌కు 35 దిమ్మలు రాగా అవి కూడా రెండోరకం కావడంతో ధర కూడా కనిష్టంగా క్వింటాల్‌కు రూ.2,250 పడిపోయింది. ఈనెల 11వతేదీన 39 బెల్లం దిమ్మలు రాగా 14వ తేదీన 33 బెల్లందిమ్మలు వచ్చాయి. ఈ వారంలో క్వింటాల్ గరిష్టంగా రూ.3,800 పలికింది. ఇక 12న, 13న, 15న మార్కెట్‌కు ఒక్కబెల్లం దిమ్మ కూడా రాలేదు. ఉభయగోదావరి జిల్లాల్లో వరద విలయతాండవం పరిస్థితులు కూడా జాతీయస్థాయిలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్‌పైనే పడిందని చెప్పాలి. ప్రస్తుతం మార్కెకు కోల్డ్ స్టోరేజీలో ఉన్న బెల్లం మాత్రమే ఇతర రాష్ట్రాల్లో ఉన్న డిమాండ్ మేరకు బయటకు తీస్తారు. అయినప్పటికీ బెల్లం ధరలు మాత్రం పతనావస్థలోనే ఉన్నాయి. కొత్తబెల్లం ఉత్పత్తి కావాలంటే దసరా వరకు వేచి ఉండాల్సిందే. కాగా 15 కేజీల బెల్లం దిమ్మ స్థానంలో కేవలం 5 కేజీలు, 10 కేజీల బెల్లందిమ్మలకే ఉత్తరాదిలో డిమాండ్ పెరిగింది. ఇలా అన్‌సీజన్, ముసురు వాతావరణం, బెల్లంసైజు వంటి సమస్యలతో అనకాపల్లి బెల్లంమార్కెట్కు డీలా పడింది. బెల్లం రైతులు, అటు వర్తకులు అన్‌సీజన్ విషయంలో ఎలా ఉన్నా మార్కెట్‌పై ఆధారపడిన కొలగార్లు, కళాసీలు, కార్మికులు, వాహనదారులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ( రెండేళ్లుగా అడ్డగోలు చెత్త బంధం..!!) -
అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు
అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్లో మంగళవారం నుంచి లావాదేవీలు మొదలయ్యాయి. నల్లబెల్లంపై ఎక్సైజ్ పోలీసులు పెడుతున్న కేసులకు నిరసనగా వర్తకులు ఆరురోజుల క్రితం లావాదేవీలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ప్రధానంగా ఇబ్బంది పడే వర్తకులు జిల్లాస్థాయి అధికారులతోపాటు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎంపీ డాక్టర్ బివి సత్యవతి, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలను కలిసి తమ గోడును వినిపించుకున్నారు. వేధింపులవీ ఉండవని, అపోహలు వీడాలని పోలీసు ఉన్నతాధికారులు సైతం స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ క్రమంలో మార్కెట్లో మంగళవారం నుంచి లావాదేవీలు జరపాలని సోమవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మంగళవారం నుంచి లావాదేవీలు ప్రారంభం కావడంతో మార్కెట్ వర్గాలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అనకాపల్లి మార్కెట్లో నిలిచిన బెల్లం అమ్మకాలు
అనకాపల్లి: సీజన్లో రోజుకు సుమారు రూ.4 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే అనకాపల్లి బెల్లం మార్కెట్లో మరోసారి ప్రతిçష్టంభన ఏర్పడింది. బుధవారం బెల్లం క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. సీజన్, అన్‌సీజన్‌గా లావాదేవీలు జరిగే అనకాపల్లి మార్కెట్లో ఏటా రెండు, మూడుసార్లు సమస్యల కారణంగా లావాదేవీలు నిలిచిపోవడం, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుని లావాదేవీలను పునరుద్ధరించడం సాధారణమే. ఈసారి బెల్లం ఎగుమతిదారులకు, కార్మికులకు మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలతో మార్కెట్లో లావాదేవీలు నిలిచిపోయాయి. సంక్రాంతికి ముందురోజు 20 వేలకు పైగా బెల్లం దిమ్మెల వ్యాపారం జరగ్గా.. పండుగ తర్వాత సోమవారం 11,866 దిమ్మెలు, మంగళవారం 8,644 బెల్లం దిమ్మెలు మార్కెట్‌కు వచ్చాయి. పండుగ మూడ్ నుంచి బయటపడిన రైతులు బెల్లాన్ని మార్కెట్‌కు తరలించాలనుకుంటున్న సమయంలో లావాదేవీలు నిలిచిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ప్రతిష్టంభనకు కారణమిదీ మార్కెట్‌కు బెల్లాన్ని రైతులు వాహనాల్లో తీసుకొచ్చి మార్కెట్ యార్డులలో దించుతారు. తర్వాత కొన్ని ప్రక్రియలు జరిపి ఎగుమతిదారుడి అధీనంలోకి వెళ్లిన తర్వాత సుమారు 170 మంది కార్మికులు బెల్లం దిమ్మెలను గోనె సంచిలో కుట్టే ముందు ఆయా వర్తకునికి సంబంధించిన గుర్తులు వేస్తారు. దీనికి గాను ఒక్కో కార్మికునికి దిమ్మెకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. కాగా, గోనె సంచులను కుట్టే ప్రక్రియకు స్వస్తి పలికిన వర్తకులు నేరుగా కవర్లను చుట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనివల్ల కార్మికలకు వచ్చే వేతనం తగ్గిపోతోంది. తమకు గిట్టుబాటు కాదని భావించిన కార్మికులు అనధికారికంగా నిర్వహించే వేలం ప్రక్రియలో పాల్గొనబోమని మొండికేశారు. ఇది ఎగుమతి, దిగుమతి వర్తకుల మధ్య ప్రతిష్టంభనకు దారితీసి బుధవారం లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం అటు వర్తకులు, ఇటు కొలగార్లు, కార్మికులతోపాటు బెల్లం రైతులు, బెల్లాన్ని తరలించే వాహనదారులపైనా పడింది. ఈ సమస్య వెంటనే పరిష్కారం కాకుంటే పక్వానికి వచ్చిన చెరకు తోటలు పాడైపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
బెల్లం మార్కెట్‌కు దసరా జోష్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్ దసరా జోష్‌తో కళకళలాడింది. ప్రతి ఏటా ప్రధానమైన పండగలకు బెల్లంతో తయారు చేసే పిండి వంటలను దేశంలోని పలు ప్రాంతాల వారు వండుతారు. ఈ క్రమంలోనే బెల్లానికి గిరాకీ పెరుగుతోంది. సహజంగా క్వింటాలుకు రూ.3500 పలికే అనకాపల్లి బెల్లం మార్కెట్లో క్వింటాలు బెల్లం ధర అనూహ్యంగా పుంజుకుంది. మొదటి రకం బెల్లం గరిష్టంగా రూ.4,720 పలకడంతో మార్కెట్వర్గాల్లో జోష్ కనిపించింది. మే నెలాఖరు నాటికి దాదాపు బెల్లం తయారీ పూర్తవుతుంది. ఆ తర్వాత రైతులు తయారు చేసిన బెల్లాన్ని వర్తకులు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుతారు. ఈ బెల్లం అంతా రోజు వారీ కార్యకలాపాలతో పాటు ఉత్సవాలకు అవసరమైనప్పుడు దశలవారీగా కోల్డ్ స్టోరేజీ నుంచి బెల్లాన్ని తీసుకొచ్చి మార్కెట్లో విక్రయిస్తుంటారు. దసరా వచ్చిన వెంటనే బెల్లం తయారీకి రైతులు పూనుకున్నప్పటికీ మొదట్లో తయారు చేసిన బెల్లాన్ని దేవునికి సమర్పిస్తారు. ఈ కారణంగా కొత్త బెల్లం అధికంగా దసరా తర్వాత నుంచి మార్కెట్‌కు వస్తుంది. హోల్‌సేల్‌తో పాటు రిటైల్ మార్కెట్లోనూ బెల్లానికి ఒక్కసారిగా డిమాండ్ పెరగడం ధర అనూహ్యంగా పుంజుకుంది. అనకాపల్లి మార్కెట్ నుంచి బీహార్, ఒడిశా, బెంగాల్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తారు. అక్కడి వర్తకులు ఈ బెల్లాన్ని కొనుగోలు చేసుకుని పండగ సమయంలో విక్రయిస్తారు. గత ప్రభుత్వ హయాంలో అనకాపల్లి బెల్లానికి జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ చంద్రన్న కానుక కోసం అవసరమైన బెల్లాన్ని సరఫరా చేసే టెండర్‌ను గుజరాత్ వర్తకులకు అప్పగించారు. అప్పుడు కనీస టర్నోవర్ నిబంధనను తెరపైకి తెచ్చి రాష్ట్రంలో పేరొందిన అనకాపల్లి బెల్లానికి డిమాండ్ లేకుండా చేశారు. ఈ ఏడాది దసరా ముందురోజైన సోమవారం అనకాపల్లి మార్కెట్‌కు 1504 దిమ్మలు రాగా మొదటి రకం క్వింటాలుకు గరిష్టంగా రూ.4720, మూడో రకం కనిష్టంగా రూ.2850 పలికింది. బెల్లం ధర అధికంగా పలకడంతో చెరకు రైతులు దసరా తర్వాత నుంచి బెల్లం తయారీపై మరింత మక్కువ చూపే అవకాశముంది. -
బెల్లం మార్కెట్‌కు సంక్రాంతి కళ
ఈ సీజన్లో అధిక లావాదేవీలు లోటును పూడ్చుకునే యత్నం అనకాపల్లి: బెల్లం మార్కెట్లో సోమవారం సంక్రాంతి పండుగ సందడి కనిపించింది. ఈ సీజన్‌కు రికార్డు స్థాయిలో బెల్లం దిమ్మలు వచ్చాయి. మార్కెట్లో 38 వేల 222 దిమ్మల లావాదేవీలు జరిగాయి. సంక్రాం తి ముందు బెల్లం తయారీ ఊపందుకుంటుంది. సంక్రాంతి పండుగకు సంబంధించిన ఆర్థిక అవసరాల కోసం బెల్లం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వినియోగిస్తారు. వాస్తవానికి జనవరి నెలలో గతంలో 50 వేల నుంచి 80 వేల దిమ్మల వరకు వచ్చిన సందర్భాలు వున్నాయి. అయితే ఈ సీజ బెల్లం వ్యాపారానికి ఎదురవుతున్న ప్రతిబంధకాల ప్రభావం తయారీపై కూడా పడింది. పెద్దనోట్ల రద్దు కారణంగా ఆర్థికపరమైన లావాదేవీలకు ఇబ్బందులు ఎదురవడంతో కొద్దిరోజులపాటు మార్కెట్లో లావాదేవీలు సైతం నిలిపివేశారు. చెరకు రైతుల భవితవ్యాన్ని దష్టిలో పెట్టుకొని వర్తకులు తప్పనిసరి పరిస్థితుల్లో కూడా వ్యాపారాలు ప్రారంభించారు. అయితే ఏరోజుకారోజు బెల్లం అమ్మకాలు జరపగా వచ్చిన సొమ్మును పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేకపోయారు. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా అప్పటికీ అంతంతమాత్రంగా జరుగుతున్న బెల్లం వ్యాపారంపై ఫుడ్ కంట్రోల్ అధికారులు మరింత ప్రభావాన్ని చూపారు. తెల్లబెల్లం తయారీలో హైడ్రాస్ వాడుతున్నట్లు వచ్చిన ప్రచారంపై ఫుడ్‌కంట్రోల్ అధికారులు అనకాపల్లి బెల్లం మార్కెట్లో గత నెలలో దాడులు జరిపారు. ఈ కారణంగా కూడా రైతులు బెల్లం తయారీకి కాస్త వెనుకంజ వేశారు. అయితే ఆ రెండు రకాల చేదు అనుభవాల నుంచి బయటపడిన బెల్లం రైతులు ఇపుడు బెల్లం వంటకాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించారు. భోగి, సంక్రాంతి, కనుమతోపాటు తదుపరి కొద్ది రోజులు బెల్లం వంటకాలను రైతులు నిలిపివేస్తారు. భోగికి ముందు వండిన బెల్లాన్ని విక్రయించడం ద్వారా పండుగకు అవసరమైన సొమ్మును పొందేందుకు రైతులు బెల్లం తయారీ జోరు పెంచారు. ఈ క్రమంలోనే 2016–17 సీజన్‌కు సంబంధించి సోమవారం బెల్లం లావాదేవీలు రికార్డుగా నిలిచాయి. ఇదే నెల రెండో తేదీన మార్కెట్‌కు 30,915 దిమ్మలు వచ్చాయి. అయితే ధరలు మాత్రం రైతులను తీవ్రంగా నిరాశపరిచాయి. మొదటి రకం క్వింటాల్‌కు గరిష్టంగా 3,740 రూపాయలు పలకగా మూడో రకం కనిష్టంగా 2,300 రూపాయలు పలికింది. గత వారంతో పోల్చితే క్విం టాల్‌కు మొదటి రకం 110 రూపాయలు తగ్గగా మూడో రకం 100 రూపాయలు తగ్గింది. నిరాశతో రైతులు వున్నప్పటికీ బెల్లం అమ్మకాలపై మాత్రం పూర్తిస్థాయిలోనే ఉత్సాహం చూపించారు. -
బెల్లం మార్కెట్లో కలకలం
-
బెల్లం మార్కెట్‌కు నష్టాల చేదు
గణనీయంగా తగ్గిన లావాదేవీలు 2015-2016లో రూ.109 కోట్లకు పడిపోయిన విక్రయాలు 2009-2010 తర్వాత భారీగా తగ్గుదల 2011-2012లో మాత్రమే రికార్డుస్థాయిలో రూ.161 కోట్ల వ్యాపారం తగ్గిన చెరకు విస్తీర్ణం, దిగుబడి {పత్యామ్నాయ పంటలవైపు రైతుల మొగ్గు కలసిరాని మార్కెట్ పరిస్థితులు అనకాపల్లి: జాతీయస్థాయిలో రెండో స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లావాదేవీలు గణనీయంగా తగ్గిపోయాయి. 2009-2010 ఆర్థిక సంవత్సరం తర్వాత పెరిగిన అనకాపల్లి మార్కెట్లో బెల్లం వ్యాపారం 2015-16లో తగ్గింది. 2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపాను, చెరకుపై పుసుపు ఆకు తెగులు ప్రభావం చెరకు, బెల్లం దిగుబడిపై గణనీయంగా ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే 2015-16 ఆర్థిక సంవత్సరంలో అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఆశాజనక ఫలితాలు దూరమయ్యాయి. రూ. 109 కోట్లకు తగ్గిన వ్యాపారం... 2015-16 ఆర్థిక సంవత్సరంలో అనకాపల్లి బెల్లం మార్కెట్లో 4, 82,850 క్వింటాళ్ల బెల్లం విక్రయాలు జరగ్గా, 109 కోట్ల 18 లక్షల 30వేల 280 రూపాయల మేర వ్యాపారం జరిగింది. 2009-2010 ఆర్థిక సంవత్సరంలో 4,11,191 క్వింటాళ్ల బెల్లం లావాదేవీల మేరకు 104 కోట్ల 86 లక్షల 3వేల 387 రూపాయల వ్యాపారం జరిగింది. 2010-2011 ఆర్థిక సంవత్సరానికి 123 కోట్ల వ్యాపారం జరగ్గా 2011-2012 సీజన్లో రికార్డుస్థాయిలో 8 లక్షల 17వేల 958 క్వింటాళ్ల లావాదేవీల మేరకు 161 కోట్ల 60లక్షల 95వేల 510 రూపాయల వ్యాపారం జరిగింది. 2012-2013లో 143 కోట్లు, 2013-2014లో రూ.144 కోట్లు, 2014-2015లో రూ.121 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో మార్కెట్‌కు సెస్సు రూపేణ రావాల్సిన ఆదాయం పడిపోయింది. మరోవైపు జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గడం, చెరకుపై వైరస్ తాకిడి పెరగడంతో దిగుబడి తగ్గిపోయింది. ఈ ప్రభావం చక్కెర కర్మాగారాల రికవరీ, బెల్లం వ్యాపారంపైన చూపింది. చెక్‌పోస్ట్ ద్వారా తగ్గిన ఆదాయం... చెక్‌పోస్ట్ ద్వారా 2014-2015లో 89 లక్షల 71వేల 775 రూపాయల పన్ను లభించగా 2015-2016లో 66 లక్షల 13వేల 408 రూపాయలకు పడి పోయింది. దీంతో మార్కెట్ వర్గాలు కలవరపాటుకు గురవుతుండగా వర్తకుల్లో సైతం తగ్గిన బెల్లం వ్యాపారం నిరాశను మిగిల్చింది. అన్నీ ఎదురుదెబ్బలే... అనకాపల్లి బెల్లంమార్కెట్కు కొన్నేళ్లుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హుద్‌హుద్ తుపాను చెరకు పంటకు తీవ్ర నష్టాన్ని మిగల్చగా నాణ్యమైన విత్తనం లేకుండా పోయింది. మరోవైపు అనకాపల్లి మార్కెట్‌నుంచి రాష్ర్టంలోని పలు ప్రాంతాలకు తరలించే బెల్లంపై కొనసాగుతున్న ఆంక్షలు సైతం వ్యాపారంపై ప్రభావితం చేసింది. కేసుల తలనొప్పితో పలువురు బెల్లం వ్యాపారానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. తగ్గుతున్న చెరకు విస్తీర్ణం రాష్ట్ర విభజన ప్రభావం సైతం అనకాపల్లి బెల్లం మార్కెట్‌పై పడింది. తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి బెల్లం రావడం వల్ల ఆ ప్రాంతానికి అనకాపల్లి నుంచి వెళ్లే బెల్లం తగ్గింది. అనకాపల్లి నుంచి ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపే వెళ్తోంది. దీనికి తోడు చెరకు సాగు చేసే రైతులు దీర్ఘకాలంపాటు నష్టాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేక స్వల్పకాలిక పంటలవైపు మళ్లుతున్నారు. ఈక్రమంలోనే వరి సాగు విస్తీర్ణం గత ఖరీఫ్‌లో పెరగడం గమనార్హం. చెరకుపంట సాగుకు ప్రతికూలంగా మారుతున్న అంశాలకు పరిష్కారం దొరక్కుంటే పరిస్థితి మరింత దిగజారనుంది. ఆ ప్రభావం చెరకు విస్తీర్ణంపైన, అనకాపల్లి బెల్లం వ్యాపారంపైన పడనుందని వ్యాపార, మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
అనకాపల్లి బెల్లానికి విభజన దెబ్బ
జాతరకు తగ్గిన బెల్లం ఎగుమతి గతంలో 250 లారీలు... ఇప్పుడు వెళ్లింది 15 లారీలే ప్రభుత్వ విధానాలతో వ్యాపారుల నిరాశ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్ పై రాష్ట్ర విభజన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడి మార్కెట్ ప్రాభవం కోల్పోయి కుదేలవుతోంది. గతంలో ఇక్కడి నుంచి తెలంగాణాలో నిర్వహించే మేడారం (సమ్మక్క - సారలమ్మ) జాతరకు 250కి పైగా లారీల బెల్లం తరలి వెళ్లేది. ప్రస్తుతం 15 లోడ్లు మాత్రమే వెళ్లడం ఇక్కడి వ్యాపారులను కలవరపెడుతోంది. అనకాపల్లి: ఇక్కడి నుంచి సమ్మక్క- సారలమ్మ జాతరకు తరలివెళ్లే బెల్లం ఈ ఏడాది గణనీయంగా పడిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ విధానాలతో మరికొన్ని అంశాలు అనకాపల్లి బెల్లానికి గిరాకీ తగ్గడానికి కారణమయ్యాయని బెల్లం వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. రెండేళ్లకోసారి వరంగల్ జిల్లా మేడారం కొండల్లో నిర్వహించే సమ్మక్క-సారలమ్మ జాతరకు అనకాపల్లి బెల్లం మార్కెట్ నుంచి భారీగా బెల్లాన్ని తరలించేవారు. గతంలో 250 లారీల బెల్లం వరకూ మేడారానికి తరలిపోయేది. ఈ జాతరలో మొక్కు తీర్చుకునే భక్తులు, గిరిజనులు వారి బరువుతో సమానంగా బెల్లాన్ని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. ఈ కారణంగా బెల్లానికి మంచి గిరాకీ ఉంటుంది. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఆంక్షలు, పన్నులు ఉండేవి కావు. విడిపోయిన తరువాత మేడారం జాతరలో విక్రయించే అనకాపల్లి బెల్లం పరాయిదైపోయిది. ఈ ఏడాది ఆ జాతరకు అనకాపల్లి బెల్లం మార్కెట్ నుంచి కేవలం 15 లారీల బెల్లం వెళ్లింది. ఈ నెల 17న మొదలైన జాతర 20తేదీతో ముగిసిన తరువాత అనకాపల్లి వర్తకులు వేసిన లెక్కల మేరకు వ్యాపారం గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. మనం కోల్పోయిన బెల్లం వ్యాపారాన్ని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు తన్నుకుపోయాయని ఇక్కడి వర్తకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఆ రాష్ట్రాల్లో బెల్లం దిగుబడి అధికంగా ఉండటంతో ధర కూడా కాస్త తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఆంక్షలు కూడా ప్రభావితం.. అనకాపల్లి బెల్లాన్ని వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, భద్రచలం, ఇల్లందు పరిసరాలకు తరలించేవారు. ఈ ఏడాది జిల్లా మేడారంలో 15 దుకాణాలకు మాత్రమే అనుమతివ్వడం, ఖమ్మం జిల్లాల్లోకి మహారాష్ట్ర బెల్లం రావడంతో ఆ ప్రభావం అనకాపల్లి బెల్లంపై పడింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌లో నల్ల బెల్లం రవాణాపై కొనసాగుతున్న ఆంక్షలు, దాడులు బెల్లం వర్తకుల్ని కుదేలు చేస్తున్నాయి. సారాతో ఎవరైనా పట్టుబడినపుడు బెల్లం అమ్మిన రైతులపై కూడా కేసులు పెడుతుండటతో బెల్లం వర్తకులు బెంబేలెత్తి కేవలం తెల్లబెల్లాన్ని సరఫరా చేస్తున్నారు. కాని వాతావరణ, స్థానిక భూ స్థితిగతుల కారణంగా ఈ ప్రాంత రైతులు ఉత్పత్తి చేసే బెల్లంలో ఎక్కువగా నల్ల రకం వస్తోంది. దీని ఎగుమతులపై ఆంక్షలు ఉండటంతో రైతులతో పాటు వ్యాపారులు నష్టపోతున్నారు. మేడారం జాతరకు వెళ్లింది తక్కువే ఈ ఏడాది మేడారానికి కేవలం 15 లారీల బెల్లమే వెళ్లింది. గతంలో 250 లారీల వరకు వెళ్లేది. బెల్లం విషయంలో ప్రభుత్వాల విధానాలు ఈ తగ్గుదలకు కారణం. నల్లబెల్లం సారాకు వినియోగిస్తున్నారని చెప్పి కేసులు పెడితే వ్యాపారం ఏమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మన సంస్కృతి, మన వ్యాపారాలను రక్షించాలి. - కర్రి సన్యాసినాయుడు, ఎస్ఎల్జీటి ప్రొప్రయిటర్, బెల్లం వర్తకుడు -
అమ్మకాలు అదుర్స్
అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఒక్క రోజులో రూ. కోటి వ్యాపారం ఈ సీజన్లో ఇదే రికార్డు బెల్లం ఉత్పత్తి వైపు రైతుల మొగ్గు నిరాశ పరిచిన ధరలు అనకాపల్లి: స్థానిక బెల్లం మార్కెట్లో సోమవారం రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి. ఈ సీజన్‌కు సంబంధించి నెల రోజుల నుంచి లావాదేవీలు ఊపందుకున్న నేపథ్యంలో మార్కెట్లో సందడి నెలకొంది. సోమవారం ఒక్కరోజు జరిగిన లావాదేవీలు విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. ఈ నెల 8న మార్కెట్‌కు 24,121 దిమ్మలు రాగా సోమవారం మార్కెట్‌కు 29,788 దిమ్మలు వచ్చాయి. దీంతో మార్కెట్లోని యార్డులన్నీ కొనుగోళ్లు, అమ్మకాలతో కిటకిటలాడాయి. బెల్లం లావాదేవీల్లో భాగంగా ఆన్లైన్ అమ్మకాలు ప్రతిపాదన, ప్రారంభం జరిగిన నేపథ్యంలో వ్యాపారంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్నప్పటికీ లావాదేవీలపై ఈ ప్రభావం పడకపోవడంతో మార్కెట్ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. ఇదే సమయంలో గత ఏడాది హుద్‌హుద్ చేదు అనుభవాలు, ఈ ఏడాది తగ్గిన చెరకు పంట విస్తీర్ణం, బెల్లం ఉత్పత్తిపై పరోక్షంగా ప్రభావాన్ని చూపుతున్నాయి. లావాదేవీల పరంగా రికార్డు నమోదైనప్పటికీ ధరలు మాత్రం రైతులను నిరాశ పరిచాయి. మొదటి రకం క్వింటాల్‌కు 2890 పలకడం రైతులకు అసంతృప్తి కలిగించింది. ఇక మూడోరకం కనిష్టంగా మరీ దయనీయంగా 2240 రూపాయలు పలకడంతో ఏ మాత్రం గిట్టుబాటు లేకుండాపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే నల్లబెల్లం కంటే మార్కెట్లో విక్రయించే మూడో రకం ధర తక్కువుగా ఉండడం రైతులను నిరాశ పరుస్తోంది. బెల్లం తయారీపైనే మొగ్గు మరో వైపు తుమ్మపాల కర్మాగారం గానుగాటపై స్పష్టత లేకపోవడం, ఏటికొప్పాక కర్మాగారం పరిధిలో చెరకు మద్దతు ధర చెల్లింపుపై నెలకొన్న జాప్యం కారణంగా పలువురు రైతులు చెరకును చక్కెర కర్మాగారానికి తరలించే కంటే బెల్లం తయారు చేయడం మేలని భావిస్తున్నారు. అయితే బెల్లం తయారు చేసేందుకు అవసరమైన సుదీర్ఘ ప్రక్రియ కొద్దిగా ప్రతిబందకంగా మారడం వలన రైతులు తప్పనిసరి పరిస్థితిలోనే చెరకును కర్మాగారానికి తరలిస్తున్నారు. తుమ్మపాల చక్కెర కర్మాగార గానుగాటపై స్పష్టత రాకపోవడంతో కర్మాగారంపై ఆధారపడిన కుంచంగి, తుమ్మపాల రైతుల్లో కలవరం మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో తుమ్మపాల రైతుల్లో కొందరు సమీపంలోని బెల్లం తయారీ కేంద్రాలకు చెరకును తరలించి బెల్లాన్ని వండుతున్నారు. తీరా బెల్లాన్ని ఎంతోఆశతో అనకాపల్లి మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధర లేక నిరాశ పరుస్తోంది. కాకపోతే కర్మాగారం ద్వారా చెల్లించాల్సిన మద్దతు ధర రావాలంటే ఏడాది పడుతుంది. అదే బెల్లం విక్రయం ద్వారా వచ్చే ధర రోజుల వ్యవధిలోనే జమ కావడం వలన రైతులకు కొంత ఊరటగా ఉంటుంది. -
చేదెక్కుతున్న సాగు
ప్రభుత్వ పోకడలు రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. ప్రతికూల వాతావరణ ం,మద్దతు ధర లేకపోవడం, చక్కెరమిల్లుల దయనీయ పరిస్థితుల ప్రభావం చెరకు సాగుకు అన్నదాతను దూరం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కాడిమేడి వదిలేస్తున్న వైనం దీనికి అద్దం పడుతోంది. ఇప్పటికే రైతులు నాట్లు వేయడం మానేశారు. వేసిన పంటకే ఎరువులు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ ఏడాది నాలుగు చక్కెర కర్మాగారాల్లో లక్ష్యం మేరకు క్రషింగ్ అనుమానమే. మరో పక్క బెల్లం తయారీ కూడా నామమాత్రంగా ఉండేలా ఉంది. - తగ్గిన చెరకు పంట విస్తీర్ణం - రుణాలివ్వని బ్యాంకర్లు - పెట్టుబడులు లేక ఆసక్తి చూపని రైతులు - ఆందోళన కలిగిస్తున సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితులు చోడవరం: అంతర్జాతీయ బెల్లం మార్కెట్, నాలుగు సహకార చక్కెర కర్మాగారాలు ఉండటంతో జిల్లాలో ఏటా 2లక్షల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. ఈ ఏడాది బెల్లం ధరలు తగ్గడం, చెరకు సరఫరా చేసిన రైతులకు మిల్లు యాజమాన్యాలు సకాలంలో చెల్లిం పులు చేపట్టకపోవడంతో ఈ పంటపై రైతుల్లో ఆసక్తి తగ్గింది. ఇప్పటి వరకు 70శాతమే నాట్లు పడ్డాయి. మిగతా 30శాతం నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది చెరకు రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. పంట పక్వానికి వచ్చే సమయంలో హుద్‌హుద్ ధాటికి 40శాతం పంటను కోల్పోయారు. ఉన్నదానిని దక్కించుకుని బెల్లం తయారీకి, ఫ్యాక్టరీలకు తరలించినా పెట్టుబడులు కూడా దక్కలేదు. బెల్లం ధరలు తగ్గిపోవడం, పంచదారకు ధరలేకపోవడం, రాష్ట్రం ప్రభుత్వం ఆదుకోని విధానంతో సుగర్ ఫ్యాక్టరీలు చతికిలపడ్డాయి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేపట్టలేకపోయాయి. కేంద్రం ప్రకటించిన రూ.2265 మద్దతు ధరనే గోవాడ లాంటి ఫ్యాక్టరీ సైతం ఇవ్వలేదు. దీనికి తోడు ఫ్యాక్టరీల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక, ఒక వేళ అప్పులు చేసినా గిట్టుబాటు ధర లభిస్తుందన్న నమ్మకం లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంట వేస్తే అప్పులేనంటూ సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. ఈ ఏడాది చెరకు నాట్లు సమయంలో వర్షాలు అనుకూలించలేదు. మోటార్ల సాయంతోనైనా నాట్లు వేద్దామంటే జలాశయాలు, నదులు, చెరువులు, కొండగెడ్డలు అడుగంటడంతో అన్నదాతలు నిరాశకు గురయ్యారు. వీటికి తోడు కూలీ ధరలు, ఎరువులు, విత్తనం ధరలు భారీగా పెరగడంతో గతంలో ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెడితే ఈ ఏడాది రూ.45వేలకు పైబడే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం పుణ్యమా అని రుణమాఫీ అమలుకాకపోవడంతో బ్యాంకులు సైతం అప్పులివ్వలేదు. రైతులు పూర్తిగా ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇన్ని సమస్యలు చుట్టుముట్టడంతో చెరకు సాగుకు దూరమవుతున్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 30వేల ఎకరాల్లో చెరకు సాగు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 22వేల ఎకరాల్లో మాత్రమే చేపట్టారు. జిల్లాలో అత్యధికంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోనే సుమారు 80వే ఎకరాలకు పైబడి చెరకు పండిస్తారు. అలాంటిది ఈ ఏడాది 65వేలకు మించలేదు. నెలాఖరుతో నాట్లుకు సీజన్ ముగుస్తోంది.చోడవరం, చీడికాడ, బుచ్చెయ్యపేట, సబ్బవరం,అనకాపల్లి, కశింకోటతో పాటు చెరకు పండించే అనేక ప్రాంతాల్లో భూములను రైతులు రీఎలర్టర్లకు అమ్మేస్తున్నారు. అప్పులు చేసి సాగుచేయలేమని వాపోతున్నారు. -
ఫలితమివ్వని చర్చలు
రెండో రోజూ బెల్లం మార్కెట్ బంద్ కొలగార్లు, వ్యాపారుల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన 16 పైసలు పెంచేందుకు వర్తకుల ప్రతిపాదన బుధవారం ఉదయం నిర్ణయం వెల్లడిస్తామన్న కొలగార్లు అనకాపల్లి: బెల్లం మార్కెట్లో కొలగారం పెంపు విషయమై చోటుచేసుకున్న ప్రతిష్టంభన తొలగలేదు. కొలగార్లు, వర్తకుల మధ్య మంగళవారం రాత్రి వరకు సాగిన చర్చలు ఫలించలేదు. మంగళవారం కూడా కొలగార్లు ఎవరూ మార్కెట్‌కు రాలేదు. కొలగారం పెంచాలన్న డిమాండ్‌తో కొలగార్లు మార్కెట్లో సోమవారం నుంచి బీట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజులు సుమారు రూ.4 కోట్లకు పైబడి బెల్లం వ్యాపారం ఆగిపోయింది. బుధవారం నాటి లావాదేవీలపై కూడా స్పష్టత లేకుండా పోయింది. మార్చి నెల కావడంతో బెల్లం సీజన్ జోరుగానే ఉంటుంది. సీజన్ ముగింపు దశలో లావాదేవీలు నిలిచిపోవడం రైతులకు పెద్ద నష్టమే. కమతాలలో తయారు చేసిన బెల్లం పాడయ్యే ప్రమాదముంది. కొలగార్లకు వంద కిలోలకు 16 పైసలు పెంచేందుకు ఎగుమతి వర్తకులు సుముఖత వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం గిట్టుబాటుకాదని కొలగార్లు అభిప్రాయపడుతున్నారు. గ్రేడింగ్‌తో పాటు బీట్ నిర్వహణ కోసం దిగుమతి వర్తకులు అదనపు కొలగారం ఇవ్వాలని కోరుతున్నారు. బుధవారం ఉదయం వారంతా సమావేశమై 16 పైసలు పెంపు విషయమై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. చర్చలు ఫలిస్తే బుధవారం మధ్యాహ్నం నుంచైనా లావాదేవీలు జరిగే అవకాశముంది. లేకుంటే ప్రతిష్టంభన కొనసాగుతుంది. -
నరకయాతన
అంధకారంలో అనకాపల్లి వాణిజ్య కేంద్రానికి తప్పని చీకట్లు తాగు నీటికి జనం అవస్థలు జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి ఇప్పటికీ అంధకారంలోనే మగ్గుతోంది. తొమ్మిది రోజులవుతున్నా.. పట్టణంలో చీకట్లు తొలగలేదు.చీకటిపడితే జనం అడుగుతీసి బయటపెట్టలేని దుస్థితి. తాగు నీటికి నోచుకోక నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా రోజువారి అవసరాలకు వాడుక నీరు దొరక్క పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్న అధికారుల మాటలు అమలు కాలేదు. పనులు చేపడుతున్నా సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే వున్నాయి. అనకాపల్లి : పట్టణంలోని 60 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. 700 పైగా స్తంభాలు విరిగిపోయాయి. దీంతో రూ.3 కోట్ల మేర ఆ శాఖకు నష్టం వాటిల్లింది. విద్యుత్ డిమాండ్‌తో కశింకోట సబ్‌స్టేషన్ నుంచి అనకాపల్లికి ఇంతకాలం విద్యుత్ సరఫరా చేసేవారు. ప్రస్తుతం కశింకోట సబ్‌స్టేషన్ కూడా ధ్వంసమైంది. అక్కడి నుంచి విద్యుత్ వచ్చే అవకాసం లేకుండా పోయింది. రెండురోజుల క్రితమే వాటర్‌హౌస్‌కు విద్యుత్ సరఫరాకు అధికారులు భావించినా శారదానది మీదుగా విద్యుత్ తీగలు పడిపోవడంతో అధికారులు విఫలమయ్యారు. అనకాపల్లికి చారిత్రకంగా, వ్యాపారపరంగా గుర్తింపు ఉంది. ఇక్కడి జాతీయస్థాయి బెల్లం మార్కెట్లో రోజూ పెద్ద ఎత్తున లావాదేవీలు సాగుతాయి. జిల్లాస్థాయిలో కూరగాయల వ్యాపారం, ఇతర వాణిజ్య కలాపాలు కొనసాగుతుంటాయి. లక్షకు పైగా జనాభా ఉన్న ఈ పట్టణంలో దాదాపు జిల్లాస్థాయి ప్రధాన కార్యాలన్నీ ఉన్నాయి. దీనికితోడు వ్యాపార కలాపాల కోసం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పలువురు వస్తుంటారు. గురువారం నాటికే విద్యుత్ సరఫరా చేస్తామని నేతలతో పాటు అధికారులు చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా విద్యుత్ పునరుద్ధరణలో ఆశాఖ అధికారులు విఫలమయ్యారు. ఈ క్రమంలో ప్రజల్లో ఆగ్రాహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సీఎం చంద్రబాబునాయుడు, రాష్ర్టంలోని పలువురు మంత్రులు అనకాపల్లి మీదుగా పయనిస్తున్నా విద్యుత్ పునరుద్ధరణ విషయంలో అధికారులు చేతులెత్తేయడం శోచనీయం. వాతావరణం అనుకూలించకే : డీఈ రాజ్‌కుమార్... రెండు రోజులుగా వాతావరణం అనుకూలించకపోవడం వల్లే విద్యుత్ సరఫరా ఆలస్యమైందని డీఈ రవికుమార్ తెలిపారు. పరవాడ 22 కేవీ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితులలోను ఆదివారం రాత్రికి లేదా సోమవారం నాటికి విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు. -
ఊరటనిచ్చిన లావాదేవీలు
బెల్లం మార్కెట్ వర్గాల్లో ఆనందం 9 లక్షల దిమ్మల క్రయవిక్రయం రూ.33 నుంచి రూ.35 కోట్ల వ్యాపారం అనకాపల్లి, న్యూస్‌లైన్ : జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్లో మార్చి నెలలో రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదయ్యాయి. ఈ నెలలో 9 లక్షల బెల్లం దిమ్మల క్రయవిక్రయాలు జరిగినట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఇవి లక్షా 35 వేల క్వింటాళ్ల వరకు ఉంటాయి. సుమారు 33 నుంచి 35 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ జరిగినట్లయింది. వాస్తవానికి 2013-14 ఆర్థిక సంవత్సరంలో బెల్లం క్రయ విక్రయాలు మందకొడిగా సాగాయి. డిసెంబర్ నెలాఖరు వరకు కేవలం 55.76 కోట్ల లావాదేవీలు మాత్రమే జరగడంతో 2012-13 సీజన్ లావాదేవీలను అధిగమిస్తుందోలేదోనని మార్కెట్ అధికారులు ఆందోళనకు గురయ్యారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో మార్కెట్లో సుమారు రూ.65 కోట్ల పైబడి వ్యాపారం జరగడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 2012-13 సీజన్‌కు నీలం తుఫాన్, 2013-14 సీజన్‌కు భారీ వర్షాలు, నీటిముంపు చెరకు పంటకు తీవ్రనష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 2011-12 సీజన్లో అనకాపల్లి మార్కెట్లో రూ.161.61 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2012-13 సీజన్‌కు అంతకు ముందు సీజన్‌తో పోలిస్తే రూ.18 కోట్ల లావాదేవీలు తగ్గుముఖం పట్టడంతో నీలం తుఫాన్ కారణాన్ని చూపించి మార్కెట్ వర్గాలు ఉపశమనం పొందాయి. 2013 -14 సీజన్లో కూడా ఇంచుమించు గా రూ.140 కోట్ల లావాదేవీలు జరగడంతో ఈసారి కూడా భారీ వర్షాలు, నీటిముంపును చూసి మార్కెట్ వర్గాలు సర్ది చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలో 1.96 లక్షల హెక్టార్లలో చెరకు సాగు చేయగా, జిల్లాలో సాధారణ విస్తీర్ణంకంటే తక్కువుగానే చెరకు సాగు జరగడం, భారీ వర్షాల తాకిడి తోడవడంతో 2013-14 సీజన్ నిరాశాజనకంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు ముందే అంచనా వేశాయి. దీనికితోడు బెల్లం ధరలు సైతం ఈ సీజన్లో అటు రైతులను, ఇటు వర్తకులను నిరాశపరిచాయి. ఏదిఏమైనా మార్చి నెలలో జరిగిన లావాదేవీలు సీజన్లో తగ్గిన వ్యాపారానికి కాసింత సర్దుబాటు చేశాయని చెప్పవచ్చు. -
బెల్లం మార్కెట్ కళకళ
66,059 దిమ్మల క్రయవిక్రయాలు రికార్డు స్థాయిలో లావాదేవీలు సీజన్‌కే అత్యధికం కొనసాగుతున్న ధర పతనం అనకాపల్లి, న్యూస్‌లైన్: సీజన్ ముగింపు దశలో అనకాపల్లి బెల్లం మార్కెట్లో శనివారం రికార్డు స్థాయిలో క్రయవిక్రయాలు సాగాయి. 2013-14 సీజన్‌కే అత్యధికంగా లావాదేవీలు నమోదయ్యాయి. గత నెల 27న మార్కెట్‌కు 52,881 బెల్లం దిమ్మల రాగా, శనివారం ఆ రికార్డును అధిగమిస్తూ 66059 బెల్లం దిమ్మలు వచ్చాయి. యార్డులు రైతులు, కొనుగోలుదారులతో కళకళలాడాయి. అయితే ధరల్లో తగ్గుదల స్పష్టంగా కనిపించింది. గతేడాది ఫిబ్రవరి 22న మార్కెట్లో మొదటి రక ం క్వింటా రూ.2780లకు అమ్ముడుపోగా, శనివారం రూ.2680లు పలికింది. మూడో రకం మరీ దయనీయంగా రూ. 2180లకు పడిపోయింది. మార్కెట్లో లావాదేవీలు నిర్వహించే వర్తకుని మృతితో శుక్రవారం సెలవు ప్రకటించారు. దీంతో లావాదేవీలు పెరుగుతాయని భావించినప్పటికీ సీజన్‌కు అత్యధిక లావాదేవీలు జరిపిన రోజుగా రికార్డు నమోదవుతుందని మార్కెట్ వర్గాలు ఊహించలేదు. ఈ ఏడాది భారీ వర్షాలతో చెరకుతోటలు ముంపునకు గురయ్యాయి. అందువల్లే ఈ సీజన్లో దిగుబడి తగ్గిందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. -
కాస్త తీపి.. కాస్త చేదు
=బెల్లం మార్కెట్లో భిన్న పరిస్థితి =భారీగా లావాదేవీలు =రేటు తగ్గి వ్యాపారవర్గాలు కుదేలు అనకాపల్లి,న్యూస్‌లైన్ : బెల్లం రైతులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే చెరకు పంటకు నష్టం వాటిల్లి దిగుబడిపరంగా చతికిలపడ్డ రైతులకు అటు కర్మాగారాలందించే మద్దతు ధర నిరాశ పరుస్తోంది. ఇటు జాతీయస్థాయిలో పేరొందిన అనకాపల్లి మార్కెట్లో ధరలు ఊహించని స్థాయిలో పడిపోతున్నాయి. సోమవారం అనకాపల్లి మార్కెట్లో కనిపించిన స్థితిగతులే దీనికి అద్దంపడుతున్నాయి. ఈ సీజన్లోనే అత్యధిక బెల్లం దిమ్మలు వచ్చిన రోజుగా సోమవారం నమోదయింది. అదే సమయంలో మొదటిరకం బెల్లం ధరలు మూడువేలు లోపు పడిపోవడం మార్కెట్ వర్గాలను కుంగదీసింది. మార్కెట్‌కు 16,355 దిమ్మలు రాగా, మొదటిరకం అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 2960, మూడో రకం క్వింటాల్ అత్యల్పంగా రూ. 2480 పలికింది. శనివారం మార్కెట్‌కు 8810 దిమ్మలు రాగా మొదటి రకం ధర గరిష్టంగా రూ. 3170, మూడో రకం కనిష్ట ధర రూ. 2630 నమోదయ్యాయి. రెండు రోజుల వ్యవధిలో మొదటిరకం రూ. 210 కోల్పోగా మూడో రకం రూ. 150 తగ్గిపోయింది. లావాదేవీలు పెరిగినందుకు సంతోషపడాలో, ధరలు తగ్గిపోయినందుకు బాధపడాలో అర్ధం కాక మార్కెట్ వర్గాలు సతమతమయ్యాయి.