బెల్లం మార్కెట్‌కు సంక్రాంతి కళ
ఈ సీజన్‌లో అధిక లావాదేవీలు
లోటును పూడ్చుకునే యత్నం
అనకాపల్లి: బెల్లం మార్కెట్‌లో సోమవారం సంక్రాంతి పండుగ సందడి కనిపించింది. ఈ సీజన్‌కు రికార్డు స్థాయిలో బెల్లం దిమ్మలు వచ్చాయి. మార్కెట్లో 38 వేల 222 దిమ్మల లావాదేవీలు జరిగాయి. సంక్రాం తి ముందు బెల్లం తయారీ ఊపందుకుంటుంది. సంక్రాంతి పండుగకు సంబంధించిన ఆర్థిక అవసరాల కోసం బెల్లం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వినియోగిస్తారు. వాస్తవానికి జనవరి నెలలో గతంలో 50 వేల నుంచి 80 వేల దిమ్మల వరకు వచ్చిన సందర్భాలు వున్నాయి. అయితే ఈ సీజ బెల్లం వ్యాపారానికి ఎదురవుతున్న ప్రతిబంధకాల ప్రభావం తయారీపై కూడా పడింది. పెద్దనోట్ల రద్దు కారణంగా ఆర్థికపరమైన లావాదేవీలకు ఇబ్బందులు ఎదురవడంతో కొద్దిరోజులపాటు మార్కెట్లో లావాదేవీలు సైతం నిలిపివేశారు. చెరకు రైతుల భవితవ్యాన్ని దష్టిలో పెట్టుకొని వర్తకులు తప్పనిసరి పరిస్థితుల్లో కూడా వ్యాపారాలు ప్రారంభించారు. అయితే ఏరోజుకారోజు బెల్లం అమ్మకాలు జరపగా వచ్చిన సొమ్మును పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేకపోయారు.
గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా అప్పటికీ అంతంతమాత్రంగా జరుగుతున్న బెల్లం వ్యాపారంపై ఫుడ్ కంట్రోల్ అధికారులు మరింత ప్రభావాన్ని చూపారు. తెల్లబెల్లం తయారీలో హైడ్రాస్ వాడుతున్నట్లు వచ్చిన ప్రచారంపై ఫుడ్‌కంట్రోల్ అధికారులు అనకాపల్లి బెల్లం మార్కెట్లో గత నెలలో దాడులు జరిపారు. ఈ కారణంగా కూడా రైతులు బెల్లం తయారీకి కాస్త వెనుకంజ వేశారు. అయితే ఆ రెండు రకాల చేదు అనుభవాల నుంచి బయటపడిన బెల్లం రైతులు ఇపుడు బెల్లం వంటకాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించారు. భోగి, సంక్రాంతి, కనుమతోపాటు తదుపరి కొద్ది రోజులు బెల్లం వంటకాలను రైతులు నిలిపివేస్తారు. భోగికి ముందు వండిన బెల్లాన్ని విక్రయించడం ద్వారా పండుగకు అవసరమైన సొమ్మును పొందేందుకు రైతులు బెల్లం తయారీ జోరు పెంచారు. ఈ క్రమంలోనే 2016–17 సీజన్‌కు సంబంధించి సోమవారం బెల్లం లావాదేవీలు రికార్డుగా నిలిచాయి. ఇదే నెల రెండో తేదీన మార్కెట్‌కు 30,915 దిమ్మలు వచ్చాయి. అయితే ధరలు మాత్రం రైతులను తీవ్రంగా నిరాశపరిచాయి. మొదటి రకం క్వింటాల్‌కు గరిష్టంగా 3,740 రూపాయలు పలకగా మూడో రకం కనిష్టంగా 2,300 రూపాయలు పలికింది. గత వారంతో పోల్చితే క్విం టాల్‌కు మొదటి రకం 110 రూపాయలు తగ్గగా మూడో రకం 100 రూపాయలు తగ్గింది. నిరాశతో రైతులు వున్నప్పటికీ బెల్లం అమ్మకాలపై మాత్రం పూర్తిస్థాయిలోనే ఉత్సాహం చూపించారు.