యూపీ, మహారాష్ట్రకు దీటుగా అనకాపల్లి బెల్లం ఎగుమతులు
దేశంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్లలో ఒకటిగా అనకాపల్లి
బెల్లం ఉత్పత్తిలో పోషక విలువలు ఉండేలా ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రయోగాలు
బెల్లంలో తేమ శాతం తగ్గించి నిల్వ సామర్థ్యం పెంచేలా కృషి
బెల్లం పొడి, జొన్న, ఓట్సు బిస్కెట్లు, జెల్లీలు, చాక్లెట్‌లు, పల్లీ చెక్కీల ఎగుమతి
సాక్షి, అనకాపల్లి: సేంద్రియ పద్ధతుల్లో తయారుచేసే రుచికరమైన అనకాపల్లి ఆర్గానిక్ బెల్లానికి, దానితో తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయంగా గిరాకీ పెరిగింది. తయారీదారులకు విదేశాల నుంచి ఆర్డర్లు పెరుగుతున్నాయి. నాణ్యమైన పద్ధతుల్లో తయారుచేసే ఈ బెల్లం దేశ విదేశాల్లో వినియోగదారుల ఆదరణ చూరగొంటోంది.
రాజస్థాన్, ఒడిశా, పశి్చమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు అమెరికా, మారిషస్, అ్రస్టేలియా, యూరప్ దేశాలకు ఇక్కడి నుంచి బెల్లం ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బెల్లం సీజన్ ప్రారంభం కావడంతో ఆయా దేశాలనుంచి ఇక్కడి వ్యాపారులుకు ఆర్డర్లు ఊపందుకున్నాయి. అనకాపల్లి జిల్లా నుంచి ‘ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా’’మార్క్‌తో సేంద్రియ బెల్లం, దానితో తయారయ్యే ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంటారు. ఏటా అనకాపల్లి జిల్లా నుంచి సుమారు 25 వేల టన్నుల సేంద్రియ బెల్లం ఎగుమతి అవుతోంది.
అదేవిధంగా 30కి పైగా సేంద్రియ బెల్లం ఉత్పత్తులు కూడా ఎగుమతవుతున్నాయి. అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం, బెల్లం ఉత్పతులపై ఆధారపడి జీవించే కుటుంబాలు 100కి పైగా ఉన్నాయి. హైడ్రోస్ కలపకుండా మంచి ఫ్లేవర్స్ వచ్చేలా వినూత్న రీతిలో తయారుచేయడం, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో అనకాపల్లి ఆర్గానిక్ బెల్లానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అనకాపల్లి, మునగపాక, మాడుగుల, కోటవురట్ల మండలాల్లో ఆర్గానిక్ బెల్లం తయారుచేస్తున్నారు. చక్కెర కర్మాగారాలు గిట్టుబాటు ధర కలి్పంచలేని పరిస్థితుల్లో చెరకు రైతులకు ఆర్గానిక్ బెల్లం తయారీ సంస్థలు అండగా నిలుస్తున్నాయి.
హైడ్రోస్ కలపకుండా..
బెల్లం తయారీలో సహజంగా సల్ఫర్, పంచదార వినియోగిస్తుంటారు. కానీ సేంద్రియ బెల్లం తయారీలో అవి కలపకుండా వాటి స్థానంలో సుక్రోజ్, విటమిన్–ఎ, విటమిన్–సి లను తగు మోతాదులో కలిపి అత్యున్నత ప్రమాణాలతో తయారుచేయడం ప్రారంభించారు. పంచదారతో సంబంధం
లేకుండా, రంగుకు ప్రాధాన్యమివ్వకుండా, హైడ్రోస్ కలపకుండా బెల్లం అందిస్తారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆధునిక పద్ధతుల్లో బెల్లం తయారు చేసే యూనిట్లను ఇక్కడ కూడా ఏర్పాటుచేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో పోటీ పడుతూ.. అనకాపల్లి పరిశోధన కేంద్రాల్లో విలువ ఆధారిత బెల్లం తయారు చేస్తున్నారు.
ఆర్గానిక్ పద్ధతిలో తయారీ
అనకాపల్లి జిల్లాలో పలువురు సంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారీ యూనిట్లు ఏర్పాటుచేశారు. 5 గ్రాముల నుంచి 850 గ్రాముల బరువు బెల్లం దిమ్మలు, కుందులు, పౌడర్, బెల్లం ద్రావణాన్ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం భారత దేశం నుంచి ప్రపంచ దేశాలకు ఆరు మిలియన్ టన్నుల బెల్లం ఎగుమతిచేస్తున్నారు. ఇంకా డిమాండ్ భారీ స్థాయిలో ఉంది. దీంతో సేంద్రియ బెల్లం తయారీదారులు ఎగుమతులపై దృష్టి పెట్టారు. విదేశీయులు ఇష్టపడే ఫ్లేవర్లలో బెల్లం తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు.
ఆర్‌ఏఆర్‌ఎస్ నుంచి ఎగుమతి
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు దీటుగా అనకాపల్లి బెల్లం ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఆర్‌ఏఆర్‌ఎస్ (రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్)లో శాస్త్రవేత్తల సహకారంతో సేంద్రియ పద్ధతిలో బెల్లం ఉత్త్పత్తులను తయారు చేస్తున్నారు. అత్యుత్తమ నాణ్యత కారణంగా ఈ ఉత్పత్తులకు దేశ విదేశాల నుంచి ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పీఎంఎఫ్‌ఎంఈ(ప్రైమ్‌మినిస్టర్స్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్) పథకంలో భాగంగా అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రూ.3.5 కోట్లతో చెరకు, పనస, చిరుధాన్యాలకు సంబంధించి ఇంక్కుబేషన్ సెంటర్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో చెరకు ఇంక్యుబేషన్ సెంటర్‌లో ఉత్పత్తి ప్రారంభమై గణనీయమైన ఆదరణ కనిపిస్తోంది. పనస, చిరుధాన్యాల ఉత్పత్తులకు సంబంధించిన ఇంక్యుబేషన్ సెంటర్ల నిర్మాణంకూడా దాదాపు పూర్తయింది. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయోత్పత్తుల ఎగుమతులకు మంచి డిమాండ్ వచ్చి రైతులకు మేలు జరగనుంది.
రైతుకు అండగా..
ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటుతో చెరకు, చిరుధాన్యాలు, పనస రైతులకు అండగా నిలవడంతో పాటు వారి ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని చెరకు రైతులకు ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు. దీంతో పాటు పనస, మిల్లెట్స్ పండించే గిరిజన రైతులకు కూడా మంచి లాభాలు వస్తాయి. ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం కూడా పూర్తయింది.
– పి.వి.కె జగన్నాథరావు, ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీ
Comments
Please login to add a commentAdd a comment