
అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో మంగళవారం నుంచి లావాదేవీలు మొదలయ్యాయి.
అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో మంగళవారం నుంచి లావాదేవీలు మొదలయ్యాయి. నల్లబెల్లంపై ఎక్సైజ్ పోలీసులు పెడుతున్న కేసులకు నిరసనగా వర్తకులు ఆరురోజుల క్రితం లావాదేవీలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ప్రధానంగా ఇబ్బంది పడే వర్తకులు జిల్లాస్థాయి అధికారులతోపాటు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎంపీ డాక్టర్ బివి సత్యవతి, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలను కలిసి తమ గోడును వినిపించుకున్నారు.
వేధింపులవీ ఉండవని, అపోహలు వీడాలని పోలీసు ఉన్నతాధికారులు సైతం స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ క్రమంలో మార్కెట్‌లో మంగళవారం నుంచి లావాదేవీలు జరపాలని సోమవారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మంగళవారం నుంచి లావాదేవీలు ప్రారంభం కావడంతో మార్కెట్ వర్గాలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.