గణనీయంగా తగ్గిన లావాదేవీలు
2015-2016లో రూ.109 కోట్లకు పడిపోయిన విక్రయాలు
2009-2010 తర్వాత భారీగా తగ్గుదల 2011-2012లో మాత్రమే
రికార్డుస్థాయిలో రూ.161 కోట్ల వ్యాపారం తగ్గిన చెరకు విస్తీర్ణం, దిగుబడి
{పత్యామ్నాయ పంటలవైపు రైతుల మొగ్గు కలసిరాని మార్కెట్ పరిస్థితులు
అనకాపల్లి: జాతీయస్థాయిలో రెండో స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లావాదేవీలు గణనీయంగా తగ్గిపోయాయి. 2009-2010 ఆర్థిక సంవత్సరం తర్వాత పెరిగిన అనకాపల్లి మార్కెట్‌లో బెల్లం వ్యాపారం 2015-16లో తగ్గింది. 2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్ తుపాను, చెరకుపై పుసుపు ఆకు తెగులు ప్రభావం చెరకు, బెల్లం దిగుబడిపై గణనీయంగా ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే 2015-16 ఆర్థిక సంవత్సరంలో అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఆశాజనక ఫలితాలు దూరమయ్యాయి.
రూ. 109 కోట్లకు తగ్గిన వ్యాపారం...
2015-16 ఆర్థిక సంవత్సరంలో అనకాపల్లి బెల్లం మార్కెట్లో 4, 82,850 క్వింటాళ్ల బెల్లం విక్రయాలు జరగ్గా, 109 కోట్ల 18 లక్షల 30వేల 280 రూపాయల మేర వ్యాపారం జరిగింది. 2009-2010 ఆర్థిక సంవత్సరంలో 4,11,191 క్వింటాళ్ల బెల్లం లావాదేవీల మేరకు 104 కోట్ల 86 లక్షల 3వేల 387 రూపాయల వ్యాపారం జరిగింది. 2010-2011 ఆర్థిక సంవత్సరానికి 123 కోట్ల వ్యాపారం జరగ్గా 2011-2012 సీజన్‌లో రికార్డుస్థాయిలో 8 లక్షల 17వేల 958 క్వింటాళ్ల లావాదేవీల మేరకు 161 కోట్ల 60లక్షల 95వేల 510 రూపాయల వ్యాపారం జరిగింది. 2012-2013లో 143 కోట్లు, 2013-2014లో రూ.144 కోట్లు, 2014-2015లో రూ.121 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో మార్కెట్‌కు సెస్సు రూపేణ రావాల్సిన ఆదాయం పడిపోయింది. మరోవైపు జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గడం, చెరకుపై వైరస్ తాకిడి పెరగడంతో దిగుబడి తగ్గిపోయింది. ఈ ప్రభావం చక్కెర కర్మాగారాల రికవరీ, బెల్లం వ్యాపారంపైన చూపింది.
చెక్‌పోస్ట్ ద్వారా తగ్గిన ఆదాయం...
చెక్‌పోస్ట్ ద్వారా 2014-2015లో 89 లక్షల 71వేల 775 రూపాయల పన్ను లభించగా 2015-2016లో 66 లక్షల 13వేల 408 రూపాయలకు పడి పోయింది. దీంతో మార్కెట్ వర్గాలు కలవరపాటుకు గురవుతుండగా వర్తకుల్లో సైతం తగ్గిన బెల్లం వ్యాపారం నిరాశను మిగిల్చింది.
అన్నీ ఎదురుదెబ్బలే...
అనకాపల్లి బెల్లంమార్కెట్‌కు కొన్నేళ్లుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హుద్‌హుద్ తుపాను చెరకు పంటకు తీవ్ర నష్టాన్ని మిగల్చగా నాణ్యమైన విత్తనం లేకుండా పోయింది. మరోవైపు అనకాపల్లి మార్కెట్‌నుంచి రాష్ర్టంలోని పలు ప్రాంతాలకు తరలించే బెల్లంపై కొనసాగుతున్న ఆంక్షలు సైతం వ్యాపారంపై ప్రభావితం చేసింది. కేసుల తలనొప్పితో పలువురు బెల్లం వ్యాపారానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
తగ్గుతున్న చెరకు విస్తీర్ణం
రాష్ట్ర విభజన ప్రభావం సైతం అనకాపల్లి బెల్లం మార్కెట్‌పై పడింది. తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి బెల్లం రావడం వల్ల ఆ ప్రాంతానికి అనకాపల్లి నుంచి వెళ్లే బెల్లం తగ్గింది. అనకాపల్లి నుంచి ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపే వెళ్తోంది. దీనికి తోడు చెరకు సాగు చేసే రైతులు దీర్ఘకాలంపాటు నష్టాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేక స్వల్పకాలిక పంటలవైపు మళ్లుతున్నారు. ఈక్రమంలోనే వరి సాగు విస్తీర్ణం గత ఖరీఫ్‌లో పెరగడం గమనార్హం. చెరకుపంట సాగుకు ప్రతికూలంగా మారుతున్న అంశాలకు పరిష్కారం దొరక్కుంటే పరిస్థితి మరింత దిగజారనుంది. ఆ ప్రభావం చెరకు విస్తీర్ణంపైన, అనకాపల్లి బెల్లం వ్యాపారంపైన పడనుందని వ్యాపార, మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.