రెండో రోజూ బెల్లం మార్కెట్ బంద్
కొలగార్లు, వ్యాపారుల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన
16 పైసలు పెంచేందుకు వర్తకుల ప్రతిపాదన
బుధవారం ఉదయం నిర్ణయం వెల్లడిస్తామన్న కొలగార్లు
అనకాపల్లి: బెల్లం మార్కెట్‌లో కొలగారం పెంపు విషయమై చోటుచేసుకున్న ప్రతిష్టంభన తొలగలేదు. కొలగార్లు, వర్తకుల మధ్య మంగళవారం రాత్రి వరకు సాగిన చర్చలు ఫలించలేదు. మంగళవారం కూడా కొలగార్లు ఎవరూ మార్కెట్‌కు రాలేదు. కొలగారం పెంచాలన్న డిమాండ్‌తో కొలగార్లు మార్కెట్‌లో సోమవారం నుంచి బీట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రోజులు సుమారు రూ.4 కోట్లకు పైబడి బెల్లం వ్యాపారం ఆగిపోయింది. బుధవారం నాటి లావాదేవీలపై కూడా స్పష్టత లేకుండా పోయింది. మార్చి నెల కావడంతో బెల్లం సీజన్ జోరుగానే ఉంటుంది. సీజన్ ముగింపు దశలో లావాదేవీలు నిలిచిపోవడం రైతులకు పెద్ద నష్టమే. కమతాలలో తయారు చేసిన బెల్లం పాడయ్యే ప్రమాదముంది.
కొలగార్లకు వంద కిలోలకు 16 పైసలు పెంచేందుకు ఎగుమతి వర్తకులు సుముఖత వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం గిట్టుబాటుకాదని కొలగార్లు అభిప్రాయపడుతున్నారు. గ్రేడింగ్‌తో పాటు బీట్ నిర్వహణ కోసం దిగుమతి వర్తకులు అదనపు కొలగారం ఇవ్వాలని కోరుతున్నారు. బుధవారం ఉదయం వారంతా సమావేశమై 16 పైసలు పెంపు విషయమై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. చర్చలు ఫలిస్తే బుధవారం మధ్యాహ్నం నుంచైనా లావాదేవీలు జరిగే అవకాశముంది. లేకుంటే ప్రతిష్టంభన కొనసాగుతుంది.
ఫలితమివ్వని చర్చలు
Published Wed, Mar 4 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM