
కైకలూరు: ఏపీలో కొల్లేరు ప్రాంతం చేపల పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొల్లేరు పరీవాహక ప్రాంత నియోజకవర్గాలన్నీ ఒకే గూటికి చేరాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1.72 లక్షల ఎకరాల్లో 55,866 మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల నుంచి రోజు సుమారు 320 లారీల్లో చేపల ఎగుమతులు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతాయి. ఇటీవల ఆక్వా పరిశ్రమపై మక్కువతో ఔత్సాహిక రైతులు ఈ రంగంపై దృష్టి సారిస్తున్నారు. చేప ఉత్పత్తులలో మేలైన విధానాలు అవలభించకపోతే 30 శాతం నష్టపోయే అవకాశం ఉంది. చేపలను పట్టిన తర్వాత మెత్తబడటం, పొలుసులు ఊడటం, మొప్పలు పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని ప్యాకింగ్ చేయకూడదు. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మార్కెట్‌లో చేపలకు మంచి ధర దక్కుతుంది.
చెరువుల్లో చేపలను సరైన యాజమాన్య పద్ధతుల్లో సాగు చేయడం ఎంత ముఖ్యమో పట్టుబడి తర్వాత కూడా తాజా చేపలను మార్కెటింగ్ చేసి అధిక ధర దక్కించుకోవడమూ అంతే కీలకం. నీటి నుంచి చేపలను బయటకు తీసిన తర్వాత వాటి శ్వాసక్రియ ఆగిపోతుంది. ఆ వెంటనే జీవ రసాయన, సూక్షజీవుల చర్య మొదలవుతుంది. మాంసం సహజగుణం కోల్పోకుండా ప్యాకింగ్ చేసే వరకు చేపల రైతులు కొన్ని మెలకువలు పాటించాలని కలిదిండి మత్స్యశాఖ అభివృద్థి అధికారి సీహెచ్ గణపతి సూచిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటాల్లోనే..
పట్టుబడికి ముందు ఈ జాగ్రత్తలు అవసరం
∙రైతులు మార్కెట్‌లో చేపల ధరలను ముందే తెలుసుకోవాలి
∙చెరువుగట్టు వద్దే తూకం జరిగేలా వ్యాపారులతో ఒప్పందం చేసుకోవాలి
∙పట్టుబడి ముందు రోజు చెరువులో చేపలకు మేతలను నిలుపుదల చేయాలి
∙చిన్న చెరువు అయితే ఒక్క రోజులో పట్టుబడి ముగిసేలా చూడాలి.
∙చెరువులో నీరు తోడటానికి డీజిల్ ఇంజిన్లను సిద్ధం చేసుకోవాలి
∙కూలీలను, ఐస్ ప్యాకింగ్ చేసే వారిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి
∙ప్యాకింగ్‌కు ఐస్ ఎంత కావాలో ముందుగానే అంచనా వేయాలి
పట్టుబడి సమయంలో..
∙ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున పట్టుబడి చేయాలి
∙చెరువులో నీటిమట్టం మూడో వంతుకు వచ్చిన తర్వాత లాగుడు వలలతో చేపలను పట్టాలి
∙నీరు బయటకుపోయే తూముకు సంచి కట్టాలి
∙పట్టుబడి చేసేటప్పుడు నీటిని ఎక్కువగా బురద చేయకూడదు
∙చేపల పట్టుబడికి రసాయనాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించకూడదు
∙చేపలు ఎగరకుండా ట్రేలను ఉపయోగించాలి
∙చేపలను బయటకు తీసిన వెంటనే తూకం వేసే ప్రదేశానికి తరలించాలి
పట్టుబడి తర్వాత..
∙పట్టుబడి చేసిన చేపలను మంచినీటిలో శుభ్రపర్చాలి
∙నేలపై పరిచిన ప్లాస్టిక్ సంచి మీద మాత్రమే చేపలను వదలాలి
∙దెబ్బలు తగలకుండా, మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
∙తూకం, రవాణా ప్రదేశం ఒకే చోట ఉండేలా చూడాలి
∙పరిశుభ్రమైన మంచినీటితో తయారు చేసిన ఐస్‌ను వాడాలి
∙రవాణా సమయాన్ని బట్టి 1:1 నిష్పత్తిలో ఐస్ ఉపయోగించాలి
∙మోతాదుకు మించి ఎక్కువ వరసలో చేపలను ట్రేలలో ఉంచకూడదు
∙ప్లాస్టిక్ ట్రేలలో చేపలను ప్యాకింగ్ చేసినప్పుడు అడుగు భాగంలో రంధ్రాలు ఏర్పాటు చేయాలి
∙మిషన్ ఆడించి పొడిగా చేసిన ఐస్‌ను మాత్రమే ప్యాకింగ్‌కు ఉపయోగించాలి
గ్రేడింగ్ ఇలా..
∙చేపల పట్టుబడి తర్వాత గ్రేడింగ్ ఎంతో కీలకం
∙మెత్తబడిన చేపలు, గ్రహణం మొర్రి, వంకర తిరిగిన చేపలు, జన (గుడ్లు)ను గుర్తించాలి
∙ఆరోగ్యంగా లేని చేపలను విడిగా ప్యాకింగ్ చేయాలి
∙చేపలను ప్లాస్టిక్ ట్రేలు, థర్మకోల్ బాక్సుల్లోనే ప్యాకింగ్ చేయాలి
∙గ్రేడింగ్ చేసిన సమయంలో మెత్తబడిన చేపలను విడిచేటప్పుడు మిగిలిన చేపలతో కలవకుండా చూడాలి
∙చేపల సైజులను గుర్తించి విడివిడిగా ప్యాకింగ్ చేయాలి
∙గ్రేడింగ్ చేసేటప్పుడు కచ్చితంగా శుభ్రత పాటించాలి
చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే!
Comments
Please login to add a commentAdd a comment