- 66,059 దిమ్మల క్రయవిక్రయాలు
- రికార్డు స్థాయిలో లావాదేవీలు
- సీజన్‌కే అత్యధికం
- కొనసాగుతున్న ధర పతనం
అనకాపల్లి, న్యూస్‌లైన్: సీజన్ ముగింపు దశలో అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో శనివారం రికార్డు స్థాయిలో క్రయవిక్రయాలు సాగాయి. 2013-14 సీజన్‌కే అత్యధికంగా లావాదేవీలు నమోదయ్యాయి. గత నెల 27న మార్కెట్‌కు 52,881 బెల్లం దిమ్మల రాగా, శనివారం ఆ రికార్డును అధిగమిస్తూ 66059 బెల్లం దిమ్మలు వచ్చాయి. యార్డులు రైతులు, కొనుగోలుదారులతో కళకళలాడాయి. అయితే ధరల్లో తగ్గుదల స్పష్టంగా కనిపించింది. గతేడాది ఫిబ్రవరి 22న మార్కెట్‌లో మొదటి రక ం క్వింటా రూ.2780లకు అమ్ముడుపోగా, శనివారం రూ.2680లు పలికింది.
మూడో రకం మరీ దయనీయంగా రూ. 2180లకు పడిపోయింది. మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించే వర్తకుని మృతితో శుక్రవారం సెలవు ప్రకటించారు. దీంతో లావాదేవీలు పెరుగుతాయని భావించినప్పటికీ సీజన్‌కు అత్యధిక లావాదేవీలు జరిపిన రోజుగా రికార్డు నమోదవుతుందని మార్కెట్ వర్గాలు ఊహించలేదు. ఈ ఏడాది భారీ వర్షాలతో చెరకుతోటలు ముంపునకు గురయ్యాయి. అందువల్లే ఈ సీజన్‌లో దిగుబడి తగ్గిందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు.