Crop acreage
-
చేదెక్కుతున్న సాగు
ప్రభుత్వ పోకడలు రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. ప్రతికూల వాతావరణ ం,మద్దతు ధర లేకపోవడం, చక్కెరమిల్లుల దయనీయ పరిస్థితుల ప్రభావం చెరకు సాగుకు అన్నదాతను దూరం చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కాడిమేడి వదిలేస్తున్న వైనం దీనికి అద్దం పడుతోంది. ఇప్పటికే రైతులు నాట్లు వేయడం మానేశారు. వేసిన పంటకే ఎరువులు దొరకక నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఈ ఏడాది నాలుగు చక్కెర కర్మాగారాల్లో లక్ష్యం మేరకు క్రషింగ్ అనుమానమే. మరో పక్క బెల్లం తయారీ కూడా నామమాత్రంగా ఉండేలా ఉంది. - తగ్గిన చెరకు పంట విస్తీర్ణం - రుణాలివ్వని బ్యాంకర్లు - పెట్టుబడులు లేక ఆసక్తి చూపని రైతులు - ఆందోళన కలిగిస్తున సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితులు చోడవరం: అంతర్జాతీయ బెల్లం మార్కెట్, నాలుగు సహకార చక్కెర కర్మాగారాలు ఉండటంతో జిల్లాలో ఏటా 2లక్షల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. ఈ ఏడాది బెల్లం ధరలు తగ్గడం, చెరకు సరఫరా చేసిన రైతులకు మిల్లు యాజమాన్యాలు సకాలంలో చెల్లిం పులు చేపట్టకపోవడంతో ఈ పంటపై రైతుల్లో ఆసక్తి తగ్గింది. ఇప్పటి వరకు 70శాతమే నాట్లు పడ్డాయి. మిగతా 30శాతం నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది చెరకు రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. పంట పక్వానికి వచ్చే సమయంలో హుద్‌హుద్ ధాటికి 40శాతం పంటను కోల్పోయారు. ఉన్నదానిని దక్కించుకుని బెల్లం తయారీకి, ఫ్యాక్టరీలకు తరలించినా పెట్టుబడులు కూడా దక్కలేదు. బెల్లం ధరలు తగ్గిపోవడం, పంచదారకు ధరలేకపోవడం, రాష్ట్రం ప్రభుత్వం ఆదుకోని విధానంతో సుగర్ ఫ్యాక్టరీలు చతికిలపడ్డాయి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేపట్టలేకపోయాయి. కేంద్రం ప్రకటించిన రూ.2265 మద్దతు ధరనే గోవాడ లాంటి ఫ్యాక్టరీ సైతం ఇవ్వలేదు. దీనికి తోడు ఫ్యాక్టరీల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేక, ఒక వేళ అప్పులు చేసినా గిట్టుబాటు ధర లభిస్తుందన్న నమ్మకం లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంట వేస్తే అప్పులేనంటూ సాగు విస్తీర్ణాన్ని తగ్గించారు. ఈ ఏడాది చెరకు నాట్లు సమయంలో వర్షాలు అనుకూలించలేదు. మోటార్ల సాయంతోనైనా నాట్లు వేద్దామంటే జలాశయాలు, నదులు, చెరువులు, కొండగెడ్డలు అడుగంటడంతో అన్నదాతలు నిరాశకు గురయ్యారు. వీటికి తోడు కూలీ ధరలు, ఎరువులు, విత్తనం ధరలు భారీగా పెరగడంతో గతంలో ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెడితే ఈ ఏడాది రూ.45వేలకు పైబడే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం పుణ్యమా అని రుణమాఫీ అమలుకాకపోవడంతో బ్యాంకులు సైతం అప్పులివ్వలేదు. రైతులు పూర్తిగా ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇన్ని సమస్యలు చుట్టుముట్టడంతో చెరకు సాగుకు దూరమవుతున్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 30వేల ఎకరాల్లో చెరకు సాగు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు 22వేల ఎకరాల్లో మాత్రమే చేపట్టారు. జిల్లాలో అత్యధికంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోనే సుమారు 80వే ఎకరాలకు పైబడి చెరకు పండిస్తారు. అలాంటిది ఈ ఏడాది 65వేలకు మించలేదు. నెలాఖరుతో నాట్లుకు సీజన్ ముగుస్తోంది.చోడవరం, చీడికాడ, బుచ్చెయ్యపేట, సబ్బవరం,అనకాపల్లి, కశింకోటతో పాటు చెరకు పండించే అనేక ప్రాంతాల్లో భూములను రైతులు రీఎలర్టర్లకు అమ్మేస్తున్నారు. అప్పులు చేసి సాగుచేయలేమని వాపోతున్నారు. -
పరిహారం... పరిహాసం!
అన్నదాతలపై ప్రభుత్వం చిన్నచూపు ఏటా తగ్గుతున్న పంట విస్తీర్ణం ఒక్క కోలారు జిల్లాలోనే రూ.189 కోట్ల మేర పంట నష్టం పరిహారం చెల్లింపుల్లో ఉదాసీనత కనీస పెట్టుబడులూ దక్కని వైనం పాలకుల వైఫల్యానికి పరాకాష్ట కనుచూపు మేరలో ఎక్కడా పచ్చని చెట్లు కనిపించవు. తాగేందుకు నీళ్లు కూడా లభ్యం కావు! ఒకవేళ దొరికినా విషతుల్యం... ఫ్లోరైడ్ మయం. ఇక్కడ వ్యవసాయం చేయడమంటే సాహసమే. బోరుబావి ఏర్పాటు చేయాలంటే 1500 అడుగుల లోతున నీటి కోసం సోధించాల్సిందే. అదృష్టం బాగుంటే అరకొరగా నీరు లభ్యమవుతుంది. లేదంటే అన్నదాత అప్పుల పాలవ్వాల్సిందే. ఇది ప్రకృతి శాపం కాదు.. పాలకుల అసమర్థతను ఎత్తి చూపుతూ దశాబ్ధాలుగా కరువు కాటకాలతో చిక్కి శల్యమై పోతున్న కోలారు జిల్లా దుస్థితి. నీటి బొట్టు కోసం ఇక్కడ పుడమి తల్లి తహతహలాడుతోంది. నీటి పథకాల పేరుతో కాలయాపన చేయడం ప్రజాప్రతినిధులకు ప్రహసనంగా మారింది. వ్యక్తిగత పరువుకు పాకులాడుతుండడంతో పది మందికి ఉపయోగపడే నీటి పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. వరుస పంట నష్టాలను చవి చూస్తున్న అన్నదాతలను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు సైతం చర్యలు చేపట్టకపోవడంతో ఏటా పంట విస్తీర్ణం తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోలారు జిల్లాలో రైతు ఉనికికి ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోలారు: దశాబ్దాలుగా కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న కోలారు జిల్లాలో ప్రతి ఏటా పంట విస్తీర్ణం తగ్గిపోతోంది. వర్షాభావ పరిస్థితులు నెలకొని వరుస పంట నష్టాలతో అన్నదాతలు చిక్కి శల్యమైపోతున్నారు. అధికారుల లెక్క ప్రకారం కోలారు జిల్లాలో 1.02 లక్షల హెక్టార్ల పంట విస్తీర్ణం ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల గత ఏడాది 79,025 హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేయగలిగారు. ఇందులో 50 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా 13,160 హెక్టార్లలో వేరుశనగను విత్తారు. ఇందులో 12వేల హెకా్టార్లలో పంట నష్టం వాటిల్లిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. అలాగే 48,162 హెక్టార్లలో రాగి పంట సాగు చేపడితే 47,397 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. పంట పెట్టుబడులు సైతం దక్కకపోవడంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. మొత్తానికి ఈ ఏడాది 4.97 లక్షల క్వింటాళ్ల దిగుబడి తగ్గడంతో రూ. 84.75 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఎండుతున్న తోటలు కోలారు జిల్లాలో 1,06,262 హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. ఇందులో 53,209 హెక్టార్లలో పండ్ల తోటలు ఉండగా 45 వేల హెక్టార్లలోని తోటలు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయాయి. దీంతో రూ. 103.48 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 2014 నవంబర్ 20న ఆర్.బి.సిన్హా నేతృత్వంలోని కరువు పరిశీలన కేంద్ర ృందం కోలారు జిల్లాలో పర్యటన చేసి అధ్యయనం చేసిన సమయంలో జిల్లాలో రూ. 189 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు నివేదికను జిల్లా యంత్రాంగం అందజేసింది. మామిడి పంటలకు ప్రపంచ ప్రసిధ్ది పొందిన కోలారు జిల్లాలో నేడు నీటి కొరత వల్ల మామిడి చెట్లు ఎండుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎండుతున్న మామిడి చెట్లను గుర్తించి రైతులు బాధతో వాటిని కొట్టి వేస్తున్నారు. అరకొర సాయం కోలారు జిల్లాలో ఇంత భారీ ఎత్తున పంట నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. నామమాత్రంగా పంట నష్ట పరిహారాన్ని విదిల్చి పాలకులు చేతులు దులుపుకుంటున్నారు. రూ. వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం లెక్కలు చూపిస్తున్నా కేవలం రూ. 28.74 కోట్ల మేర పరిహారాన్ని ప్రభుత్వం అందించడం రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పంట పెట్టుబడుల కింద ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులకు కనీసం వడ్డీకి కూడా పరిహారం సరిపోకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా అన్నదాతలను ఆదుకునే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పంట సాగు చేసేందుకు ఎవరూ ముందుకు రారని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.