‘చక్కెర’కు చేదు ఫలం!
- తుఫాన్ తాకిడితో కోలుకోలేని దెబ్బ
- ధ్వంసమైన గోవాడ, తుమ్మపాల, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు
- రూ.40 కోట్ల యంత్రాలు, రూ.110 కోట్ల పంచదార లాస్
చోడవరం : హుదూద్ తుఫాన్ బీభత్సం సహకార చక్కెర కర్మాగారాలకు చేదు ఫలం మిగిల్చింది. అసలే అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చింది. మరో నెలరోజుల్లో అన్ని ఫ్యాక్టరీలు క్రషింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఊహించని విపత్తు ఫ్యాక్టరీలను కుదిపేసింది. జిల్లాలోని గోవాడ, ఏటికొప్పాక, అనకాపల్లి (తుమ్మపాల), తాండవ చక్కెర కర్మాగారాలకు తీరని నష్టం వాటిల్లింది. నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఫ్యాక్టరీలు కావడంతో మిషనరీ, గోదాముల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
తుఫాన్ వర్షాలకు మిషనరీ తడిసి దెబ్బతినగా గోదాముల పైకప్పులు ఎగిరిపోయి నిల్వ ఉంచిన పంచదార బస్తాలు తడిసిపాడయ్యాయి. తాం డవ ఫ్యాక్టరీకి అంతగా నష్టం జరగకున్నా మిగతా మూడు ఫ్యాక్టరీలకు భారీ నష్టమే మిగిలింది. దాదాపు రూ.150 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఒక్క గోవాడ ఫ్యాక్టరీలోనే రూ.14 కోట్ల విలువైన మిషనరీ ధ్వంసమైంది. గోదాముల్లో నిల్వ ఉంచిన రూ.82 కోట్ల విలువైన 2 లక్షల 52 వేల బస్తాల పంచదార తడిసిపోయింది.
ఏటికొప్పాకలో రూ.5 కోట్ల మేర ప్లాంట్‌కు, రూ.10 కోట్ల విలువైన పంచదారకు నష్టం జరిగింది. తుమ్మపాల సుగర్స్ మిషనరీ పూర్తిగా దెబ్బతింది. పాతమిల్లు కావడంతో గాలుల విధ్వంసానికి ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది. రూ.9 కోట్ల మేర ఫ్యాక్టరీకి నష్టం వాటిల్లగా రూ.2 కోట్ల విలువైన పంచదార తడిసిపోయింది. వీటన్నింటికీ బీమా సదుపాయం ఉ న్నప్పటికీ ప్రభుత్వం మరో రూ.70 కోట్ల మేర ఆదుకోవాల్సి ఉందని ఆయా ఫ్యాక్టరీల యాజ మాన్యాలు, పాలకవర్గాలు కోరుతున్నాయి.
దిక్కుతోచని స్థితిలో రైతులు
తుఫాన్ బీభత్సంతో ఫ్యాక్టరీలకు నష్టం జరగడం ఒక ఎత్తయితే, క్రషింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విపత్తు ఎదుర్కోవాల్సి రావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పంట కోతకు రావడంతో చెరకు సరఫరాకు రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో తుఫాన్ విరుచుకుపడింది. జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో చెరకు పంట నేలమట్టమైనట్లు ప్రాథమిక అంచనా. ఇందులో 40 వేల ఎకరాల్లో పంట పూర్తిగా పక్వానికి వచ్చిన దశలో ఉంది. తొలివిడత క్రషింగ్‌కు కటింగ్ ఆర్డర్ ఇచ్చేది ఈ పంటకే. ఈ పరిస్థితుల్లో తోటలన్నీ ఒరిగిపోయి నీటమునగడంతో రికవరీ ఐదు శాతానికి మించి రాదని వ్యవసాయాధికారులే చెబుతున్నారు.
ఈ విధంగా లెక్కేస్తే రైతులకు లక్షల్లో నష్టం వాటిల్లినట్లే. పంట దెబ్బతిని రైతులు, ఫ్యాక్టరీలు దెబ్బతిని యాజమాన్యాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. పరిస్థితి ఏదైనా సకాలంలో క్రషింగ్ ప్రారంభం కాకుంటే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో యాజమాన్యాలు ప్రభుత్వ ఆసరా కోసం ఎదురు చూస్తూ, మరోవైపు బీమా సొమ్ము కోసం అన్ని పాట్లు పడుతున్నాయి. తక్షణం ప్రభుత్వం ఆదుకోకుంటే సహకార ఫ్యాక్టరీల మనుగడ మరింత ప్రశ్నార్థకంలో పడే ప్రమాదం ఉంది.
డిసెంబర్‌కు క్రషింగ్
ఎన్నిఅడ్డంకులు ఎదురైనా డిసెంబర్ మొదటి వారానికి క్రషింగ్ ప్రారంభిస్తాం. తుఫాన్ తాకిడికి తీవ్ర నష్టం జరిగింది. అయినా రైతు శ్రేయస్సు దృష్ట్యా క్రషింగ్‌కు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఫ్యాక్టరీ మిల్లు హౌస్ మరమ్మతుకు కూలీలను, అవసరమైన సామగ్రి సమకూర్చుతూ మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం. సహకార చక్కెర ఫ్యాక్టరీల మనుగడను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొంతమేర ఆదుకోవాలి
- గూనూరు మల్లునాయుడు, చైర్మన్ గోవాడ సుగర్స్