మంత్రి కుటుంబం ఫ్యాక్టరీలనీటి అవసరాల కోసం తుంగభద్రపై చెక్‌డ్యాం
కర్నూలు తాగునీటి అవసరాల పేరుతో తన ఫ్యాక్టరీలకు నీటిని మళ్లించుకునే ఎత్తుగడ
కిరణ్‌కుమార్ హయాంలో రూ.64.89 కోట్లతో ప్రతిపాదనలు.. 2017లో రూ.177 కోట్లతో రివైజ్
నాడు తిరస్కరించిన నీటిపారుదలశాఖ.. తాజాగా మరోసారి ప్రతిపాదనలు
రూ.300 కోట్లకుపైగా ఖర్చవుతుందంటున్న అధికారులు
తుంగభద్ర ఒడ్డున ఫ్యాక్టరీలు..! రూ.వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం! చేతిలో మంత్రి పదవి..! ఏకంగా పరిశ్రమలశాఖ! ఇంకేముంది..? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా అధికారంలో ఉండగానే తన ఫ్యాక్టరీల నీటి అవసరాల కోసం చెక్‌డ్యాం నిర్మాణానికి మంత్రి టీజీ భరత్ ఉపక్రమించారు. ఆయన తండ్రి టీజీ వెంకటేశ్ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీ భరత్‌ను మంత్రి పదవి వరించడంతో కర్నూలు ప్రజల తాగునీటి అవసరాల పేరుతో తుంగభద్ర నదిపై చెక్‌డ్యాం నిర్మించి నది ఒడ్డున ఉన్న తమ ఫ్యాక్టరీల నీటి అవసరాలను తీర్చుకునే ఎత్తుగడ వేశారు. అధికార పార్టీ! పైగా మంత్రి పదవిలో ఉండటంతో అధికారులు ‘జీ హుజూర్’ అంటూ ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు.– సాక్షి ప్రతినిధి కర్నూలు
కర్నూలు ఎమ్మెల్యే, మంత్రి టీజీ భరత్ కుటుంబానికి తుంగభద్ర నది సమీపంలో రెండు ఆల్కలీస్ ఫ్యాక్టరీలున్నాయి. వీటికి వేసవిలో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఫిబ్రవరి–జూన్ మధ్య ఫ్యాక్టరీకి నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉంది. దీంతో టీజీ వెంకటేశ్ తన ఫ్యాక్టరీకి సమీపంలో తుంగభద్రపై చెక్‌డ్యాం నిర్మించాలని భావించారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో టీజీ మంత్రిగా ఉన్న సమయంలో తుంగభద్రపై చెక్‌డ్యాం నిర్మించేందుకు 2013 జూన్ 18న జీవో 56 జారీ చేయించారు. రూ.64.89 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించి 0.50 టీఎంసీలు నిల్వ చేసేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ శిలా ఫలకాన్ని కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం రాష్ట్ర విభజన పరిణామాలతో జీవో కార్యరూపం దాల్చలేదు. ఆపై టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో 2017లో మరోసారి అధికారులు రూ.177 కోట్లతో డీపీఆర్ రివైజ్ చేసి పరిపాలన అనుమతుల కోసం పంపారు. అయితే సీడబ్ల్యూసీ అనుమతి, నీటి కేటాయింపుల సమస్య, చెక్‌డ్యాం నిర్మిస్తే ఉత్పన్నమయ్యే ఇబ్బందులతో ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
కూటమి రాగానే మరోసారి ప్రతిపాదనలు
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, టీజీ భరత్ మంత్రి పదవిలో ఉండటంతో చెక్ డ్యాం నిర్మాణం అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు గత నెల 21న ఇరిగేషన్ ఎస్‌ఈకి ఓ లేఖ రాశారు. నగర భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర, హంద్రీపై చెక్‌డ్యాం నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని, 12 నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని ప్రతిపాదించారు. దీనిపై అదే నెల 27న ఇరిగేషన్ ఎస్‌ఈ తిరిగి కార్పొరేషన్ ఎస్‌ఈకి లేఖ రాశారు.
చెక్‌డ్యాం నిర్మాణానికి టెక్నికల్ కమిటీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుకూలతలు, ప్రతికూలతలతోపాటు సమీపంలో రైల్వే బ్రిడ్జి ఉన్నందున ఆ శాఖ నుంచి అభ్యంతరాలు తదితర అంశాలన్నీ పరిశీలించి ఫీజుబులిటి నివేదిక ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే అభ్యంతరాలను అధిగమించి ప్రభుత్వం నుంచి జీవో జారీ చేయించే పనిలో మంత్రి భరత్ ఉన్నట్లు అధికారులు చర్చించుకుంటున్నారు.
ఇప్పటి అధికారుల ప్రతిపాదన ఇదీ..
కర్నూలు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి అవసరాల కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. శివారు కాలనీలకు తాగునీటి సమస్య ఉండటంతో మునగాలపాడు వద్ద రూ.15 కోట్లతో మరో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. దీంతో పాటు అమృత్ ద్వారా హంద్రీ–నీవా నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.130 కోట్లు మంజూరు చేశారు.
ఈ పథకానికి అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును రద్దు చేసి చెక్‌డ్యాం నిర్మించాలని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం చెక్‌డ్యాం నిర్మించేందుకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని తెలుస్తోంది. అమృత్ పథకం కింద మంజూరైన రూ.130 కోట్లు కాకుండా తక్కిన మొత్తాన్ని మంజూరు చేయించుకుని చెక్‌డ్యాం నిర్మించాలని భావిస్తున్నారు.
చెక్‌డ్యాం నిర్మిస్తే 0.50 టీఎంసీలు నీరు నిల్వ ఉంటుందని, అందులో 0.30 టీఎంసీలు కర్నూలు తాగునీటి అవసరాలకు, తక్కిన 0.20 టీఎంసీలు తన పరిశ్రమలకు వినియోగించుకునేలా జీవో మంజూరు చేసేలా మంత్రి టీజీ భరత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రివర్స్ పంపింగ్ చేస్తారా?
కర్నూలు తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే హంద్రీ–నీవా నుంచి ప్రతిపాదనలు ఉన్నపుడు దాన్ని పూర్తి చేయకుండా చెక్‌డ్యాంను తెరపైకి తేవడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
కేవలం టీజీ ఫ్యాక్టరీల కోసమే మంత్రి చెప్పినట్లు నడుచుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఒకవేళ చెక్‌డ్యాం నిర్మించాల్సి వస్తే మునగాలపాడు సమీపంలో నిర్మిస్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు దగ్గరవుతుంది. అలా కాకుండా రాఘవేంద్ర మఠం సమీపంలో చెక్‌డ్యాం నిర్మించి తిరిగి రివర్స్ పంపింగ్ చేయాలని అంటున్నారు.
పైగా కర్నూలు మురుగునీరు మొత్తం అందులో నిల్వ ఉంటుందని, తుంగభద్రలో నీటి ప్రవాహం లేనపుడు కేవలం మురుగునీటి మడుగుగా మారే అవకాశం ఉందని, ఆ నీటిని తాగునీటికి ఎలా వినియోగిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నీటితో కేవలం టీజీ ఫ్యాక్టరీల అవసరాలు మాత్రమే తీరుతాయని చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment