ఆశల పల్లకీలో నేతలు
సార్వత్రిక పోరులో అత్యధిక స్థానాల్లో కూటమి విజయం
2004 తర్వాత టీడీపీకి తొలిసారి అత్యధిక అసెంబ్లీ స్థానాలు
కూటమి అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై చర్చ
రేసులో కోట్ల, బీసీ, టీజీ, భూమా, ఫరూక్
తమ నాయకుడికే అవకాశమని కేడర్‌లో ధీమా
సార్వత్రిక పోరు ముగిసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే కూటమి నేతగా నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందనే చర్చ కర్నూలు, నంద్యాల జిల్లాలో మొదలైంది. 2004 తర్వాత అత్యధిక స్థానాల్లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడంతో మంత్రి పదవి ఆశించేవారి సంఖ్య కూడా పెరిగింది.
నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లాకో మంత్రి పదవి ఇస్తారా? లేదా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఒకే మంత్రి పదవి ఇస్తారా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. సీనియర్ నేతలకు మంత్రి పదవి దక్కుతుందని అధిక శాతం నేతలు భావిస్తున్నా, సామాజిక సమీకరణల నేపథ్యంలో తమకూ అవకాశం దక్కుతుందని తొలిసారి అసెంబ్లీకి వెళ్లే నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రెండు ఎంపీలతో పాటు 12 అసెంబ్లీలు కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఆదోనిలో బీజేపీ అభ్యర్థి పార్థసారథి ఎమ్మెల్యేగా గెలుపొందితే, తక్కిన 11 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆలూరు, మంత్రాలయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా విరూపాక్షి, బాలనాగిరెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థుల్లో మంత్రి వర్గంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.
సార్వత్రిక పోరులో ప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మ టిక్కెట్లు ఆశించారు. అయితే ఆమెకు టిక్కెట్ ఇవ్వలేమని, డోన్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని.. గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారనే చర్చ కోట్ల వర్గంలో నడుస్తోంది. దీంతో ప్రకాశ్‌రెడ్డికి కచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే ఆశాభావం ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది. కోట్ల అసెంబ్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో ఆదోని నుంచి పోటీ చేసి మీనాక్షినాయుడు చేతిలో ఓడిపోయారు. అయితే కర్నూలు ఎంపీగా ఆయన పలుసార్లు ప్రాతినిథ్యం వహించారు. కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.
నంద్యాల జిల్లా నుంచి రేసులో ముగ్గురు..
నంద్యాల జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. 2014లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన బీసీ, 2019లో ఓటమి చెందారు. తిరిగి 2024లో విజయం సాధించారు. నంద్యాల జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ కూడా కేబినెట్ బెర్త్‌పై ఆశపెట్టుకున్నారు. ఇదే జిల్లాలో భూమా అఖిలప్రియ కూడా మంత్రివర్గంలో చోటుపై ధీమాగా ఉన్నారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన అఖిలప్రియ ఆపై తన తండ్రి భూమా నాగిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
నాగిరెడ్డి మృతి తర్వాత అఖిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. పర్యాటక శాఖ మంత్రిగా చేసిన అఖిల ఈ దఫా కూడా మహిళల కోటాలో తనకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. అలాగే నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ కూడా మంత్రి వర్గంలో చోటుపై ఆశలపల్లకిలో ఉన్నారు. 1999లో మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉంది. మైనార్టీ నేత కావడం, రాయలసీమలో మదనపల్లి, నంద్యాల మాత్రమే మైనారీ్టలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇద్దరూ గెలుపొందినా వీరిలో ఫరూక్ సీనియర్ కావడంతో మైనార్టీ కోటాలో కచ్చితంగా చోటు దక్కుతుందనే ఆశతో ఉన్నారు.
పార్థసారథిని అదృష్టం వరించేనా?
కర్నూలు జిల్లాలో తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఆదోని నుంచి పార్థసారథి గెలుపొందారు. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈయనకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. కర్నూలు, అనంతపురంలో బలమైన సామాజికవర్గంగా వాల్మీకులు, కురబలు ఉన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, గుంతకల్లులో కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం ఉన్నారు. వీరిద్దరికీ మంత్రి పదవుల అనుభవం ఉంది. అయితే అనంతపురం జిల్లాలో పోటీ ఎక్కువగా ఉంది.
కురబ, వాల్మీకులకు చెరో మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవితకు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాలవ, గుమ్మనూరు, పార్థసారథిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఒక బీసీకి అనంతపురంలో ఇస్తే, మరో బీసీకి ఇచ్చే అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఈక్రమంలో వాల్మీకి వర్గం నుంచి పార్థసారథిని మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
పైగా ఇతను బీజేపీ నేత కావడంతో.. ఆ పారీ్టకి కూడా కనీసం 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండటంతో పార్థసారథికి అదృష్టం వరించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా కర్నూలు, నంద్యాల జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కూటమి అభ్యర్థుల్లో దాదాపు సగం మంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎవరికి అమాత్యయోగం ఉందో వేచిచూడాలి.
టీజీ, కేఈలు కూడా మంత్రివర్గంపై ఆశలు..
సీనియర్ నేతలతో పాటు తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్న కర్నూలు, పత్తికొండ ఎమ్మెల్యేలు టీజీ భరత్, కేఈ శ్యాంబాబు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. టీజీ భరత్ ఆర్యవైశ్యుల కోటాలో తనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా తనను గెలిపించాలని, ఈ దఫా తాను మంత్రిని కాబోతున్నానని పలువురు ప్రముఖులతో బాహాటంగానే చెప్పారు.
భరత్ గెలుపొందిన తర్వాత టీజీ వర్గం కూడా కేబినెట్ బెర్త్ దక్కుతుందని చర్చించుకుంటున్నారు. అలాగే కేఈ శ్యాంబాబు కూడా కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతీ కేబినెట్‌లోనూ కేఈ కుటుంబం ఉంది. కేఈ ప్రభాకర్, కేఈ కృష్ణమూర్తి మంత్రులుగా చేశారు. 2014లో డిప్యూటీ సీఎంగా కూడా కేఈ కృష్ణమూర్తి కొనసాగారు. బీసీ కోటాలో తనకు చోటు దక్కుతుందని శ్యాంబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవి చదవండి: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment