సంక్షోభంలో చక్కెర ఫ్యాక్టరీలు
* పడిపోయిన పంచదార ధర
* ఫ్యాక్టరీల్లో భారీగా పేరుకుపోతున్న నిల్వలు
* ఆందోళనలో యాజమాన్యాలు
చోడవరం: రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. చక్కెర ధరలు మార్కెట్‌లో గణనీయంగా పడిపోవడంతో ఫ్యాక్టరీలన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10 సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా కడప, తెనాలిలో ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. మిగతా ఎనిమిది ఒడిదుడుకుల మధ్య నడుస్తున్నాయి. చోడవరం(గోవాడ), ఏటికొప్పాక ఫ్యాక్టరీలు లాభనష్టాలు లేకుండా నడుస్తుండగా అనకాపల్లి, తాండవ, భీమసింగ్, చిత్తూరు, రేణిగుంట, నెల్లూరు(కొవ్వూరు) ఫ్యాక్టరీలు ప్రభుత్వ రుణంపై ఆధారపడి నడుస్తున్నాయి. ఇప్పటికే పాత యంత్రాలతో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలకు ఇప్పుడు పేరుకుపోతున్న పంచదార నిల్వలు పెద్ద సమస్యగా మారాయి.
ఇబ్బందుల వలయం...
గత ఏడాదిగా పంచదారకు మార్కెట్‌లో ఆశించన మేర ధర లేదు. అప్పటి వరకు క్వింటా రూ. 3200 వరకు విక్రయించగా ఒక్కసారిగా రూ.2900లకు పడిపోయింది. ఆతర్వాత ఈ ఏడాది మొదట్లో రూ.3100వరకు విక్రయించగా గత ఐదునెలలుగా మరలా రూ.2800కు ధర పడిపోయింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలే. మిగతా రాష్ట్రాల్లో పంచదారపై వ్యాట్ లేదు. ఇక్కడ మాత్రం బస్తాకు రూ.150 వ్యాట్ చార్జీని ప్రభుత్వం వసూలు చేస్తోంది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి పంచదారను ఇక్కడకు దిగుమతి చేసుకుంటున్నారు. ఈపరిస్థితుల్లో పంచదారను కొనుగోలుచేసేందుకు వ్యాపారులు ఎవరూ ముందుకు రావడంలేదు. వచ్చిన కొద్దిమంది కూడా సిండికేట్ అవడంతో ధర పెరగడం లేదు.
మూడేళ్ల కిందట గత ప్రభుత్వం పంచదారపై లెవీ ఎత్తేయడంతో చౌకదుకాణాలకు సరఫరా చేసే పంచదారకు మార్కెట్‌ధర చెల్లించి ఫ్యాక్టరీలను నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే ఇది టెండర్ల పద్ధతిలో కొనుగోలు చేస్తున్నది. ఈ టెండర్లలో ఒక్క మన రాష్ట్రం చక్కెరనే అనుమతిస్తే ఇక్కడ ఫ్యాక్టరీలకు కొంత ఊరట కలిగేది. కాని ప్రభుత్వం ఇతర రాష్ట్రాల చక్కెరను కూడా అనుమతించడంతో ఇక్కడి ఫ్యాక్టరీలకు నష్టం కలుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో పంచదార తయారీకి అయ్యే ఖర్చు కంటే మన పాత మిల్లుల్లో ఉత్పత్తికి అయ్యే ఖర్చు బస్తాకు సుమారు రూ.200నుంచి 300వరకు అదనం అవుతుంది. దీనివల్ల ఇతర రాష్ట్రాల వారు తక్కువకే కోడ్ చేసి టెండర్లు సొంతం చేసుకుంటున్నారు.
ఈ పరిణామాల వల్ల మన రాష్ట్రంలో నిల్వలు పేరుకుపోయాయి. క్వింటా పంచదార ఉత్పత్తికి రూ.3వేలు వరకు ఖర్చవుతుంటే రూ.2800 ధరకు అమ్మలేక ఫ్యాక్టరీలు ఆందోళన చెందుతున్నాయి. విశాఖజిల్లాలో ఉన్న నాలుగు ఫ్యాక్టరీల్లోనే ఏకంగా రూ.270కోట్లు విలువచేసే 7లక్షల30వేల క్వింటాళ్ల పంచదార నిల్వలు అమ్మకం కాకుండా గోడౌన్లలో ఉండిపోయాయి. ఒక్క చోడవరం ఫ్యాక్టరీలోనే రూ. 180కోట్లు విలువచేసే 4.5లక్షల క్వింటాళ్ల పంచదార మూలుగుతోంది. అయితే ధర వస్తుందని దాచి ఉంచే పరిస్థితి కూడాలేదు. తయారైన పంచదార 8నెలలు దాటితే క్రమేణా రంగుమారి నాణ్యత తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఒక పక్క సరుకు అమ్ముడుకాక, మరోపక్క గోడౌన్లకు అద్దె చెల్లించుకోలేక ఆర్థిక భారంతో సహకార ఫ్యాక్టరీలు నలిగిపోతున్నాయి. ప్రభుత్వ సహాయం కోసం యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి.