Sugar prices
-
చుక్కల్లో చక్కెర.. చిక్కుల్లో ఉత్పత్తులు
న్యూఢిల్లీ : చక్కెర ఉత్పత్తులైన చాకోలెట్ లు, సాప్ట్ డ్రింక్ లు, ఐస్ క్రీమ్ లు, బిస్కెట్ల ధరలు ఇక చేదు కానున్నాయా? వాటిపై లభించే డిస్కౌంట్లు ఇక లభించవా? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ ఐదేళ్లలో ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఆయా ధరలు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే అంచనాలు నెలకొన్నాయి. చక్కెర ధరలు ఆకాశాన్నంటడంతో చక్కెర ప్రొడక్ట్ ల ఉత్పత్తిదారులు ఇబ్బందుల్లో పడ్డారు. విపరీతంగా పెరిగిన షుగర్ దరలు వారికి చుక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఉత్పత్తులపై కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లు తగ్గించనున్నాయని సమాచారం. గత అక్టోబర్ లో ఒక కిలో చక్కెర ధర రూ.30 ఉంటే, ఈ వారంలో ఆ ధర రూ.40 లను తాకింది. చక్కెర ఉత్పత్తిలో మహారాష్ట్ర ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈ ఏడాది తీవ్ర కరవు సంభవించడంతో, దేశమంతటా ఘగర్ ఉత్పత్తి 10శాతం పడిపోయిందని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ గణాంకాలు తెలిపాయి. ధరలు పెరుగుతున్న ప్రతిసారీ ప్రమోషన్లను, ఆఫర్లను తగ్గించి, ప్రత్యక్షంగా తమపై ప్రభావం చూపనున్న ఎక్కువ కమోడిటీ ధరల నుంచి కొంత ఉపశమనం పొందుతామని పార్లె ఉత్పత్తుల మార్కెటింగ్ హెడ్ మయాంక్ షా చెప్పారు. చక్కెర ధరలు పెరుగుతున్నప్పటికీ, వెంటనే ఉత్పత్తుల ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, జూన్ లో వీటిపై పునఃసమీక్షిస్తామని మదర్ డైరీ ఎండీ ఎస్.నాగరాజన్ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ కాలంలోనే తమ ఉత్పత్తులకు డిమాండ్ బాగా ఉంటుందని చెప్పారు. చక్కెర ధరలు ఇలానే పెరుగుతూ ఉంటే మాత్రం ఉత్పత్తి కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లు కొంతమేర తగ్గుతాయని బెవరేజ్ పరిశ్రమ అధికారులు పేర్కొన్నారు. -
సుగర్స్‌కు చేదు
ఘోరంగా పడిపోయిన పంచదార ధర క్వింటా రూ.2600లు సంక్రాంతి నెలలోనూ పెరగని ధర,అమ్మకాలు నష్టాల్లో చక్కెర మిల్లులు మార్కెట్లో పంచదార ధరలు ఘోరంగా పడిపోవడంతో సహకార చక్కెర మిల్లుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉత్పత్తి వ్యయం కంటే క్వింటా పంచదార ధర తక్కువగా ఉండటంతో నష్టాల బాట పడుతున్నాయి. ఈ వారంలో ధర మరీ ఘోరంగా క్వింటా రూ.2600లకు పడిపోయింది. సంక్రాంతి నెలలో అమ్మకాలు పెరిగి ధర బాగుంటుందని ఆశించిన యాజమాన్యాలకు నిరాశే మిగిలింది. ఫ్యాక్టరీల్లో పేరుకుపోయిన నిల్వలను ఎలా అమ్ముకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నాయి. చోడవరం: హోల్‌సేల్ మార్కెట్లో పంచదార ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నా యి. ఆరు నెలల కిం దట క్వింటా పంచదార రూ. 3100లు ఉండేది. ఒక దశ లో రూ.2900వద్ద రెండు నెల లపాటు నిలకడగా ఉన్నప్పటికీ, సుగర్స్‌కు చేదు అనంతరం రూ.2700లు, ప్రస్తుతం 2600కు పడిపోయింది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లో లేని వ్యాట్ రాష్ర్టంలో ఉండటంతో అదనంగా క్వింటాకు రూ.150వరకు చెల్లించాల్సి రావడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి పంచదారను కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ఇక్కడి హోల్‌సేల్ వ్యాపారులు నిర్ణయించిన ధరకే సుగర్స్ యాజమాన్యాలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా ఏటేటా పంచదార తయారీ వ్యయం పెరుగుతోంది. పంటకు మద్దతు ధర లేదని రైతులూ గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది కేంద్రప్రభుత్వం టన్నుకు రూ.2280గా మద్దతు ధరను నిర్ణయించింది. దానికి అదనంగా రూ.60 నుంచి రూ.80లు కలిపి చెల్లించేందుకు ఫ్యాక్టరీలు నిర్ణయించాయి. ఇప్పటికే ఏటికొప్పాక రూ.2356లు, తాండవ రూ.2350లుగా మద్దతు ధరను ప్రకటించాయి. పూర్తిగా నష్టాల్లో ఉన్న తుమ్మపాలతోపాటు లాభాల్లో ఉన్న గోవాడ ఫ్యాక్టరీ కూడా మద్దతు ధరను ప్రకటించలేదు. ఏది ఏమైనా కేంద్రం నిర్దేశించిన ధరకు తగ్గకుండానే రైతులకు చెల్లించాల్సి ఉంది. మద్దతు ధరతోపాటు అదనంగా రూ.100 నుంచి రూ.150వరకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వాలి. అన్నీ కపులుకుంటే క్వింటా పంచదార తయారీకి కనీసం రూ.3వేల నుంచి 3100 వర కు ఖర్చవుతోంది. రైతుకిచ్చే మద్దతు ధరతోపాటు ఉత్పత్తి ఖర్చు క్వింటాకు రూ. 600-700వరకు అదనంగా ఉంటోంది. మార్కెట్లో ప్రస్తుతం ధర కేవలం రూ.2600లు మాత్రమే ఉండటంతో అదనంగా రూ.500 వరకు ఫ్యాక్టరీలు భరించాల్సి వస్తున్నది. అసలే హుద్‌హుద్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన మిల్లులకు ఇది పెనుభారమవుతోంది. ఏటా మంచి రికవరీతో ముందుండే ఏటికొప్పాక ఫ్యాక్టరీలో ఇటీవల అగ్నిప్రమాదంతో అది కూడా నష్టాలబారిన పడింది. ఇప్పటికీ మిల్లుల్లో పాత పంచదార పేరుకుపోయి ఉంది. గోవాడ ఫ్యాక్టరీలో లక్షా90వేల క్వింటాళ్లు, ఏటికొప్పాకలో 60, తాండవలో 50క్వింటాళ్లు నిల్వలున్నాయి. దీనికి ఈ సీజన్లో ఉత్పత్తయిన కొత్త పంచదార కూడా తోడవుతోంది. ఈ నిల్వలను ఎలా అమ్ముకోవాలో తెలియక యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలను అధ్యయనం చేసి వెళ్లిన కమిటీ రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమీ స్పందించలేదు. వ్యాట్‌ను ఎత్తేయడంతోపాటు తుఫాన్ నష్టపరిహారంగా ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తే తప్పా సహకార చక్కెర మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంలో పడే ప్రమాదముందని పాలకవర్గాలు, యాజమాన్యాలు, రైతులు అంటున్నారు. ఫ్యాక్టరీలను పరిరక్షించి చెరకు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. -
చక్కెర ధరలపై విపక్షం వాకౌట్
సమగ్ర ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ నాగపూర్: చక్కెర ధరలు నానాటికీ పడిపోతుండడంపై ఏకమైన ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. మంగళవారం విధానసభ నుంచి వాకౌట్ చేశాయి. ఇందుకు సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లోనూ సమగ్ర ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే సహకార శాఖ మంత్రి చంద్రకాంత్పాటిల్ ఇచ్చిన సమాధానం అసంతృప్తి చెందిన కాంగ్రెస్, ఎన్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు చంద్రకాంత్పాటిల్ సభనుద్దేశించి మాట్లాడుతూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి తీసుకుపోతానన్నారు. ఆయనతో చర్చిస్తానన్నారు. అంతేకాకుండా త్వరలో అఖిలపక్షంతో కలసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతామన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్‌పవార్ మాట్లాడుతూ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ (ఎఫ్ఆర్పీ) విధానం అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని అనేకమంది చక్కెర కర్మాగారం యజమానులు నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. వారిపై క్రిమినల్ అభియోగాలను మోపాలని డిమాండ్ చేశారు. చివరికి రాష్ట్రమంత్రులకు సైతం చక్కెర కర్మాగారాలు ఉన్నాయని, ఈ కర్మాగారాలు కలిగిన వారిలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే, రెవె న్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే, సభాపతి హరిభావ్ బాగ్డే తదితరులు ఉన్నారన్నారు. దీంతో సభలోనే ఉన్న మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే స్పందించారు. ఎఫ్ఆర్పీ కింద రైతాంగానికి చక్కెరకు తగినంత ధర ఇవ్వడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదన్నారు. అయితే ఆ సమయంలో బాగ్డే, ఖడ్సేలు సభలో లేరు. మాజీ స్పీకర్ దిలీప్‌వాల్సే పాటిల్ మాట్లాడుతూ దిగుమతులు, ఎగుమతుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానం వల్లనే చక్కెర రైతాంగానికి గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపించారు. చక్కెర రైతులు సంక్షోభంలో చిక్కుకుపోయారని, అందువల్ల వారికి అండదండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేకపోతే రుణం తీసుకోవాలని సూచించారు. త్వరలో రెండు ఫొరెన్సిక్ లేబొరేటరీలు నాగపూర్: రాష్ర్టంలో రెండు ప్రాంతీయ ఫొరెన్సిక్ లేబొరేటరీలు ఏర్పాటు కానున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం మంగళవారం విధానసభలో వెల్లడించింది. ఒకటి మరాఠ్వాడాలోని కొల్హాపూర్‌లోనూ, మరొకటి నాందేడ్‌లోనూ ఏర్పాటు చేయనుంది. కొల్హాపూర్‌లో ఏర్పాటయ్యే ఫొరెన్సిక్ లేబొరేటరీ... సాంగ్లి, కొల్హాపూర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు, ఇక నాందేడ్‌లో ఏర్పాటు కానున్న ఫొరెన్సిక్ లేబొరేటరీ పర్భణి, నాందేడ్, హింగోళి, లాతూర్ జిల్లాలకు సేవలందించనుంది. ఫొరెన్సిక్ లేబొరేటరీల ఏర్పాటుకోసం ప్రభుత్వం రూ. 27 కోట్ల మేర నిధులను కేటాయించింది. కొత్తగా వంద మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. నేరాలు జరిగిన సమయంలో ఈ లేబొరేటరీలు శాస్త్రీయ విశ్లేషణ ద్వారా ఆధారాలను సేకరిస్తాయి. న్యాయస్థానాల్లో కేసు విచారణకు వచ్చిన సందర్భంలో ఈ లేబొరేటరీలు అందించే నివేదికలే అత్యంత కీలకం. ఈ ఫొరెన్సిక్ లేబొరేటరీల్లో అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటివల్ల నేరనిర్ధారణ త్వరగా జరుగుతుంది. దీంతో దోషులకు శరవేగంగా శిక్ష పడుతుంది. ప్రస్తుతం ఫొరెన్సిక్ లేబొరేటరీ డెరైక్టరేట్ ముంబైలో ఉంది. దీనికి అనుబంధంగా నాగపూర్, పుణే, ఔరంగాబాద్ , నాసిక్, అమరావతిలలో ఫొరెన్సిక్ లేబొరేటరీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అయితే పెండింగ్‌లో ఉన్న నేరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ప్రభుత్వం కొత్తగా మరో రెండు ప్రాంతీయ ఫొరెన్సిక్ లేబొరేటరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. -
సంక్షోభంలో చక్కెర ఫ్యాక్టరీలు
* పడిపోయిన పంచదార ధర * ఫ్యాక్టరీల్లో భారీగా పేరుకుపోతున్న నిల్వలు * ఆందోళనలో యాజమాన్యాలు చోడవరం: రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. చక్కెర ధరలు మార్కెట్లో గణనీయంగా పడిపోవడంతో ఫ్యాక్టరీలన్నీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10 సహకార చక్కెర కర్మాగారాలు ఉండగా కడప, తెనాలిలో ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. మిగతా ఎనిమిది ఒడిదుడుకుల మధ్య నడుస్తున్నాయి. చోడవరం(గోవాడ), ఏటికొప్పాక ఫ్యాక్టరీలు లాభనష్టాలు లేకుండా నడుస్తుండగా అనకాపల్లి, తాండవ, భీమసింగ్, చిత్తూరు, రేణిగుంట, నెల్లూరు(కొవ్వూరు) ఫ్యాక్టరీలు ప్రభుత్వ రుణంపై ఆధారపడి నడుస్తున్నాయి. ఇప్పటికే పాత యంత్రాలతో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలకు ఇప్పుడు పేరుకుపోతున్న పంచదార నిల్వలు పెద్ద సమస్యగా మారాయి. ఇబ్బందుల వలయం... గత ఏడాదిగా పంచదారకు మార్కెట్లో ఆశించన మేర ధర లేదు. అప్పటి వరకు క్వింటా రూ. 3200 వరకు విక్రయించగా ఒక్కసారిగా రూ.2900లకు పడిపోయింది. ఆతర్వాత ఈ ఏడాది మొదట్లో రూ.3100వరకు విక్రయించగా గత ఐదునెలలుగా మరలా రూ.2800కు ధర పడిపోయింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలే. మిగతా రాష్ట్రాల్లో పంచదారపై వ్యాట్ లేదు. ఇక్కడ మాత్రం బస్తాకు రూ.150 వ్యాట్ చార్జీని ప్రభుత్వం వసూలు చేస్తోంది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి పంచదారను ఇక్కడకు దిగుమతి చేసుకుంటున్నారు. ఈపరిస్థితుల్లో పంచదారను కొనుగోలుచేసేందుకు వ్యాపారులు ఎవరూ ముందుకు రావడంలేదు. వచ్చిన కొద్దిమంది కూడా సిండికేట్ అవడంతో ధర పెరగడం లేదు. మూడేళ్ల కిందట గత ప్రభుత్వం పంచదారపై లెవీ ఎత్తేయడంతో చౌకదుకాణాలకు సరఫరా చేసే పంచదారకు మార్కెట్‌ధర చెల్లించి ఫ్యాక్టరీలను నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే ఇది టెండర్ల పద్ధతిలో కొనుగోలు చేస్తున్నది. ఈ టెండర్లలో ఒక్క మన రాష్ట్రం చక్కెరనే అనుమతిస్తే ఇక్కడ ఫ్యాక్టరీలకు కొంత ఊరట కలిగేది. కాని ప్రభుత్వం ఇతర రాష్ట్రాల చక్కెరను కూడా అనుమతించడంతో ఇక్కడి ఫ్యాక్టరీలకు నష్టం కలుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో పంచదార తయారీకి అయ్యే ఖర్చు కంటే మన పాత మిల్లుల్లో ఉత్పత్తికి అయ్యే ఖర్చు బస్తాకు సుమారు రూ.200నుంచి 300వరకు అదనం అవుతుంది. దీనివల్ల ఇతర రాష్ట్రాల వారు తక్కువకే కోడ్ చేసి టెండర్లు సొంతం చేసుకుంటున్నారు. ఈ పరిణామాల వల్ల మన రాష్ట్రంలో నిల్వలు పేరుకుపోయాయి. క్వింటా పంచదార ఉత్పత్తికి రూ.3వేలు వరకు ఖర్చవుతుంటే రూ.2800 ధరకు అమ్మలేక ఫ్యాక్టరీలు ఆందోళన చెందుతున్నాయి. విశాఖజిల్లాలో ఉన్న నాలుగు ఫ్యాక్టరీల్లోనే ఏకంగా రూ.270కోట్లు విలువచేసే 7లక్షల30వేల క్వింటాళ్ల పంచదార నిల్వలు అమ్మకం కాకుండా గోడౌన్లలో ఉండిపోయాయి. ఒక్క చోడవరం ఫ్యాక్టరీలోనే రూ. 180కోట్లు విలువచేసే 4.5లక్షల క్వింటాళ్ల పంచదార మూలుగుతోంది. అయితే ధర వస్తుందని దాచి ఉంచే పరిస్థితి కూడాలేదు. తయారైన పంచదార 8నెలలు దాటితే క్రమేణా రంగుమారి నాణ్యత తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఒక పక్క సరుకు అమ్ముడుకాక, మరోపక్క గోడౌన్లకు అద్దె చెల్లించుకోలేక ఆర్థిక భారంతో సహకార ఫ్యాక్టరీలు నలిగిపోతున్నాయి. ప్రభుత్వ సహాయం కోసం యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. -
చెరకు రైతులకు తీపి కబురు
సాక్షి, నెల్లూరు: నిధుల కొరతతో అల్లాడుతున్న చక్కెర కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. చక్కెర కర్మాగారాలకు రూ.4,400 కోట్లు వడ్డీలేని అదనపు రుణం ఇవ్వాలని నిర్ణయించింది. చెరకు రైతులకు ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేలా కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు ప్రోత్సాహకరంగా ఉండేలా చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా చక్కెర దిగుమతి సుంకాన్ని 40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎగుమతులను సైతం ప్రోత్సహించాలని నిర్ణయించారు. ద్రవ్య సంక్షోభం నుంచి చక్కెర మిల్లులను గట్టెక్కించేందుకు, తద్వారా చెరకు రైతుల బకాయిలు చెల్లించేందుకు కేంద్ర నిర్ణయం దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తమకు బకాయిలు అందితే చాలని రైతులు అంటున్నారు. బకాయిలు చెల్లించని ఫ్యాక్టరీలు చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు సకాలంలో డబ్బు ఇచ్చిన పాపాన పోవడంలేదు. సాధారణంగా ఫిబ్రవరి, మా ర్చి, ఏప్రిల్‌లో రైతులు చెరకును ఫ్యాక్టరీలకు తరలిస్తారు. నిబంధనల మేరకు పంటను ఇచ్చిన నెలలోపే యాజమాన్యం రైతులకు డబ్బు చెల్లించాల్సి ఉంది. కానీ ఫ్యాక్టరీలు రైతులకు నెలలు,ఏళ్ల తరబడి డబ్బు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. బకాయిల కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఐదారేళ్లుగా ఇదే జరుగుతోంది. ప్రస్తుతం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు కలిపి రూ.12 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక ప్రభగిరిపట్నం ఫ్యాక్టరీ రూ.14 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రెండు ఫ్యాక్టరీలు రూ.26 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. పట్టించుకోని అధికారులు: షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం రైతులకు పైసా చెల్లించకుండానే రైతులవద్ద తీసుకున్న చెరకు తో చేసిన చక్కెరను మాత్రం ప్రభుత్వ అనుమతు లు లేకుండానే అమ్ముకుంటున్నట్లు సమాచారం. అయినా షుగర్ కేన్ కమిషనర్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు పరిధిలోని అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు వ్యవసాయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. తగ్గుతున్న సాగు విస్తీర్ణం 2000కు ముందు జిల్లా పరిధిలో 50 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగైన చెరకు 2011-12కు వచ్చేసరికి 25 వేల ఎకరాలకు తగ్గింది. ఈ ఏడాది 15 వేల ఎకరాల్లో కూడా చెరకుపంట సాగుకాలేదు. దీన్ని బట్టి చూస్తే ఏడాదికేడాదికి చెరకు సాగు విస్తీర్ణం ఇబ్బడిముబ్బడిగా పడిపోతున్నట్టు స్పష్టమౌతోంది. చెరకు సాగుపై ఆసక్తి ఉన్నా ఫ్యాక్టరీలు సకాలంలో బకాయిలు చెల్లించడం లేదని ,ఏళ్ల తరబడి తిరిగితే తప్ప డబ్బు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో చెరకు సాగు అంటే భయపడే పరిస్థితి నెలకొందని వారు పేర్కొంటున్నారు. గతవైభవం: జిల్లాలో వరి తర్వాత చెరకు పంటను రైతులు అత్యధికంగా సాగు చేస్తారు. 1973లో కోవూరు చక్కెర కర్మాగారం ఏర్పాటైంది. 4.5 లక్షల టన్నుల కెపాసిటీతో దీనిని నిర్మించారు. జిల్లాలోని పొదలకూరు,నాయుడుపేటలలో రెండు ప్రైవేటు చక్కెర కర్మాగాలు వెలిశాయి. నాయుడుపేట ఎంపీ షుగర్స్ 1989-90 లో ఏర్పాటైంది. దీంతో పాటు పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం వద్ద 5 లక్షల టన్నుల కెపాసిటీతో వీడీబి షుగర్ ఫ్యాక్టరీ నిర్మితమైంది. జిల్లాలో మూడు చక్కెర కర్మాగారాలు నెలకొనడంతో రైతులు చెరకు సాగుపై మొగ్గు చూపారు. బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, సంగం,పొదలకూరు, కలువాయి, అనంతసాగరం, ఉదయగిరి, వింజమూరు,ఏఎస్‌పేట, కలికిరి, మర్రిపాడుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల పరిధిలో 1400 మందికిపైగా రైతులు 50 వేలకు పైగా విస్తీర్ణంలో చెరకుపంటను సాగుచేసేవారు. ఇక నాన్జోన్గా ఉన్న జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతోపాటు వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేలు, పోరుమామిళ్ల, కాశినాయన, బి.కోడూరు, మైదుకూరు, చెన్నూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో 15 వేల ఎకరాలు ,కర్నూలు జిల్లాలోని నంద్యాల, చిత్తూరు జిల్లాతోపాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో సాగు అయ్యే చెరకును ఈ మూడు ఫ్యాక్టరీలకు తరలించేవారు. -
సుడిగండాల్లో సుగర్స్
ఘోరంగా పడిపోయిన చక్కెర ధరలు పాలకుల నిర్లక్ష్యంతో నష్టాల్లో ఫ్యాక్టరీలు గిట్టుబాటు దర లేక అప్పుల్లో చె రకు రైతులు సంక్షోభంతో యాజమాన్యాలు, అన్నదాతల ఆందోళన చోడవరం,న్యూస్‌లైన్: అందరికీ మధురమైన చక్కెర రైతన్నకు, సుగర్స్ యాజమాన్యాలకు మాత్రం చేదు అనుభవాలను మిగులుస్తోంది. రైతులకైతే.. చెరకు పేరెత్తితేనే భయపడే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలోని సహకార కర్మాగారాల యాజమాన్యాలకూ చక్కెరతో సమస్యలు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్లక్ష్యం పర్యవసానంగా ఉభయ వర్గాలకూ ఇక్కట్లు అనివార్యమనిపిస్తోంది. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చెరకు పండించలేమని రైతులు చేతులెత్తేస్తుంటే, పంచదార ధర ఘోరంగా పడిపోయి ఫ్యాక్టరీలన్నీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని సహకార చక్కెర కర్మాగారాలు కాలానికనుగుణంగా ఆధునికీకరణతో మంచి రికవరీ సాధించి రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం చేయూత లేకపోవడంతో రైతులు, యాజమాన్యాలు నానాటికీ సంక్షోభంలో కూరుకుపోతున్నాయి . సహకార రంగంలో జిల్లాలో చోడవరం, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి ఫ్యాక్టరీలు ఉన్నాయి. చెంతనే భీమసింగి కర్మాగారం ఉంది. అంతర్జాతీయ బెల్లం మార్కెట్ కూడా అనకాపల్లిలోనే ఉండడంతో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో చెరకు పండిస్తున్నారు. కానీ విదేశీ పంచదార ముంచెత్తడంతో ఇక్కడి చక్కెరకు డిమాండ్ తగ్గిపోయింది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా క్వింటాల్ పంచదార రూ. 2600కు పడిపోయింది. దాంతో జిల్లాలోని ఫ్యాక్టరీల్లో లక్షలాది క్వింటాళ్ల పంచదార పేరుకుపోయింది. ఈ ఏడాది అనకాపల్లి ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రశ్నార్థంగా మారగా, తాండవ, భీమసింగి ఫ్యాక్టరీలు పీకల లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. ఫర్వాలేదనుకున్న చోడవరం, ఏటికొప్పాక ఫ్యాక్టరీల పరిస్థితి కూడా ఇప్పుడు ప్రమాదకరంగా ఉంది. ప్రభుత్వం నయవంచన 2011-12 సీజన్లో రూ. 50 కోట్లు ప్రభుత్వం ఇచ్చి కొంత ఆదుకున్నప్పటికీ రెండు సీజన్ల నుంచి ఒక్క పైసా కూడా ఫ్యాక్టరీలకు ఇవ్వలేదు. మరోవైపున ఎరువులు, విత్తనాల రేట్లు, కూలి ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ఎకరా భూమిలో చెరకు పండించేందుకు సుమారు రూ. 50 వేలకు పైబడి ఖర్చవుతోంది. గత మూడేళ్లలో వరదలతో ఎకరాకు 15-20 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఫ్యాక్టరీలు టన్నుకు రూ. 1800 నుంచి 2000 మాత్రమే గిట్టుబాటు ధర చెల్లించాయి. మరో పక్క బెల్లం ధరలు కూడా బాగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో చెరకు పంట వేయకపోవడమే మంచిదని రైతులు అంటున్నారు. బాబు పుణ్య ఫలితం.. చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు ఫ్యాక్టరీలను నిర్లక్ష్యం చేయడం వల్లే చెరకు రైతులకు, సుగర్ ఫ్యాక్టరీలకు ఇప్పుడీ దుస్థితి దాపురించిందన్నది విస్పష్టం. తర్వాత మహానేత వైఎస్ ఆదుకున్నా, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం విస్మరించడంతో ఫ్యాక్టరీలతోపాటు చెరకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ. 500 కోట్లు ఇస్తే ఫ్యాక్టరీలు బాగుపడతాయని ఎపిట్కో కమిటీ సిఫార్సు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు కలవరపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఫ్యాక్టరీలు మూతపడతాయని, సాగు కనుమరుగవుతుందని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ధర కోసం షుగర్ గేమ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పడుతున్న చక్కెర ధరలకు అడ్డుకట్ట వేయడానికి చక్కెర పరిశ్రమ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి 50 శాతానికిపైగా తగ్గిపోయిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) ప్రకటించినప్పటికీ హోల్‌సేల్ మార్కెట్లో ధరల పతనం ఆగలేదు. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో చక్కెర ధరలు ఏకంగా ఐదు నెలల కనిష్టానికి చేరుకోవడంతో కంపెనీల వ్యూహానికి ఎదురుదెబ్బ తగలింది. ఉత్పత్తి తగ్గినా... దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు క్వింటాల్‌కు రూ.30 తగ్గడం గమనార్హం. ప్రస్తుతం మొదటి రకం (ఎం-30) రకం క్వింటాల్ ధర రూ.3,020-3,225 పలుకుతుంటే ఎస్-30 రకం రూ.3,000-3,200 పలుకుతోంది. అంతకుముందు ఇస్మా ఈ సంవత్సరం చెరుకు గానుగ ఆడటం ఆలస్యం కావడంతో చక్కెర ఉత్పత్తి 50 శాతం పడిపోయిందని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సీజన్లో డిసెంబర్ 15 నాటికి పంచదార ఉత్పత్తి 50 శాతం తగ్గి 24.24 లక్షల టన్నులు మాత్రమే నమోదైనట్లు ఇస్మా తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో 457 మిల్లులు పంచదారను ఉత్పత్తి చేస్తుండగా ఈ ఏడాది ఈ సంఖ్య 426కి పడిపోయింది. దేశంలో చెరకును అత్యధికంగా పండించే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లో వరుసగా 35 శాతం, 78 శాతం క్షీణించడమే ప్రధాన కారణంగా ఇస్మా పేర్కొంది. మన రాష్ట్రంలో కూడా చక్కెర ఉత్పత్తి 44 శాతం తగ్గి 0.95 లక్షల టన్నులుగా ఉన్నట్లు ఇస్మా పేర్కొంది. ఆలస్యమే తప్ప ఉత్పత్తి తగ్గదు చక్కెర మద్దతు ధరపై మిల్లలు రైతులకు మధ్య అవగాహన కుదరకపోవడం వలన ఆలస్యం అయ్యిందే తప్ప ఉత్పత్తి తగ్గదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది 241 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందన్న అంచనాపై ఈ ఆలస్యం ఎటువంటి ప్రభావం చూపదని కేంద్ర ఆహార మంత్రి కె.వి.థామస్ మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. గతంలో ఇస్మా ఈ సీజన్ మొత్తం మీద ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువగా 250 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ ఆశలతో... అప్పుల ఊబిలో కూరుకుపోయిన చక్కెర మిల్లులను ఆదుకోవడానికి ఏర్పాటైన మంత్రివర్గ బృందం బుధవారం సమావేశం నేపథ్యంలో చక్కెర కంపెనీ షేర్లు మంగళవారం పరుగులు తీశాయి. రానా సుగర్స్, ధంపూర్ సుగర్ మిల్స్ షేర్లు 5 శాతం పెరగ్గా, బలరాంపూర్ చిని, ద్వారికేష్ సుగర్స్ మూడు శాతం చొప్పున పెరిగాయి. చక్కెర మిల్స్ బెయిల్ ఔట్ ప్యాకేజీ గురించి బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశం కానుంది. చక్కెర మిల్లులు రైతులకు చెల్లించాల్సిన బకాయిల విలువ దాదాపు రూ.7,200 కోట్లు ఉంది. -
చక్కెర ధరలు మరింత దిగొస్తాయా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిమాండ్‌కు మించి ఉత్పత్తి, అధిక మిగులు నిల్వల కారణంగా ఈ ఏడాది కూడా చక్కెర ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.31 ఉన్న ధర సీజన్ ప్రారంభమైన తర్వాత మరింత తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైల్‌గా ఈ ధర రూ. 32-35 మధ్య వుంది. పేరుకుపోయిన చక్కెర నిల్వలకు తోడు ఈ ఏడాది ఉత్పత్తి కూడా బాగుంటుందన్న ప్రాధమిక అంచనాలే దీనికి కారణం. కాని ఇదే సమయంలో చక్కెర మిల్లులు మాత్రం పెరుగుతున్న చెరకు మద్దతు ధర, తగ్గుతున్న పంచదార ధరతో నష్టాలను మూటకట్టుకుంటున్నాయి. ఎగుమతులపై కేంద్రం ఆంక్షలను ఎత్తివేసినా ప్రపంచవ్యాప్తంగా కూడా నిల్వలు పేరుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధర పలకడం లేదు. మన దేశంలో 235 లక్షల టన్నుల చక్కెరకు డిమాండ్ ఉండగా, అక్టోబర్ 1 నుంచి మొదలైన ఈ ఏడాది సీజన్లో 250 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది కాకుండా ఇప్పటికే 88.5 లక్షల టన్నుల మిగులు నిల్వలున్నాయి. ఈ నిల్వలు ఐదేళ్ళ గరిష్ట స్థాయికి సమానం. ఈ ఏడాది 3,400 లక్షల టన్నుల చెరకు దిగుబడి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, డెరైక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం 3,418 లక్షల టన్నులు దాటింది. దీంతో గడచిన ఏడాది కంటే జరిగిన చక్కెర ఉత్పత్తి 250 లక్షల టన్నుల కంటే ఎక్కువగా ఉండొచ్చన్నది ప్రాథమిక అంచనా. అదే ప్రపంచ వ్యాప్తంగా 1,800 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా వేస్తోంది. ఇలా అంతటా ఉత్పత్తి అధికంగా ఉండటంతో ధరలు దిగివస్తున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ నెలలో మిల్లుల దగ్గర కిలో చక్కెర ధర రూ.36 ఉండగా అది ఇప్పుడు రూ.29.50కి పడిపోయింది. ఈ మిగులును వదిలించుకోకపోతే కొత్త ఉత్పత్తి అందుబాటులోకి వస్తే ధరలు మరిం త తగ్గే అవకాశం ఉందంటూ పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో ఎగుమతులపై దృష్టిసారించాయి. ఈ ఏడాది కనీసం 30 నుంచి 40 లక్షల టన్నులు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐసీఎంఏ) లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద చూస్తే ఈ ఏడాది ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదని, కాని ఈ స్థాయి నుంచి మరింత తగ్గే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయని దక్షిణ భారత చక్కెర మిల్లుల అసోసియేషన్ కార్యదర్శి ఆర్.ఎస్.భలేరావు వ్యాఖ్యానించారు. విదేశాల్లో ధరలు తగ్గితే ఇక్కడా తగ్గుతాయన్నారు. మద్దతు ధర తగ్గించాలి.. చక్కెర ధరలు తగ్గుతున్నా చెరకు మద్దతు ధరను పెంచుకుంటూ పోతున్నాయని దీంతో చక్కెర మిల్లులకు భారీ నష్టాలు వస్తున్నట్లు ఐసీఎంఏ పేర్కొంది. గడచిన మూడేళ్ళలో చెరకు మద్దతు ధర సగటున 17 శాతం పెరిగితే ఇదే సమయంలో చక్కెర ధరలు పది శాతం తగ్గాయని ఐసీఎంఏ డెరెక్టర్ జనరల్ అవినాష్ వర్మ పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలోని అన్ని పంచదార మిల్లులు రూ.3,000 కోట్లకు పైగా నష్టాలను మూటకట్టుకున్నాయని, ఇటువంటి సమయంలో చెరకు మద్దతు ధరను పెంచుకుంటూ పోతే మిల్లులు మూసుకోవాల్సి వస్తుందన్నారు. మద్దతు ధర పెంపునకు నిరసనగా దేశంలో చెరకును అత్యధికంగా సాగు చేసే ఉత్తరప్రదేశ్‌లో క్రషింగ్‌ను ఆపేసి మిల్లులు నిరసన తెలుపుతున్నాయి. మద్దతు ధరను తగ్గించాలన్న మిల్లర్ల డిమాండ్‌ను తోసిపుచ్చి బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను రూ. 280 వద్దే స్థిరపర్చింది. చక్కెర ధర కంటే చెరకు ధర ఎక్కువగా ఉందని, ఇలాగైతే మిల్లుల మనుగడ కష్టమేనని భలేరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్వింటాల్‌కి రూ.225కు మించి మిల్లులు భరించలేవని, కాని ప్రభుత్వాలు మద్దతు ధరను రూ.300 వరకు పెంచాలనుకోవడం ఎంత వరకు సమంజసమో అర్థం చేసుకోవాలన్నారు. మన రాష్ట్రంలో గతేడాది క్వింటాల్ చెరకుకు రూ.240 వరకు చెల్లించారని ఈ ఏడాది రూ.260 వరకు చెల్లించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తోందని రావు వివరించారు. చక్కెర షేర్ల ర్యాలీ దేశంలోని చక్కెర మిల్లులు భారీ నష్టాలతో మూల్గుతున్నప్పటికీ, బుధవారం స్టాక్ మార్కెట్లో చక్కెర షేర్లు ర్యాలీ జరిపాయి. చక్కెర మిల్లుల నగదు సంక్షోభాన్ని తొలగించేందుకు 8-10 రోజుల్లో ప్రభుత్వం ఒక ప్యాకేజీని ప్రకటిస్తుందంటూ వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ప్రకటించడంతో ఈ ర్యాలీ జరిగింది. బలరాంపూర్ చినీ, రేణుకా షుగర్స్, బజాజ్ హిందుస్థాన్, శక్తి షుగర్స్, ఈఐడీ ప్యారీ షేర్లు 2-10 శాతం మధ్య పెరిగాయి. చక్కెర ఫ్యాక్టరీలకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు వడ్డీ లేని రుణాలతో సహా నాలుగైదు ఆప్షన్లను మంత్రుల బృందం పరిశీలిస్తున్నదని పవార్ చెప్పారు.