హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిమాండ్‌కు మించి ఉత్పత్తి, అధిక మిగులు నిల్వల కారణంగా ఈ ఏడాది కూడా చక్కెర ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.31 ఉన్న ధర సీజన్ ప్రారంభమైన తర్వాత మరింత తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిటైల్‌గా ఈ ధర రూ. 32-35 మధ్య వుంది. పేరుకుపోయిన చక్కెర నిల్వలకు తోడు ఈ ఏడాది ఉత్పత్తి కూడా బాగుంటుందన్న ప్రాధమిక అంచనాలే దీనికి కారణం. కాని ఇదే సమయంలో చక్కెర మిల్లులు మాత్రం పెరుగుతున్న చెరకు మద్దతు ధర, తగ్గుతున్న పంచదార ధరతో నష్టాలను మూటకట్టుకుంటున్నాయి. ఎగుమతులపై కేంద్రం ఆంక్షలను ఎత్తివేసినా ప్రపంచవ్యాప్తంగా కూడా నిల్వలు పేరుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధర పలకడం లేదు. మన దేశంలో 235 లక్షల టన్నుల చక్కెరకు డిమాండ్ ఉండగా, అక్టోబర్ 1 నుంచి మొదలైన ఈ ఏడాది సీజన్‌లో 250 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది కాకుండా ఇప్పటికే 88.5 లక్షల టన్నుల మిగులు నిల్వలున్నాయి.
ఈ నిల్వలు ఐదేళ్ళ గరిష్ట స్థాయికి సమానం. ఈ ఏడాది 3,400 లక్షల టన్నుల చెరకు దిగుబడి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, డెరైక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ అడ్వాన్స్‌డ్ అంచనాల ప్రకారం 3,418 లక్షల టన్నులు దాటింది. దీంతో గడచిన ఏడాది కంటే జరిగిన చక్కెర ఉత్పత్తి 250 లక్షల టన్నుల కంటే ఎక్కువగా ఉండొచ్చన్నది ప్రాథమిక అంచనా. అదే ప్రపంచ వ్యాప్తంగా 1,800 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా వేస్తోంది. ఇలా అంతటా ఉత్పత్తి అధికంగా ఉండటంతో ధరలు దిగివస్తున్నాయి. గత సంవత్సరం అక్టోబర్ నెలలో మిల్లుల దగ్గర కిలో చక్కెర ధర రూ.36 ఉండగా అది ఇప్పుడు రూ.29.50కి పడిపోయింది. ఈ మిగులును వదిలించుకోకపోతే కొత్త ఉత్పత్తి అందుబాటులోకి వస్తే ధరలు మరిం త తగ్గే అవకాశం ఉందంటూ పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీంతో ఎగుమతులపై దృష్టిసారించాయి. ఈ ఏడాది కనీసం 30 నుంచి 40 లక్షల టన్నులు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐసీఎంఏ) లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం మీద చూస్తే ఈ ఏడాది ధరలు పెరిగే అవకాశం కనిపించడం లేదని, కాని ఈ స్థాయి నుంచి మరింత తగ్గే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయని దక్షిణ భారత చక్కెర మిల్లుల అసోసియేషన్ కార్యదర్శి ఆర్.ఎస్.భలేరావు వ్యాఖ్యానించారు. విదేశాల్లో ధరలు తగ్గితే ఇక్కడా తగ్గుతాయన్నారు.
మద్దతు ధర తగ్గించాలి..
చక్కెర ధరలు తగ్గుతున్నా చెరకు మద్దతు ధరను పెంచుకుంటూ పోతున్నాయని దీంతో చక్కెర మిల్లులకు భారీ నష్టాలు వస్తున్నట్లు ఐసీఎంఏ పేర్కొంది. గడచిన మూడేళ్ళలో చెరకు మద్దతు ధర సగటున 17 శాతం పెరిగితే ఇదే సమయంలో చక్కెర ధరలు పది శాతం తగ్గాయని ఐసీఎంఏ డెరెక్టర్ జనరల్ అవినాష్ వర్మ పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలోని అన్ని పంచదార మిల్లులు రూ.3,000 కోట్లకు పైగా నష్టాలను మూటకట్టుకున్నాయని, ఇటువంటి సమయంలో చెరకు మద్దతు ధరను పెంచుకుంటూ పోతే మిల్లులు మూసుకోవాల్సి వస్తుందన్నారు. మద్దతు ధర పెంపునకు నిరసనగా దేశంలో చెరకును అత్యధికంగా సాగు చేసే ఉత్తరప్రదేశ్‌లో క్రషింగ్‌ను ఆపేసి మిల్లులు నిరసన తెలుపుతున్నాయి. మద్దతు ధరను తగ్గించాలన్న మిల్లర్ల డిమాండ్‌ను తోసిపుచ్చి బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను రూ. 280 వద్దే స్థిరపర్చింది. చక్కెర ధర కంటే చెరకు ధర ఎక్కువగా ఉందని, ఇలాగైతే మిల్లుల మనుగడ కష్టమేనని భలేరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్వింటాల్‌కి రూ.225కు మించి మిల్లులు భరించలేవని, కాని ప్రభుత్వాలు మద్దతు ధరను రూ.300 వరకు పెంచాలనుకోవడం ఎంత వరకు సమంజసమో అర్థం చేసుకోవాలన్నారు. మన రాష్ట్రంలో గతేడాది క్వింటాల్ చెరకుకు రూ.240 వరకు చెల్లించారని ఈ ఏడాది రూ.260 వరకు చెల్లించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తోందని రావు వివరించారు.
చక్కెర షేర్ల ర్యాలీ
దేశంలోని చక్కెర మిల్లులు భారీ నష్టాలతో మూల్గుతున్నప్పటికీ, బుధవారం స్టాక్ మార్కెట్లో చక్కెర షేర్లు ర్యాలీ జరిపాయి. చక్కెర మిల్లుల నగదు సంక్షోభాన్ని తొలగించేందుకు 8-10 రోజుల్లో ప్రభుత్వం ఒక ప్యాకేజీని ప్రకటిస్తుందంటూ వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ప్రకటించడంతో ఈ ర్యాలీ జరిగింది. బలరాంపూర్ చినీ, రేణుకా షుగర్స్, బజాజ్ హిందుస్థాన్, శక్తి షుగర్స్, ఈఐడీ ప్యారీ షేర్లు 2-10 శాతం మధ్య పెరిగాయి. చక్కెర ఫ్యాక్టరీలకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు వడ్డీ లేని రుణాలతో సహా నాలుగైదు ఆప్షన్లను మంత్రుల బృందం పరిశీలిస్తున్నదని పవార్ చెప్పారు.
చక్కెర ధరలు మరింత దిగొస్తాయా?
Published Thu, Nov 21 2013 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement
Advertisement