చుక్కల్లో చక్కెర.. చిక్కుల్లో ఉత్పత్తులు
న్యూఢిల్లీ : చక్కెర ఉత్పత్తులైన చాకోలెట్ లు, సాప్ట్ డ్రింక్ లు, ఐస్ క్రీమ్ లు, బిస్కెట్ల ధరలు ఇక చేదు కానున్నాయా? వాటిపై లభించే డిస్కౌంట్లు ఇక లభించవా? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ ఐదేళ్లలో ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఆయా ధరలు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే అంచనాలు నెలకొన్నాయి.
చక్కెర ధరలు ఆకాశాన్నంటడంతో చక్కెర ప్రొడక్ట్ ల ఉత్పత్తిదారులు ఇబ్బందుల్లో పడ్డారు. విపరీతంగా పెరిగిన షుగర్ దరలు వారికి చుక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఉత్పత్తులపై కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లు తగ్గించనున్నాయని సమాచారం. గత అక్టోబర్ లో ఒక కిలో చక్కెర ధర రూ.30 ఉంటే, ఈ వారంలో ఆ ధర రూ.40 లను తాకింది. చక్కెర ఉత్పత్తిలో మహారాష్ట్ర ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈ ఏడాది తీవ్ర కరవు సంభవించడంతో, దేశమంతటా ఘగర్ ఉత్పత్తి 10శాతం పడిపోయిందని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ గణాంకాలు తెలిపాయి. ధరలు పెరుగుతున్న ప్రతిసారీ ప్రమోషన్లను, ఆఫర్లను తగ్గించి, ప్రత్యక్షంగా తమపై ప్రభావం చూపనున్న ఎక్కువ కమోడిటీ ధరల నుంచి కొంత ఉపశమనం పొందుతామని పార్లె ఉత్పత్తుల మార్కెటింగ్ హెడ్ మయాంక్ షా చెప్పారు.
చక్కెర ధరలు పెరుగుతున్నప్పటికీ, వెంటనే ఉత్పత్తుల ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, జూన్ లో వీటిపై పునఃసమీక్షిస్తామని మదర్ డైరీ ఎండీ ఎస్.నాగరాజన్ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ కాలంలోనే తమ ఉత్పత్తులకు డిమాండ్ బాగా ఉంటుందని చెప్పారు. చక్కెర ధరలు ఇలానే పెరుగుతూ ఉంటే మాత్రం ఉత్పత్తి కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లు కొంతమేర తగ్గుతాయని బెవరేజ్ పరిశ్రమ అధికారులు పేర్కొన్నారు.