సుగర్స్‌కు చేదు
ఘోరంగా పడిపోయిన పంచదార ధర క్వింటా రూ.2600లు సంక్రాంతి నెలలోనూ పెరగని ధర,అమ్మకాలు నష్టాల్లో చక్కెర మిల్లులు
మార్కెట్‌లో పంచదార ధరలు ఘోరంగా పడిపోవడంతో సహకార చక్కెర మిల్లుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉత్పత్తి వ్యయం కంటే క్వింటా పంచదార ధర తక్కువగా ఉండటంతో నష్టాల బాట పడుతున్నాయి. ఈ వారంలో ధర మరీ ఘోరంగా క్వింటా రూ.2600లకు పడిపోయింది. సంక్రాంతి నెలలో అమ్మకాలు పెరిగి ధర బాగుంటుందని ఆశించిన యాజమాన్యాలకు నిరాశే మిగిలింది. ఫ్యాక్టరీల్లో పేరుకుపోయిన నిల్వలను ఎలా అమ్ముకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నాయి.
చోడవరం: హోల్‌సేల్ మార్కెట్‌లో పంచదార ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నా యి. ఆరు నెలల కిం దట క్వింటా పంచదార రూ. 3100లు ఉండేది. ఒక దశ లో రూ.2900వద్ద రెండు నెల లపాటు నిలకడగా ఉన్నప్పటికీ,
సుగర్స్‌కు చేదు
అనంతరం రూ.2700లు, ప్రస్తుతం 2600కు పడిపోయింది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లో లేని వ్యాట్ రాష్ర్టంలో ఉండటంతో అదనంగా క్వింటాకు రూ.150వరకు చెల్లించాల్సి రావడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి పంచదారను కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ఇక్కడి హోల్‌సేల్ వ్యాపారులు నిర్ణయించిన ధరకే సుగర్స్ యాజమాన్యాలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా ఏటేటా పంచదార తయారీ వ్యయం పెరుగుతోంది. పంటకు మద్దతు ధర లేదని రైతులూ గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది కేంద్రప్రభుత్వం టన్నుకు రూ.2280గా మద్దతు ధరను నిర్ణయించింది. దానికి అదనంగా రూ.60 నుంచి రూ.80లు కలిపి చెల్లించేందుకు ఫ్యాక్టరీలు నిర్ణయించాయి. ఇప్పటికే ఏటికొప్పాక రూ.2356లు, తాండవ రూ.2350లుగా మద్దతు ధరను ప్రకటించాయి. పూర్తిగా నష్టాల్లో ఉన్న తుమ్మపాలతోపాటు లాభాల్లో ఉన్న గోవాడ ఫ్యాక్టరీ కూడా మద్దతు ధరను ప్రకటించలేదు. ఏది ఏమైనా కేంద్రం నిర్దేశించిన ధరకు తగ్గకుండానే రైతులకు చెల్లించాల్సి ఉంది. మద్దతు ధరతోపాటు అదనంగా రూ.100 నుంచి రూ.150వరకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వాలి. అన్నీ కపులుకుంటే క్వింటా పంచదార తయారీకి కనీసం రూ.3వేల నుంచి 3100 వర కు ఖర్చవుతోంది. రైతుకిచ్చే మద్దతు ధరతోపాటు ఉత్పత్తి ఖర్చు క్వింటాకు రూ. 600-700వరకు అదనంగా ఉంటోంది. మార్కెట్‌లో ప్రస్తుతం ధర కేవలం రూ.2600లు మాత్రమే ఉండటంతో అదనంగా రూ.500 వరకు ఫ్యాక్టరీలు భరించాల్సి వస్తున్నది.
అసలే హుద్‌హుద్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన మిల్లులకు ఇది పెనుభారమవుతోంది. ఏటా మంచి రికవరీతో ముందుండే ఏటికొప్పాక ఫ్యాక్టరీలో ఇటీవల అగ్నిప్రమాదంతో అది కూడా నష్టాలబారిన పడింది. ఇప్పటికీ మిల్లుల్లో పాత పంచదార పేరుకుపోయి ఉంది. గోవాడ ఫ్యాక్టరీలో లక్షా90వేల క్వింటాళ్లు, ఏటికొప్పాకలో 60, తాండవలో 50క్వింటాళ్లు నిల్వలున్నాయి. దీనికి ఈ సీజన్‌లో ఉత్పత్తయిన కొత్త పంచదార కూడా తోడవుతోంది. ఈ నిల్వలను ఎలా అమ్ముకోవాలో తెలియక యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలను అధ్యయనం చేసి వెళ్లిన కమిటీ రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమీ స్పందించలేదు. వ్యాట్‌ను ఎత్తేయడంతోపాటు తుఫాన్ నష్టపరిహారంగా ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తే తప్పా సహకార చక్కెర మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంలో పడే ప్రమాదముందని పాలకవర్గాలు, యాజమాన్యాలు, రైతులు అంటున్నారు. ఫ్యాక్టరీలను పరిరక్షించి చెరకు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.