చెరకు రైతులకు తీపి కబురు | good news for sugar cane former | Sakshi
Sakshi News home page

చెరకు రైతులకు తీపి కబురు

Published Wed, Jun 25 2014 2:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

చెరకు రైతులకు తీపి కబురు - Sakshi

చెరకు రైతులకు తీపి కబురు

సాక్షి, నెల్లూరు: నిధుల కొరతతో అల్లాడుతున్న చక్కెర కర్మాగారాలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. చక్కెర కర్మాగారాలకు రూ.4,400 కోట్లు వడ్డీలేని అదనపు రుణం ఇవ్వాలని నిర్ణయించింది.
 
 చెరకు రైతులకు ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేలా కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు ప్రోత్సాహకరంగా ఉండేలా చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా చక్కెర దిగుమతి సుంకాన్ని 40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎగుమతులను సైతం ప్రోత్సహించాలని నిర్ణయించారు. ద్రవ్య సంక్షోభం నుంచి చక్కెర మిల్లులను గట్టెక్కించేందుకు, తద్వారా చెరకు రైతుల బకాయిలు చెల్లించేందుకు కేంద్ర నిర్ణయం దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తమకు బకాయిలు అందితే చాలని రైతులు అంటున్నారు.  
 
 బకాయిలు చెల్లించని ఫ్యాక్టరీలు
 చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు సకాలంలో డబ్బు ఇచ్చిన పాపాన పోవడంలేదు.   సాధారణంగా ఫిబ్రవరి, మా ర్చి, ఏప్రిల్‌లో రైతులు చెరకును ఫ్యాక్టరీలకు తరలిస్తారు. నిబంధనల మేరకు పంటను ఇచ్చిన నెలలోపే యాజమాన్యం రైతులకు డబ్బు చెల్లించాల్సి ఉంది.
 
 కానీ ఫ్యాక్టరీలు రైతులకు నెలలు,ఏళ్ల తరబడి డబ్బు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. బకాయిల కోసం రైతులు  కాళ్లరిగేలా తిరిగి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఐదారేళ్లుగా ఇదే జరుగుతోంది. ప్రస్తుతం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు, కార్మికులకు కలిపి రూ.12 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక ప్రభగిరిపట్నం ఫ్యాక్టరీ రూ.14 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రెండు ఫ్యాక్టరీలు రూ.26 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.  
 
 పట్టించుకోని అధికారులు:
 షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం రైతులకు పైసా చెల్లించకుండానే రైతులవద్ద తీసుకున్న చెరకు తో చేసిన చక్కెరను మాత్రం   ప్రభుత్వ అనుమతు లు లేకుండానే అమ్ముకుంటున్నట్లు  సమాచారం. అయినా షుగర్ కేన్ కమిషనర్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు పరిధిలోని అసిస్టెంట్ కమిషనర్‌తో పాటు వ్యవసాయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
 
 తగ్గుతున్న సాగు విస్తీర్ణం
 2000కు ముందు  జిల్లా పరిధిలో 50 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగైన చెరకు  2011-12కు వచ్చేసరికి  25 వేల ఎకరాలకు తగ్గింది. ఈ ఏడాది 15 వేల ఎకరాల్లో కూడా చెరకుపంట సాగుకాలేదు. దీన్ని బట్టి చూస్తే ఏడాదికేడాదికి చెరకు సాగు విస్తీర్ణం ఇబ్బడిముబ్బడిగా పడిపోతున్నట్టు స్పష్టమౌతోంది. చెరకు సాగుపై ఆసక్తి ఉన్నా ఫ్యాక్టరీలు సకాలంలో బకాయిలు చెల్లించడం లేదని ,ఏళ్ల తరబడి తిరిగితే తప్ప డబ్బు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో చెరకు సాగు అంటే భయపడే పరిస్థితి నెలకొందని వారు పేర్కొంటున్నారు.
 
 గతవైభవం:
  జిల్లాలో వరి తర్వాత చెరకు పంటను రైతులు అత్యధికంగా సాగు చేస్తారు. 1973లో కోవూరు చక్కెర కర్మాగారం ఏర్పాటైంది. 4.5 లక్షల టన్నుల కెపాసిటీతో దీనిని నిర్మించారు. జిల్లాలోని పొదలకూరు,నాయుడుపేటలలో రెండు ప్రైవేటు చక్కెర కర్మాగాలు వెలిశాయి. నాయుడుపేట ఎంపీ షుగర్స్ 1989-90 లో ఏర్పాటైంది.  దీంతో పాటు  పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం వద్ద 5 లక్షల టన్నుల కెపాసిటీతో వీడీబి షుగర్ ఫ్యాక్టరీ నిర్మితమైంది.
 
 జిల్లాలో మూడు చక్కెర కర్మాగారాలు నెలకొనడంతో రైతులు చెరకు సాగుపై మొగ్గు చూపారు. బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు, సంగం,పొదలకూరు, కలువాయి, అనంతసాగరం, ఉదయగిరి, వింజమూరు,ఏఎస్‌పేట, కలికిరి, మర్రిపాడుతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల పరిధిలో 1400 మందికిపైగా రైతులు  50 వేలకు పైగా విస్తీర్ణంలో చెరకుపంటను సాగుచేసేవారు. ఇక నాన్‌జోన్‌గా ఉన్న జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతోపాటు వైఎస్‌ఆర్  జిల్లాలోని బద్వేలు, పోరుమామిళ్ల, కాశినాయన, బి.కోడూరు, మైదుకూరు, చెన్నూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో 15 వేల ఎకరాలు ,కర్నూలు జిల్లాలోని నంద్యాల, చిత్తూరు జిల్లాతోపాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో 10 వేల ఎకరాల్లో సాగు అయ్యే చెరకును ఈ మూడు ఫ్యాక్టరీలకు తరలించేవారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement