నెల్లూరు(క్రైమ్): ప్రజలకు సేవ చేయాల్సిన పలు ప్రభుత్వ కార్యాలయాలు లంచాల మత్తులో జోగుతున్నాయి. అధికారి స్థాయి నుంచి అటెండర్ వరకు పచ్చనోటు కనపడితేనే పనిచేస్తున్నారు. ఎవరిస్థాయిలో వారు అవినీతికి పాల్పడుతున్నారు. నెలనెలా వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా బల్లకింద చేయిచాపే సంస్కృతి కొనసాగుతూనే ఉంది. ఏ పనిచేయాలన్నా దానికోరేటు...మధ్యవర్తితో సంప్రదింపులు...ఇవ్వకపోతే పని ముందుకు వెళ్లని పరిస్థితి నెలకొంది. వీటిని నియంత్రించాల్సిన అవినీతి నిరోధకశాఖపై సైతం అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఒక్కప్పుడు అవినీతి అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తించినా ఏసీబీ విభాగం అసలు జిల్లాలో ఉందా? అన్న సందేహం అందరిలో నెలకొంది. గత కొంతకాలంగా ఏసీబీ జిల్లాలో నిద్రావస్థల్లోకి వెళ్లిందనే ఆరోపణలున్నాయి.
అవినీతిపరుల భరతం పట్టాల్సిన శాఖలో ఒకరిద్దరు అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్ల శాఖ ప్రతిష్ట దిగజారిపోతోందన్న ఆరోపణలున్నాయి. జిల్లా ఏసీబీ కార్యాలయంలో సుమారు మూడేళ్లుగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి వసూళ్లకు పాల్పడుతూ అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏదైన ఓ ఉద్యోగిని ట్రాప్ చేసేందుకు కార్యాలయంలో సన్నాహాలు జరుగుతుంటే వెంటనే సమాచారాన్ని సంబంధిత వ్యక్తులకు చేరవేస్తున్నారన్న విమర్శలున్నాయి. సదరు వ్యక్తి వ్యవహారశైలి శాఖ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉండటంతో గతంలో పనిచేసిన ఓ డీఎస్పీ అతడిని నిలదీసినట్లు తెలిసింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన డీఎస్పీని నానా ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా తనకు తానుగా బదిలీ చేయించుకొని వెళ్లిపోయేలా చేశారన్న విమర్శలున్నాయి. ఆరునెలలుగా డీఎస్పీ లేకపోవడంతో సదరు వ్యక్తి ఇష్టారాజ్యంగా అంతా తానై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఏసీబీ ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అదేక్రమంలో సిబ్బంది కొరత సైతం జిల్లా ఏసీబీ శాఖను వెంటాడుతోంది.
వీటన్నింటిపై ఉన్నతాధికారులు దృష్టిసారించాలి.
నేడు అడిషనల్ డెరైక్టర్ రాక :అవినీతి నిరోధకశాఖ అడిషినల్ డెరైక్టర్ రామకృష్ణయ్య, జేడీ గంగాధర్‌లు శుక్రవారం జిల్లాకు రానున్నట్లు సమాచారం. వారు ఏసీబీ కార్యాలయాన్ని తనిఖీ చేయనున్నారు. అదేక్రమంలో నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి తదితర ప్రాంతాలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.
లీకుల మయం!
Published Fri, Apr 24 2015 2:08 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement