జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం
నెల్లూరు(అర్బన్): గ్రామాల్లో ప్రజాప్రతినిధిలుగా ఓ వెలుగు వెలిగిన పంచాయతీ సర్పంచ్‌ల పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం ఫలితాల్లో చేదు అనుభవం ఎదురవుతుందని భయపడింది. ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో ఐదేళ్లు సర్పంచ్‌లు, వార్డు సభ్యులు హోదా ఉన్నవారంతా మాజీలు కానున్నారు. ఇప్పటికే తెలంగాణాలో ప్రత్యేక అధికారుల పాలన ఉండటంతో ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన క్యాబినెట్‌లో సైతం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా తమనే పర్సన్ ఇన్‌చార్జిలుగా కొనసాగిస్తారని కొంతమంది ఆశావహులైన సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. ఇతర జిల్లాలో ఓ సర్పంచ్ మరొక ముందడుగు వేసి ఏకంగా కోర్టుకెళ్లాడు. ఎన్నికలు జరిగే వరకు తమను పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించాలని కోరాడు. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక అధికారుల పాలన వైపే మొగ్గు చూపింది.
విధివిధానాలు సిద్ధం
పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు సిద్ధం చేసింది. ఉన్న నిధుల్లో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీత భత్యాలకు 30శాతం, నీటిసరఫరా కోసం 15 శాతం, పారిశుద్ధ్య నిర్వహణకు 15 శాతం, వీధి దీపాల నిర్వహణకు 15శాతం, అంతర్గత రోడ్లు, మరమ్మతుల కోసం 20 శాతం, సమావేశాలు, మిసిలేనియస్ ఖర్చుల కోసం ఐదు శాతం నిధులు వినియోగించుకోవాలి.
ప్రత్యేక అధికారులు నిర్వర్తించాల్సిన విధులు
తాగునీటి సరఫరాలో పరిశుభ్రత, నూతన నిర్మాణాలకు అనుమతులు, కొత్త నిర్మాణాలకు ఇంటి నంబర్లు కేటాయింపు, ట్రేడ్ లైసెన్స్‌లు, దుకాణాలు, వాణిజ్య–వ్యాపార అనుమతులు జారీ చేయడం, గ్రామ రికార్డులు అప్‌గ్రేడ్ చేయడం, తాగునీటి పైపుల లీకేజీలు అరికట్టడం, మోటార్ల మరమ్మతులు, గ్రామాల్లో మార్కెట్లు, ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాలకు పన్నులు వసూళ్లు చేయడం, ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం తదితర విధులను అధికారులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాగే తాగునీటిలో క్లోరినేషన్, తడిచెత్త–పొడిచెత్తను నిర్వహించడం, ప్రభుత్వ స్థలాలు, బడుల్లో మొక్కలు నాటడం, రోడ్లును ఊడ్చడం, కాల్వలను క్లీన్ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.
నిధులు వాడు కోవచ్చు
పంచాయతీకి సంబంధించిన వేతనాలు, ఖర్చుల కోసం ని«ధులు విడుదల చేసే అ««ధికారాన్ని ప్రత్యేక అధికారులకు కల్పించారు. ఏదైనా సంస్థలకు అప్పు ఉంటే చెల్లించవచ్చు. ఉత్సవాల నిర్వహణకు, ప్రజల వినోదం, గ్రామంలోని పేదలను ఆదుకునేందుకు వీలు కల్పించారు.
∙జరిమానా విధించవచ్చు
∙గ్రామాల్లో ఖాళీ, పబ్లిక్ స్థలాలను రోడ్లను ఆక్రమిస్తే జరిమానా విధించవచ్చు.
ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్
90శాతం గ్రామాలు కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడి అభివృద్ధి పనులు సాగిస్తున్నాయి. ఎన్నికలు జరపనందున న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేంద్రం 14తో పాటు రాబోయే 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా ఆపేస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించనందున కేంద్రం ఇలాగే నిధులు ఆపేసినప్పుడు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయిన సంఘటనలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ దఫా టీడీపీ ప్రభుత్వంలో అవే ఇబ్బందులు తలెత్తనున్నాయి.
పల్లె ప్రగతికి ఆటంకం
ప్రత్యేక అధికారుల (స్పెషల్‌ఆఫీసర్లు) పాలన రానుండటంతో పల్లె ప్రగతికి ఆటంకం ఏర్పడనుంది. నెల్లూరు జిల్లాలో 940 పంచాయతీల్లో 22 లక్షల మంది నివసిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి పథకాలు మరమ్మతులకు గురైనా, వీధిదీపాలు వెలగకపోయినా, ఇతరత్రా గ్రామ తక్షణ అవసరాలకు సర్పంచ్‌లు మొదట తమ జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టేవారు. తరువాత నిదానంగా బిల్లులు పెట్టుకుని డ్రా చేసేవారు. ప్రత్యేక పాలనలో ఆస్వేచ్ఛ ఉండదు. నిబంధనల ప్రకారం జరగాల్సిందే. కార్యదర్శి, ప్రత్యేకాధికారి సంయుక్త సంతకాలతో ఫైళ్లు నడవాలి. ఈ తంతు జరగాలంటే కొంత అలస్యం తప్పదు. ప్రజలు ఇబ్బందులు పాలు కాక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment