మాజీల చూపు.. కమలంవైపు
బీజేపీలో త్వరలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల చేరిక
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా టీడీపీలోని అంతర్గత విభేదాలను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ప్రాధాన్యం దక్కక అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలను ఆకర్షిస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని బీజేపీ పాటిస్తోంది. అధికారంలో ఉండగానే పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు టీడీపీ నుంచి జిల్లాలో భారతీయ జనతా పార్టీలోకి త్వరలో భారీగా వలసలు ఉన్నట్టు తెలిసింది. జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
జిల్లా టీడీపీలో ఒకే వర్గానికి ప్రాతినిధ్యం పెరగడంతో, రెండో వర్గానికి చెందిన వారు భారీగా బీజేపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరితో పాటు పలువురు బడానేతలు కూడా బీజేపీలో చేరనున్నారు. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టనుందని, ఏ పార్టీ నుంచి వచ్చినా చేర్చుకోవడానికి సిద్ధమని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల చరిత్ర తెలుసుకుని, తమ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకుని చేర్చుకుంటామన్నారు.
శాసనసభా ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, అది ఎన్నికలతోనే ముగిసిపోయిందని, దీంతో టీడీపీ నుంచి కూడా వలసలు ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర పథకాలను టీడీపీ తమ పథకాలుగా చెప్పుకోవడానికి సిద్ధపడుతోందని, వాటిని తిప్పికొట్టేందుకు జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారన్నారు. రాష్ట్రంలో కోతలను తగ్గించేందుకు రాజస్థాన్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ వస్తుండగా, అది తమ ఘనతగా టీడీపీ చెప్పుకుంటోందని ఆ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలకు తావివ్వకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండడంతో ఆ పార్టీలోకి చేరడానికి అనేక మంది సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర , టీడీపీలకు చెందిన పలువురు నేతలు బీజేపీ అగ్రనేతలను సంప్రదిస్తున్నట్టు సమాచారం. జిల్లాల్లో బలంగా ఉండే నాయకులపై ఆ పార్టీ కన్నేసినట్టు బోగట్టా. దీనికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మంత్రాంగం నడుపుతున్నట్టు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.
వ్యక్తిగత సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని వెంకయ్య సూచించినటుట ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన నేషనల్ కౌన్సిల్ సమావేశంలో కూడా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయాలపై చర్చ జరగడం గమనార్హం.