ప్రకృతి వైపరీత్యాలు, కరువు కాటకాలతో అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇబ్బందిగా మారాయి. ప్రకటించిన ధాన్యం మద్దతు ధర మినహా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా హుకుం జారీ చేసింది. ధాన్యానికి కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లిస్తే ఆ రాష్ట్రంలో ధాన్యం సేకరణను తగ్గించేయాలని ఎఫ్‌సీఐని ఆదేశించింది. దీంతో రైతులకు మద్దతు ధర మినహా మరే విధమైన అదనపు ధర లభించని పరిస్థితి ఏర్పడనుంది.
సాక్షి, నెల్లూరు : ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధర నిర్ణయిస్తుంది. వచ్చే అక్టోబర్ సీజన్‌కు ధాన్యం ధర క్వింటాలు సాధారణ రకం రూ.1,360, గ్రేడ్-1 రకం రూ.1400 వంతున మద్దతు ధర ప్రకటించింది. ఈ లెక్కన గతంతో పోలిస్తే ఈ ఏడాది క్వింటాల్‌పై కేవలం రూ. 50 మాత్రమే పెంచారు.
ఇది రైతులకు పెద్దగా గిట్టుబాటు ధరేం కాదు. ఉత్తరాదిన విస్తారంగా పండే గోధుమతో పోలిస్తే మన ప్రాంత రైతులకు ఇస్తున్న ధర నామమాత్రమే. అయితే కేంద్రం ధరతో రైతులకు సక్రమంగా న్యాయం జరగని విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని క్వింటాలుకు రూ.50 నుంచి రూ. 200 వరకు వరకు బోనస్ చెల్లించడం ఆనవాయితీ. పదేళ్లలో మన రాష్ట్రంలో కేవలం రెండు సార్లు మాత్రమే రూ.50 వంతున కేంద్ర ప్రభుత్వం బోనస్ చెల్లించగా మిగిలిన 8 సార్లు రూ.100 నుంచి రూ.250 వరకు రాష్ట్ర ప్రభుత్వమే బోనస్ చెల్లించింది. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో క్వింటాలు ధాన్యానికి రూ. 100 నుంచి రూ. 250 వరకూ బోనస్ ఇచ్చారు. ఇది కచ్చితంగా అమలు జరిగింది.
బోనస్‌పై ఆంక్షలు
కొత్తగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు బోనస్ ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. స్థానికంగా ప్రభుత్వాలు రైతులకు ఇష్టారాజ్యంగా బోనస్ ఇస్తే ధాన్యం సేకరణ సమయంలో ఎఫ్‌సీఐకి అదనపు భారం పడుతోందని, సబ్సిడీ మొత్తం కేంద్రం మోయడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. బోనస్ ప్రకటించిన రాష్ట్రాల్లో ధాన్యం సేకరణను ఎఫ్‌సీఐ తగ్గించాలని ఆదేశించింది. వికేంద్రీకృత సేకరణ విధానం ఉన్న రాష్ట్రాల్లో సబ్సిడీ బియ్యం అవసరాలకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలే తప్ప అదనంగా చేయవద్దని కేంద్రం ఆదేశిస్తోంది.
వాస్తవానికి గత ఏడాదే ఇలాంటి ప్రతిపాదన వచ్చిన ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. మళ్లీ ఇప్పుడు ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వికేంద్రీకృత విధానంలో ఎఫ్‌సీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తాయి. ఆయా ప్రాంతాల్లో అమలవుతున్న సబ్సిడీ బియ్యం పథకానికి కూడా ఈ ధాన్యం నుంచి బియ్యం సరఫరా చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటిస్తే ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణ తగ్గుతుంది. ఖరీఫ్ సీజన్‌కు సుమారు 50లక్షల టన్నులు ఎఫ్‌సీఐ సేకరించాల్సి ఉంది.
కేంద్రం నిర్దేశించిన ప్రకారం బీపీఎల్ కోటా కింద సరఫరా అయ్యే బియ్యం ఎంత ఉంటే అంతే ఎఫ్‌సీఐ సేకరించాలి. అయితే ఈ పని ఎలాగో రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నందున మొత్తం 50లక్షల టన్నులు ఎఫ్‌సీఐ సేకరించకపోవచ్చు. ధాన్యం ఎక్కువగా పండే రాష్ట్రాల నుంచి లెవీ కింద వాటిని ఎఫ్‌సీఐ సేకరించి ధాన్యం తక్కువగా ఉండే ప్రాంతాలకు సెంట్రల్ పూల్ ద్వారా కేటాయిస్తుంటారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణ నిలిపివేస్తే మిల్లర్లు, దళారులు కుమ్మక్కై తక్కువ ధరకే ధాన్యం అమ్మేలా రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందులో రైతులు నష్టపోవాల్సి వస్తుంది.
సింహపురి రైతులపై తీవ్రప్రభావం
జిల్లాలో రెండు పంటలకు కలిపి 25 లక్షల టన్నుల ధాన్యం పండుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఏటా 14,798 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం లెవీకింద సేకరిస్తుంది. ప్రజల అవసరాలకు 5 లక్షల టన్నులు పోను మిగిలిన ధాన్యం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు మద్దతు ధరతోనే ధాన్యం అమ్ముకోవాలంటే రైతులకు మిగిలేది నామమాత్రమే. డిమాండ్ వచ్చినపుడు రైతులు ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటేనే అంతోఇంతో మిగిలేది. అలాకాకుండా తాము చెప్పిన నామమాత్రపు ధరకే ధాన్యం ఇవ్వమనడం ఎంతవరకు సబబని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు సరికాదని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
రైతులకు బోనస్ లేనట్టే
Published Mon, Jul 28 2014 2:42 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement