ధర కోసం షుగర్ గేమ్! | Sugar prices low | Sakshi
Sakshi News home page

ధర కోసం షుగర్ గేమ్!

Published Wed, Dec 18 2013 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

ధర కోసం షుగర్ గేమ్!

ధర కోసం షుగర్ గేమ్!

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పడుతున్న చక్కెర ధరలకు అడ్డుకట్ట వేయడానికి చక్కెర పరిశ్రమ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రస్తుత సీజన్‌లో చక్కెర ఉత్పత్తి 50 శాతానికిపైగా తగ్గిపోయిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) ప్రకటించినప్పటికీ హోల్‌సేల్ మార్కెట్లో ధరల పతనం ఆగలేదు. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో చక్కెర ధరలు ఏకంగా ఐదు నెలల కనిష్టానికి చేరుకోవడంతో కంపెనీల వ్యూహానికి ఎదురుదెబ్బ తగలింది.
 
 ఉత్పత్తి తగ్గినా... దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు క్వింటాల్‌కు రూ.30 తగ్గడం గమనార్హం. ప్రస్తుతం మొదటి రకం (ఎం-30) రకం క్వింటాల్ ధర రూ.3,020-3,225 పలుకుతుంటే ఎస్-30 రకం రూ.3,000-3,200 పలుకుతోంది. అంతకుముందు ఇస్మా ఈ సంవత్సరం చెరుకు గానుగ ఆడటం ఆలస్యం కావడంతో చక్కెర ఉత్పత్తి 50 శాతం పడిపోయిందని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో డిసెంబర్ 15 నాటికి పంచదార ఉత్పత్తి 50 శాతం తగ్గి 24.24  లక్షల టన్నులు మాత్రమే నమోదైనట్లు ఇస్మా తెలిపింది. గతేడాది ఇదే సీజన్‌లో 457 మిల్లులు పంచదారను ఉత్పత్తి చేస్తుండగా  ఈ ఏడాది ఈ సంఖ్య 426కి పడిపోయింది. దేశంలో చెరకును అత్యధికంగా పండించే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లో వరుసగా 35 శాతం, 78 శాతం క్షీణించడమే ప్రధాన కారణంగా ఇస్మా పేర్కొంది. మన రాష్ట్రంలో కూడా చక్కెర ఉత్పత్తి 44 శాతం తగ్గి 0.95 లక్షల టన్నులుగా ఉన్నట్లు ఇస్మా పేర్కొంది.
 
 ఆలస్యమే తప్ప ఉత్పత్తి తగ్గదు
 చక్కెర మద్దతు ధరపై మిల్లలు రైతులకు మధ్య అవగాహన కుదరకపోవడం వలన ఆలస్యం అయ్యిందే తప్ప ఉత్పత్తి తగ్గదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది 241 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందన్న అంచనాపై ఈ ఆలస్యం ఎటువంటి ప్రభావం చూపదని కేంద్ర ఆహార మంత్రి కె.వి.థామస్ మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. గతంలో ఇస్మా ఈ సీజన్ మొత్తం మీద ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువగా 250 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
 ప్యాకేజీ ఆశలతో...
 అప్పుల ఊబిలో కూరుకుపోయిన చక్కెర మిల్లులను ఆదుకోవడానికి ఏర్పాటైన మంత్రివర్గ బృందం బుధవారం సమావేశం నేపథ్యంలో చక్కెర కంపెనీ షేర్లు మంగళవారం పరుగులు తీశాయి. రానా సుగర్స్, ధంపూర్ సుగర్ మిల్స్ షేర్లు 5 శాతం పెరగ్గా, బలరాంపూర్ చిని, ద్వారికేష్ సుగర్స్ మూడు శాతం చొప్పున పెరిగాయి. చక్కెర మిల్స్ బెయిల్ ఔట్ ప్యాకేజీ గురించి బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశం కానుంది. చక్కెర మిల్లులు రైతులకు చెల్లించాల్సిన బకాయిల విలువ  దాదాపు రూ.7,200 కోట్లు ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement