sugar shares
-
చక్కెర పరిశ్రమకు స్వీట్డేస్!
♦ ఐదారేళ్ల నష్టాల నుంచి ఈ ఏడాది లాభాల్లోకి ♦ ఆగస్టునాటికి రైతుల బకాయిలన్నీ క్లియర్ ♦ ఏడాది గరిష్ట స్థాయిలో ట్రేడవుతున్న చక్కెర షేర్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అయిదారేళ్ల నిరీక్షణ తర్వాత చక్కెర కంపెనీలకు మంచి రోజులొచ్చాయి. ఈ ఏడాది ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధర బాగుందని కంపెనీలు చెబుతున్నాయి. భారత్‌లో చక్కెర వార్షిక డిమాండ్ 240 లక్షల టన్నులు కాగా గత సీజన్లో (అక్టోబర్ 2014-సెప్టెంబర్ 2015) దేశవ్యాప్తంగా 251 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తయింది. ప్రస్తుత సీజన్లో ఇది 232.6 లక్షల టన్నులకే పరిమితం కానున్నట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) అంచనా వేసింది. స్టాకిస్టులు, బల్క్ వినియోగదార్ల నుంచి కొనుగోళ్లు అధికమవడంతో ప్రస్తుతం చక్కెరకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో అవసరానికి తగ్గట్టుగా మిల్లుల నుంచి సరఫరా లేకపోవడంతో ధర పెరుగుతూ వస్తోంది. ఇక 2016 అక్టోబరు 1 నాటికి ఓపెనింగ్ స్టాక్ (నిల్వ) 70 లక్షల టన్నులుంటుందని అంచనా. 2017-18 సీజన్లో మాత్రం ఉత్పత్తి-డిమాండ్ మధ్య అంతరం తొలగిపోతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. లాభాల్లోకి కంపెనీలు.. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది క్వింటాలు చక్కెరకు మిల్లు ధర రూ.1,900 పలికింది. ఉత్పత్తి వ్యయం రూ.3,400 కావడంతో ఒక్కో బస్తాపై కంపెనీలకు రూ.1,500 నష్టం వచ్చింది. చాలా కంపెనీలు నష్టాల బాట పట్టాయి. క్లిష్టమైన తయారీ విధానమైనప్పటికీ చక్కెర ధర పెరగకపోవడంతో అయిదారేళ్లు కంపెనీలు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. కొన్నయితే మిల్లులు నడపలేమని ప్రభుత్వానికి చెప్పాయి కూడా. ప్రస్తుతం మిల్లు వద్ద 100 కిలోల బస్తా ధర రూ.3,400 పలుకుతోంది. రిటైల్‌లో కిలో ధర రూ.40 పైనే ఉంది. తయారీ వ్యయంలో మార్పు లేనప్పటికీ ఉప ఉత్పాదనల విక్రయం ద్వారా కంపెనీలకు అదనపు ఆదాయం సమకూరుతోంది. దీంతో ఈ సీజన్ పెద్ద ఊరటనిచ్చింది. ఈ ఏడాది అన్ని కంపెనీలూ లాభాల్ని ప్రకటించవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బకాయిల చెల్లింపు.. దేశంలో చెరకు రైతులకు కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలు 2015 ఏప్రిల్‌లో రూ.2,000 కోట్లు. 2016 ఏప్రిల్‌కు ఇది రూ.16,000 కోట్లకు చేరింది. జూలై 1కి ఇది రూ.6,000 కోట్లకు పరిమితమైంది. ఆగస్టుకల్లా కంపెనీలు ఈ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తాయని కేసీపీ షుగర్ సీవోవో జి.వెంకటేశ్వర రావు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. చక్కెర పరిశ్రమకు మంచి రోజులొచ్చాయన్నారు. ‘‘ఎగుమతులపై విధించిన 20 శాతం పన్ను చక్కెర పరిశ్రమ వృద్ధికి అడ్డంకిగా మారింది. చెరకు ధర ను ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. చక్కెర ధరతో చెరకు ధరను ముడిపెట్టాలి. పరిశ్రమకు అడ్డంకిగా ఉన్న నియంత్రణలేవీ లేకపోతే లాభాల్లో 80 శాతం రైతులకు పంచేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి’’ అని వివరించారాయన. దూసుకెళ్తున్న షేర్ల ధరలు.. చక్కెర పరిశ్రమకు మరో రెండు మూడేళ్లు మంచి రోజులని కంపెనీలంటున్నాయి. ఐదారేళ్ల విరామం తర్వాత పరిశ్రమ గాడిలో పడడంతో అటు కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీలూ ఏడాది గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. వచ్చే రెండు నెలల్లో వీటి ధరలు మరో 25-30 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, మిల్లుల్లో చెరకు పిప్పితో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 170 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. విద్యుత్ యూనిట్‌కు ప్రభుత్వం రూ.4 చెల్లిస్తోంది. మహారాష్ట్ర మాదిరిగా రూ.6 చెల్లిస్తే ఇక్కడే 750 మెగావాట్ల ఉత్పత్తి అవుతుందని కంపెనీలు చెబుతున్నాయి. -
ధర కోసం షుగర్ గేమ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పడుతున్న చక్కెర ధరలకు అడ్డుకట్ట వేయడానికి చక్కెర పరిశ్రమ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి 50 శాతానికిపైగా తగ్గిపోయిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) ప్రకటించినప్పటికీ హోల్‌సేల్ మార్కెట్లో ధరల పతనం ఆగలేదు. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో చక్కెర ధరలు ఏకంగా ఐదు నెలల కనిష్టానికి చేరుకోవడంతో కంపెనీల వ్యూహానికి ఎదురుదెబ్బ తగలింది. ఉత్పత్తి తగ్గినా... దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు క్వింటాల్‌కు రూ.30 తగ్గడం గమనార్హం. ప్రస్తుతం మొదటి రకం (ఎం-30) రకం క్వింటాల్ ధర రూ.3,020-3,225 పలుకుతుంటే ఎస్-30 రకం రూ.3,000-3,200 పలుకుతోంది. అంతకుముందు ఇస్మా ఈ సంవత్సరం చెరుకు గానుగ ఆడటం ఆలస్యం కావడంతో చక్కెర ఉత్పత్తి 50 శాతం పడిపోయిందని ప్రకటించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సీజన్లో డిసెంబర్ 15 నాటికి పంచదార ఉత్పత్తి 50 శాతం తగ్గి 24.24 లక్షల టన్నులు మాత్రమే నమోదైనట్లు ఇస్మా తెలిపింది. గతేడాది ఇదే సీజన్లో 457 మిల్లులు పంచదారను ఉత్పత్తి చేస్తుండగా ఈ ఏడాది ఈ సంఖ్య 426కి పడిపోయింది. దేశంలో చెరకును అత్యధికంగా పండించే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లో వరుసగా 35 శాతం, 78 శాతం క్షీణించడమే ప్రధాన కారణంగా ఇస్మా పేర్కొంది. మన రాష్ట్రంలో కూడా చక్కెర ఉత్పత్తి 44 శాతం తగ్గి 0.95 లక్షల టన్నులుగా ఉన్నట్లు ఇస్మా పేర్కొంది. ఆలస్యమే తప్ప ఉత్పత్తి తగ్గదు చక్కెర మద్దతు ధరపై మిల్లలు రైతులకు మధ్య అవగాహన కుదరకపోవడం వలన ఆలస్యం అయ్యిందే తప్ప ఉత్పత్తి తగ్గదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది 241 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందన్న అంచనాపై ఈ ఆలస్యం ఎటువంటి ప్రభావం చూపదని కేంద్ర ఆహార మంత్రి కె.వి.థామస్ మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. గతంలో ఇస్మా ఈ సీజన్ మొత్తం మీద ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువగా 250 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాకేజీ ఆశలతో... అప్పుల ఊబిలో కూరుకుపోయిన చక్కెర మిల్లులను ఆదుకోవడానికి ఏర్పాటైన మంత్రివర్గ బృందం బుధవారం సమావేశం నేపథ్యంలో చక్కెర కంపెనీ షేర్లు మంగళవారం పరుగులు తీశాయి. రానా సుగర్స్, ధంపూర్ సుగర్ మిల్స్ షేర్లు 5 శాతం పెరగ్గా, బలరాంపూర్ చిని, ద్వారికేష్ సుగర్స్ మూడు శాతం చొప్పున పెరిగాయి. చక్కెర మిల్స్ బెయిల్ ఔట్ ప్యాకేజీ గురించి బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశం కానుంది. చక్కెర మిల్లులు రైతులకు చెల్లించాల్సిన బకాయిల విలువ దాదాపు రూ.7,200 కోట్లు ఉంది.