చక్కెర పరిశ్రమకు స్వీట్డేస్! | 16 sugar stocks that have given over 100% returns in 2016 so far | Sakshi
Sakshi News home page

చక్కెర పరిశ్రమకు స్వీట్డేస్!

Published Wed, Jul 13 2016 12:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM

చక్కెర పరిశ్రమకు స్వీట్డేస్! - Sakshi

చక్కెర పరిశ్రమకు స్వీట్డేస్!

ఐదారేళ్ల నష్టాల నుంచి ఈ ఏడాది లాభాల్లోకి
ఆగస్టునాటికి రైతుల బకాయిలన్నీ క్లియర్
ఏడాది గరిష్ట స్థాయిలో ట్రేడవుతున్న చక్కెర షేర్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అయిదారేళ్ల నిరీక్షణ తర్వాత చక్కెర కంపెనీలకు మంచి రోజులొచ్చాయి. ఈ ఏడాది ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధర బాగుందని కంపెనీలు చెబుతున్నాయి. భారత్‌లో చక్కెర వార్షిక డిమాండ్ 240 లక్షల టన్నులు కాగా గత సీజన్‌లో (అక్టోబర్ 2014-సెప్టెంబర్ 2015) దేశవ్యాప్తంగా 251 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తయింది. ప్రస్తుత సీజన్‌లో ఇది 232.6 లక్షల టన్నులకే పరిమితం కానున్నట్లు ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) అంచనా వేసింది. స్టాకిస్టులు, బల్క్ వినియోగదార్ల నుంచి కొనుగోళ్లు అధికమవడంతో ప్రస్తుతం చక్కెరకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో అవసరానికి తగ్గట్టుగా మిల్లుల నుంచి సరఫరా లేకపోవడంతో ధర పెరుగుతూ వస్తోంది. ఇక 2016 అక్టోబరు 1 నాటికి ఓపెనింగ్ స్టాక్ (నిల్వ) 70 లక్షల టన్నులుంటుందని అంచనా. 2017-18 సీజన్‌లో మాత్రం ఉత్పత్తి-డిమాండ్ మధ్య అంతరం తొలగిపోతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

 లాభాల్లోకి కంపెనీలు..
తెలుగు రాష్ట్రాల్లో గతేడాది క్వింటాలు చక్కెరకు మిల్లు ధర రూ.1,900 పలికింది. ఉత్పత్తి వ్యయం రూ.3,400 కావడంతో ఒక్కో బస్తాపై కంపెనీలకు రూ.1,500 నష్టం వచ్చింది. చాలా కంపెనీలు నష్టాల బాట పట్టాయి. క్లిష్టమైన తయారీ విధానమైనప్పటికీ చక్కెర ధర పెరగకపోవడంతో అయిదారేళ్లు కంపెనీలు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. కొన్నయితే మిల్లులు నడపలేమని ప్రభుత్వానికి చెప్పాయి కూడా. ప్రస్తుతం మిల్లు వద్ద 100 కిలోల బస్తా ధర రూ.3,400 పలుకుతోంది. రిటైల్‌లో కిలో ధర రూ.40 పైనే ఉంది. తయారీ వ్యయంలో మార్పు లేనప్పటికీ ఉప ఉత్పాదనల విక్రయం ద్వారా కంపెనీలకు అదనపు ఆదాయం సమకూరుతోంది. దీంతో ఈ సీజన్ పెద్ద ఊరటనిచ్చింది. ఈ ఏడాది అన్ని కంపెనీలూ లాభాల్ని ప్రకటించవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

 బకాయిల చెల్లింపు..
దేశంలో చెరకు రైతులకు కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలు 2015 ఏప్రిల్‌లో రూ.2,000 కోట్లు. 2016 ఏప్రిల్‌కు ఇది రూ.16,000 కోట్లకు చేరింది. జూలై 1కి ఇది రూ.6,000 కోట్లకు పరిమితమైంది. ఆగస్టుకల్లా కంపెనీలు ఈ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తాయని కేసీపీ షుగర్ సీవోవో జి.వెంకటేశ్వర రావు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. చక్కెర పరిశ్రమకు మంచి రోజులొచ్చాయన్నారు. ‘‘ఎగుమతులపై విధించిన 20 శాతం పన్ను చక్కెర పరిశ్రమ వృద్ధికి అడ్డంకిగా మారింది. చెరకు ధర ను ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. చక్కెర ధరతో చెరకు ధరను ముడిపెట్టాలి. పరిశ్రమకు అడ్డంకిగా ఉన్న నియంత్రణలేవీ లేకపోతే లాభాల్లో 80 శాతం రైతులకు పంచేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి’’ అని వివరించారాయన.

దూసుకెళ్తున్న షేర్ల ధరలు..
చక్కెర పరిశ్రమకు మరో రెండు మూడేళ్లు మంచి రోజులని కంపెనీలంటున్నాయి. ఐదారేళ్ల విరామం తర్వాత పరిశ్రమ గాడిలో పడడంతో అటు కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీలూ ఏడాది గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. వచ్చే రెండు నెలల్లో వీటి ధరలు మరో 25-30 శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, మిల్లుల్లో చెరకు పిప్పితో తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 170 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. విద్యుత్ యూనిట్‌కు ప్రభుత్వం రూ.4 చెల్లిస్తోంది. మహారాష్ట్ర మాదిరిగా రూ.6 చెల్లిస్తే ఇక్కడే 750 మెగావాట్ల ఉత్పత్తి అవుతుందని కంపెనీలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement